30, జనవరి 2012, సోమవారం

‘పెట్టుబడి’ క్రౌర్యానికి ఇద్దరు బలి




యానాంలో కర్ఫ్యూ
‘అనంత’ లాభాలను గుంజుకోవడానికి వెంపర్లాడే పెట్టుబడి క్రౌర్యానికి ఇద్దరు బలయ్యారు. మరణించినవారిలో ఒకరు కార్మిక యూనియన్ నాయకుడు కాగా మరొకరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్. యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీ ఛార్జిలో కార్మికుల నాయకుడు చనిపోగా, తమ నాయకుడి మరణానికి ఆగ్రహంగా తిరగబడ్డ కార్మికుల చేతిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. కార్మికులకు స్ధానిక ప్రజానీకం సంఘీభావంగా ఉద్యమిస్తుండడంతో యానాంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది.
కాకినాడకి ముప్ఫై కి.మీ దూరంలో ఉన్న యానాంలోని ఒక ప్రవేటు సిరమిక్ ఫ్యాక్టరీలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కార్మిక యూనియన్ పెట్టుకుని యూనియన్ నాయకత్వంలో హక్కులు కావాలనీ, సౌకర్యాలు కల్పించాలనీ కొన్ని నెలలుగా కోరుతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. సమస్యలు పరిష్కరించడానికి బదులు యూనియన్ ని విచ్ఛిన్నం చేయడానికే యాజమాన్యం మొగ్గు చూపడంతో కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన తీవ్రం చేసారు. యాజమాన్యానికి పోలీసులు వత్తాసు వచ్చి లాఠీ ఛార్జీతో కార్మికుల యూనియన్ నాయకుడినే బలి తీసుకున్నారు.
రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులకి కూడా ఇక్కడ పర్మినెంటు ఉద్యోగం దక్కలేదు. మొత్తం పన్నెండు వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా అందులో ఎనిమిది వందలమంది ఇంకా కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. సీనియారిటీతో నిమిత్తం లేకుండా అరకొర వేతనాలిస్తూ లాభాలు జుర్రు కోవడానికి అలవాటు పడ్డ యాజమాన్యం కార్మికులు యూనియన్ పెట్టుకోవడం సహించలేకపోయింది. యూనియన్ వ్యవస్ధాపకుడు మురళీ మోహన్ నేతృత్వంలో జనవరి 1 నుండి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతనాలు పెంచాలనీ, కాంట్రాక్టు కార్మికులని పర్మినెంటు చేయాలనీ వీరు డిమాండ్ చేస్తున్నారు. కనీసం పది హేను సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులనైనా పర్మినెంటు చేయాలని కోరినా యాజమాన్యం దానికి నిరాకరించింది.
యాజమాన్యం కార్మికుల మీద పోలీసులకి ఫిర్యాదు చేయడంతో గురువారం రాత్రి యూనియన్ నాయకుడు మురళీ మోహన్ ని పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత అతన్ని వదిలిపెట్టారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకి కార్మికులని వెంట బెట్టుకుని మురళీ మోహన్ ఫ్యాక్టరి వద్దకు వెళ్ళాడు. ఉదయం షిప్టుకి హాజరువుతున్న కొద్ది మందికి నచ్చజెప్పి సమ్మెచేయించాలన్నది అతని ప్రయత్నం. యాజమాన్యం తరపున అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి ఉన్నారు. వారు వెంటనే లాఠీ ఛార్జీ ప్రారంభించారు. లాఠీ ఛార్జిలో మురళీ మోహన్ తలకి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్ధానిక ఆసుపత్రికి తీసుకెళ్ళిన కొద్ది సేపటికే అతను చనిపోయాడు. తమ కళ్ల ముందే తమ నాయకుడు లాఠీ దెబ్బలు తిని చనిపోవడం కార్మికుల్లో ఆగ్రహావేశాల్ని రగిలించింది.
కార్మిక నాయకుడి మరణ వార్త దావానలంలా వ్యాపించింది. కార్మికులకి స్ధానిక ప్రజలు కూడా జత కలిసి బస్సుల్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కంపెనీ లారీలు, బస్సులు మొత్తం యాభై వరకూ తగలబెట్టినట్లు తెలుస్తోంది. కార్మికులు గుంపులు గుంపులుగా ఫ్యాక్టరీలోకి జొరబడి కనపడ్డ ప్రతీదాన్నీ ధ్వంసం చేసారు. ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజి పైన కూడా దాడి జరిగింది. ఆపరేషన్స్ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్ ఇంటిపైన జరిగిన దాడిలో ఆయన తలకి బలమైన గాయాలు కావడంతో కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొంతమంది పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా మరికొంతమంది ధ్వంస రచనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వంద మంది యానాం పోలీసులు వచ్చినప్పటికీ గుంపులు గుంపులుగా జనం రావడంతో వారేమీ చేయలేకపోయారని జెమినీ న్యూస్ ఛానెల్ తెలిపింది.
పోలీసులు, కార్మికులు, జనం మధ్య కూడా తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ ఛార్జీకి దిగడమే కాక కాల్పులు ప్రారంభించడంతో ఆరుగురు కార్మికులకి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లూ, కార్మికులు కూడా రెచ్చిపోయి రాళ్లు విసిరినట్లు తెలుస్తొంది. కాకినాడ నుండి అదనపు బలగాలు యానాం వెళ్ళాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి ఇంకా పరిస్ధితి ఉద్రిక్తంగానే ఉందని ఛానెళ్ళు చెబుతున్నాయి.
ఇరవై సంవత్సరాలకి పైగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యం వైఖరిని ఏ చట్టాలూ కదిలించలేకపోయాయి. తమ జీవితాలు మొత్తం ఫ్యాక్టరీకే అంకితం చేసినా వారికి కనీస వేతనాలు ఇవ్వడానికి యాజమాన్యానికి మనసొప్పలేదు. పేరు గొప్ప చట్టాలు అనేక ఉన్నా నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో అవన్నీ పనికిరానివిగా మార్చివేశారు. కొన్ని నెలలుగా శాంతియుతంగా తమ కోర్కెలను కార్మికులు వ్యక్తం చేస్తున్నప్పటికీ శ్రమ దోపిడీకి అలవాటు పడ్డ యాజమాన్యానికి వారి శాంతి ప్రయత్నాలు తలకెక్కలేదు. అయినప్పటికీ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెల ద్వారానైనా యాజమాన్యం తమ మాట ఆలకించేలా చేయాలని ప్రయత్నించిన కార్మికులకు పేరు గొప్ప చట్టాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలూ, పోలీసులు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వగానే పరుగెత్తుకుంటూ వచ్చిన పోలీసులు కార్మికుల సమస్యలని పక్కనబెట్టి దౌర్జన్యానికి పూనుకున్న ఫలితంగా కార్మికుల నాయకుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దశాబ్దాల తరబడి ఆర్ధిక దోపిడీకి దిగడమే కాక కనీస వేతన హక్కు అడిగిన కార్మికులకి సమాధానం చెప్పేది పోలీసులే తప్ప యాజమాన్యం కాదన్నమాట.
పెట్టుబడికి లాభాలంటే పేరాశ. దానికి మామూలు లాభాలు సరిపోవు. ప్రతి రోజూ, ప్రతి నెలా, పతి సంవత్సరమూ దానికి లాభాలు పెరుగుతూ పోవాలి తప్ప తగ్గకూడదు. ప్రతి సంవత్సరం అది పెంచుకుంటూ పోయే లక్ష్యాలని చేరుకోవడానికి బలికావలసింది కార్మికుల వేతనాలూ, ఆ వేతనాలపై ఆధారపడ్డ కార్మికుల బతుకులూను. పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రతీదీ వృద్ధి రేటుతోనే కొలుస్తారు. వృద్ధి రేటు, లాభాలు, లాభ శాతం ఇవన్నీ పెరిగితే వాటిని చూసి షేర్ మార్కెట్లలో దాని షేర్ ధర పెరుగుతూ పోవాలి. మరింతమంది షేర్లు కొంటూ పోయేది మరిన్ని లాభాలు వస్తాయని. కాని ఆ లాభాలు ఎక్కడినుండి రావాలి? నెల నెలా, క్వార్టర్ క్వార్టరూ, సంవత్సరం సంవత్సరమూ లాభాలు ఎలా పెరుగుతాయి? మామాలు మార్గాల్లో అటువంటి అనంతమైన వృద్ధి, అనంతమైన లాభాలు సాధ్యం కాని పని. కొల్లగొట్టడమే దానికి మార్గం. అలా కొల్లగొట్టడానికి తేలిగ్గా దొరికేది కార్మికుడి శ్రమ శక్తే. శ్రమ తప్ప మరోక ఆస్తి లేని కార్మికుడు ఆ శ్రమను అమ్ముకోవడానికి పెట్టుబడిదారుడిని ఆశ్రయిస్తాడు. శ్రమకి తగిన వేతనాలు ఇవ్వడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కనీస వేతన చట్టం లాంటి కార్మిక చట్టాలు ఏర్పరిచాయి. ఆ చట్టాలని అమలు చేయాల్సినవాడు యజమాని జేబులో ఉంటే ఇక కార్మికుడి ఆర్తనాదం వినేదెవ్వడు?
కార్మికుడికి ఉండవలసిన సమ్మె హక్కు, కనీస వేతన హక్కు, ఉమ్మడి బేరసారాల హాక్కు నిజానికి హక్కులుగా ఏనాడో అంతరింపజేశారు. పెట్టుబడులు రావడమే గొప్ప అని భావించే మన్మోహన్ లాంటి పాలకుల వల్ల కార్మికుల హక్కులు సోదిలోకి కూడా లేకుండా పోయాయి. కార్మికులు శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ఈ హక్కులు ఇప్పుడు యజమానుల దయా దాక్షిణ్యాలకు లొంగి ఉన్నాయి. ఇక కార్మికుల విముక్తికి దారేది? అతనికి కనీస వేతనం వచ్చే మార్గం ఏది? ఫిక్కి, ఆసోఛామ్, ఎఫ్.ఐ.ఐ లాంటి సంఘాలు పెట్టుబడిదారులకి ఉన్నాయి. ఆ సంఘాలు ఏం కోరినా నడిచి వస్తాయి. చట్టాలు కావాలంటే వస్తాయి. ఉన్న చట్టాలు పోవాలంటే పోతాయి. వారు పన్నులు రద్దు చేయాలని కోరినా, బెయిలౌట్ కావాలన్నా, లక్షల కోట్ల అప్పులు రద్దు చేయాలన్నా ఆఘమేఘాల మీద జరిగిపోతాయి. కాని కార్మికుడు వంద రూపాయలు జీతం పెంచమన్నా, పదిహేనేళ్ళుగా పని చేస్తున్నాను కనుక జాబ్ రెగ్యులరైజ్ చెయ్యాలని కోరినా వచ్చేది పోలీసులు, లాఠీ చార్జీ. చివరికి ప్రాణాలు కూడా వదులుకోవాల్సిందే.
ఇదే పెట్టుబడికి తెలిసిన న్యాయం. అందుకే కార్మికులు తమకు తెలిసిన న్యాయం వెతుక్కోవలసిన పరిస్ధితి వస్తోంది. ఆ పరిస్ధితిని తెస్తోంది పెట్టుబడిదారులూ, వారికి కొమ్ముకాసే ప్రభుత్వాలే తప్ప కార్మికులు ఎంతమాత్రం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి