24, జనవరి 2012, మంగళవారం

జగన్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే విజయసాయి అరెస్ట్ తో జగన్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీబీఐ అధికారులు, తాజాగా జగన్ సన్నిహితుడు, ఆయన భార్య భారతి బంధువు సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇవాళ ఉదయం గోపన్ పల్లిలోని సునీల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఆయన్ను తమతో పాటు కార్యాలయానికి తీసుకెళ్లి, చాలా సేపు ప్రశ్నించారు. అనంతరం మళ్లీ ఆయన్ను తమ వాహనంలోనే ఇంటికి తీసుకువెళ్లి, అక్కడ సోదాలు చేశారు. సునీల్ రెడ్డి నివాసం నుంచి కీలక వివరాలను ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. జగన్ ఆస్తుల గురించి, అక్రమ పెట్టుబడుల గురించి చాలా వివరాలు సునీల్ రెడ్డికి తెలుసని సీబీఐ భావిస్తోంది. జగన్ వెన్నంటి ఉండే సునీల్ రెడ్డి కూడా, ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాడని అనుమానిస్తోంది. సునీల్ రెడ్డి అరెస్ట్ను ఇంకా ధృవీకరించకపోయినా, త్వరలోనే సీబీఐ జేడీ ఆ ప్రకటనా చేసే అవకాశం కనిపిస్తోంది. ఓ రకంగా జగన్ చుట్టూ ఉన్న అన్ని మార్గాలను మూసివేసి, అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలు సంపాదించి ఆ తర్వాతే జగన్ పై దృష్టి పెట్టాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో A1 గా ఉన్న జగన్ ను వదిలి, ఒక్కొక్కరిపైనా పంజా విసురుతోంది. అయితే, జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేసి, ఆయన్ను ఆత్మరక్షణ నెట్టడానికి అధికారపార్టీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలూ లేకపోలేవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అతి పెద్ద ప్రమాదంగా భావిస్తున్న జగన్ ను, సీబీఐతోనే చెక్ చెప్పి, తమకు లొంగి ఉండేలా చేసుకోవడానికే, ఈ తరహా దర్యాప్తును తెరపైకి తెచ్చిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి