18, జనవరి 2012, బుధవారం

ఆన్‌లైన్‌ పైరసీ నిరోధానికి అమెరికా కొత్త చట్టం

AA

* పైరసీకి పాల్పడితే శిక్షలు తప్పవు
* ఏడాది క్రితమే చట్టాన్ని బలోపేతం చేసిన భారత్‌
* ఐటీ సంస్థలు, పబ్లిషర్స్‌కు ఊరట
* యాంటీపైరసీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
* నిరసనగా సర్వీసులను ఒకరోజు నిలిపివేయనున్న వీకీపీడియా
* యాంటీ పైరసీ చట్టం వల్ల వికీపీడియాకు తీవ్ర నష్టం


ఆన్‌లైన్‌ సమాచార బాండాగారం వికీపిడియాకు బ్రేక్‌ పడనుందా...? ఇకపై ఇందులో అప్‌డేట్ సమాచారం దొరకదా. ఈ పరిస్థితికి కారణం ఏంటి. ఆన్‌లైన్‌ పైరసీపై అమెరికా తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇంకా ఏయే వెబ్‌సైట్లకు ఇబ్బంది కలుగుతుంది. అమెరికా తీసుకొచ్చిన సోపా, పీపా చట్టాల అసలు ఉద్దేశం ఏంటి. ఈ అంశాలపై టీవీ5 ప్రత్యేక కథనం. ఆన్‌లైన్‌ పైరసీని నిరోధించేందుకు అమెరికా కాంగ్రెస్‌ పదిహేను మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

సుదీర్ఘ అధ్యాయనం తరువాత ఆ కమిటీ చేసిన సూచనలను చట్టరూపంలోకి తీసుకొచ్చేందుకు అమెరికా సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో దాదాపు ఆన్‌లైన్‌లో జరిగే పైరసీకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌స్టాప్‌ పడే అవకాశాలున్నాయి. స్టాప్‌ ఆన్‌లైన్‌ పైరసీ యాక్టు తోపాటు ఐపీ ప్రొటెక్షన్‌ యాక్టులను కమిటీ సూచన మేరకు అమెరికా ప్రభుత్వం ఖరారు చేయనుంది. మన దేశంలో ఐటీ చట్టం-2000కు పలు సవరణలు చేసిన మన ప్రభుత్వం గత ఏడాది ఐటీ చట్టాన్ని బలోపేతం చేసింది.

అయినా... అమెరికాలాంటి దేశాల్లో జరిగే పైరసీలతో ఇక్కడి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, గ్రాఫిక్‌ మీడియా, సినీరంగం నష్టాల బారిన పడుతున్నాయి. అమెరికా సెనెట్‌ తీసుకురాబోయే కొత్త చట్టం....భారత్‌కు ఉపయుక్తంగా ఉంటుందని... ఒక్క వికీపీడియానే కాకుండా యూట్యూబ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లపైనా ఈ చట్టం ప్రభావం ఉంటుందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అమెరికా ఇంటర్నెట్‌కు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అందులో ప్రధానమైనది ఆన్‌లైన్‌ కాపీరైట్‌ నిబంధనలు, చట్టాల్లో సవరణలు. ఆన్‌లైన్‌ ప్రైవసీ చట్టాన్ని నిలిపివేయటం. రెండవది ఐపీ ప్రొటెక్ట్‌ యాక్ట్‌. అమెరికా చేస్తున్న కొత్తచట్టంతో ఆన్‌లైన్‌ సమాచార బాండాగారంగా పేర్గాంచిన వికీపీడియాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరైనా అప్‌లోడ్‌ చేయవచ్చు. అలా వికీపీడియాకు ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం ఆరులక్షల మంది యూజర్లు ఉన్నారు.

అయితే సంబంధిత కంటెంట్‌ కాపీరైట్‌ పరిధిలోనిదా? లేదా? అనే అంశంతో ప్రమేయం లేకుండా వికీపీడియా ఆ సమాచారాన్ని ప్రచురిస్తోంది. ఇతరులు కూడా ఆ సమాచారాన్ని యథావిధిగా వాడుకోవచ్చని వికీపీడియా నిబంధనల్లో ఉంది. అయితే అమెరికా తీసుకురాబోతున్న కొత్త చట్టంతో ఎవరైనా తమ కాపీరైట్‌ కంటెంట్‌ను వికీపీడియా వినియోగించుకున్నట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... కేసులు వేస్తే... నష్టపరిహారం మిలియన్‌ డాలర్లలో ఉండే ప్రమాదముంది.

దీంతో వికీపీడియాకు కోలుకోలేని దెబ్బ తగలనుంది. ఈ కారణంగా వికీపీడియా మూతపడే ప్రమాదమూ లేకపోలేదు. ఈ కారణంగా వికీపీడియా అమెరికా చేసిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా బుధవారం నాడు తమ సర్వీసులను నిలిపివేయనుంది. ఆన్‌లైన్‌ సమాచార బాండాగారం వికీపీడియా రేపు కనుమరుగు కానుంది. అమెరికా ధోరణిని నిరసిస్తూ బుధవారం వీకిపీడియా తన సేవలను నిలిపివేయనుంది. ఇదే దారిలోనే సెర్చింజన్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు సైతం తమ సేవలను నిలిపివేసే దిశలో చర్యలు తీసుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి