28, జూన్ 2012, గురువారం

ఫ్రెంచ్'కు కాకుండా భారతికెలా: సిమెంట్స్‌పై సిబిఐ దృష్టి


గురువారం, జూన్ 28, 2012, 9:24 [IST]
 Cbi Eyes On Jagan Bharathi Cements

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అంశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) భారతి సిమెంట్స్‌పై దృష్టి పెట్టింది. భారతి సిమెంట్స్‌కు చైర్మన్ జగన్ సతీమణి వైయస్ భారతీ రెడ్డి. సాధారణంగా ఏ కంపెనీలోనైనా వాటాల్లో సింహభాగం ఉన్న వారే దాని నిర్వహణను చేపడతారు. ఇలాంటి నిబంధనలు ఏమీ లేకపోయినా కంపెనీలలో సహజంగా ఇదే అమలవుతోంది.
అయితే భారతి రెడ్డి చైర్మన్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇందులో ఫ్రెంచి కంపెనీ పెర్‌ఫిసమ్ 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని ప్రకారం కంపెనీ సారథ్య బాధ్యతలు ఫ్రెంచి కంపెనీకి వెళ్లాలి. కానీ ఆ ఫ్రెంచ్ కంపెనీని కాదని భారతి సిమెంట్స్ వ్యవస్థాపక సంస్థకే బాధ్యతలు అప్పగించారు. దీంతో సిబిఐ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది.
భారతి సిమెంట్సులోకి వచ్చిన ఫ్రెంచి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అని సిబిఐ అనుమానిస్తోంది. ఈ పెట్టుబడులన్నీ హవాలా ద్వారానే వచ్చినట్లు గుర్తించి, దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన జరుగుతున్న వాదనలలోనూ భారతి సిమెంట్సులోకి వచ్చిన పెట్టుబడులన్నీ హవాలావే అని భావిస్తున్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది.
దీనిపై దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే కోల్‌కతా కంపెనీల నుండి కూడా జగన్ కంపెనీలలోకి కోట్లాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థలకు సంబంధించి కూడా సిబిఐ కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా జగన్ అరెస్టు అక్రమమన్న పిటిషన్ పైన తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి