అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారులఅవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నాడని
పత్రికలు కోడై కూస్తునాయి. ఈ మధ్య కాలంలో ఈ కూతల సంఖ్య తగ్గినా అన్నా
హజారే కి అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు బిరుదు ఇవ్వడం మానలేదు. పఠిష్టమైన
లోక్ పాల్ చట్టం తెస్తే అవినీతి సమస్య పరిష్కారం అవుతుందని అన్నా,
ఆయన వెంట ఉన్న బృందం చెబుతోంది. అన్నా బృందం చెబుతున్న లోక్ పాల్,
నిజానికి మరొక బ్యూరోక్రాట్ వ్యవస్ధ మాత్రమే. ప్రభుత్వ రంగంలోనూ, రాజకీయ
రంగంలోనూ ఉన్న సమస్త వ్యవస్ధలను తనిఖీ చేసే అధికారం లోక్ పాల్ కి ఉండాలని ఈ
బృందం ప్రతిపాదిస్తోంది. కింది స్ధాయి గుమాస్తా దగ్గర్నుండి దేశ ప్రధాని,
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకూ లోక్ పాల్ పరిధిలో ఉండాలని ఈ బృందం
చెబుతోంది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు మాత్రమే ఈ దేశంలోని
అవినీతికి మూల విరాట్టులైనందున, ప్రధాని, చీఫ్ జస్టిస్ లతో సహా ఉన్నత
స్ధాయి అధికార, రాజకీయ గణాన్నంతటినీ లోక్ పాల్ పరిధిలోకి తెస్తే మంచిదే.
అలా తేవాలనే డిమాండ్ చేయాలి కూడా. కానీ పత్రికల వార్తలను బట్టి చూస్తే
అన్నా బృందం దృష్టి ప్రధాని పైన ఎంత ఉందో కింది గుమాస్తా పైన కూడా అంతే
ఉంది. ఇది అభ్యంతరకరం. ఇది అంతిమంగా పెద్ద చేపల్లాంటి అవినీతి
మూలవిరాట్టుల్ని వదిలి ఎప్పటిలాగానే, అవినీతి పరమపద సోపాన వ్యవస్ధలో కింది
వారిపై కేంద్రీకరణకే దారి తీస్తుంది.
అన్నా ఉద్యమాన్ని గురించీ, ఆయన ప్రతిపాదిస్తున్న జన లోక్ పాల్ గురించీ ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ ఆగష్టు 21 న ‘ది హిందూ’ కోసం రాసిన వ్యాసంలో ఇలా అన్నది. “మనం టివిలో చూస్తున్నది నిజంగానే విప్లవం ఐతే, అదిఇటీవల కాలంలో సంభవించిన ఇబ్బందికరమైన, తెలివిహీనమైన విప్లవం అయి ఉండాలి.ఇప్పటివరకూ చూస్తే జన్ లోక్‌పాల్ బిల్లుని గురించి ఏప్రశ్నయినా మీరు వేయండి, మీకు సమాధానంగా వచ్చే వీలున్నవి: (ఎ) వందే మాతరం (బి) భారత్ మాతా కి జై (సి) ఇండియా ఈజ్ అన్నా అన్నా ఈజ్ ఇండియా (ఇండియాయేఅన్నా, అన్నాయే ఇండియా) (డి) జై హింద్.”
అదే వ్యాసంలో ఆమె మరొక చోట ఇలా అంది. “… జన్ లోక్ పాల్ బిల్లు ఓ రాక్షస స్వభావం కలిగిన అవినీతి వ్యతిరేకచట్టం. దాని ప్రకారం, జాగ్రత్తగా ఎన్నుకోబడిన వ్యక్తులు, వేలమందిఉద్యోగులతో కూడిన అతి పెద్ద బ్యూరోక్రసీవ్యవస్ధతో, ప్రధాని నుండి న్యాయవ్యవస్ధ, పార్లమెంటు సభ్యులు, మొత్తం బ్యూరోక్రసీవ్యవస్ధలతో పాటు కింది స్ధాయిప్రభుత్వాధికారి వరకూ అందరిపైనా విచారణ చేయగల అధికారాన్ని కలిగి ఉంటారు.లోక్ పాల్ కి పరిశోధన చేసే అధికారం, నిఘా పెట్టే అధికారం, ప్రాసిక్యూట్ (విచారణ) చేసే అధికారం అన్నీ ఉంటాయి. సొంతానికి జైళ్ళు మత్రమే తక్కువ తప్పసర్వ స్వతంత్రంగా వ్యవహరించే ఈ లోక్ పాల్ వ్యవస్ధను, మనకిప్పటికే ఉన్నలెక్క చూపని అవినీతితో నిండి ఉన్న బ్యూరోక్రట్ వ్యవస్ధకు వ్యతిరేకంగామొహరించడానికి ఉద్దేశించారు. కొద్ది మందితో కూడిన ఒక గుంపు పరిపాలనస్ధానంలో రెండు గుంపుల పరిపాలన అన్నమాట!”
ఎవరీ అన్నా?
అన్నా హజారేకి కొద్దో గొప్పో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. రాజకీయనాయకులు, అధికారుల అవినీతితో ఆయన ఢీ కొట్టిన వార్తలు గతంలో పత్రికల్లో వచ్చాయి. ఆయన జరిపినపోరాటాలలో ఎంతవరకు సఫలం అయిందీ లోకానికి పెద్దగా తెలియదు గానీ పోరాడాడన్నపేరు ఆయనకి మిగిలింది. అన్నా సైన్యం నుండి రిటైరైన వ్యక్తి వ్యక్తి కనుక, సైన్యంపైన మధ్య తరగతి జనానికి ఉండే గౌరవం కొంత అతనికి చేరి ఉండవచ్చు. అన్నా హాజారే ఒకఆదర్శ గ్రామాన్ని నిర్మించాడని కొన్ని పత్రికలు తరచూ ప్రస్తావిస్తాయి. ఈయన నిర్మించిన ఆదర్శ గ్రామం గురించి ముకుల్ శర్మ అనే పరిశోధకుడు, విలేఖరీ అధ్యయనం జరిపి కొన్ని వివరాలు వెల్లడించాడు. ఈ వివరాలలో అన్నా హజారే పని విధానంపై ముఖ్య సమాచారం ఉంది.
ముకుల్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం బలవంతపెట్టడం (force),
శిక్షించడం (punishment) ప్రధాన అంశాలుగా ఉన్న విశ్వాస వ్యవస్ధ (belief
system); హిందూ మత చిహ్నాలను యధేచ్ఛగా ఉపయోగించడం; కఠినమైన నియమాలు
సూత్రాలు; జాతీయత, తీవ్ర-జాతీయతలను రెచ్చగొట్టడం, స్వచ్ఛమైన నైతికత, కుల
దొంతరల వ్యవస్ధ; గ్రామాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన (core) విధులనుండి
మహిళలు, ముస్లింలు, దళితులను దూరంగా ఉంచడం మున్నగు అంశాలపైన అన్నా హజారే
ప్రవచించే గ్రామీణాభివృద్ధి నమూనా ఆధార్పడి ఉంది. గ్రామ సర్పంచి “అన్నా ఎంత
చెపితే అంత. ఆయన ఏం చెప్పినా మేం చేస్తాం. గ్రామం మొత్తం ఆయన మాటలు
అనుసరిస్తాం” అని అంటే, మరొక గ్రామస్ధుడు “అన్నా దేవుడిలాంటి వాడు” అని
చెప్పినట్లుగా ముకుల్ తెలిపాడు. గ్రామం మొత్తం సైన్యం లా పని చేస్తామని
గ్రామస్తులు చెప్పారని ముకుల్ తెలిపాడు. గ్రామస్తులంతా పరస్పర అవగాహనతో
తామందరికీ ఏది మంచో నిర్ణయించుకుని అది పాటించే ప్రజాస్వామిక దృక్పధం ఈ
గ్రామంలో లేదని ముకుల్ పరిశోధనలో తేలింది. బీడీలు, సిగరేట్లు తాగరాదనీ,
సినిమా పాటలు, సినిమాలు ఈ గ్రామంలో నిషిద్ధం. మత సంబంధిత సినిమాలైన సంత్
తుకారాం, సంత్ గ్యానేశ్వర్ ఈ సినిమాలే చూడాలి. ప్రజలే వీటిని
విధించుకున్నారని చెప్పినా అది అమలవుతున్న తీరు బ్రాహ్మణీయ మరియు ఆధిపత్య
పద్ధతుల్లో జరిగిందని ముకుల్ తేల్చాడు. తాగకూడదు అన్న నిబంధనను అమలు
చేయడానికి అన్నా హింస ప్రయోగించడం ఒక వింత. ఇద్దరు యువకులు తాగి వచ్చినపుడు
వారిని గుడి ముందు స్తంభానికి కట్టి తన ఆర్మీ బెల్టు తో అన్నా చితకబాదాడని
ముకుల్ వెల్లడించినపుడు చాలా పత్రికలు నిర్ఘాంతపోయాయి. ఒక సూత్రం, నిబంధన
అమలు చేయాలంటే గ్రామస్ధూల చేత గుడి ముందు ప్రమాణం చేయించడం అన్నా ఎంచుకునే
పద్ధతి. ఈ ఆధిపత్య పద్ధతులతోనే అన్న సాధించిన గ్రామాభివృద్ధి పరిమితమైంది
తప్ప గ్రామంలోని మనుషులంతా సమానమేననీ, వారందరూ సమానాభివృద్ధికి అర్హులేననీ
అన్న అవగాహన శూన్యం.
గ్రామీణాభివృద్ధి,
దేశాభివృద్ధి లకు చెందిన అంశాల్లో అన్నా ప్రతిపాదనలు యుద్ధం, సైన్యం,
శత్రువు వీటి చుట్టూనే తిరుగుతాయి. “మనం దేశాన్ని ఒకటిగా ఉంచాలి. లేకుంటే
పాకిస్ధాన్ పట్టుకు పోతుంది. అందుకే మనం చైతన్యయుతంగా మన పిల్లలను
సైన్యంలోకి పంపాలి” అని తరచుగా అన్నా గ్రామస్ధులకు చెబుతుంటాడు. ఈయన
అభివృద్ధి భావజాలంలో ‘నైతికత, దానికి సంబంధించిన సూత్రాలు, నిబంధనలు’
ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాఠశాల విద్యార్ధులకు నేర్పే అంశాల్లో నైతిక
విద్య, దేశ భక్తి బోధనలు హిందూ మత విలువలతో ముడి పడి ఉంటాయి. సూర్య
నమస్కారాలు చెయ్యడం, ఓం కార సాధన తప్పనిసరి. స్త్రీలయితే ఇంటి బాధ్యతలు
తప్పనిసరిగా చూడాలి, దానితో పాటు తమ దేశానికి, సమాజానికీ సాయపడంటంలో కూడా
తప్పనిసరిగా పాల్గొనాలి. భారత దేశ నైతిక పతనంలో ‘ఆధునిక సంస్కృతి, ఆధునిక
అభివృద్ధి’ పాత్ర వహిస్తున్నాయని అన్నా నమ్మకం, బోధన. రాలేగావ్ లో కొద్ది
మంది చమర్ లు, మహార్లు, మాతంగులు, భర్హాదీలు, సుతార్లు ఉన్నారని ముకుల్
తెలిపాడు. వీరిని హరిజనులుగానే ఇక్కడ పిలుస్తారు. భారత రాజ్యాంగం
‘హరిజనులు’ అన్న పదాన్ని తృణీకరించినా అన్నా అలాగే పిలుస్తాడు. “గ్రామం
భగవంతుడి కుటుంబం” అన్న భావనలో భాగంగా ఈ ‘హరిజనుల అభివృద్ధి’ అన్న
ప్రస్తావన ఉంటుంది తప్ప వారూ అందరితో సమానమే అన్న దృష్టి కనపడదు. ‘హరిజనుల’
(దళితుల) ఉనికి రెండు విధాలుగా సమర్ధించబడిందని ముకుల్ తెలిపాడు. ఒకటి:
‘కొన్ని విధులనూ, అవసరమైన సేవలనూ చేయడానికి వారు ఎప్పటినుండో ఉన్నారు. వారి
అవసరం ఇప్పటికీ ఉంది’ అన్న అవగాహన. రెండు: ‘దళితులను బ్రాహ్మణీయ ఆధిపత్య
పరిధిలోకి తీసుకురావాలన్న’ అవగాహన. ఆహారపు అలవాట్ల తో పాటు దుస్తుల ధారణ
నిబంధనలలోనూ ఇంకా ఇతర వ్యవహారాలలో కూడా ఈ సూత్రాలను అమలు చేస్తున్నారని
ముకుల్ తెలిపాడు.
వివిధ సందర్భాలలో వివిధ రకాల వాదనలను వినిపిస్తున్నట్లూ,
పరస్పరం సంబంధం లేని అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు పైకి
కనిపించినప్పటికీ అన్నా భావనలలో అంతర్గతంగా ‘పూసల్లో దారంలా’ ఒక ఏకత
కనిపిస్తుంది. అది ఫ్యూడల్ విలువల పట్ల ఆయనకి ఉన్న ఎనలేని గురి. ఆ
విలువల్లో భాగంగానే ఆయన హిందూ మత ఆచారాల పట్ల నిబద్ధతను వ్యక్తపరుస్తాడు.
చాతుర్వర్ణ వ్యవస్ధ నియమాలను అమలు చేయడానికి ఆసక్తి చూపుతాడు. తాను నమ్మిన
నియమాలను ఆర్మీ బెల్టుతో కొట్టయినా అమలు చేయిస్తాడు. ముస్లింలను ఊచకోత
కోసిన నరేంద్ర మోడి లాంటి నరరూప రాక్షసుడిని బహిరంగంగా మెచ్చుకుంటాడు.
పార్లమెంటరీ ప్రజాస్వామిక సూత్రాలను కూడా పక్కన బెట్టి తన ‘జన లోక్ పాల్’
బిల్లుని ఆమోధించాల్సిందేనని పార్లమెంటుకే ‘ఫత్వా’ జారీ చేస్తాడు. ‘అరవింద్
కేజ్రీవాల్’ లాంటి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులను తన కుడి భుజంగా
స్వీకరిస్తాడు. మావోయిస్టు నాయకుడు ‘ఆజాద్’ బూటకపు ఎన్ కౌంటర్ ని
వ్యతిరేకించిన ‘స్వామీ అగ్నివేష్’ ని తన బృందంలో ఉండరాదని శాసిస్తాడు.
అందుకనే ఆర్.ఎస్.ఎస్ లాంటి హిందూ మతోన్మాద సంస్ధలు ఆయన ఉద్యమానికి పూర్తి
మద్దతు ప్రకటించాయి. ఉద్యమ నిర్వహణ కోసం కార్యకర్తలను సరఫరా చేశాయి.
వీటన్నింటి నుండీ దూరంగా అన్నా ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ను చూడడం సరికాదు.
అవినీతి వ్యతిరేక ఉద్యమ సామాజిక భూమిక
రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీలు తదితర వర్గాలన్నీపాల్పడుతున్న అవినీతి పచ్చిగా కళ్ళెదుట కనిపిస్తున్న పరిస్ధితి దేశంలోనెలకొని ఉంది. ముఖ్యంగా యు.పి.ఎ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక వరుసగావెలువడ్డ కుంభకోణాలు ప్రజల్లో రాజకీయ నాయకుల అవినీతి పట్ల తీవ్రమైనఆగ్రహాన్నీ, వ్యతిరేకతనూ రగిల్చాయి. వాటిలో 2జి స్పెక్ట్రం కుంభకోణంఅవినీతి కుంభకోణాల్లో రారాజుగా ప్రసిద్ధి కెక్కింది. మాజీ టెలికం మంత్రిఎ.రాజా దర్జాగా పాల్పడిన ఈ ‘రారాజు‘ కుంభకోణం దేశ ప్రజలను నివ్వెరపరిచింది.మెజారిటీ ప్రజానీకం అయిన కార్మికులు, రైతులు, కూలీలు వీటికి దూరంగా ఉన్నా, చిన్న పట్టణాలనుండి మెట్రోపాలిటన్ నగరాల వరకూ విస్తరించి ఉన్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలు, చిన్న పెట్టుబడిదారులు, వ్యాపారులు వీరంతాఈ అవినీతి కుంభకోణాల పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. తమకు అవకాశంవస్తే అవినీతి రాజాలను ఒక చూపు చూడాలి అన్న ఆవేశం ఈ కుంభకోణాలు వీరిలోరగిల్చాయి.ఈ నేపధ్యం లేకుండా, దేశంలో ఈ పరిస్ధితి లేకుండా అన్నా వెంట, ఆయన నేపధ్యం, పేరు, ప్రతిష్టలు ఏమైనప్పటికీ, జనంలో స్పందన వచ్చి ఉండేది కాదు.
ఉద్యమాలకు సారవంతమైన భూమి(క) సమాజంలో లేనట్లయితే ఎంతమంది మహామహులు గోచిబిగించినా పూచిక పుల్లను కూడా కదిలించలేరు. స్వాతంత్ర పొరాటానికి గాంధీవెంట ప్రజలు కోట్లమంది కదిలారు గానీ, అవినీతి వ్యతిరేక ఉద్యమం ‘మరోస్వాతంత్ర్య పోరాటం‘ అని అన్నా హజారే ఎన్ని సార్లు నినదించినా దాన్నిపట్టించుకున్నవారు, ఆలకించినవారు లేరని గమనించాల్సిన విషయం. అన్నా అవినీతివ్యతిరేక ఉద్యమానికి స్పందన వచ్చింది తప్ప ఆయన చెప్పిన ‘మరో స్వాతంత్ర్యపోరాటానికి‘ స్పందన రాలేదని గమనించాలి. దానికి కారణం అవినీతి వ్యతిరేకఉద్యమానికి సమీప భూమిక ప్రస్తుతం దేశంలో ఉంది తప్ప ‘మరొ స్వాతంత్ర పోరాటం‘ అని ఆయన చెప్పినదానికి తగిన భూమిక ‘ప్రజల్లో‘ లేకపోవడమే. అవినీతి వ్యతిరేకఉద్యమానికి ఉపయోగపడిన అన్నా హజారే ఉద్యమ చరిత్ర, పేరు ప్రతిష్టలు, ‘మరోస్వాతంత్ర్య పోరాటా‘నికి ఎందుకు ఉపయోగపడలేదు? అదే పేరు, అవే ప్రతిష్ట ఒకపిలుపుకి ఉపయోగపడి, మరొక పిలుపుకి పనికిరాకుండా పోవడం వెనక ఏ విషయాన్నిగమనించాలి? పిలుపుకి స్పందన, ఉద్యమానికి వ్యాప్తి అన్నవి వాటికి గల సామాజికభూమికపైనే ఆధారపడి ఉన్నాయనీ, ఉద్యమ నాయకుల వ్యక్తిగత పేరు ప్రతిష్టలలోలేదన్న విషయాన్ని గ్రహించాలి. ఉద్యమాలకు సామాజిక భూమికతప్పనిసరి అవసరం. ఈ వాస్తవానికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో, అంగీకారఅనంగీకారాలతో సంబధం లేదు.
ఒక ఉద్యమం ఇచ్చే ప్రధాన పిలుపుపైనప్రజా స్పందన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఆ ప్రధాన పిలుపు అప్పటి సామాజిక, (రాజకీయ, ఆర్ధిక) పరిస్ధితులకు అనుగుణంగా, సమీపంగా ఉన్నట్లయితేనే అదిప్రజాదరణ పొంది దాని చుట్టూ ప్రజలు సమీకృతులవుతారు. 2008 లో ప్రపంచ ఆర్ధికసంక్షోభం రానట్లయితే, అందులో వాల్ స్ట్రీట్ లోని ఇన్వెస్ట్‌మెంట్బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధల అవినీతి, పేరాశ, దోపిడీ బైటపడకపోతే, ‘ఆకుపైవాల్ స్ట్రీట్!‘, ‘వుయ్ ఆర్ 99%!’ నినాదాలకు ఇనాడు ప్రపంచవ్యాపితంగావస్తున్న మద్దతు వచ్చి ఉండేది కాదని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ‘అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన లోక్ పాల్ కై ఉద్యమిద్దాం!‘ అన్న నినాదానికి సమీపంగా నేటి సామాజిక పరిస్ధితి ఉంది. అందుకే ఆనినాదానికి స్పందన వచ్చింది. స్వాతంత్ర పోరాటం అనగానే అది ఎవరీపైన అన్నప్రశ్న వెంటనే ఉదయిస్తుంది. దానికి సమాధానం లేకపోవడంతో అన్నా వెనుక సమీకృతులైన పరిమిత ప్రజానీకంలో స్పందనకరువైంది.
ఇటీవలి కుంభకోణాలు
నిజానికి ప్రతి ఒక్క కుంభకోణం ఇక్కడ చెప్పుకోవడం అసాధ్యం. గత పదేళ్ళలో అనేక కుంభకోణాలు, అనేక రంగాలలో చోటు చేస్తుకున్నాయి. కుంభకోణం జరుగుతుందని ఊహించలేని చోట్ల కూడా ‘పశు గడ్డి కుంభకోణం’ లాంటివి జరిగాయి. ప్రపుల్ పటేల్ – యు.టి.ఐ కుంభకోణం, మహారాష్ట్రలోఆదర్శ సొసైటీ అపార్టుమెంటుల కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, మాయావతి తాజ్ కారిడార్ మరియు విగ్రహాలకుంభకోణాలు, ఓటుకి నోటు కుంభకోణం, పార్లమెంటు ప్రశ్నలకు డబ్బుల కుంభకోణం, యు.పిలో అనేక మంది సిటింగ్, రిటైర్డ్ జడ్జిలు పాల్పడినపి.ఎఫ్ కుంభకోణం, సత్యం కంప్యూటర్స్ ఆడిటింగ్ కుంభకోణం లాంటి కార్పొరేట్ కంభకోణాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ‘నాఫెడ్‘ కుంభకోణం, దేవుడి డాక్టర్ అశోక్ జడేజా పాల్పడిన‘ఆధ్యాత్మిక‘ కుంభకోణం, ఛత్తీస్ ఘడ్ ‘దొంగ ధాన్యం‘ కుంభకోణం, కర్ణాటకకు చెందినఇనుము తుక్కు (ఉక్కు కాదు) కుంభకోణం, ఆస్త్రా కోక్బోగస్ ట్రాన్సాక్షన్ల (కార్పొరేట్) కుంభకోణం, తమిళనాడుగోల్డ్ క్వెస్ట్ (కార్పొరేట్) కుంభకోణం, ఎల్.ఐ.సి (రైల్వేస్) కుంభకోణం, గుజరాత్కాండ్లా పోర్ట్ ట్రస్టు భూ కుంభకోణం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాక్యాపిటేషన్ ఫీజు (సీట్ ఫర్ సేల్) కుంభకోణం, లలిత్ మోడిఐ.పి.ఎల్ కుంభకోణం (ఇందులో శరద్ పవార్ పేరు బైటికి రాకుండా చేశారన్నది ఒక అభియోగం), కేరళపామాయిల్ కుంభకోణం, జార్ఖండ్ మధు కోడా అక్రమాస్తుల కుంభకోణం, జగన్అక్రమాస్తుల కుంభకోణం, ఎమార్ విల్లాల కుంభకోణం…….. ఇవన్నీ భారత దేశవ్యాపితంగా జరిగిన కుంభకోణాలు, వీటిలో కొన్ని దేశ వ్యాపితంగా ప్రాచుర్యంపొందగా, చాలా వరకు ఆయా రాష్ట్రాల ప్రజల వరకే ప్రచారం పొందాయి.
నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి
నిజానికిజాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయస్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం దీనికో కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలోగల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలోప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారంపొందింది. కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి రావడానికి జరిగిన తీవ్రమైనప్రయత్నాలలో భాగంగా కూడా ఈ కేసు బహుళ ప్రచారం పొందింది. అప్పట్లోసంవత్సరానికి ఒక కుంభకోణం బైటపడడం కూడా గగనమే. కుంభకోణాల సంఖ్య కూడాతక్కువగానే ఉండడం, కుంభకోణాలలో గల్లంతైన మొత్తం తక్కువగా ఉండడంతో బైటికి వచ్చేకుంభకోణాల సంఖ్య కూడా తక్కువే.
దానికి కారణం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం.ప్రభుత్వ రంగం దేశంలో ఆధిపత్యం వహించినపుడు కుంభకోణాలకు పాల్పడే అవకాశంకేవలం కొన్ని రంగాలకే పరిమితమైంది. పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడే అవకాశం కూడా అప్పుడు తక్కువ. రక్షణ రంగం, మౌలిక నిర్మాణాల రంగంలాంటివి మాత్రమే కుంభకోణాలకు అనువుగా ఉండేవి. కాని నూతన ఆర్ధిక విధానాలుఅమలు కావడం మొదలయ్యాక సమస్త రంగాలలో ఉన్న దేశ సంపదలు రాజకీయ రంగం లోనూ, బ్యూరోక్రసీ లోనూ ఉన్న వ్యక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
అది కూడాఅత్యంత తేలికగా అత్యంత సమీపంగా అత్యంత తక్కువ స్క్రూటినీతో ఆర్ధికవిధానాలలో భాగంగానే ఇలా ప్రజా సంపద నిలువుదోపిడికి వీలుగా చేరువగావచ్చింది. అప్పటివరకూ ఉన్న భూ పరిమితి చట్టాల నుండి, స్వదేశీవిదేశీ ప్రవేటు పెట్టుబడి పరిమితి చట్టాల వరకూ అనేక చట్టాలు ఈ కుంభకోణాలనునివారించాయి. నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో ఈ చట్టాలన్నీ మార్చివేశారు. ఏఅంశమూ, ఏ రంగమూ కుంభకోణాలకు అతీతంగా ఉండలేని పరిస్ధితి నెలకొంది. సరళీకృతఆర్ధిక విధానాల కారణంగా చట్టాలు, ఆర్ధిక విధానాలు, పన్నుల విధానాలు, లైసెన్సింగ్ విధానాలు అన్నీ సమస్తం సరళతరం కావడంతో రాజకీయంగా ఏమాత్రంపలుకుబడి ఉన్నా, బ్యూరోక్రసీ అధికారులు ఏమాత్రం రాజకీయ నాయకులకు లొంగిఉన్నా పదుల కోట్ల నుండి వేల కోట్లను దాటి లక్షల కోట్ల వరకూ కుంభకోణాలకుపాల్పడడానికి దండిగా అవకాశాలు చేజిక్కాయి. భారత దేశ పాలకులు నూతన ఆర్ధికవిధానాలను అనుసరించిన ఫలితంగా ఏర్పడిన ఉప ఉత్పత్తి (బై ప్రొడక్టు) మాత్రమేఇది. ఉప ఉత్పత్తి విలువే లెక్కకు అందనంత రీతిలో ఉన్నపుడు ఇక స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలు నొల్లు కుంటున్న సంపద, రాజ మార్గాలలో ఆర్ధికవిధానాలు సమకూర్చిన లైసెన్సుల సాక్షిగా తరలివెళ్తున్న ప్రజాధనం ఎంత ఉంటుందోలెక్కగట్టడానికి వందమంది ‘రామానుజం‘ లు అవసరం పడవచ్చు.
లైవ్ మింట్ డాట్ కామ్ వార్తా పత్రిక, కార్పొరేట్ అవినీతి
పైన గత సంవత్సరం ఒక నివేదిక ప్రచురించింది. ఆడిట్, కన్సల్టింగ్ సంస్ధ
కె.పి.ఎం.జి సర్వే జరిపి తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం 2008, 2009
సంవత్సరాలలో భారత దేశంలోని 87 శాతం కంపెనీలలో ఆర్ధిక మోసాలు జరిగాయి. ఈ
నివేదిక కంపెనీలు పాల్పడిన మోసాల గురించి చెప్పలేదు. కేవలం కంపెనీల లోపల
జరిగిన మోసాల పైనే మాట్లాడింది. 2008 లో ఇదే సంస్ధ జరిపిన సర్వేలో 47 శాతం
కంపెనీలలో మాత్రమే ఆర్ధిక మోసాలు జరిగాయని వెల్లడి కాగా మరో సంవత్సరం
గడిచేసరికి 87 శాతానికి పెరిగింది. వెయ్యి కంపెనీలు సర్వేలో పాల్గొనగా
అందులో 870 కంపెనీల్లో మోసాలు జరిగాయి! ఈ పెరుగుదలకు సర్వే సంస్ధ చెప్పిన
కారణాలలో ముఖ్యమైనవి బలహీనమైన నియంత్రణ వ్యవస్ధ (రెగ్యులేటరీ ఎన్విరాన్
మెంట్) ఉండడం, ఆడిట్ కమిటీలు సీనియర్ మేనేజర్ల కార్యకలాపాలపైన పెద్దగా
తనిఖీ చేయకపోవడం, స్వతంత్ర అంతర్గత ఆడిట్ లు జరగకపోవడం. వీటిలో కూడా మొదటి
రెండూ ప్రధానమైనవి గా గుర్తించాలి. కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ (బ్యాలన్స్ షీట్) లలోనే మోసం జరగడం ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం
అని పదవ ‘ఇండియా ఫ్రాడ్ సర్వే రిపోర్ట్ – 2010’ వెల్లడించిందని ఇదే వెబ్
సైట్ తెలిపింది. నైతిక విలువలు పతనం కావడం, బలహీన అంతర్గత ఆడిటింగ్,
మోసకారులపై చర్యలు లేకపోవడం వల్ల మోసాలకు అనుకూల వాతావరణం కల్పించాయని ఈ
నివేదిక స్పష్టం చేసింది. మదుపరులు ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లపైనే ఆధారపడి
షేర్లలో మదుపు చేస్తారు కనక ఇది నిజంగానే పెద్ద ప్రమాదం. సత్యం రామలింగ
రాజు అయిదేళ్ళుగా దొంగ లెక్కలు చూపినా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘ప్రైస్
వాటర్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్ధ చూసీ చూడనట్లు వదిలేసింది. రాజు మోసం
బైటపడ్డాక అనేకమంది సామాన్య మదుపరులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సత్యం
పాల్పడిన మోసం ఐదువేల కోట్ల రూపాయలు కాగా మదుపరుల నష్టం తోడైతే ఆ మోసం
ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పలేం.
ఇలా బ్యాలన్స్ షీట్లలో మోసాలను ఈ విదేశీ ఆడింటింగ్ సంస్ధలు,
రేటింగ్ సంస్ధలు ఇండియాకు సరికొత్త రీతుల్లో పరిచయం చేశాయని నిస్సందేహంగా
చెప్పవచ్చు. విదేశీ బహుళజాతి ద్రవ్య సంస్ధలు (ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,
ఇన్సూరెన్స్ సంస్ధలు) ప్రపంచంలోని ద్రవ్య కార్యకలాపాలలోనూ,
మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి కంపెనీల ఆర్ధిక కార్యకలాపాలలోనూ మెజారిటీని
(దాదాపు అన్నీ అంటే సరిగ్గా ఉంటుంది) తమ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాయి. వీటి
పనల్లా ఆయా దేశాలలోని చట్టాలకు దొరక్కుండా, పన్ను పోట్లకు గురి కాకుండా,
గరిష్ట లాభాలు సమకూరేలా వివిధ ఆర్ధిక, ద్రవ్య కార్యక్రమాలను కంపెనీలకు,
ఫ్యాక్టరీలకూ, ట్రస్టులకు, హెడ్జ్ ఫండ్లకు, మ్యూచువల్ ఫండ్లకు పూర్తి చేసి
పెట్టడమే. ప్రభుత్వాల కోసం ఒక సెట్ డాక్యుమెంట్లు, కేవలం కంపెనీల కోసం మరొక
సెట్ డాక్యుమెంట్లు తయారు చెయ్యడం వీరి పని. అంటే ప్రభుత్వాలను
సమర్ధవంతంగా మోసం చేసే పనిని ఈ సంస్ధలు చేసిపెడతాయన్నమాట! కంపెనీల విలీనాలు
మరియు స్వాధీనాలు (Mergers&Acquisitions), అమ్మకాలు కొనుగోళ్ళు,
పబ్లిక్ ఇష్యూల జారీలు, కంపెనీలను విడగొట్టడం, కంపెనీల పునర్వ్యవస్ద్ధీకరణ,
కంపెనీల విస్తరణ, షేర్ల విస్తరణ… ఒకటేమిటి, కంపెనీలను మూసివెయ్యడంతో సహా,
ఆధునిక ఆర్ధిక ద్రవ్య కార్యకలాపాలు సమస్తం వీరి చేతులమీదుగా జరగాల్సిందే.
వీరు లేకపోతే కంపెనీలు మోసాలు చెయ్యడం అసలు సాధ్యం కాదు.
అందుకే
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించాక వాల్ స్ట్రీట్ కంపెనీల (ఇంకా ప్రపంచ
వ్యాపితంగా ఉన్న అలాంటి కంపెనీలతో సహా) పైన నియంత్రణలు పెంచాలని జి-20
గ్రూపు దేశాల వరుస సమావేశాలు నిర్ణయించాయి. ఈ సమావేశాలలోనే ఇవే మోసపూరిత
కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను బెయిలౌట్లుగా పంచాలని కూడా
నిర్ణయించారు. కంపెనీలకు బెయిలౌట్లయితే పంచారు గానీ వాటిపైన నియంత్రణలు
విధించ లేకపోయారు. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ఈ కంపెనీల
చేతుల్లో ఉండగా వీరిని కాదని వీరిపైనే నియంత్రణలు విధించడం ప్రభుత్వాల వల్ల
కాలేదు, కాదు కూడా. జి-20
సమావేశాల్లో తీర్మానం చేశాం కనుక నామ మాత్రంగానైనా కొత్త నియంత్రణలు ఒకటి
రెండూ చేస్తామని అమెరికా ప్రభుత్వం విన్నపాల మీద విన్నపాలు చేసుకున్నా వీరు
ససేమిరా అన్నారు. వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రతిపక్ష రిపబ్లికన్
పార్టీ (కాంగ్రెస్ లో దీనికే మెజారిటీ ఉంది) పూర్తి మద్దతు ఇవ్వడంతో ఒక్క
నియంత్రణ చర్య కూడా అమెరికా ప్రభుత్వం తీసుకోలేకపోయింది. అలాగని డెమొక్రాట్
పార్టీ కార్పొరేట్ కంపెనీలపై చర్యలకు అనుకూలమని కాదు. ఎన్నికలను దృష్టిలో
పెట్టుకుని నామ మాత్రపు చర్య మాత్రమే అది కోరుకుంది. అమెరికాలోనే కాదు. ఏ
దేశంలో నైనా ఇదే తంతు. ఇతర దేశాలలోని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ
వ్యవస్ధలకూ, సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధల అనుబంధిత ఆర్ధిక వ్యవస్ధలుగా
మారిన మూడో ప్రపంచ దేశాలకూ అమెరికా ఆర్ధిక వ్యవస్ధే మార్గదర్శకత్వం
వహిస్తున్నందున అక్కడ జరగనిది ఇతర దేశాల్లో జరిగే అవకాశం లేదు. ఇతర
దేశాల్లో సైతం రాజకీయ పార్టీలకు కార్పొరేట్ రంగమే నిధులు అందిస్తుంది కనుక
అక్కడ కూడా కార్పొరేట్ కంపెనీలపైన చర్యలు తీసుకునే అవకాశం లేదు లేదా అతి
తక్కువ. పైగా ప్రపంచ వ్యాపితంగా ఉన్న చిన్నా పెద్దా కంపెనీలన్నీ ఫేస్ బుక్
లోగోలో కంటే క్లిష్టంగా ఒకదాని కొకటి సంబంధ బాంధవ్యాలతో పరస్పరం
పెనవేసుకుపోయినందున వాటి ఆర్ధిక సూత్రాలు యూనివర్సలైజ్ అయిపోయాయి.
ఈ
నేపధ్యంలో భారత దేశంలో అనేక రేట్లు పెరిగిన అవినీతిని నూతన ఆర్ధిక విధానాల
ప్రవేశంతో విడదీసి చూడడం అసాధ్యమైన సంగతి. కనుక అవినీతిని
ప్రస్తావించుకున్నపుడు, దానికి
వ్యతిరేకంగా పోరాడాలని సిద్ధ పడినప్పుడు, అవినీతి పరులను ఉరితీయాలని కూడా
ప్రకటనలు ఇస్తున్నపుడు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా ఈ
దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్నికల్లో
ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడినప్పుడు, అవినీతిని అనేక రెట్లు పెంచిన
నూతన ఆర్ధిక విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండగలగడం అసాధ్యం. నూతన
ఆర్ధిక విధానాలు తెచ్చిన చేటు గురించి ప్రస్తావించకుండా, అవినీతికి భూమికగా
ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక కారణాలను ప్రస్తావించకుండా, ముఖ్యంగా ఆర్ధిక
విధానాలను ప్రస్తావించకుండా, ఆ అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటం
నామమాత్రంగానే ఉంటుంది తప్ప నిర్ణయాత్మకంగా ఉండజాలదు.
భారత రాజకీయ పార్టీలవన్నీ ఒకే ఆర్ధిక విధానాలు
చిత్రం ఏమిటంటే తమ సంపదలకు ఆయువు పట్టు అయిన ‘అవినీతి సంపాదన‘ పైనేఅన్నా హజారే గురి పెట్టినప్పటికీ రాజకీయ నాయకులు కూడా అన్నా హాజారే పట్లపైకి గౌరవ, మర్యాదలు ప్రకటించారు. బి.జె.పి లాంటి జాతీయ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆయనఅవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఆర్.ఎస్.ఎస్ లాంటిసంస్ధలు సైతం ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాక క్రియాశీలక పాత్ర కూడాపోషించాయి. కార్యకర్తలను సరఫరా చేసి ప్రజలను కూడగట్టడానికి సహాయంగానిలిచాయి.ఆర్.ఎస్.ఎస్ అధినేత స్వయంగా అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగు దేశం,
అన్నా డి.ఏం.కె, డి.ఏం.కె లాంటి దక్షిణాది పార్టీలే కాక ఉత్తరాదిన ఉన్న
ప్రాంతీయ పార్టీలు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర ఉన్నప్పటికీ
అన్నా ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు
ఇవ్వనివాడిదే పాపం అన్నట్లుగా మద్దతుల పర్వం సాగింది. ఎ.రాజా, గాలి జనార్ధన
రెడ్డి, కనిమొళి లే మద్దతు ఇవ్వకుండా మిగిలారని అప్పట్లో జోకులు పేలాయి
కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్నాకి మద్దతు ఇవ్వకుండా లేరు.
ప్రధాని, సోనియా, రాహుల్ లాంటి ప్రధాన నాయకులు అన్నాకి మద్దతు ఇచ్చారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ఐతే అన్నా ప్రాణాలు దేశానికి అవసరమనీ, ఆయన సేవలు
భవిష్యత్తులో కూడా దేశానికి అవసరమనీ, కనుక అన్నా నిరాహార దీక్ష విరమించాలనీ
ఆగష్టు నిరాహార దీక్ష సందర్భంగా నేరుగా పార్లమెంటులోనే
విన్నవించుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని
అణచి వేయడమే ప్రభుత్వానికి తెలుసు తప్ప ఇలా విన్నపాలు చేసుకోవడం
మున్నేన్నడూ ఎరగనిది.
అన్నా మొదటిసారి అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు పూనుకున్నపుడు దేశంలో ఉన్న జాతీయ,
అంతర్జాతీయ పరిస్ధితులను కూడా మననం చేసుకోవడం అవసరం. ఆ సమయంలో
అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే అరబ్ విప్లవాల వెల్లువ కొనసాగుతోంది. అరబ్
ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ట్యునీషియా, ఈజిప్టులలో నియంతృత్వ
ప్రభుత్వాలు నేల కూలాయి. నియంతృత్వ ప్రభుత్వాలు నేల కూలినా ప్రజలు
కోరుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి బదులు మళ్ళీ
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల ప్రాపకంలో ఉన్న అక్కడి సైనిక వ్యవస్ధలే
అధికారం చేజిక్కించుకున్నాయన్నది నిష్టుర సత్యం. సందర్భం కానందున దానికి గల
కారణాల చర్చను వదిలేద్దాం. యెమెన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ లాంటి
ఇస్లామిక్ మత ఛాందస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమాలు
నిర్వహించారు. లిబియా, సిరియాలలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లు తమ పత్రికల
పచ్చి అబద్ధాల ప్రచారం సహాయంతో నడిపిన, నడుపుతున్న బూటకపు ఉద్యమాలు మినహా
ఇతర అరబ్ దేశాలన్నింటా ప్రజలు ఏదో మేరకు ఉద్యమాలు నిర్వహించారు. మరోవైపు
అమెరికా, యూరప్ లలో ‘వాల్ స్ట్రీట్ ఆక్రమిద్ధాం!’ ఉద్యమం నడిచింది.
అమెరికా, యూరప్ లలో జరిగిన ఉద్యమాలకి ప్రపంచం ఆర్ధిక సంక్షోభం నేపధ్యంగా
పని చేసింది. అంతర్జాతీయంగా సాగిన ఈ ఉద్యమాల ప్రభావం భారత దేశం పై కూడా
పడడం ఒక అంశం.
దేశంలో కుంభకోణాలు వెల్లువత్తడం ఒక పరిస్ధితి కాగా ఈ పరిస్ధితిలోనే భారత ప్రభుత్వంపైన అమెరికా,
యూరప్ దేశాలనుండి సంస్కరణల అమలు కోసం తీవ్రమైన ఒత్తిడిలు వస్తున్న
పరిస్ధితి నెలకొని ఉంది. వరుసగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అవినీతి
కుంభకోణాలు వెల్లడవుతున్న పరిస్ధితిలో ఆ అవినీతికి మూలంగా ఉన్న సంస్కరణల
ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టడం భారత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.
దేశంలోని అనేక అక్రమ సెజ్ లకు వ్యతిరేకంగా, భూములను ప్రభుత్వాలు బలవంతంగా
లాక్కోవడానికి వ్యతిరేకంగా, భూములను పరిశ్రమల కోసం లాక్కుని వాటితో రియల్
ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి వ్యతిరేకంగా, భూములు
లాక్కుని విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి వ్యతిరేకంగా, పరిశ్రమల పేరుతో
గ్రామీణ ప్రాంతాలను కాలుష్యంతో నింపడానికి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ
ఉద్యమాలలోకి దూకుతున్న పరిస్ధితి నెలకొని ఉంది. ఒరిస్సా పోస్కో వ్యతిరేక
ఉద్యమం, నియంగిరి – వేదాంత బాక్సైట్ తవ్వక వ్యతిరేక ఉద్యమం, ఛత్తీస్ ఘడ్,
జార్ఘండ్ రాష్ట్రాల ఆదివాసీల ఉద్యమాలు, ఆంధ్ర ప్రదేశ్ లో సోంపేట,
కాకరాపల్లి రైతుల ధర్మల్ వ్యతిరేక ఉద్యమాలు వీటిలో మచ్చుకు కొన్ని. ఈ
ఉద్యమాలు నిజంగా ప్రజలను కదిలిస్తున్న ఉద్యమాలు. భారత సమాజంలో అట్టడుగున
ఉన్న ప్రజానీకం ఐన రైతులు, కార్మికులు, కూలీలను కదిలిస్తున్న ఉద్యమాలు.
అట్టడుగు ప్రజానీకం తమ కూడు, గుడ్డ, నీడ కోసం చేస్తున్న ఉద్యమాలివి. భారత
దేశంలోని ఆధిపత్య వర్గాల ఆర్ధిక ఆధిపత్యానికి తద్వారా రాజకీయ ఆధిపత్యానికి
కూడా గండికొట్టే ఉద్యామలివి. అట్టడుగు ప్రజల కూడు, గుడ్డ, నీడలను కబళించడం
ద్వారానే తమ దోపిడిని కొనసాగిస్తున్న వర్గాలు అట్టడుగు ప్రజానీకం చేసే
ప్రాధమిక ఉద్యమాలను కరకు ఉద్యమాలుగా పరిగణిస్తాయి. ఆధిపత్య వర్గాల
ఆధిపత్యానికి భంగం కలిగేలా అట్టడుగు వర్గాల ప్రజలు కదిలినట్లయితే
ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం అవుతాయి. ఆ ఉద్యమాలను ఎలా అణచివేయాలా అని
పధకాలు పన్నుతాయి. ఆ ఉద్యమాల అణచివేతను తక్షణ కార్యక్రమంగా చేసుకుంటాయి.
ఉద్యమాల అణచివేతకు ప్రభుత్వాలు సహజంగానే అనేక పద్ధతులు, ఎత్తుగడలు
అనుసరిస్తాయి. పోలీసులు, పారామిలట్రీ, ఆనక సైన్యాన్ని దించడం లాంటి కరకు
పద్ధతులు, కరుకు ఎత్తుగడలతో పాటు ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించే సాఫ్ట్
పద్ధతులు, సాఫ్ట్ ఎత్తుగడలు కూడా ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. అటువంటి సాఫ్ట్
ఎత్తుగడలలో భాగంగా, కొండొకచో ఆయాచితంగా దొరికిన సాఫ్ట్ ఉద్యమాలను చూసీ
చూడనట్లు పోవడం ద్వారా అటువంటి సాఫ్ట్ ఉద్యమాలకు సమానాంతరంగా సాగుతున్న
ప్రాధమిక ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించే ఎత్తుగడలను ప్రభుత్వాలు
అనుసరిస్తాయి.
సేఫ్టీ వాల్వ్
ప్రభుత్వాలలో
ఆధిపత్యం వహిస్తున్న వర్గాల ప్రయోజనాలకు ప్రమాదం లేని ఉద్యమాలను
పాలకవర్గాలు సాఫ్ట్ ఉద్యమాలుగా పరిగణిస్తాయి. ఈ తరహా ఉద్యమాలు ఒక్కోసారి
ప్రభుత్వాల కనుసన్నల్లో జరిగినా ఆశ్చర్యం లేదు. తమ కనుసన్నల్లో జరిగే
ఉద్యమాలకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తమకు ఏ విధంగానూ లొంగని,
కరకు అణచివేత పద్ధతులకు పాల్పడవలసి వచ్చే ఉద్యమాలను పూర్వ పక్షం చేయడానికి
ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. కనుసన్నల్లో జరగకపోయినప్పటికీ, కొండొకచో
ప్రతిపక్షాల కనుసన్నల్లో నడుస్తున్నప్పటికీ అటువంటి ఉద్యమాలను సాఫ్ట్
ఉద్యమాలుగా పరిగణించబడతాయి. ఇటువంటి సాఫ్ట్ ఉద్యమాలకు సహజంగానే దేశంలోని
పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాయి. అట్టడుగు ప్రజానీకం
లేవనెత్తుతున్న మౌలిక సమస్యలు కూడు, గుడ్డ, నీడ లనుండి ఇతర వర్గాల ప్రజలైన
మధ్య తరగతి బుద్ధి జీవులు, మేధావుల దృష్టి ని ఈ ప్రచారం పక్కకు
మళ్లిస్తుంది.
సాఫ్ట్
ఉద్యమాలు లేవనెత్తుతున్న ఉద్యమాన్ని ప్రముఖంగా ప్రభుత్వం కూడా
పట్టించుకుంటుంది. ఆ ఉద్యమం లేవనెత్తిన సమస్య దేశంలో ప్రాముఖ్యగా
గుర్తించినట్లుగా ఫోజులు పెడుతుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి
పూనుకుంటున్నట్లుగా కూడా ఫోజులు పెడుతుంది. సమస్య పరిష్కారానికి తక్షణం
చర్యలు తీసుకుంటున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. ప్రజా ఉద్యమాలను ఓ పక్క
కర్కశంగా అణచివేస్తున్నప్పటికీ సాఫ్ట్ ఉద్యమాలకు ప్రముఖంగా స్పంధించడం
ద్వారా తాను ప్రజల డిమాండ్లకు ప్రజాస్వామ్య యుతంగా స్పందిస్తున్నట్లుగా
చూపుకుంటుంది. ఆ విధంగా సాఫ్ట్ ఉద్యమాలను ప్రభుత్వం సేఫ్టీ వాల్వ్ గా
ఉపయోగించుకుంటుంది. అలా చేయనట్లయితే ప్రభుత్వాలు అట్టడుగు ప్రజానీకం
లేవనెత్తిన మౌలిక సమస్యలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి సమాధానం
ఇవ్వడం అంటే భారత ప్రభుత్వం తాను గత ఇరవై సంవత్సరాలుగా అనుసరిస్తూ వస్తున్న
నూతన ఆర్ధిక విధానాలను సమీక్షించుకుంటానని చెప్పడమే. నూతన ఆర్ధిక
విధానాలను సమీక్షించుకుంటే అవి భారత దేశ ప్రజల ప్రాధమిక హక్కులను
కాలరాస్తున్నాయని వెల్లడవుతుంది. జీవించే హక్కు నుండి,
ఆస్తి హక్కు, భావ ప్రకటనా స్వేచ్చా హక్కు లాంటి ప్రాధమిక హక్కులను తాము
హరిస్తున్నామని ప్రభుత్వాలు అంగీకరించవలసి ఉంటుంది. ఈ అంగీకారం ఒక్క కేంద్ర
ప్రభుత్వం వరకే పరిమితం కాజాలదు. ఈ దేశంలోని జాతీయ, ప్రాంతీయ పాలకవర్గ
పార్టీలన్నీ నూతన ఆర్ధిక విధానాలని అనుససరిస్తున్నందున అవన్నీ తమ విధానాలను
వదులుకోవలసి ఉంటుంది.
కానీ అది అసాధ్యం. ప్రభుత్వాలు నడుపుతున్న వర్గాలు తమ స్వభావాన్ని ఎలా వదులుకుంటాయి?
తమ స్వభావాన్ని వదులుకోవడం అంటే అది వారు తాము ఇప్పటిదాకా తిన్న కోటి
కోట్ల అవినీతి సొమ్ముని కక్కడంతో సమానం. అది చేయకుండా తమను తాము
కాపాడుకోవడానికి భారత పాలక వర్గాలకు అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం
ఆయాచితంగా దొరికింది. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ కనుసన్నల్లో
జరిగిందన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన
ఆర్ధిక విధానాల్తో, సరళీకరణ-ప్రవేటీకరణ-ప్రపంచీకరణ విధానాలతో ఏ మాత్రం
భిన్నాభిప్రాయాలు లేని ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు
ఇచ్చాయన్నది విస్మరించరాని విషయం. చివరికి ప్రభుత్వం కూడా చెప్పుకోదగ్గ
రీతిలో అన్నా ఉద్యమానికి సహకరించింది. అన్నా రెండవ నిరాహార దీక్షకు
గ్రౌండును ప్రభుత్వం ఆగమేఘాల మీద మునిసిపల్ సిబ్బందిని నియమించి మరీ సిద్ధం
చేసింది. అన్నా అరెస్టు అయినప్పుడు జైలులో సకల సౌకర్యాలు అందించింది. జైలు
ఆఫీసులో ఉన్న అన్నా సందేశాలను జైలు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులే బైట
ఉన్న పత్రికా విలేఖర్లకు మోశారని అప్పట్లో పత్రికలు రాశాయి. ఎంత అన్నా
అరెస్టులో ప్రభుత్వం తప్పు చేసినప్పటికీ ఇవన్నీ చేయనవసరం లేదు. ఆందోళనకు
ప్రభుత్వమే గ్రౌండు సిద్ధం చేయడం ఎక్కడైనా విన్నామా? ఉన్నది ఉన్నట్లుగా
గ్రౌండు అడిగినవారికి మున్సిపాలిటీ ఇస్తుంది. దాన్ని శుభ్రం చేసుకుని
వాడుకునేదీ లేనిదీ తీసుకున్నవారి ఇష్టానికి వదిలివేస్తారు తప్ప స్వయంగా
శుభ్రం చేసి ఇవ్వరు. అప్పటికప్పుడు ఎర్త్ మూవర్స్ ని తెప్పించి, వందకు పైగా
కార్మికులను నియమించి, తుప్పలు కొట్టించి, ఎత్తుపల్లాలను చదును చేసి…
ఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం లేదు. చెయ్యవు కూడా. గత ఉద్యమాలను ఏది
చూసినా ఈ విషయం స్పష్టం అవుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ సహకారాన్ని
తప్పని సరిగా ఒక ముఖ్య అంశంగా పరిశీలించాలి. దీనర్ధం సాఫ్ట్
ఉద్యమాలన్నింటినీ అన్నీ సందర్భాలలో సాఫ్ట్ గానే పరిష్కరించడానికి
ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని చెప్పడం కాదు.
మూడవ
సారి నిరాహార దీక్షకు వచ్చేసరికి ప్రజల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల
ఆసక్తి సన్నగిల్లింది. ప్రభుత్వం అప్పటివరకు అన్నా బృందం సభ్యులపైన అనేక
విధాలుగా విష ప్రచారం చెయ్యడం వల్ల వారి విశ్వసనీయతమైన దెబ్బకొట్టగలిగింది.
అన్నా హజారే స్వయంగా అనేక వివాస్పద ప్రకటనలు ఇచ్చి తన విశ్వసనీయతకు ఏదో
మేరకు గండి కొట్టుకున్నాడు. రెండవసారి నిరాహార దీక్ష సమయంలో అన్నాను
అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకి రిమాండ్ విధించడం ప్రజలను బాగా
కదిలించిన అంశంగా గుర్తించాలి. అన్నాను జైలుకి పంపాక ప్రభుత్వం తన తప్పు
సరిదిద్దుకుని విడుదల చేయించినప్పటికీ అప్పటికే జరగవలసింది జరిగిపోయింది.
అన్నా కూడా వ్యూహాత్మకంగా జైలు నుండి బైటికి రావడానికి నిరాకరించడంతో
ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది. ఇటువంటి పరిస్ధితులు
మూడవసారి (డిసెంబరులో) నిరాహార దీక్ష సమయంలో లేవు. దానితో ప్రజల హాజరు బాగా
పడిపోయింది. లక్ష వస్తారనుకున్న ముంబై దీక్షకు పది వేలమంది హాజరయ్యారని
పత్రికలు రాశాయి. ఆగష్టులో లక్షకు పైగా హాజరైన ఢిల్లీ లో ఈ సారి రెండు
వందలకు మించలేదు. ప్రజలు నిరంతరం ఉద్యమాలపైన దృష్టి ఉంచరు. దైనందిన సమస్యలు
వారికి అనేకం. నిత్యం అనేక సమస్యలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రభుత్వాలే
పరోక్షంగా వారు ఆందోళనకు సమీకృతులు కాకుండా నిరోధిస్తున్నాయన్నమాట!
సమస్యలు ఎదుర్కోవడం అంటే మరో అర్ధంలో ప్రజలు అనేక త్యాగాలు అప్పటికే
చేస్తున్నట్లు లెక్క. ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా మరొక త్యాగం అదనంగా చేయడం
వారికి నిరంతరం సాధ్యం కాని పని. దానితో మూడవసారి అన్నాయే రెండో రోజుకల్లా
చాప చుట్టవలసి వచ్చింది. జ్వరం వల్ల దీక్ష విరమించాడని చెప్పినా, అన్నా దీక్షకి జ్వరం ఒక లెక్క కాదని ఆగష్టు నాటి పద్దెనిమిది రోజుల నిరాహార దీక్ష చెప్పింది.
అన్నా దీక్ష విరమణతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేరింది. ఏమిటా లక్ష్యం?
ఈ సంవత్సరం ప్రాంభంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న అనేక
ప్రజాందోళనలను పక్కదారి పట్టించడం అన్నది ప్రధాన లక్ష్యం. ఈ వ్యాసంలో ఇంతకు
ముందు చెప్పుకున్న ఆందోళనలపైన భారత ప్రజల దృష్టి పడకుండా ప్రభుత్వం
ఇప్పటివరకూ చూడగలిగింది. ఓ వైపు అన్నా ఉద్యమం నడుస్తుండగా మరే ఉద్యమమూ
పత్రికలలో ప్రముఖ స్ధానం సంపాధించలేకపోయింది. అవినీతి ఉద్యమంతోటి దేశంలోని
ప్రతి సమస్య ముడి పడి ఉన్నట్లు కనిపిస్తుండడంతో అన్నింటికీ ఈ ఉద్యమం చాలు
అన్న వాతారావణం ఏర్పడింది. అందుకు అన్నా ఉద్యమం ప్రభుత్వానికి ఉపయోగపడింది.
అన్నా ఉద్దేశ్య పూర్వకంగా సహకరించాడా అన్నది ఇక్కడ అప్రస్తుతం. ఉద్దేశ్య
పూర్వకంగా సహకరించే అవగాహన అన్నా కు లేకపోవచ్చు. కానీ ఆ ఉద్యమాన్ని
ప్రభుత్వం ఎలా ఉపయోగించుకున్నదీ ఇక్కడ అర్ధం చేసుకోవలసిన అంశం. నిజానికి ఈ
విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా చెప్పాడు కూడా. ఇప్పటి లోక్ పాల్
బిల్లుని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వం రాజకీయ నాయకుల, అధికారుల
అవినీతి పరులను సమర్ధవంతంగా రక్షించుకుంది అని ఆయన ప్రకటించాడు.
అంతిమగా చెప్పదలిచిన విషయం ఏమిటి?
అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటి ఉద్యమాలు ప్రజల మౌలిక సమస్యలకు
దూరంగా ఉన్నట్లయితే అవి అసంపూర్ణ ఉద్యమాలుగానే ఉండిపోతాయి. అటువంటి
అసంపూర్ణ ఉద్యమాల వల్ల ప్రజలకు లాభం లేకపోగా అంతిమ పరిశీలనలో నష్టం
జరుగుతోంది. మౌలిక సమస్యలపై జరిగే ఉద్యమాలను ప్రభుత్వాలు తప్పించుకోగల
అవకాశాలు ఈ ఉద్యమాలు ఇస్తున్నాయి. తద్వారా ప్రజలకు నష్టమే జరుగుతున్నది.
మౌలిక సమస్యలపై ఉద్యమాలు లేకుండా మౌలిక సమస్యల ప్రతిబింబం అయిన అవినీతి
లాంటి అంశాలపైన జరిగే ఉద్యమాలు అటు అవినీతి సమస్యను పరిష్కరించక పోగా ఇటు
మౌలిక సమస్యలపై ఆందోళనలను కూడా కనిపించ కుండా చేస్తున్నాయి. ఉద్యమ నాయకులు
గానీ, మొత్తంగా ఉద్యమానికి గానీ దేశంలోని సమస్యలన్నింటి పట్లా సమగ్ర
ద్ఱృక్పధం ఉండాలి. దేశంలోని ఇతర వర్గాల ఉద్యమాలతో సజీవ సంబంధం లేకుండా ఏ
ఉద్యమమూ మనజాలదని కూడా అన్నా ఉద్యమం ద్వారా తెలుస్తున్నది. ప్రజల మౌలిక
హక్కులను కాలరాస్తున్న నూతన ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా అన్నా
అవినీతి వ్యతిరేక ఉద్యమాలు సాధించేది సున్న. నమలడానికి దంతాలు కూడా
లేకుండా కోరలు పీకేసిన ‘లోక్ పాల్ బిల్లు’ ని లోక్ సభ ఆమోధించింది.
రాష్ట్రాల హక్కుల పేరుతో తన భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ద్వారా
అభ్యంతరాలు లేవనెత్తించి రాజ్య సభలో ఆమోదం పొందకుండా కాంగ్రెస్
చూసుకోగలిగింది. ఇక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి లోక్ పాల్ లో సవరణలు
జరిపి అందరికి ఆమోద యోగ్యమైన చట్టం బడ్జెట్ సమావేసాల్లో తెస్తామని
ప్రభుత్వం ప్రకటించి పార్లమెంటు సమావేశాలు ముగించింది. లక్షల కోట్ల రూపాయల
ఖరీదు చేసే బిల్లుల్ని, చట్టాల్నీ మూజువాణీ ఓటుతో ఆమోదించే పార్లమెంటు అది
‘పందుల దొడ్డి’ అని మరోసారి లోక్ పాల్ చట్టం ద్వారా నిరూపించుకుంది. అన్నా
ఉద్యమం సాధించిండి సున్నకు సున్నా, హళ్ళికి హళ్ళి. అన్నా ఉద్యమం ద్వారా
పాలకవర్గాలు సాధించింది, మరిన్ని లక్షల కోట్ల విలువ చేసే కుంభకోణాలూ,
మరిన్ని నూతన ఆర్ధిక విధానాలూను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి