ఇప్పటికిప్పుడు
అనుకోని ఉపద్రవం వచ్చిపడితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలిచేది
కేవలం ఆ వారం రోజులేనని ఓ అధ్యయన సంస్ధ తేల్చిపారేసింది. ఓ పెద్ద ప్రకృతి
విలయం లేదా మిలిటెంట్ల దాడి (9/11 దాడుల్లాంటివి కావచ్చు) వస్తే గనక
అటువంటి వాటిని తట్టుకుని సుదీర్ఘ కాలం నిలవ గల శక్తి ఇప్పటి ప్రపంచ ఆర్ధిక
వ్యవస్ధకు లేదని ఆ సంస్ధ తేల్చింది. 2010 లో ఐస్ లాండ్ అగ్ని పర్వతం
పేలుడుతో ఎగజిమ్మిన బూడిద మేఘాలుగా ఏర్పడడం, గత సంవత్సరం సంభవించిన జపాన్
భూకంపం తదనంతర సునామీ, ధాయిలాండ్ వరదలు ఇవన్నీ అలాంటి ఉపద్రవాల కోవలోకి
వస్తాయని సదరు సంస్ధ తెలిపింది.
ఐస్ లాండ్
అగ్ని పర్వతం బద్దలయ్యాక పెద్ద ఎత్తున బూడిదను కొన్ని రోజుల పాటు
ఆకాశంలోకి ఎగజిమ్మింది. ఈ బూడిద ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి యూరప్ వైపుకి
ప్రయాణం కట్టడంతో గాల్లో ఎగిరే విమానాలకి మార్గాలు మూసుకుపోయాయి. దాంతో
ఎగరడానికి భయం వేసి యూరప్ అంతా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇది విమానయాన
సంస్ధలు, విమాన ప్రయాణాలతో ముడిపడి ఉన్న వ్యాపారాలను బాగా దెబ్బతీసింది.
విమాన సంస్ధల షేర్లు పడిపోయి నష్టాలు ఎదుర్కొన్నాయి.
ఇక
ఫుకుషిమా అణు ప్రమాదం గురించి చెప్పనవసరం లేదు. ఎన్నడూ లేనంతగా అక్కడి
సముద్రంలో తొమ్మిది పాయింట్ల భూకంపం సంభవించడంతో సముద్రం ఈశాన్య జపాన్ పైన
విరుచుకుపడింది. ఫుకుషిమా అణు కర్మాగారం కట్టేటపుడు సునామి వస్తే పది
మీటర్ల లోపు ఎత్తుకు అలలు ఎగసి పడతాయన్న అంచనాతో పది మీటర్ల అడ్డుగోడని
మాత్రమే కట్టారు. కాని జపాన్ సునామిలో ముప్ఫై మీటర్ల అలలు భూమిపైకి రావడంతో
అణు కర్మాగారం మొత్తం మునిగిపోయింది. భూకంపానికి అప్పటికే అక్కడి విద్యుత్
సరఫరా నిలిచిపోయింది. నీటిలో మునిగిన జనరేటర్లు పనిచేయకపోవడంతో విద్యుత్
పూర్తిగా రద్దయ్యి రియాక్టర్లలో అణు ఇంధనం వేడెక్కి కరిగిపోయి బైటికి
ప్రవహించి గాలిలో, నీటిలో కలిసి పొయి పెద్ద ప్రమాదం సృష్టించింది. ముప్ఫై,
నలభై నుండి వంద కి.మీ వరకూ ఆ ప్రభావం వ్యాపించింది. అటు అమెరికా, ఇటు ఆసియా
వరకు రేడియేషన్ వ్యాపించింది. జపాన్ లో ఉత్పత్తు పడిపోయి వాటిపై ఆధారపడిన
అమెరికా, ఆసియా, యూరప్ ల కంపెనీలు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక
వ్యవస్ధ పైన ఇది ప్రభావం తీవ్ర ప్రభావం చూపింది. అప్పటికే ప్రతి
ద్రవ్యోల్బణంతో పదేళ్ళుగా అల్లాడుతున్న జపాన్ సునామీ దెబ్బకి
విలవిలలాడింది.
ఇటువంటి
దుర్ఘటనలు ఈ స్ధాయిలో జరిగితే కీలకమైన రంగాల్లో వ్యాపారాలు దెబ్బతిని
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకోలేదని లండన్ కి చెందిన ‘ఛాటమ్ హౌస్’
తెలిపింది. ఇది అంతర్జాతీయ వ్యవహారాలలో విధానాల రూపకల్పనా సంస్ధ. “ప్రపంచ
ఆర్ధిక వ్యవస్ధ ఇప్పటికిప్పుడు అటువంటి ఉపద్రవం ఎదుర్కొంటే ఓ వారం రోజుల
వరకు మాత్రమే తట్టుకోగలదు” అని ఛాటం హౌస్ నివేదిక తెలిపింది. అమెరికా,
యూరప్, జపాన్ ల సంక్షోభాల వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ చాలా ఫెళుసుగా
తయారైందని ఈ నివేదిక తెలిపింది. ఆ సంగతిని ఈ నివేదిక వెల్లడి కావడానికి
ముందే అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆకస్మిక ప్రమాదాలకు ఎంతవరకూ
తట్టుకోగలదన్నది వీరు విశ్లేషించి చెప్పిన సత్యం.
ఐస్ లాండ్
అగ్ని పర్వతం బద్దలైన తర్వాత యూరప్ ఎయిర్ లైన్స్ సంస్ధలు ఐదు నుండి పది
బిలియన్ డాలర్ల వరకూ నష్టపోయాయి. కొన్నయితే దివాలా తీసేదాకా వెళ్ళాయి.
ప్రభుత్వాలు, వ్యాపారాలు సరిగ్గా సిద్ధపడకపోతే చాలా కష్టం అని నివేదిక
తెలిపింది. సరఫరా సౌకర్యాలని ఇప్పటికైనా సిద్ధం చేయకపోతే ఇలాంటి ఉపద్రవాలకు
తట్టుకోవడం సాధ్యం కాదని తెలిపింది. కొద్ది రోజుల పాటు రవాణా, ప్రధాన
ఉత్పత్తి కార్యకలాపాల కేంద్రాలకు ఆటంకం కలిగితే అది అహారం, నీరు, విద్యుత్,
కమ్యూనికేషన్ల నెట్ వర్క్స్ నాశనం కావడానికి దారి తీస్తుందని ఆ నివేదిక
తెలిపింది.
కొంచెం
ఎక్కువ కాలం ఆటంకాలు కొనసాగితే కొన్ని వ్యాపారాలు తమ పెట్టుబడుల్ని,
ఉద్యోగాల్ని రద్దు చేసుకుని మూసుకోవడానికి సిద్ధపడతాయని అది దేశాల ఆర్ధిక
వృద్ధిలో శాశ్వత తగ్గుదలకి దారి తీస్తుందనీ నివేదిక వివరించింది.
‘ప్రభుత్వాల అత్యవసర పధకాలు ఆకస్మిక ఉపద్రవాలను పరిగణనలోకి తీసుకోవు. కనుక
అవి అటువంటి ఉపద్రవాలకు సిద్ధపడి ఉండవు’ అని నివేదిక తెలిపింది. “సంక్షోభాల
తర్వాత పాత స్ధితి పునరుద్ధరించబడుతుందని వ్యాపారాల అత్యవసర పధకాలు
భావిస్తాయి. ఇప్పటి సంక్లిష్టమైన ఆర్ధిక, సామాజిక పరిస్ధితులలో ఈ దృక్పధం
పనికి రాదు. ఎందుకంటే యధావిధి పరిస్ధితి పునరుద్ధరించబడే అవకాశాలు తక్కువగా
ఉంటాయి” అని నివేదిక రచయితల బృందం నాయకురాలు బెర్నీస్ తెలిపినట్లుగా
రాయిటర్స్ తెలిపింది.
పరస్పరం
ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్న నేటి ప్రపంచంలో పరిశ్రమలు ముఖ్యంగా అత్యధిక విలువ
కలిగి ఉన్న మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు తమ ‘అత్యవసర ఉపద్రవ ఏర్పాట్లను’
పునర్మూల్యాంకనం చేసుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది. వాతావరణ మార్పు, నీటి
లభ్యత కరువుగా మారడం సమస్యలు పరిస్ధితిని ఇంకా కఠినం చేస్తాయనీ మౌలిక
నిర్మాణాలపైనా, వనరులపైన మరింత ఒత్తిడి పెంచుతాయనీ ఆమె తెలిపింది. జాతీయ
సంక్షోభాలకు దేశాల ప్రభుత్వాలు సరిగ్గా సిద్ధపడి లేవని నిపుణులు చాలా
కాలంగా చెబుతున్నారని రాయిటర్స్ తెలిపింది. 2007 వరదల్లో 3.2 బిలియన్
పౌండ్లు ఇంగ్లండు నష్టపోయింది. ఈ దుర్ఘటనకి ఇంగ్లండు సిద్ధపడి లేదని ఆ దేశం
విమర్శలు ఎదుర్కొంది. వివిధ దుర్ఘటనలకు సిద్ధపడడానికీ, స్పందించడానికి
నివేదిక వివిధ మార్గాలను నివేదిక సూచించింది.
సంక్షోభ
సమయాల్లో సమాచారం త్వరగా ఇచ్చిపుచ్చుకోవడానికి సోషల్ నెటవర్కింగ్ వెబ్
సైట్ల ఉపయోగాన్ని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. లండన్ అల్లర్ల
సమయంలో జరుగుతున్న అల్లర్లను గుర్తించడానికి ముందే హెచ్చరికలు జారీ
చేయడానికీ ట్విటర్ లాంటి వెబ్ సైట్లు గొప్పగా ఉపయోగపడ్డాయని అది తెలిపింది.
అయితే దాదాపు ముప్ఫై ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తిని ప్రతి సంవత్సరం తీసే
ప్రపంచ ఆర్ధిక, పారిశ్రామిక, వ్యవసాయక వ్యవస్ధలు కేవలం ఐదు, పది బిలియన్
డాలర్ల నష్టాన్ని తట్టుకోలేవని చెప్పడం కొంత విచిత్రంగా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి