24, జనవరి 2012, మంగళవారం

వామ్మో!హడలెత్తిస్తున్న బడ్జెట్

హైదరాబాద్: ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం వస్తున్న డిమాండ్లు చూసి ఆర్థిక శాఖ గుండె గాబరా అవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో రెండున్నర లక్షల కోట్లకు డిమాండ్లు వివిధ శాఖల నుంచి రావడంతో ఏంచేయాలో అర్థంగాని అయోమయం ఎదుర్కొంటోంది. గత బడ్జెట్‌లో రెండు 1.75 లక్షల కోట్లకు డిమాండ్లు రాగా, బడ్జెట్‌ను మాత్రం 1.30 లక్షల కోట్లకే రూపొందించారు. ఇప్పుడు ఏకంగా 2.5 లక్షల కోట్లకు డిమాండ్లు చేరడంతో, ఏం చేయాలన్న అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. కాగా బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 13నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం వచ్చిన డిమాండ్లలో సింహభాగం జీతభత్యాలకే కావాల్సి ఉంటుంది. గత బడ్జెట్‌లో 35 వేల కోట్ల వరకు నిధులు కేటాయించగా, ఈసారి అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని వివిధ శాఖల నుంచి విజ్ఞప్తులు అందాయి. ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించిన భారీ ఉద్యోగ భర్తీ ప్రకటన కారణంగా జీతాలకు మరింత ఎక్కువ మొత్తం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఖజానాకు భారంగా మారనున్నట్టు కొత్తగా వచ్చిన బడ్జెట్ డిమాండ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇలాఉండగా, నీటిపారుదల శాఖ 35 వేల కోట్లు కోరగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కోరడం గమనార్హం.

హోంశాఖ కూడా ఆయుధాల కొనుగోలు, ఇతర భద్రతా ఏర్పాట్ల కోసం గత ఏడాది కన్నా ఎక్కువ మొత్తాన్ని కోరినట్టు అధికారులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ కన్నా ముందుగానే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఏం చేయాలన్న అంశంపైనా ఆర్థికశాఖ సమాలోచనలు జరుపుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంతమొత్తం వచ్చే అవకాశాలు ఉంటాయోనన్న అంశంపై ముందుగానే సూచన ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అనుకున్న సమయంలోగా కేంద్రం నుంచి సూచనాత్మక కేటాయింపు వివరాలు రాకపోతే గత బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చిన మొత్తానికి, అదనంగా కొంత కలుపుకొని బడ్జెట్‌ను రూపొందించుకోవాలని, బడ్జెట్ సమావేశాల చివరిలో అప్రాప్రియేషన్ ఆమోదం సమయంలో మార్పులు చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. అందువల్ల ఈ అంశం పెద్ద సమస్య కాబోదని తేల్చి చెప్పారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కూడా ఇంకా పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగకపోవడంతో, ఆ మొత్తం భారం ఈ ఏడాదిపై పడనుంది. అందుకే పాత బకాయిల మొత్తాన్ని కూడా విడతలవారీగా చెల్లించేందుకు ఈసారి బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని సమకూర్చాలని కూడా ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇది కూడా మరోసారి భారీ బడ్జెట్‌కు తెరలేపుతుందని అంచనా వేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి