1, జూన్ 2012, శుక్రవారం

జడ్జి కొడుకు ఖాతాలోకి రూ.2కోట్లు, మిగతా బినామీగా




 Cbi Found Rs 2 Crores Judge Son Account


హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వద్ద నుండి రూ.5 కోట్ల లంచం తీసుకొని అతనికి బెయిల్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి పట్టాభి రామారావు అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై అంతటా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలు జడ్జి తీరును ధనుమాడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాలి జనార్దన్‌ రెడ్డికి మే 12వ తేదీన సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ ఆదేశాలు జారీ చేసింది జడ్జి పట్టాభి రామారావే. హైదరాబాద్‌లో మొన్నటిదాకా ఒకే సిబిఐ కోర్టు ఉండేది. అయితే కేసుల సంఖ్య పెరగడంతో మరో మూడు అదనపు కోర్టులు కొత్తగా ఏర్పాటయ్యాయి. అప్పటిదాకా ప్రిన్సిపల్ కోర్టు జడ్జిగా ఉన్న నాగమారుతి శర్మ, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటయిన రెండో అదనపు కోర్టు జడ్జిగా వెళ్లారు. మొదటి కోర్టు జడ్జిగా పట్టాభి రామారావు నియమితులయ్యారు. ప్రిన్సిపల్ కోర్టు జడ్జిగా పుల్లయ్య వచ్చారు.

గాలి కేసు అప్పటిదాకా ప్రిన్సిపల్ కోర్టు పరిధిలో ఉండేది. అయితే, తమ కేసును నాగమారుతి శర్మనే విచారించారని, అందువల్ల ఆయన కోర్టుకే దానిని బదిలీ చేయాలని గాలి, తదితరులు విజ్ఞప్తి చేసుకున్నారు. దీంతో కోర్టు వారి కేసును రెండో అదనపు న్యాయస్థానానికి బదిలీ చేసింది. నాగమారుతి శర్మ సెలవుపై వెళ్లిన సమయంలో... రెండో కోర్టు బాధ్యతలు కూడా మొదటి కోర్టు జడ్జి పట్టాభి రామారావుకే దఖలు పడ్డాయి.

ఈ క్రమంలోనే గాలి జనార్దన్‌ రెడ్డి బెయిల్ పిటిషన్ ఆయన ముందుకు విచారణకు వచ్చింది. విచారణ క్రమంలో భాగంగా పట్టాభి రామారావు మే 12న గాలికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అవినీతి కేసుల్లో నిందితులపై కోర్టులు కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న సమయంలో... బెయిలు దుర్లభంగా మారిన పరిస్థితుల్లో గాలికి బెయిలు రావడం సంచలనం సృష్టించింది. కీలకమైన కేసులపై దర్యాప్తు, కోర్టుల్లో విచారణ జరిగే సమయంలో సిబిఐ ఆ కేసులతో సంబంధం ఉన్న అన్ని వర్గాలపైనా, వ్యక్తులపైనా ఓ కన్నేసి ఉంచుతుంది.

నిఘా పెడుతుంది. ఇది సాధారణంగా జరిగే పరిణామమే. ఈ క్రమంలోనే పట్టాభి రామారావు గురించి తవ్వి తీసినపుడు సిబిఐకి విస్తుపోయే వివరాలు లభ్యమయ్యాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినందుకు పట్టాభి రామారావుకు ఐదు కోట్ల రూపాయలు లంచంగా ముట్టినట్టు సిబిఐ తన పరిశోధనలో తేల్చింది. ఇందులో రెండు కోట్ల రూపాయలను పట్టాభి రామావు కుమారుడికి సంబంధించిన లాకర్‌లో గుర్తించింది. మిగిలిన సొమ్మును బినామీ లాకర్లలో గుర్తించింది.

కరెన్సీ కట్టలను వాటిలో కూర్చి పేర్చినట్టుగా సమాచారం. మిగతా మూడు కోట్లను వేరే చోట భద్రపరిచారట. సదరు లాకర్‌ను పట్టాభి రామారావు కుమారుడు మారుపేరుతో తెరిచినట్టు కూడా సిబిఐ కనుగొంది. గాలికి బెయిలివ్వడానికి కొద్ది రోజుల ముందు ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు పూర్తయ్యాయి. ఇది నిర్ధారణ అయిన వెంటనే సిబిఐ ఉన్నతాధికారులు రహస్యంగా వెళ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్‌ను కలుసుకున్నారు.

సదరు జడ్జిపై నిఘా కొనసాగించాలనీ, ఈ వ్యవహారంలో సిబిఐ తనదైన శైలిలో నిరభ్యంతరంగా ముందుకు వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి లోకూర్ పచ్చజెండా ఊపేశారు. జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు తమకు వివరాలు అందజేయాలని ఆదేశించారు. దీంతో సిబిఐ వెంటనే సదరు బ్యాంకును సంప్రదించి, తమ అనుమతి లేకుండా ఆ లాకర్‌ను తెరవవద్దని, దానిపై ఎలాంటి లావాదేవీలూ నిర్వహించవద్దని సూచించింది.

ఆ తర్వాత గాలి నుంచి పట్టాభి రామారావు కుమారుడికి చేరిన సొమ్మును స్వాధీనం చేసుకుంది. బ్యాంకు పంచనామా నివేదిక, ఇతరత్రా రిపోర్టును సిబిఐ ఉన్నతాధికారులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. దీంతో వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు కావడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ ఉదంతాన్ని ఫోన్ల ద్వారా కొలీజియం (ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బృందం) దృష్టికి తీసుకువచ్చారు.

సుదీర్ఘ సమాలోచనలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం.... పట్టాభి రామారావు లంచం తీసుకునే గాలికి బెయిలిచ్చినట్టు కొలీజియం న్యాయమూర్తులు నిర్ధారణకు వచ్చారు. ఆయనను తక్షణం బాధ్యతల నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాత్రి వారు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు. జడ్జి పట్టాభి రామారావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుకు కూడా సిబిఐకి హైకోర్టు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.

నేరం రుజువైతే పట్టాభిరామారావు తన జడ్జి పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలైనా కాకమునుపే... పట్టాభి రామారావు లంచాల బాగోతం బయటపడటం గమనార్హం. అనుమానాస్పద తీర్పులు ఇచ్చిన జడ్జిలపై సస్పెన్షన్ వేటు పడటం తరచూ జరుగుతూనే ఉంటుంది. కానీ... లంచం, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన జడ్జిల సంఖ్య మాత్రం తక్కువే.

పట్టాభి రామారావుకు డబ్బులు ఇచ్చేందుకు బెయిల్‌కు ముందు నుండే సంప్రదింపులు జరుగాయట. బినామీ లాకర్లలో గాలి అనుచరులు రూ.రెండున్నర కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారట. చీఫ్ జస్టిస్ అనుమతితో సిబిఐ నిఘా వేసినందు వల్ల ఈ వ్యవహారం బయటపడింది. కాగా పట్టాభి రామారావు తన ఇంటి ఎదుట తన పేరు బోర్డును తీసి వేయించారు. లంచం తీసుకున్న ఘటనపై మాట్లాడేందుకు పట్టాభి రామారావు నిరాకరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి