ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
Tue, 26 Jun 2012, IST
-
సిండికేట్ల జోరు
-
బారులు తీరిన బినామీలు
-
హైదరాబాద్‌లో స్వల్ప స్పందన
-
నేడు లాటరీ.. నిరసనలు బ బార్లూ బార్లా
షాపుకెంత ...?
టెండర్ దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మద్యం వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయాల ముందు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు ముగియవలసి ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వ్యాపారులు క్యూ కట్టడంతో సయయం పొడిగించారు. క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ రాత్రి 10 గంటలకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగింది. రాష్ట్ర రాజధానికి అందిన సమాచారం ప్రకారం... పలు ప్రాంతాల్లో షాపునకు 10 నుంచి 12 దరఖాస్తులందాయి. విజయవాడ, గుంటూరు, నల్గొండ, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు 30 నుండి 40 దరఖాస్తులు కూడా అందినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 169 షాపులకు 1500 దరఖాస్తులు దాఖలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 345 షాపులకు 3,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడలో 230 షాపులకు 3,500 మంది టెండర్లేశారు. ఒక్కో దరఖాస్తుకు 25 వేల రూపాయలను ఇఎండిగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 6,596 షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జంట నగరాల్లో ఆశించినంత మేరకు స్పందన లేకపోవడంతోపాటు, సిండికేట్ల మాయాజాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు అందకపోవడంతో ఆ మొత్తం కొంత మేర తగ్గింది. దరఖాస్తు రుసుంగా చెల్లించే మొత్తాన్ని లాటరీలో షాపు రానప్పటికీ ప్రభుత్వం వెనక్కు ఇవ్వదనే విషయం తెలిసిందే.
బినామీలదే హవా ...!
తాజా విధానం ద్వారా సిండికేట్లను నిర్మూలించడం సాధ్యం కాదని టెండర్ల దశలోనే తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిండికేట్లే చక్రం తిప్పి షాపులను పంచుకున్నారు. బినామీలను బారులు తీయించారు. అక్కడక్కడా ఒక్క టెండరు కూడా దాఖలు కాకుండా అడ్డుకున్నారు. ఇలా టెండర్లు దాఖలు కాని షాపుల సంఖ్య 300 దాకా ఉంటుందని అంచనా. పలు ప్రాంతాల్లో అధికారులూ నిబంధనలు ఉల్లంఘించి మరీ సిండికేట్లకు సహకరించారు. నిబంధనల ప్రకారం ఒక్క వ్యక్తి నుండి ఒక్క దరఖాస్తే తీసుకోవాల్సిఉంది. ప్రతి దరఖాస్తుదారుడు స్వయంగా ఎక్పైజ్ కార్యాలయం వద్దకు వచ్చి టెండరు ఫారాలను సమర్పించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనను దాదాపుగా ఎక్కడా అధికారులు పాటించలేదు. దరఖాస్తు రుసుం వస్తుండటంతో ఒకే వ్యక్తి నుండి పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడిఉన్న మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలోనే బినామీలతో దరఖాస్తులు చేయించారు.
బార్ల పాలసీ సిద్దం ...!
మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బార్లపైన దృష్టి సారించింది. ఈ మేరకు 2012-13 సంవత్సరపు లైసెన్స్ షీజు వివరాలను ప్రకటించింది. 50 వేల జనాభా దాటని మున్సిపల్ పట్టణానికి 25 లక్షల రూపాయలను, 50 వేల నుండి ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్ణణాలకు, నగరాలకు 35 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజు గా ప్రభుత్వం నిర్ణయించింది. 5 లక్షల నుండి 20 లక్షల వరకు జనాభా ఉన్న నగర పాలక సంస్థల్లో 38 లక్షల రూపాయలను, ఆ పై జనాభా ఉన్న ప్రాంతాలకు 31 లక్షల రూపాయలుగానూ లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. మద్యం షాపుల తరహాలోనే బార్లకు ఈ ఏడాది ప్రివిలేజి ట్యాక్స్‌ను విధించారు. లైసెన్స్ ఫీజు మొత్తానికన్నా 10 రెట్లు అమ్మిన బార్ల యజమానులు 9 శాతాన్ని ప్రివిలేజ్ ట్యాక్స్‌గా ప్రభుత్వానికి చెల్లించాల్సిఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి