30, జనవరి 2012, సోమవారం

ఆ డాక్టరే లాడెన్‌ని పట్టిచ్చాడు -అమెరికా





బిన్ లాడెన్ ఆచూకి తెలుసుకోవడంలో తమకు సహాయపడింది పాకిస్ధాన్ ప్రభుత్వం అరెస్టు చేసిన డాక్టరేనని అమెరికా మొదటిసారి ధృవీకరించింది. డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ఓ టెలివిజన్ ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తూ ఈ నిజాన్ని కక్కాడు. అబ్బోత్తాబాద్ లో లాడెన్ నివసించాడని చెబుతున్న ఇంటికి సమీపంలోనే పెనెట్టా చెబుతున్న డాక్టర్ నివాసం ఉంటున్నాడు.
అమెరికాకి చెందిన నావీ సీల్ విభాగ కమాండర్లు రెండు హెలికాప్టర్లలో బయలుదేరి, పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెప్పకుండా, పాకిస్ధాన్ గగనతలంలోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ను చంపేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా గత మే నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ల నుండి తమ కమెండోలు లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న మరో ముగ్గురిని దారుణంగా చంపేసారు. రక్తపు మడుగులో ఉన్న ముగ్గురి శవాలను పాకిస్ధాన్ భద్రతా బలగాలు బహిరంగం కావించాయి.
బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పినప్పటికీ, అమెరికా, అందుకు తగిన సాక్ష్యాలేవీ బైట పెట్టలేదు. శవం తాలూకు ఫొటోలు అత్యంత భయంకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయని అందువల్లనే ఆ ఫొటోలు విడుదల చేయలేకపోతున్నామనీ ఒబామా ప్రకటించాడు. ఒసామా బిన్ లాడెన్ నిరాయుధంగా ఉన్నాడని కూడా అమెరికా అధికారులు ఆ తర్వాత ధృవీకరించారు. నిరాయుధంగా ఉన్న బిన్ లాడెన్ ను ‘శవం ఫొటోలు బైటపెట్టడానికి కూడా వీలులేనంత’ దారుణంగా చంపామని చెప్పుకోవడానికి అమెరికా అధికారులు గానీ, అధ్యక్షుడు ఒబామా గానీ సిగ్గుపడలేదు. తమ ‘సిగ్గులేని తనాన్నీ’, ‘సంస్కార రాహిత్యాన్నీ’, ‘ప్రజాస్వామిక విలువల పట్ల ఉన్న బూటకపు గౌరవాన్నీ’, ‘లాడెన్ శవానికి కూడా భయపడే పిరికితనాన్నీ’ వారా విధంగా చాటుకున్నారు.
లాడెన్ హత్యతో పాకిస్ధాన్ పౌరులు అనేకమంది ఆగ్రహం చెందారు. పాకిస్ధాన్ ప్రాదేశిక సార్వభౌమత్యాన్ని అమెరికా నిరభ్యంతరంగా ఉల్లంఘించడం పట్ల తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ ఆగ్రహాన్ని ‘లాడెన్ కి ఆశ్రయం ఇస్తున్నందుకు’ వ్యక్తమైన ఆగ్రహంగా పశ్చిమ పత్రికలు రాసుకుని సంతృప్తి చెందాయి. అదే విశ్లేషణని ఇప్పటికీ నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నాయి. పాకిస్ధాన్ ప్రభుత్వం తమకు తెలియకుండా అమెరికా దాడి చేసిందని చెప్పినప్పటికీ దాన్ని విశ్వసించినవారు లేరు, లేదా అతి తక్కువ. ఐతే పాకిస్ధాన్ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి పాక్ ప్రభుత్వం ‘లాడెన్ హత్య’ పైన ‘విచారణ తంతు’ను ప్రారంభించి కొనసాగిస్తోంది.
డాక్టర్ షకీల్ అఫ్రిది సి.ఐ.ఏ జరిపిన దాడి కి అవసరమైన గూఢచార సమాచారాన్ని తమకు అందించాడని పెనెట్టా తెలిపాడు. సి.బి.ఎస్ ఛానెల్ కి చెందిన ’60 మినిట్స్’ కార్యక్రమానికి పెనెట్టా ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సంగతి చెప్పాడు. ఆదివారం ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నది. బిన్ లాడెన్ గా భావిస్తున్న వ్యక్తి డి.ఎన్.ఎ నమూనా సేకరించడానికి డాక్టర్ షకీల్ ‘వేక్సినేషన్ కార్యక్రమం’ నిర్వహించాడు. తద్వారా సేకరించిన డి.ఎన్.ఎ ఫలితాలను డాక్టర్ సి.ఐ.ఎ కి చేరవేశాడు. పాకిస్ధాన్ పౌరుడిగా ఉంటూ వారి దేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తి డి.ఎన్.ఎ ని అక్రమ పద్ధతుల్లో సేకరించి పరాయి దేశానికి, అందునా ప్రపంచ దురాక్రమణదారుగా, ప్రపంచంలోని ఆశేష శ్రామిక జన ప్రయోజనాలకు పచ్చి వ్యతిరేకిగా తనను తాను నిరూపించుకున్న ‘రాక్షస అమెరికా ప్రభుత్వానికి’ ఆ డాక్టర్ చేరవేశాడు.
డాక్టర్ షకీల్ పైన పాకిస్ధాన్ ‘దేశ ద్రోహం/విశ్వాస ఘాతుకం’ నేరం ఆరోపించింది. అయితే పాకిస్ధాన్ ప్రభుత్వం డాక్టర్ ని శిక్షించడంలో చిత్తశుద్ధితో లేదు. డాక్టర్ సమస్యను గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించుకోవాలని పాక్ చూస్తున్నట్లుగా తెలుస్తొంది. అఫ్రిది విషయమై మీడియా కేంద్రీకరణ చప్పబడిన తర్వాత షకీల్ ని అమెరికాకి అప్పజెప్పడానికి పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు పాక్ అధికారులు చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది. డాక్టర్ పై విచారణ జరుగుతున్నందున తమ పేర్లు చెప్పవద్దని వారు కోరారట.
డాక్టర్ షకీల్ అఫ్రిది ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో టాప్ సర్జన్ గా నియామకం సంపాదించడం వెనుక అమెరికా కుట్ర ఉంది. అంతవరకూ ఆయన డిపార్ట్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నప్పటికీ ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంతో సంబంధాలు ఏర్పడ్డాక ఒక్కసారిగా టాప్ సర్జన్ గా పేరు సంపాదించాడు. ఆరోగ్య విభాగంలో షకీల్ ఉన్నత స్ధానాలకి వేగంగా ప్రమోషన్లు పొందడం ‘మైండ్ బాగ్లింగ్’ గా ఆ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అభివర్ణించారని ఈ కధనం తెలియజేస్తోంది.1990ల్లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన షకీల్ ఇప్పటి ఖైబర్ ఫక్తూన్వా (అప్పటి నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. ఈయన తాతగారు కూడా బ్రిటిష్ ఆర్మీలో పని చేసి, తన సేవలకు ప్రతిఫలంగా, పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ లో, భూముల్ని పొందిన ఘనుడేనట.
డాక్టర్ గా పని చేస్తూ తనకు బహుమానాలు కురిపించిన కంపెనీల మందులనే సిఫారసు చేసేవాడని ఓ మెడికల్ రిప్రెజెంటేటివ్ తెలిపాడు. జామూద్ లో ఓ ప్రవేటు క్లినిక్ నడుపుతూ, తాను సర్జన్ కాకపోయినప్పటికీ అనేక సర్జన్లు చేశాడు. దానితో ఆయనపైన ఆరోగ్య విభాగం విచారణ జరుపుతోంది.  ఐదేళ్ల క్రితం ఆయన నర్సింగ్ హోమ్ లో పని చేసి ఒక నర్సు అనుమానాస్పద పరిస్ధితుల్లో మృతి చెందింది. నర్సు మృతి విషయంలో కూడా ఈయనపైన దర్యాప్తు జరుగుతోంది. అలాంటిది 2007 లో అమెరికా రాయబార కార్యాలయంతో సంబంధాలు ఏర్పడ్డాక షకీల్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. తనకు అమెరికా ఎంబసీ నుండి పిలుపు వచ్చినప్పుడల్లా తన పలుకుబడి గురించి గొప్పలు చెప్పుకునేవాడని అతని బంధువు తెలిపాడు. 2009లో షకిల్, భార్యాపిల్లలతో కలిసి అమెరికా కూడా వెళ్లాడు. అమెరికా నుండి తిరిగొచ్చాక ఆయన అకస్మాత్తుగా ఎజెన్సీ సర్జన్ గా ప్రమోషన్ సంపాదించాడు. ఆయన ప్రమోషన్ తో హెల్త్ డిపార్ట్ మెంట్ లో అనేకులు షాక్ తిన్నారట. ఆయన కంటే సీనియర్ డాక్టర్లను, మెరుగైనవారినీ పక్కన బెట్టి షకీల్ కి ప్రమోషన్ ఇచ్చారని ఆయన సహోద్యోగులు తెలిపారు.
అమెరికా గూఢచార సంస్ధ, కుట్ర కుతంత్రాల పుట్ట అయిన సి.ఐ.ఎ రాక్షస హస్తాలు ఊహించని మారుమూల చోట్లకి కూడా ఎలా చాచి ఉంటాయో ఈ ఉదాహరణ స్పషం చేస్తోంది. సి.ఐ.ఎ అనగానే అదెక్కడో అమెరికాలో ఉంటుందనీ, సినిమాల్లో సాహస కృత్యాలలో మాత్రమే కనిపిస్తుందనీ భావించేవారికి ఈ ఉదంతం కనువిప్పు కావాలి. తనకు అనుకూలమైన ప్రచార, ప్రసార సాధనాల ద్వారా సి.ఐ.ఎ ప్రపంచంలోని నలుమూలలకీ తన ప్రభావాన్ని విస్తరించింది. ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఇది అనేక దేశాల్లో ప్రజా జీవనాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. పాకిస్ధాన్ లో ఎక్కడో వాయువ్య మూలన పాక్ ప్రభుత్వానికి కూడా సరిగా అందుబాటులో ఉండని ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ లో గల ప్రాంతంలో నివసించే ఒక అవినీతి డాక్టర్ ని ఆకర్షించి అతని ద్వారా ‘పేరు మోసిన టెర్రరిస్టు’ గా అమెరికా ముద్ర వేసిన ‘ఒసామా బిన్ లాడేన్’ ప్రాణాలను సి.ఐ.ఎ తీయగలిగింది. గత సంవత్సరం జనవరిలో సి.ఐ.ఎ గూఢచారి ఒకరు ఇద్దరు పాక్ పౌరుల్ని కాల్చి చంపాక పాకిస్ధాన్ అనేక నగరాల్లో నివాస కాలనీల్లో ఉంటూ, పాక్ యువతులను వివాహం కూడా చేసుకుని నివసిస్తున్న అనేక మంది సి.ఐ.ఎ గూఢచారుల ఆనుపానుల్ని పాక్ ప్రజలు బైటికి వెల్లడించిన సంగతి గుర్తుంచుకుంటే, సి.ఐ.ఎ విస్తృతి అర్ధం కాగలదు. సి.ఐ.ఎ విస్తృతికి భారత దేశం గానీ, ఆంధ్ర రాష్ట్రం గానీ, చివరికి తెలుగు బ్లాగులు గానీ ఏ మాత్రం అతీతం కావని ఈ సందర్భంగా గుర్తించవలసిన అంశం.
ఐతే, డాక్టర్ షకీల్ ని అమెరికాకి అప్పజెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయన నేరానికి పాల్పడింది పాకిస్ధాన్ గడ్డపైన. అతను పాకిస్ధానీయుడే తప్ప అమెరికా దేశస్ధుడు కాదు. తమ దేశ పౌరుడైన ఒక దేశ ద్రోహిని అమెరికాకి అప్పజెప్పవలసిన అవసరం పాకిస్ధాన్ ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? డాక్టర్ ప్రాణాల పట్ల అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకి ఉన్న ఆందోళన ఈ ప్రశ్నలకు చక్కటి సమాధానం చెబుతుంది. డాక్టర్ దేశద్రోహానికి పాల్పడ్డప్పటికీ అతను సాయం చేసింది తమ మాస్టర్ అమెరికాకి గనక పాక్ పాలకులకి ఆయనని అమెరికాకి అప్పజెప్పడానికి అభ్యంతరం ఏమీ ఉండదన్నమాట. తమకు సాయం చేసిన డాక్టర్ ని అమెరికాకి రప్పించుకుని సురక్షితంగా ఉంచడంలో అమెరికాకి ఆసక్తి ఉంది కానీ, తమ గడ్డపైన తన పౌరుడిగా ఉంటూ ‘దేశ ద్రోహానికి’ పాల్పడిన వ్యక్తిగా ఆయనని శిక్షించడంలో పాక్ పాలకులకి ఆసక్తి లేకపోవడం అత్యంత విచారకరం. పాకిస్ధాన్ దేశంలో ‘దేశ ద్రోహానికి’ పాల్పడుతున్నవారి పట్ల పాక్ పాలకులకు అభ్యంతరం ఏమీ ఉండదన్నమాట! పాక్ పాలకులు, తమ అమెరికా లొంగుబాటుతనాన్ని ఈ విధంగా నిర్ద్వంద్వంగా రుజువు చేసుకుంటున్నారు.
అబ్బోత్తాబాద్ కాంపౌండ్ లో తమకు ఆసక్తి ఉన్న వ్యక్తి నియమిస్తున్నాడన్న సంగతి పాక్ ప్రభుత్వంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుందని తాను నమ్ముతున్నానని పెనెట్టా చెప్పాడు. సదరు కాంపౌండ్ లో ఉన్నది బిన్ లాడెనే అని పాక్ ప్రభుత్వానికి తెలిసినట్లుగా తన వద్ద సాక్ష్యాధారాలేవీ లేవని పెనెట్టా అంగీకరించాడు. అయినా అమెరికా పాలకులకీ, అధికారులకీ సాక్ష్యాలతో ఏంపని? అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గానీ, అంతర్జాతీయ చట్టాలను గానీ, కనీసం తన దేశంలో అమలువుతున్న న్యాయ సూత్రాలను గానీ చట్టాలను గానీ పాటించినట్లయితే సాక్ష్యాలతో అవసరం ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలనూ, న్యాయ సూత్రాలనూ తుంగలో తొక్కో, తన కావలి కుక్కలుగా చేసుకునో తాను చేయదలుచుకున్న దుర్మార్గాలన్నింటినీ పూర్తి కావించే అమెరికా దుర్మదాంధులకి సాక్ష్యాలతో పనా?
సాక్ష్యాలు ఏవీ లేకపోయినా పచ్చి అబద్ధాలను పక్కా నిజాలుగా ప్రచారం చెయ్యడంలో దిట్ట. ఆ ‘గోబెల్’ చచ్చి ఎక్కడున్నాడో గానీ ఆయనని మించిన అబద్ధాల ప్రచారకులు, పత్రికలు, ఛానెళ్లను అమెరికా, యూరప్ దేశాలు సృష్టించుకుని వాటి సాయంతో నానా దుర్మార్గాలనీ సాగిస్తున్నాయి. సద్దాం హుస్సేన్ వద్ద ‘సామూహిక విధ్వంసక ఆయుధాలు’ ఉన్నాయని అబద్ధాలు చెప్పి ఇరాక్ ప్రజలను దశాబ్ధానికిపైగా చిత్ర హింసలు పెట్టడమే కాక, ఆ దేశంపై దాడి చేసి అనేక తెగల, వర్గాల, గ్రూపుల ‘యుద్ధాల కొట్టం’ గా అమెరికా, యూరప్ లు మార్చివేశాయి. గడ్డాఫీ పైన ప్రజలు తిరగబడ్డారంటూ ప్రచారం చేసి తాను శిక్షణ నిచ్చిన లిబియా దేశ ద్రోహులతో ‘అద్దె తిరుగుబాటు’ ను అవి నడిపాయి. చివరికి లిబియాను కూడా ఇరాక్ లాగే మార్చడానికి అవి పూనుకుంటున్నాయి. అమెరికా, యూరప్ ల దుర్మార్గపూరిత అబద్ధాల ప్రచారానికి తాజా బాదితులు సిరియా, సిరియా ప్రజలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి