30, జనవరి 2012, సోమవారం

గాలి కోసం జగన్ బూతులు బెదిరింపులు



అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజుల్ని గాలి కంపెనీకి అప్పజెప్పడంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సి.బి.ఐ జగన్ అరెస్టుకి ఎందుకు వెనకాడుతోంది? గాలి జనార్ధన రెడ్డి కంటే ముందే ఇనుప గనుల లీజుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన కంపెనీని కాదని గాలి కంపెనీకి గనులు లీజు ఇచ్చారనీ, ఈ విషయంపై కోర్టుకి వెళ్లడంతో జగన్ తనను బెంగుళూరుకి మూడుసార్లు పిలిపించి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిట్టి బెదిరించాడనీ, అందువల్లనే తాను కేసుతో పాటు లీజు దరఖాస్తు కూడా ఉపసంహరించుకున్నాననీ ‘కొండారెడ్డి’ ఇచ్చిన వాంగ్మూలాన్ని ‘ఆంధ్ర జ్యోతి’ దిన పత్రిక బయట పెట్టింది. ఇంత స్పష్టంగా వై.ఎస్.జగన్మోహన రెడ్డి పైన ఆరోపణలు వచ్చినప్పటికీ సి.బి.ఐ ఇంతవరకూ ఆయనని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలు కలగజేస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసుపైన సి.బి.ఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సి.బి.ఐ విచారిస్తున్న ఎమార్ విల్లాల కుంభకోణం, గాలి అక్రమ గనుల తవ్వకం కేసు రెండింటిలోనూ జగన్ పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇంతవరకూ జగన్ ను విచారించడానికి ఆసక్తి చూపలేదు. ఒకసారి విచారించినప్పటికీ అది ‘సాక్షి’ గానేనని జగన్ చెప్పుకున్నాడు. జగన్ ని నిందితుడుగా సి.బి.ఐ ఇంతవరకూ విచారించలేదు. సోనియాకు సరెండర్ అయినందువల్లనే జగన్ ను సి.బి.ఐ విచారించడం లేదన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.
అనంతపురం జిల్లా, డి.హీరేహల్ మండలం, మలపనపురం, సిద్ధాపురం గ్రామాలో తొంభై హెక్టార్లలోఉన్న ఇనుప గనుల లీజు కోసం 2005లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందనీ, తాను 2004లోనే మైనింగ్ కోసం అటవీశాఖ అనుమతి కోరినా తన దరఖాస్తును జగన్ పక్కనబట్టించాడని ఎన్.కొండారెడ్డి సి.బి.ఐ కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనేకసార్లు సి.ఎం.ఒ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపాడు. దానితో తనను జగన్ మూడు సార్లు బెంగుళూరులోని తన నివాసానికి పిలిపించుకున్నాడనీ, గనుల లీజుకోసం దరఖాస్తు ఉపసంహరించుకోవాలనీ, కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చాడనీ, ఐనా తాను వినకపోవడంతో ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టాడనీ, రకరకాల బెదిరింపులకు దిగాడనీ కొండారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
కొండారెడ్ది దరఖాస్తు చేసుకున్న ప్రాంతాన్ని ఇతరులకు కేటాయించకుండా హై కోర్టు స్టే విధించాక రెండోసారి (2006 డిసెంబరు లేదా 2007 జనవరి) బెంగుళూరుకి పిలిపించుకుని మళ్ళీ బెదిరించాడని కొండారెడ్డి తెలిపాడు. గాలి జనార్ధన రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కొసం ఐదు కోట్ల రూపాయలు తన తండ్రికి ఇచ్చాడనీ, దానితో తన తండ్రి గాలి జనార్ధన రెడ్డికి మైనింగ్ లీజు ఇస్తానని మాట ఇచ్చారనీ ఇపుడు కొండారెడ్డి వల్ల ఆ మాట పోతోందనీ తనపై జగన్ విరుచుకుపడ్డాడని కొండారెడ్డి తెలిపాడు. హైకోర్టు తీర్పుని కూడా ప్రభావితం చేయనున్నారని సమాచారం అందడంతో తాను ఛీఫ్ జస్టిస్ కి దరఖాస్తు చేసుకుని కేసు మరో జడ్జి కి అప్పగించామని కోరాననీ దానికి ఆయన అనూకులంగా నిర్ణయం తీసుకున్నారని కొండారెడ్డి తెలిపాడు. మళ్ళీ 2007 ఫిబ్రవరి/మార్చి లో జగన్ తనను పిలిపించాడని కొండారెడ్డి తెలిపాడు.
మూడోసారి వ్యూహం మార్చుకున్న జగన్ తిట్లకు బెదిరింపులకు దిగడానికి బదులు ప్రలోభ పెట్టాడని కొండారెడ్డి తెలిపాడు. “సర్పంచ్ నుండి, సి.ఎ దాకా అధికారం అంతా మా చేతిలో ఉంది. నీ దరఖాస్తు వెనక్కి తీసుకో. వచ్చే క్యాబినెట్ విస్తరణలో మీ తండ్రికి మంత్రి పదవి ఇవ్వాలని మా నాన్నకి చెబుతా. నీ వ్యాపారాభివృద్ధికి బ్యాంకు లోన్లు ఇప్పిస్తాం” అని జగన్ ప్రలోభ పెట్టాడని కొండారెడ్డి తెలిపాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, హితులు జగన్ కి ఉన్న అధికార బలానికి ఎదురు తిరగవద్దనీ, వాళ్ళేమైనా చెయ్యగలరని హితవు పలకడంతో తాను వారిని అనుసరించక తప్పలెదని కొండారెడ్డి తెలిపాడు. హైకోర్టులో కేసునూ, లీజు దరఖాస్తునూ వెనక్కి తీసుకుంటూ ‘ఒ.ఎం.సి’ లాయర్ తయారు చేసి ఉంచిన డాక్యుమెంటులో సంతకాలు పెట్టానని కొండారెడ్డి తెలిపాడు.
రెండు సార్లు బూతులు తిట్టి, రక రకాల బెదిరింపులకు పాల్పడిన జగన్ మూడోసారి కొండారెడ్డిని ప్రలోభాలతో లొంగదీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కొండారెడ్డి తండ్రికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఆ కుటుంబానికి అవినీతి పాల్పడగల అవకాశాలు కల్పించడమే. ఆ విధంగా ఆర్ధిక లాభాలు సమకూరుతాయని నమ్మకం కుదిరాక మాత్రమే కొండారెడ్డి జగన్ కి లొంగాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సుపుత్రుడి హోదాలో ఉన్న జగన్ రెండుసార్లు బెదిరించినా లొంగని కొండారెడ్డి ఆర్ధిక ప్రలోభాలకి లొంగాడు. ఐతే వ్రతం చెడ్డా కొండారెడ్డికి ఫలితం దక్కలేదు. పైగా ఆ తర్వాత 2009 లో ప్రత్యర్ధులతో చేతులు కలిపి కొండారెడ్డి తండ్రిని వై.ఎస్.రాజశేఖర రెడ్ది ఓడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగా మాట తప్పని, మడమ తిప్పని వంశంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన సుపుత్రుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డి లు మాట తప్పి, మడమ తిప్పారు.
‘మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది’ అని చెప్పుకునే జగన్ గొప్పలు వట్టి బూటకం. కేవలం తమకు ప్రయోజనాలు ఉంటేనే వారి మాటలు చెల్లుబాటవుతాయి తప్ప తమకు ప్రయోజనం లేదంటే వారి మాటలు నీటి మూటలే. అదొక వ్యవహారం కాగా, ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రజాధనాన్ని బంధువులకు, స్నేహితులకి, ప్రత్యర్ధులను లోంగదీసుకోవడానికి వినియోగించడానికీ సిద్ధపడడం, అందుకోసం హామీలూ, మాటలూ ఇచ్చేయడమే అత్యంత కిరాతకం. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకుని దాని ద్వారా ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమే ప్రస్తుతం రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న రాజకీయ కార్యక్రమం. ఈ పనిలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, రాష్ట్రానికి సంబంధించినంతవరకూ, అందరినీ అధిగమించి ఉన్నత స్ధాయికి చేరుకున్నాడని చెప్పవచ్చు. దేవుడి రాజ్యం అంటూ తన కిరాతక పాలనకి దైవాంశని ఆపాదించడానికి ఆయన చేసిన ప్రయత్నం చూస్తే దేవుళ్లు ఎవరికి అందుబాటులో ఉంటారో కూడా అర్ధం చేసుకోవచ్చు.
పాలక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ అధిపతి సోనియా గాంధి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఓ వైపు అవినీతి అంతానికి కంకణం కట్టుకున్నామంటూ దేశ ప్రజలకు వాగ్దానాలు కురిపిస్తూ మరోపక్క జగన్ లాంటి అవినీతిపరులపై నమోదైన సి.బి.ఐ కేసులు ముందుకు సాగకుండా జరుగుతున్న ప్రయత్నాల పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు ఎందుకు మౌనంగా ఉన్నారు? భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించగల నాయకులు కొరవడిన నేపధ్యంలో జగన్ పైన కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నదా? అందుకే ప్రస్తుతానికి జగన్ వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కకుండా జాగ్రత్తపడుతోందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్న జగన్ మీడియాకు వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలను సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇస్తున్నట్లు? సోనియా, రాహుల్, మన్మోహన్ లాంటి కాంగ్రెస్ హై కమాండ్ అనుమతి జరగకుండా ఇవన్నీ సాధ్యమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టమే. ప్రజలే వారి స్ధానాల్ని నిర్ణయించవలసి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి