2, జనవరి 2012, సోమవారం

ఈ ఏడాదిలో నేరాలు 5.88 శాతం పెరిగాయి

  
    హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది నేరాల రేటు 5.88 శాతం పెరిగిందని డిజిపి వి.దినేశ్‌రెడ్డి చెప్పారు. 2010లో మొత్తం 1.55 లక్షల కేసులు నమోదైతే, 2011 నవంబర్ నాటికి 1.64 లక్షల కేసులు నమోదు అయినట్లు తెలిపారు. హత్యలు 2010లో 2465 ఉంటే, 2011లో 2522 జరగ్గా, మహిళలపై నేరాలు 2010లో 21,559 కేసులు నమోదైతే, 2011లో 22,034 కేసులు నమోదై 9.15 శాతం పెరిగాయని చెప్పారు. శుక్రవారం విలేఖరుల సమావేశంలో 2011 వార్షిక నేరాల నమోదు వివరాలను డిజిపి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు మాత్రం కొంత తగ్గుముఖం పట్టగా కిడ్నాప్‌లు, దొంగతనాలు, దోపిడీలు స్వల్పంగా తగ్గాయని అన్నారు.
        రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. 2011లో మిలియన్ మార్చ్, సకల జనుల సమ్నె, రాస్తారోకోలు, రైల్‌రోకోలు, విద్యార్థుల ఆందోళనలు, విద్యా సంస్థల బంద్‌లు, ఆదోనిలో మతఘర్షణలు, కడప, పులివెందుల, బాన్సువాడ ఉప ఎన్నికలు, గణేశ్ నిమజ్జనోత్సవం వంటి అనేక సందర్భాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు యావత్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం విశేష కృషి చేసిందని చెప్పారు. ఆర్థిక నేరాలు 0.94 శాతం పెరిగాయి. 2010లో 8222 కేసులు నమోదైతే 2011లో 8299 కేసులు నమోదయ్యాయని వివరించారు.
               డ్రగ్స్ చలామణి కేసులు 2010లో 309 కేసులు నమోదైతే 2011లో 357 కేసులు నమోదు అయ్యాయని, సైబర్ నేరాలు 2010లో 197 కేసులు నమోదైతే, 2011లో 348 నమోదు జరిగిందని వెల్లడించారు. మానవ అక్రమ రవాణా కేసులు ఈ ఏడాది 306 నమోదు చేయగా, ఆ కేసుల్లో 507 మందిని కాపాడి, 250 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తీవ్రవాద నేరాలు మాత్రం 51 శాతం తగ్గుముఖం పట్టాయని అన్నారు. మెరైన్ పోలీసు స్టేషన్లు ప్రస్తుతం 8 పని చేస్తున్నాయని, త్వరలో మరో 15 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఢిల్లీ, ముంబయి తరహాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమీషనరేట్లను విలీనం చేసి గ్రేటర్ కమీషనరేట్‌గా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే త్వరలోనే రెండు కమీషనరేట్లు విలీనం అవుతాయని తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న డాబాలు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలపై దృష్టి సారించి దాడులు చేస్తామని దీని వల్ల మద్యం సరఫరా తగ్గి ప్రమాదాలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. మహిళా నేరాలకు విచారించేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పోలీసు శాఖ వద్ద ఉంది. 2012లో ఆ కోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిజిపి వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి