న్యూఢిల్లీ,
డిసెంబర్ 30: ఆహార ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. కూరగాయలు,
ఉల్లి, ఆలుగడ్డలు, గోధుమ వంటి పలు నిత్యావసర సరకుల ధరలు తగ్గిన ఫలితంగా
ఈనెల 17తో ముగిసిన వారంలో ఆహార ద్రవ్యోల్బణం గత ఆరేళ్ల కనిష్టస్థాయిలో 0.42
శాతానికి క్షీణించింది. టోకుధరల సూచి (డబ్ల్యుపిఐ) ఆధారంగా గణించే ఆహార
ద్రవ్యోల్బణం అంతక్రితం వారంలో 1.81% నమోదైన విషయం తెలిసిందే. గత ఏడాది
ఇదేకాలంలో ఇది 15.48% వుంది.
గురువారం
వెల్లడిచేసిన అధికార లెక్కల ప్రకారం డిసెంబర్ 17 వారంలో ఉల్లి ధరలు
వార్షికప్రాతిపదికన 59.04%, ఆలుగడ్డలు 33.76%, గోధుల ధరలు 3.30% చౌక
అయ్యాయి. నిర్ధారిత వారంలో కూరగాయల ధరలు మొత్తంమీద 36.02% దిగొచ్చాయి. గత
నెల తొలివారం వరకూ రెండంకెల స్థాయిలో కొనసాగిన ఆహార ధరల సూచి
కనిష్టస్థాయికి తగ్గటం ధరలతో పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి, ఇటు
ఆర్‌బిఐకి ఊరట కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే వచ్చేనెల
ద్రవ్యవిధాన సమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లు తగ్గించడం ఖాయమని కూడా వీరు
భావిస్తున్నారు. ఇతర ఆహార ఉత్పత్తులు వార్షిక
ప్రాతిపదికన ప్రియమైనాయి. అపరాల ధర 14.07%, పాలు 11.30%, గడ్లు, మాంసం,
చేపల ధర 11.56% పెరిగాయి. అలాగే పండ్ల ధరలు 8.46%, తృణధాన్యాల ధర 2.15%
పెరిగాయి.డిసెంబర్ 17తో ముగిసిన వారంలోప్రాథమిక వస్తువుల
ద్రవ్యోల్బణం అంతక్రితం వారానికి పోల్చుకుంటే 3.78% నుంచి 2.70 శాతానికి
తగ్గిపోయింది. టోకు ధరల సూచిలో ప్రాథమిక వస్తువుల గ్రూప్ 20 శాతం వెయిటేజీ
కలిగివుంది. ఇక ఫైబర్స్, నూనెగింజల వంటి ఆహారేతర
వస్తువుల్లో ద్రవ్యోల్బణం 1.37% నుంచి 0.28 శాతానికి దిగింది. ఇంధనం,
విద్యుత్ ద్రవ్యోల్బణం 15.24% నుంచి 14.37 శాతానికి తగ్గింది. కాగా, గత
ఏడాది డిసెంబర్ నుంచి ప్రధాన ద్రవ్యోల్బణం 9 శాతానికి ఎగువనే కొనసాగుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి