2, జనవరి 2012, సోమవారం

భూముల రిజిస్ట్రేషన్లలో అంచనాలు తారు మారు




     హైదరాబాద్, జనవరి 2: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యం భూముల రిజిస్ట్రేషన్లపైపెను ప్రభావం చూపిస్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణలోనూ భూముల రిజిస్ట్రేషన్లు  సజా గా సాగుతుండడమే కాకుండా, ఆదాయం కూడా మెరుగ్గా కనిపిస్తోంది.
 గతంకన్నా ఎక్కువ ఆదాయం తెలంగాణలో వచ్చినప్పటికీ సీమాంధ్రతో పోల్చిచూస్తే   కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది.
నవంబర్ వరకు వచ్చిన ఆదాయంలో అత్యధికం విజయనగరం జిల్లా నుంచి రాగా, అత్యల్ప ఆదాయం అనంతపురం నుంచి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో భూ అమ్మకాలు పడిపోయినట్టు ఒక దశలో ప్రచారం సాగింది. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రస్తుత గణాంకాలు చూస్తే ఉద్యమ ప్రభావం పెద్దగా పడలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రం విడిపోతే విశాఖ, గంటూరు, ప్రకాశం జిల్లాలకు లాభిస్తుందన్న భావంతో అక్కడ భూముల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయినట్లు జరిగిన ప్రచారం కూడా రికార్డుల పరంగా తప్పన్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా గుంటూరు, విశాఖపట్నంలో వచ్చిన ఆదాయం కన్నా ఇతర జిల్లాల్లో ఆదాయం గణనీయంగా ఉండటం విశేషం.
ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళంలో 105 శాతం ఆదాయం లభించగా, విజయనగరంలో ఏకంగా 127 శాతం వచ్చింది. విశాఖపట్నంలో కేవలం 85 శాతం మాత్రమే ఆదాయం లభించగా, అదే జిల్లాలోని అనకాపల్లి కేంద్రంలో మాత్రం 127 శాతం ఆదాయం సమకూరింది. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, కడప, పొద్దుటూరు, చిత్తూరు, నంద్యాల కేంద్రాల్లో, తెలంగాణలోని ఖమ్మం,
వరంగల్, అదిలాబాద్, నల్లగొండ కేంద్రాల్లో వందశాతానికి మించిన ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది. అయితే నెల్లూరు, గూడూరు, కర్నూలు, అనంతపురం, హిందుపురం కేంద్రాలతోపాటు, తెలంగాణలోని కరీనంగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్‌లలో వందకన్నా తక్కువగా రిజిస్ట్రేషన్ల ఆదాయం రావడం గమనార్హం. అయితే ఒక్క నవంబర్ ఆదాయాన్ని పరిశీలిస్తే తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వంద శాతం కన్నా ఎక్కువగానే ఆదాయం సమకూరినట్టు రికార్డులు చెబుతున్నాయి. మార్కాపురం, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, అనంతపురం కేంద్రాల్లో మాత్రం నవంబర్ ఆదాయం ఎనభై శాతం కన్నా తక్కువగా కనిపించింది.
ఆదాయాన్ని పక్కనపెట్టి జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించినా మెరుగుదల కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల కన్నా ఈ ఏడాది నవంబర్ వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండటం ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే విషయమే. గత ఏడాది కన్నా ఈ ఏడాది 6.60 శాతం పురోగతి కనిపిస్తోంది. ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ మిగిలిన నెలల్లో మాత్రం పుంజుకోవడంతో ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా పయనించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.
మళ్లీ పూర్వ వైభవం
భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా అనుకున్న ఆదాయం సాధించాలని అనుకుంటున్న ప్రభుత్వానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్టు కనిపిస్తోంది. గత పనె్నండేళ్ల రికార్డులను గమనిస్తే 2006-07 నుండి 2009-10 మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2005-06లో దాదాపు 112 శాతం ఆదాయం ఉండగా, 2006-07లో 95 శాతానికి, 2007-08లో 76 శాతానికి, 2008-09లో 62 శాతానికి, 2009-10లో 80 శాతానికి పడిపోయింది. తరువాత పుంజుకుని 2010-11లో 107 శాతానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం చేరుకుంది. ఇప్పుడు నవంబర్ నాటికే 98శాతం ఆదాయం లభించడం, ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో వందశాతానికి మించి ఆదాయం సమకూరుతుందన్న ధీమాను రాష్ట్ర ఆర్ధిక శాఖ వ్యక్తం చేస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి