19, జనవరి 2012, గురువారం

వ్యవసాయ సబ్సిడీలు, దళారీ వ్యవస్ధ



plough

నూతన ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులకు హాని చేస్తున్నాయన్న నిజాన్ని మరుగుపరచడానికి ఇటువంటి అర్ధ సత్యాలతో కూడిన వాదనలు చాలా వ్యాప్తిలోకి తెచ్చారు.

రైతులకి ఇస్తున్నామని చెబుతున్న సబ్సిడీలు దొడ్డిదారిన ఎరువులు, పురుగుమందుల కంపెనీలే పొందుతున్నాయి తప్ప అవి రైతులవరకూ రావడం లేదు. నేను కొద్ది రోజుల క్రితం ఒక మిత్రుడికి సమాధానం ఇస్తూ రాశాను. వ్యవసాయం దండగ అనీ, రైతులు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ పత్రికలు రాస్తుంటాయి గానీ నిజానికి వ్యవసాయ రంగం రైతులకి దండగగా మారింది తప్ప అందరికీ కాదని. ‘వ్యవసాయం దండగ’ అన్న ప్రచారం వెనకే పెద్ద కుట్ర ఉంది. కొంచెం సేపు కుట్ర సంగతి పక్కనబెడదాం.

వ్యవసాయం లేకుండా భారత దేశంలో పరిశ్రమల్లేవు, సేవల రంగమూ లేదు. భారత దేశంలో సరైన సమయానికి రుతుపవనాలు వస్తాయా రావా అన్న అంశంపైన ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక విశ్లేషక సంస్ధల అంచనాలు ఆధారపడి ఉంటాయి. భారత దేశంలో రుతుపవనాల రాకకు సంబంధీంచిన అంచనాలపైన పాశ్చాత్య వార్తా పత్రికలతో పాటు అక్కడి వ్యాపార వార్తా పత్రికలు కూడా కేంద్రీకరణ చేస్తాయి. ఐబిఎన్, బిబిసి, సి.ఎన్.ఎన్ లాంటి అంతర్జాతీయ వార్తా పత్రికలకు అనుబంధంగా ఉన్న బిజినెస్ విభాగాలతో పాటు రాయిటర్స్ లాంటి బిజినెస్ వార్తా సంస్ధలు కూడా భారత దేశ రుతుపవనాలపైన అంచనాలను పట్టించుకుంటాయి. ఆ తర్వాత ఆ అంచనాలు నిజం అవుతున్నాయా లేదో కూడా పరిశీలించి వాటిపైన వార్తా కధనాలు ప్రచురిస్తాయి.

ఇవన్నీ ఎందుకని? ఎందుకంటె భారత వ్యవసాయ రంగం రుతుపవనాల రాకపైన ఎంతగా ఆధారపడి ఉన్నాయో వారికి తెలుసు గనక. ఊరికే ఆ విషయం వారికి తెలిసినందువల్లనే కాదు సుమా. రుతుపవనాలు రాకపోతే వ్యవసాయరంగంలో జరిగే ఉత్పత్తి బాగా కుంటుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపైన అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. టెక్స్ టైల్స్ దగ్గర్నుండి, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రవాణా రంగం, కొండొకచో కమ్యూనికేషన్ల రంగం అన్నీ ఆధారపడి ఉన్నాయి.

సేవల రంగం (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ.వి) అయితే ఇక చెప్పనవసరం లేదు. భారత దేశంలోని జిడిపిలో సర్వీసెస్ సెక్టార్ వాటా యాభై ఐదు శాతం దాకా ఉంటుంది. వర్క్ ఫోర్స్ లో పాతిక శాతం సేవల రంగమే. ( అధమం చూసుకున్నా, వ్యవసాయ రంగం యాభై ఐదు నుండి అరవై శాతం వరకూ వర్క్ ఫోర్స్ కి ఉపాధి కల్పిస్తుంది.) ఈ సేవల రంగానికి పునాది భారత దేశంలో వ్యవసాయ రంగమే అని గుర్తుంచుకోవాలి.

వ్యవసాయ రంగానిది ప్రాధమిక ఉత్పత్తి లెదా ముడి ఉత్పత్తి అయితే దానిపైన జరిగే అనేక పారిశ్రామిక, సేవల రంగ కార్యకలాపాలు నడుస్తుంటాయి. వ్యవసాయం బాగా నడిస్తే ఆ ప్రభావం ఇండియా జిడిపిలోని ఎనభై శాతం పైన పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి జరిగితే పరిశ్రమలకు ముడి సరుకు దొరకడం ఒక సంగతి. వ్యవసాయం ద్వారా రైతులకి, కూలీలకీ వచ్చే ఆదాయం సేవింగ్స్ రూపంలొ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలోకి వెళుతుంది. అక్కడి నుండి పరిశ్రమలకి అప్పుల రూపంలో పెట్టుబడులు వెళ్తాయి. బ్యాంకుల్లో సేవింగ్స్ పెరిగితే అది స్వయం ఉపాధిదారులకు కూడా అప్పులు పెరగడానికి దోహదపడుతుంది. ఇన్సూరెన్స్ రంగంపైన కొన్ని పదుల లక్షలమంది ఏజెంట్లు ఆధారపడి ఉంటారు. వీరికి కూడా వ్యవసాయం పండగే. రైతుల వద్ద డబ్బులు కూడితే వీరికి బోలెడంత ఆదాయం.

ఈ కారణాల వల్ల భారత దేశంలో రుతుపవనాలు ప్రపంచ వ్యాపితంగా ఒక ముఖ్య వ్యాపార వార్త. ఆవి సమయానికి వస్తే రైతులు పంటలు బాగా పండిస్తారు. కోట్లమంది కూలిలకి ఆదాయం సమకూరుతుంది. కూలీల ఆదాయం అనేక సరుకులు అమ్ముడుబోయేలా చేస్తుంది. ప్రభుత్వానికి అమ్మకపు పన్నులు ఇతర పన్నులు చేకూరుతాయి. (మద్యం ఆదాయం చెప్పనవసరం లేదు.) పరిశ్రమలకి ముడి సరుకుతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కూడా వస్తుంది. వారి పొదుపు సేవల రంగంలోకి విస్తరించిన మరిన్ని లక్షల కుటుంబాలకి ఆదాయ వనరుగా మారుతుంది.

పైన చెప్పీనట్లు వ్యవసాయం ఇతరులందరికీ పండగే కాని రైతు ఒక్కడికే దండగగా మారడానికి కారణం దళారీ వ్యవస్ద. “ఆ మీడియేటర్లే కదా!” అని తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి వీలేదు. ఎందుకంటే భారత దేశంలో పారిశ్రామికీ వేత్తలంతా ఈ పాత్రలోనే లక్షల కోట్లు పోగేశారు. బ్రిటిష్ వాడి కాలం నుండి ఇప్పటివరకూ ఈ దళారీ పాత్రలోనే పారిశ్రామిక వేత్తలు అభివృద్ధి చెంది నేటి స్ధాయికి చేరుకున్నారు. పసుపు, మిర్చి, గొర్రెలు తదితర పశువులు, పత్తి, పొగాకు దగ్గర్నుండి ప్రతి రంగంలోనూ విస్తరించి ఉన్న దళారులు ప్రాధమిక ఉత్పత్తిదారునుండి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిలవ చేసి పూర్తి ధరలకు అమ్ముకుని లాభాలు పొందుతున్నారు. ఈ లాభాలన్నీ నిజానికి రైతులవి, కూలీలవి. రైతుల వద్ద నిలవ సౌకర్యాలు ఉంటే, అమ్మకం ఆలస్యం అయినా పర్వాలేదన్న ఆర్ధిక బలిమి వారి సొంతం అయితే వ్యవసాయ రంగంలో వచ్చే లాభాలన్నీ రైతులకీ, కూలీలకీ చెందుతాయి.

దళారీ వ్యవస్ధపైనే నేటి ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రసీ అంతా దళారీ వ్యవస్ధ నుండి ఎదిగినవారే (ఎదుగుతున్నవారే). పల్లెల్లో భూస్వాములే పట్నాల్లో పెట్టుబడిదారులు. నేరుగా పెట్టుబడిదారులు కాకపోతే వారి బంధువులు, పుత్రులు, మనవళ్ళు ఇలా సంబంధీకులు పెట్టుబడిదారులుగా ఉన్నారు. వీళ్ళంతా దళారీ వ్యవస్ధలో ఆదాయం పొందుతూ ఆ దళారి వ్యవస్ధని నిర్మూలించమంటే నిర్మూలిస్తారా? నిర్మూలించరు. అందుకే దళారీ వ్యవస్ధ అప్రతిహతంగా కొనసాగుతూ రైతుల ఉసురు తీస్తోంది.

రైతుల ఉత్పత్తలకు ధరలు లేకుండా పోలేదు. కాకపొతే ఆ ధరలు రైతులకి అందుబాటులో ఉండవు. అంటే అప్పు చేసి పంట తీసిన రైతు అప్పు తీర్చడానికీ, ఇంట్లో అవసరాలకీ పంటను అమ్మకుండా ఉండలేడు. తక్కువ ధరలకే అమ్మేయాల్సిన పరిస్ధితి అతనికి వస్తోంది. అది కొనేది ప్రభుత్వమో, పరిశ్రమలవారో, సేవలవారో కాదు. దళారీలు. వారు తమ ఆర్ధిక బలిమితోటి (ఆ బలిమి కూడా రైతుల పుణ్యమే) నిలవ చేసుకుని ధరలు వచ్చినపుడు అమ్ముకుని రైతుల లాభాలని తన జేబులో వేసుకుంటున్నాడు. అంటే వ్యవసాయ ఫలం రైతులకి కాకుండా మరొకరికి అందుతోంది. అంతిమంగా వ్యవసాయం దళారీలకి పండగ కాగా రైతులకి దండగ గా మిగులుతోంది. ఈ దళారీ వ్యవస్ధ ప్రమేయం లేకపొతే రైతే ఈ దేశంలో రాజు.

ఆ విధంగా వ్యవసాయం పండగ కావలసినవారికి దండగ గా మారిపోయింది.

ఇదంతా ఫస్ట్ పోస్టు ఆర్టికల్ కి సంబంధం లేదనిపిస్తోంది కదా? కాని సంబంధమ్ ఉంది.

‘ఎరువుల సబ్సిడీ ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. ఆ సబ్సిడీ రైతులకి చేరకుండా కంపెనీలకి చేరుతోంది. కనుక ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం మానుకోవాలి అన్నది ఆర్టికల్ సారాంశం.’ వేరే రకంగా సబ్సిడీ రైతులకి ఇవ్వాలని ఆర్టికల్ చివర్లో చెప్పినా దాని అసలు ఉద్దేశ్యం సబ్సిడీలు రద్దు చెయ్యాలనే.

సబ్సిడీలు రైతులకి కాకుండ కంపెనీలకి వెళ్తున్నాయి కనుక అవి రద్దు చేయాలని ఆర్టికల్ చెబుతోంది. అయితే కంపెనీలకి ఇస్తున్న ఇతర రాయితీల మాటేమిటి? ఎగుమతి రాయితీలు, దిగుమతి రాయితీలు, దిగుమతి పన్నుల రద్దు లేదా కోత, లక్షల కోట్ల అప్పులు, ఆనక పారిశ్రామిక వేత్తల అప్పుల మాఫీ, బాకీలు ఎగేసిన పారిశ్రామికవేత్తల పేర్లు చెప్పమని పార్లమెంటు కొరినా అది దేశ బధ్రతకు ముప్పు అని చెప్పకపోవడం, నల్లడబ్బుకి కావలసిన మార్గాలన్నీ తెరిచి ఉంచడం, మార్గాల్ని మూసేయడానికి లోక్ పాల్ తెమ్మంటే కోరలేవీ లేని లోక్ పాల్ తేవడం. ….ఇవన్నీ పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు ఇస్తున్న రాయితీలే. కొన్ని ప్రత్యక్ష రాయితీలయితే మరికొన్ని పరోక్ష రాయితీలు. ప్రత్యక్ష రాయితీల కంటె పరోక్ష రాయితీలు అనేక రెట్లు ఎక్కువ. ప్రత్యక్ష రాయితీలను చట్టబద్ధంగా సమర్ధించుకుంటారు. పరోక్ష రాయితీలని చట్టపరిధిలో లేవని తప్పించుకుంటారు. కనుక అవి రెండూ అప్రతిహతంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం సంవత్సరాల తరబడి వాయిదాపడుతూ ఉంటాయి. నలభై ఏళ్ల నుండి లోక్ పాల్ చట్టం వాయిదా పడుతూ వస్తోందంటే అది ఏ ఉద్దేశాలూ, పధకాలూ, ప్రయోజనాలు లేకుండా జరగదు కదా. ధనికులకి, రాజకీయ నాయకులకీ, బ్యూరోక్రట్లకీ ప్రయోజనంగా ఉన్న ఈ అవినీతి రాయితీల సమస్య పెద్ద సమస్య లేదా తక్షణం పరిష్కరించాల్సిన సమస్య కాదు కాని రైతుల సబ్సిడీల బిల్లు మాత్రం అర్జెంటుగా పరిష్కరించవలసిన సమస్యగా ముందుకు తెస్తారు. ఇదొక కుట్ర.

రైతులకి పండగ కావాల్సిన వ్యవసాయం దండగ గా మారడానికి కారణం దళారీ వ్యవస్ధ. ఈ దళారీలే బ్యూరోక్రట్ అధికారులు. ఈ దళారీలే భూస్వాములు. ఈ దళారీలే పెట్టుబడిదారులు లేదా పారిశ్రామిక వేత్తలు లేదా టెక్నోక్రాట్లు లేదా అనేకం. ఈ దళారి జాతి కూడబెట్టిన సంపదే అన్నిరంగాలకీ పరుగులు పెడుతుంది. ఇప్పుడు షేర్ మార్కెట్లలోకి అదే వెళ్తోంది. కానీ ఈ సంపదకి వాస్తవ హక్కుదారులు రైతులు, కూలీలు, కార్మికులు.

ఈ ప్రాధమిక శ్రామిక జనం తీసిన ఉత్పత్తులని తాము వశం చేసుకుని ఆ వశం చేసుకున్న దానిలో ఏదో కొంచెం బిచ్చాన్ని రైతుల ఎరువుల సబ్సిడీలుగా, రెండు రూపాయల బియ్యంగా, గ్యాస్ సిలిండర్ల సభ్సిడీలుగా, డీజెల్, కిరోసిన్ సబ్సిడీలుగా (పెట్రోల్ డీ కంట్రోక్ చేశారు కదా. అందువల్ల ఇపుడీ లిస్టులో అది లేదు), ఇందిరమ్మ ఇళ్ళుగా (ముప్ఫై ఏళ్ల క్రితం ఇవి బొంగులు, పూరి పాకల పై కప్పుకి వినియోగించే గడ్డి రూపాల్లో ఉండేది), ఎస్సీ, బీసీల స్కాలర్ షిప్పులుగా లేదా ఫీజుల రాయితీలుగా పడేస్తున్నారు.

ఈ సబ్సిడీలన్నీ కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలుగా (మహా ఐతే ఒకటో రెండో లక్షల కోట్లు) ఇప్పుడు కనిపిస్తొంది. కాని దళారీ లు కూడేసి, దాచుకుని, బైటికి తరలిస్తున్న సొమ్ము పదుల లక్షల కోట్లుగా ఉంటోంది. ఈ డబ్బు గురించి ఎవరూ లెక్కలు చెప్పరు. ఎప్పుడో శివరాత్రికో మారు పత్రికలు ప్రత్యేక ఆర్టికల్స్ రాసి భారత దేశంలో ఇంత నల్లడబ్బు ఉంది అని రాసి పాఠకులని కొద్ది కాలం ఆకర్షిస్తాయి. కాని ఆ టాపిక్ అంతంటితో ముగిసిపోతుంది. కాని రైతులు, కూలీలు, కార్మికుల సంపాదన దోచుకోవడం, నల్ల డబ్బు కూడబెట్టడం, స్విస్ బ్యాంకులకి తరలించుకెళ్లడం ప్రతి గంటా, ప్రతి రోజూ, ప్రతి నెలా, ప్రతి సంవత్సరమూ కొనసాగుతూ పోయే నిరంతర ప్రక్రియ. నిరంతరం కొనసాగే ఈ ప్రక్రియను అడ్దుకోవడానికి కావలసిన చట్టం నలభై ఏళ్లనుండి వాయిదా పడుతూ వస్తుంది. జనం గట్టిగా అడిగితే కోరలు లేని చట్టం రెడీ. అంటే ప్రభావవంతమైన లోక్ పాల్ చట్టం వచ్చినా నల్లడబ్బు పోగుపడడం, తరలివెళ్లడం కొనసాగుతూనె ఉండాలన్నమాట!

నల్లడబ్బు అరికట్టే చట్టాలని వాయిదా వేస్తున్నట్టే రైతులు, వినియొగదారులకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేసే చట్టాలు వాయిదా వేయరు. పొరబాటున వాయిదా వేసినా గుర్తు చేయడానికి ‘ఫస్ట్ పోస్టు’ లు రెడీ.

ఇంతా చేసి రైతులకి ఇస్తున్న సబ్సిడీల్లో రైతులకి అందేవి కొద్ది భాగమే. రైతులకి, కూలీలకి, కార్మికులకి వివిధ రూపాల్లొ ఇచ్చే సబ్సిడీల్ని నొక్కెస్తున్నది కూడా దళారీలే. పౌర సరఫరాల సబ్సిడీల్ని వినియోగదారుడికి చేరే లోగా రేషన్ షాపు యజమాని దగ్గర్నుండి పౌర సరఫరాల శాఖ లో అధికారుల నుండి ఆ శాఖ మంత్రి వరకూ భోంచేయడం లేదా? ఇందిరమ్మ ఇళ్ళు పదులు ఇరవైలు బినామీ పేర్లతో నొక్కేస్తున్న దళారీలు లేరా? సబ్సిడీ ఎరువుల్ని దారి మళ్ళించి మిశ్రమ ఎరువులుగా మారుస్తున్న రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది ఉదంతం ఒక్కటే బైటికి వచ్చింది. బైటికి రాని ఉదంతాలు కోకొల్లలు కాదా? సబ్సిడీ గ్యాస్ బండల్ని బినామీ పేర్లతో వాడుకుంటున్న హోటల్ పరిశ్రమలు, ఇతర కంపెనీలు ఎన్నని? ఇవన్నీ సబ్సిడీలే. పేదజనం పేరుతో ఇచ్చేది, బినామీ పేర్లతో నొక్కేది ఎవరు? బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులు తదితర నామాలతో గల దళారీలే.

ఇటువంటి పరిస్ధితుల్లో రైతుల సబ్సిడీలన్న ఒక్క అంశాన్ని పక్కకి లాగి దానిని మాత్రమే విశ్లెషిస్తే లార్జర్ పిక్చర్ మసకబారుతుంది. అది కనపడదు. అలా కనపడకుండా చేయడానికే ‘ఎంతో నిజాయితీ ఉన్నట్లు నటిస్తూ, కడు బాధతో రైతుల సబ్సిడీలు మరొకరు సొమ్ము చేసుకుంటున్నారన్న’ బూటకపు విశ్లేషణలు. రైతుల సబ్సిడీలు వారికి అందడం లేదు గనక రద్దు చెయ్యాలన్న నినాదం ఒట్ఠి బూటకం. కాస్తో కూస్తో రైతులకి ఇతర ప్రాధమిక శ్రామిక వర్గాలకి అందుతున్న కొద్ది పాటి సౌకర్యాలని కూడా పూర్తిగా రద్దు చేసి ఆ వనరుల్ని కూడా కంపెనీలకి తరలించే దుష్ట బుద్ధి ఇందులో ఉంది.

సరే సబ్సిడీలు తీసేద్దామ్! ప్రభుత్వాలు దాని బదులు నిలవ సౌకర్యాలని (శీతల గిడ్డంగులు, గ్రామాలకు పంట పొలాలకు దగ్గరలో వేర్ హౌస్ లు, రైతులకి అందుబాటులో ప్రాసెసింగ్ సౌకర్యాలు లాంటివి) రైతులకి చేరువగా తేగలదా? దాన్ని మళ్ళీ ప్రవేటు రంగానికి అప్పజెప్పకుండా, తానే ఒకటి రెండేళ్ల పాటు (అయిదేళ్ళయినా సరే) బడ్జెట్ నిధులిచ్చి నిర్మించగలదా? ఆ సౌకర్యాల్లో రైతులకి ఓ పదేళ్ళపాటు ఉచితంగా లేదా నామ మాత్రపు ఫీజుతో స్ధానం ఇచ్చి వారికి అండగా నిలవగలదా? పరిశ్రమలకి ఎగుమతి దిగుమతి రాయితీలు, టాక్స్ హాలిడేలు, కష్టాల కంపెనీలకి బెయిలౌట్లు ఇవన్నీ ఇస్తున్నపుడు రైతులకి ఇవి ఇవ్వవచ్చు. రైతుల సంపదల్ని దోచుకుంటున్న దళారీ వ్యవస్ధ రద్దు చేస్తూ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగలదా?

భూమిలేని కూలీలకు ఒక్కో కుటుంబానికి ఎంతో కొంత భూమిని ప్రభుత్వాలు ఇవ్వగలవా? మిగులు భూములు, అన్యాక్రాంతం అయిన భూములు, బంజరు భూములు ఇలా అనేక రకాల భూములు అందుకు సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ భూమిలేని పేదలకు పంచగలరా? భూగరిష్ట పరిమిత చట్టం మొదలే లోప భూయిష్టం. ఐనా సరే ఆ చట్టాన్నయినా నిజాయితీగా అమలు చేస్తే కోట్ల ఎకరాల భూమి మిగులుగా తేలుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఎమ్మేల్యేల అక్రమ ఆక్రమణలో ఉన్న భూములే కొన్ని లక్షలు బైటికి వచ్చాయి. (అప్పటి సి.ఎం రాజాశేఖర రెడ్డి ప్రకటించిందే మూడు వేల ఎకరాలు) భారత దేశంలో మిగులు భూములు లేవన్న సి.పి.ఏం లాంటి పార్టీలు చేసిన ఆందోళనలోనే లక్షల ఎకరాల మిగులు భూములు అప్పట్లో బైటికి వచ్చాయి. ‘మన ఎం.ఎల్.ఏ లు కూర్చున్నది అసెంబ్లీలో కాదు, లక్షల ఎకరాల భూములపైన’ అని హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హర గోపాల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. సందర్భాన్ని గుర్తుకి తేవడానికి ఇక్కడ ఆయన వ్యాఖ్య.

ఇవన్నీ చేసినట్లయితే రైతులకి సబ్సిడీలు అవసరమే లేదు. కూలీలు రైతులు కాగలరు. కూలీలు అదృశ్యమయ్యే పరిస్ధితి రావడం అంటే పారిశ్రామిక వ్యవసాయానికి బాటలు పడ్డట్లే. వెనకబడ్డ వ్యవసాయం స్ధానంలో పెట్టుబడిదారీ వ్యవసాయం (నిజానికి అంతకంటే మెరుగైన సహకార వ్యవసాయం నిజమైన అర్ధంలో నెలకొల్పబడినా ఆశ్చర్యం లేదు) వచ్చినట్లే.

అమెరికాలో వ్యవసాయం రంగంలో ఇక్కడి కంటే అనేక రేట్లు సబ్సిడీలు ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా, యూరప్ లకీ ఇండియా, చైనా, మలేషియా లాంటి దేశాలకీ మధ్య ప్రధానంగా వాదన జరుగుతున్నది ఈ అంశంపైనే. అమెరికా తన వ్యవసాయ రంగంలో సబ్సిడీలు రద్దు చేయాలని కోరినందుకే డబ్ల్యూ.టి.ఓ సమావేశాలు జరగకుండా శాశ్వతంగా వాయిదా పడ్డాయి. అమెరికా సహకారం ఇవ్వనందునే ఈ సమావేశాలు వాయిదా పడ్డాయన్న సంగతి గుర్తుంచుకుంటే వ్యవసాయ రంగం సబ్సిడీలని అమెరికా ఎంత ముఖ్యంగా గుర్తిస్తున్నదీ అర్ధం చేసుకోవచ్చు. అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోలిస్తే ఇండియా ఇస్తున్న సబ్సిడీలు సోదిలోకి కూడా రావు. ఐనా ఇండియా తన రైతులకి ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలని అమెరికా పట్టు పడుతోంది. దానికి భారత ప్రభుత్వం అంగీకరించి ఆ వైపుగా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇలా పత్రిల ద్వారా రైతుల సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఎత్తుగడల్ని కూడా భారత పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. ఫస్టు పోస్టు ఆర్టికల్ అందులో భాగమే. అది యధాలాపంగా బాధతో రాసింది కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి