23, జనవరి 2012, సోమవారం

నాణ్యమైన ఉన్నత విద్య ప్రభుత్వ బాధ్యత


  • మాస్టారి కాలమ్‌
తరతరాలుగా పీడనకు, దోపిడీకి గురైన అట్టడుగు వర్గాల పిల్లలకు యూనివర్శిటీలు యాంత్రికంగా ప్రతి ఏడాది అందజేసే డిగ్రీలూ అందుతున్నా వాటి ద్వారా వారు పొందుతున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. అదే పట్టణ ప్రాంతానికి చెందిన సంపన్న వర్గాల పిల్లలకు అన్ని రకాల మౌలిక వసతి సదుపాయాలు, ఆర్థిక, సామాజిక భద్రత, విద్యావంతమైన కుటుంబ నేపథ్యం, నాణ్యమైన చదువు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టెక్నాలజీ, గ్రంథాలయాలు, పత్రికలు, మేగజైన్లు అందుబాటులో ఉంటున్నాయి.

అరకులోని ఆదివాసీల జీవితాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్న సంకల్పంతో మూడు రోజుల పాటు విశాఖ పర్యటనకు వెళ్లొచ్చాను. వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారం, ములుగు ప్రాంతాలను, ఖమ్మం జిల్లాలోని చర్ల, కూనవరం వంటి గిరిజన ప్రాంతాలను పర్యటించిన నాకు అరకులోయలోని ఆదివాసీల జీవితాలను ప్రత్యక్షంగా చూడాలనే పరిశోధనా దృక్పథంతోనే వెళ్ళాను. కానీ నా వయస్సు అక్కడి చలిని భరించలేకపోయింది. దాంతో హైదరాబాద్‌కు రాగానే జ్వరం వచ్చింది. ఈ లోగా మాఊరి నుంచి తెలిసినవాళ్లు వస్తే మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు మీ తమ్ముడు మీతోనే ఉండేవాడు కదా, ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడని ప్రశ్నించాను. దానికామె జవాబిస్తూ అతను ఎంఏ., బిఇడి చేసి ఒక ప్రైమరీ స్కూళ్లో టీచరుగా ఇక్కడే పనిచేస్తున్నాడని జవాబిచ్చింది. తీరిక వేళల్లో, సెలవుల్లో అన్నం పెట్టిన సెలూన్‌షాపుకు వెళ్ళి అతనికి చేదోడువాదోడుగా ఉంటూ క్షౌర వృత్తి నిర్వహిస్తుంటాడని చెప్పింది. అంతేకాదు, అతని భార్య కూడా బిఎస్సీ. బిఇడి పూర్తి చేసి ఓ ప్రయివేటు స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తోందని తెలిపింది.
ఒకనాడు ఉన్నత కులాలకు సంపన్న వర్గాలకే పరితమైన ఉన్నత విద్య ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఫ్యూడల్‌ వ్యవస్థ పద ఘట్టనల కింద నలుగుతున్న సామాజిక తరగతులవారికి పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా అందుబాటులోకి వచ్చింది. తరతరాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉన్నత విద్య చాలా అవసరం. విద్యను ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా భావించిన ప్రపంచ దేశాలలో ఉన్నత విద్య రోజురోజుకీ విస్తరిస్తున్నది. భారతదేశంలో సగటు మనిషి జీవితానికి భద్రత దొరికేది విద్యవల్లేనన్న అభిప్రాయం బలంగా వేళ్లూనుకుంది. దీనికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వైవిధ్యంగానూ, వైరుధ్యంగానూ ఉన్నాయి. మన దేశంలో పరిస్థితికొస్తే ఒక కోటీ 15 లక్షల 77 వేల 296 మంది ఉన్నత విద్యలో ఉంటే అందులో బాలికలు 39.4 శాతం మాత్రమే ఉన్నారు. ఎస్సీలు 10.7శాతం వుండగా, ఎస్టీలు 3.7 శాతం మాత్రమే. ఉన్నత విద్య పొందుతున్నారు. మళ్లీ ఇందులో స్త్రీ, పురుషుల సంఖ్య 15.25 శాతం మాత్రమే. ఉన్నత విద్యలో ప్రపంచ సగటు 46 శాతం ఉండగా, మహిళల్లో ఇది 39 శాతంగా వున్నది. దీనిని ఒక ముందడుగుగా చెప్పుకోవడానికి పనికివస్తుంది. కానీ మౌలికంగా అవకాశాల దగ్గరికొచ్చే సరికి పూడ్చలేని వ్యత్యాసం కనిపిస్తోంది.ఉన్నత విద్యావ్యాప్తి వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామాల్లో 1.3 శాతంగా నమోదయితే పట్టణ ప్రాంతాల్లో 5.1 శాతంగా నమోదయింది. అందువల్ల గ్రామీణ నేపథ్యానికి చెందిన విద్యార్థులకు, పట్టణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు అవకాశాలలో మాత్రమే కాక నాణ్యమైన విద్య అందుబాటు విషయంలోనూ ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. మౌలిక వసతి సదుపాయాలు లేక, సరైన మార్గదర్శనం లేక వెనకబడుతున్నారు. తరతరాలుగా పీడనకు, దోపిడీకి గురైన అట్టడుగు, సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు యూనివర్శిటీలు యాం త్రికంగా ప్రతి ఏడాది అందజేసే డిగ్రీలూ అందుతున్నా వాటి ద్వారా వారు పొందుతున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చాలా అరుదుగా ఉంటు న్నాయి. అదే పట్టణ ప్రాంతానికి చెందిన సంపన్నవర్గాల యువ తకు అన్ని రకాల మౌలిక వసతి సదుపాయాలు, ఆర్థిక, సామాజిక భద్రత, విద్యావంతమైన కుటుంబ నేపథ్యం, నాణ్యమైన చదువు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టెక్నాలజీ, గ్రంథాలయాలు, పత్రికలు, మేగజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. ప్రయోగశాలలు అన్ని విధాలా మెరుగైన అవకాశాలున్న పట్టణ ప్రాంత యువత అదే యూనివర్శిటీ ద్వారా పొందిన అదే 'డిగ్రీ' తో పొందుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో హస్తిమశకాంతరం కనబడుతోంది. కాబట్టి ఒకనాడు ఫ్యూడల్‌ వ్యవస్థలో సామాజిక వర్గాలు ఏ విధంగా అణచబడ్డాయో, ఏ విధంగా వివక్షకు గురయ్యాయో, అలాగే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పీడిత తాడిత వర్గాలు వివక్షకు గురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల రూపంలో ఇది జరగడం శోచనీయం. అందుకే ఈ గణాంకాలు పెరుగుతున్న అక్షరాస్యత శాతానికి ప్రతీకగా భావించవచ్చు తప్ప అందుతున్న సమాన అవకాశాలకు కాదనేది స్పష్టం. ఈ నేపథ్యంలో సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు మెరిట్‌ పేరుతో ఉన్నత ఉద్యోగాలను, అవకాశాలను పొందుతుంటే పేద తరగతికి చెందిన విద్యార్థులు తక్కువ వేతనంతో చాలీచాలని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే సామాజిక వర్గాలకు కార్పొరేట్‌ విద్యను అందించి వాళ్ల ఎదుగుదలకు బంగారు బాటలు పరుస్తామని చెప్పి 'ఫీజు రీయింబర్స్‌మెంట్‌్‌' పేర కోట్లాది రూపాయలను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అందిస్తోంది. సమస్యను లోతుగా పరిశీలించకుండా పైపై పూతలతో పరిష్కారం చేస్తామనుకుంటే సమయం, డబ్బు వృథా తప్ప ఫలితం ఉండదు. ముందుగా వ్యవస్థలో భిన్న సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలి. బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చాలి. సామాజిక వర్గాల మధ్య ముందు సమానత్వం వచ్చిన తర్వాతనే ప్రతిభ పేరుతో సమాన అవకాశాలు కల్పించాలి. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చామని వాగాడంబరాన్ని ప్రదర్శించకుండా ఆచరణలో చూపాలి.తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఎర వేసినట్లుగా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి.
(రచయిత ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి సభ్యులు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి