30, జనవరి 2012, సోమవారం

గ్రీసు బడ్జెట్ ఇ.యు చేతికివ్వాలి, జర్మనీ దుర్మార్గం




గ్రీసు బడ్జేట్ రూపకల్పనను కూడా యూరోపియన్ యూనియన్ నియంత్రణకి అప్పజెప్పాలన్న దుర్మార్గమైన ప్రతిపాదనను జర్మనీ ముందుకు తెచ్చింది. ఇప్పటికే గ్రీసు దేశ బడ్జెట్ తో పాటు అక్కడి ఆర్ధిక కలాపాలనన్నింటినీ పెద్ద ఎత్తున గుప్పిట్లో పెట్టుకున్న యూరోపియన్ యూనియన్ ఇకనుండి నేరుగా బడ్జెట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇ.యుకి అధికారం ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. పేరుకి జర్మనీ ప్రతిపాదన అయినప్పటికీ, యూరోపియన్ యూనియన్ దేశాల్లోని బహులజాతి ప్రవేటు కంపెనీలే జర్మనీ ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నాయి.
గ్రీసు తన రుణ సంక్షోభ సమస్యలనుండి గట్టెక్కాలంటే తన సౌర్వభౌమత్వాన్ని కొంతమేరకు వదులుకోవాల్సి ఉంటుందని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ గతంలోనే ప్రకటించింది. ఐతే, ఆ ప్రతిపాదన నోటిమాటవరకే ఇప్పటివరకూ ఉండగా, ఇప్పుడది ప్రతిపాదనల రూపంలో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను ఆమోదించడానికి గ్రీసు ప్రభుత్వం తిరస్కరిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇ.యు ఒత్తిడికి లొంగదన్న గ్యారంటీ కనపడడం లేదు.
యూరోపియన్ యూనియన్ దేశాలు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రెండు దురాక్రమణ యుద్ధాలు, దరిమిలా తలెత్తిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా యూరోపియన్ దేశాలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. ఈ అప్పులన్నీ ఆయా దేశాల అవసరాల కోసం కాకుండా దురాక్రమణ యుద్ధాల కోసం, ద్రవ్య, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన బహుళజాతి కంపెనీలను ఆదుకోవడానికి పంచి పెట్టిన బెయిలౌట్లవల్ల పేరుకుపోయినవే. సంక్షోభం నుండి బైటికి రావడానికి ప్రభుత్వాలనుండి బెయిలౌట్లు పొందిన కంపెనీలు తాము సంక్షోభం నుండి బైటికి వచ్చినప్పటికీ సదరు అప్పుల భారాన్ని మోయడానికి నిరాకరిస్తున్నాయి. దానితో అప్పుల భారాన్ని మోయడం ప్రజల వంతయ్యింది.
గ్రీసును రుణ సంక్షోభం నుండి ఆదుకోవాలన్న పేరుతో ఆ దేశానికి యూరోపియన్ యూనియన్ ఇస్తున్న బెయిలౌట్లు గ్రీసు బడ్జేట్ ఖాతాలోకి వెళ్లలేదు. అవన్నీ తిరిగి అప్పు చెల్లింపుల రూపంలో ఇ.యు బహుళజాతి కంపెనీలకు, ప్రవేటు బ్యాంకులకు, ఇన్సూరెన్సు కంపెనీల లాంటి ప్రవేటు ద్రవ్య సంస్ధలకు చేరిపోయాయి. ఫలితంగా గ్రీసు కోసం ఇ.యు మంజూరు చేసి బెయిలౌట్ వల్ల ఆ దేశంలో ఉత్పత్తి కార్యక్రమాలేవీ జరగలేదు. గ్రీసు చేసిన అప్పులతో పాటు ఆ దేశ బడ్జెట్ లోని అధిక కేటాయింపులు సైతం ప్రవేటు కంపెనీలకే వెళ్తుండడంతో గ్రీసు ఆర్ధిక వనరులన్నీ గ్రీసు ప్రజల వినియోగానికి బదులు ఇ.యు అమెరికాల ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వినియోగపడుతున్నాయి.
వాస్తవాలు ఇలా ఉండగా, గ్రీసు కి బెయిలౌట్ ఇస్తున్నప్పటికీ అది సంక్షోభ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనీ, బడ్జెట్ లోటు తగ్గింపుకు చర్యలు తీసుకోవడం లేదనీ జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెత్తందారీ రాజ్యాలు ఆరోపిస్తున్నాయి. తద్వారా గ్రీసును మరింతగా కొల్లగొట్టడానికి తగిన రహదారుల్ని నిర్మించుకుంటున్నాయి. దానిలో భాగంగానే గ్రీసు రుణ సంక్షోభం పరిష్కారానికి ఆ దేశ బడ్జెట్ రూప కల్పన కూడా తమకు అప్పజెప్పాలని ఇ.యు సమావేశాల్లో జర్మనీ ప్రతిపాదిస్తోంది. దుర్మార్గమైన ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గ్రీసు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులపై అమానుషమైన నిర్బంధకాండను గ్రీసు ప్రభుత్వం ప్రయోగిస్తోంది.
అధిక బడ్జెట్ లోటు, ఖర్చులకు అప్పు పుట్టకపోవడం రుణ సంక్షోభం ముదిరిందనడానికి తగిన లక్షణాలుగా చెబుతున్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తదితర ఆదాయ వర్గాలపైన పొదుపు, కోత విధానాలు అమలు చేస్తుండడంతో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం బాగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం పడిపోవడం వల్ల బడ్జెట్ సైజును తగ్గించుకోవాలనీ, తద్వారా తన ప్రజల కోసం గ్రీసు పెడుతున్న ఖర్చులను బాగా తగ్గించుకుని, ఉన్న బడ్జెట్ అంతా వినియోగించి కంపెనీలకు అప్పులు తీరుస్తూ పోవాలని ఇ.యు దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి. గ్రీసు ప్రజలు కడుపులు మాడ్చుకుని, అవసరాలన్నీ  బందు పెట్టుకుని బహుళజాతి ద్రవ్య కంపెనీల ధనదాహాన్ని తీర్చడానికే కంకణబద్ధులు కావాలన్నది ఇ.యు దేశాల కోరిక. ఈ విధంగా ప్రవేటు బహుళజాతి కంపెనీలకు ఉన్న అప్పులన్నీ తీరుస్తూ పోతేనే ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉన్నట్లుగానూ లేదంటె ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోయినట్లుగానూ పత్రికలు పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నాయి.
కార్మికులు, ఉద్యోగులు జీతాలు లేక, సదుపాయాలు రద్దయ్యి, పస్తులుంటున్న పరిస్ధితి వచ్చినప్పటికీ ఈ విష పత్రికలకు సంక్షోభం లాగా కనిపించదు. అసలది వారికి లెక్కేకాదు. కంపెనీలకు లాభాలు రావాలి. మామూలు లాభాలు కూడా కాదు. అధిక లాభాలు రావాలి. అత్యధిక లాభాలు రావాలి. ఈ లాభాలు ప్రతి రోజూ పెరుగుతూ పోవాలి. ప్రతి నెలా, ప్రతి క్వార్టరూ, ప్రతి ఏడూ అలానే పెరుగుతూ పోవాలి. అలా పెరిగితేనే ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సజావుగా ఉన్నట్లు. కంపెనీలకు లాభాలు రాకపోయినా, ఆ లాభాలు పెరగకపోయినా, లాభాలు పెరగడమే కాక లాభ శాతం పెరగకపోయినా, గతం కంటే ఎక్కువగా ఆదాయం పెరగకపోయినా ఆ దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు లెక్క. ఇటువంటి దగుల్బాజీ పెట్టుబడిదారీ సిద్ధాంతాలతో, కేవలం ప్రవేటు కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతూ యావద్దేశ ప్రజానీకం పస్తుల్లో ఉంచడానికి కూడా సిద్ధపడే విధానాలతో ఇ.యు దేశాల ప్రభుత్వాలు తమ దేశాల ప్రజల ఉసురు తీసుకుంటున్నాయి. తమ దగుల్బాజీ విధానాలను ప్రజలు ప్రశ్తించకుండా అనేక సామాజిక వైమనస్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నాయి.
ఇప్పుడు ఏకంగా ఇ.యు సభ్య దేశాల ఆర్ధిక సార్వభౌమత్యాన్ని సైతం కబళించడానికి ఇవి సిద్ధపడుతున్నాయి. జర్మనీ ప్రతిపాదన ప్రకారం గ్రీసు బడ్జెట్ ని పర్యవేక్షించడానికి ‘బడ్జెట్ కమిషనర్’ ని ఇ.యు నియమిస్తుందట. ఈ కమిషనర్ కి దుర్మార్గమైన వీటో అధికారాలను దఖలు పరుస్తారట. అసలు బడ్జేట్ కమిషనర్ నియామకమే దుర్మార్గం కాగా, వాడికి వీటో అధికారాలను దఖలు పరచడం మరింత దుర్మార్గం. ఇ.యు ఆదేశాలకు, అది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రీసు బడ్జెట్ ప్రతిపాదనలు లేనట్లయితే అటువంటి బడ్జెట్ ప్రతిపాదనలను వీటో చేసే అధికారం బడ్జెట్ కమిషనర్ కి ఉంటుందట. అంతేకాకుండా గ్రీసు తన అప్పులను చెల్లించడానికి అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటారట. గ్రీసు దేశం ఇప్పటివరకూ ఇస్తూ వచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలోనూ, తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ విఫలం అయినందున ఈ కమిషనర్ అవసరమని ఇ.యు తరపున జర్మనీ ప్రతిపాదిస్తొందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక తెలిపింది.
జర్మనీ ప్రతిపాదనలో మరిన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రీసులో తిష్ట వేసుకుని ఉన్న ఇ.యు అధికారులకు గ్రీసు అనుసరించే కోశాగార విధానంలోని నిర్ధిష్ట నిర్ణయాధికారాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిపాదనలను చూసానంటున్న రాయిటర్స్ తెలిపింది. పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదట. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా గ్రీసు ప్రభుత్వ ప్రతినిధి పాంటేలిస్ కాప్సిస్ ప్రకటించాడని బిబిసి తెలిపింది. గ్రీసు బడ్జెట్ పూర్తిగా గ్రీసు ప్రభుత్వ చేతిలోనే ఉంటుందని ఆయన బల్లగుద్దాడని ఆ సంస్ధ తెలిపింది. సోమవారం బెల్జియ రాజధాని బ్రసెల్స్ లో ఇ.యు నాయకులు సమావేశం కానున్న నేపధ్యంలో ఈ ప్రతిపాదనలు లీక్ చేశారు. గ్రీసు కోసం ఉద్దేసించిన నూతన కోశాగార ఒప్పందాన్ని (ఫిస్కల్ పేక్ట్) ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. గ్రీసు తో ఇ.యు ఓపిక నశిస్తోందనడానికి ఇంతకంటే రుజువు అనవసరమనై బిబిసి విలేఖరి వ్యాఖ్యానిస్తున్నడు. నిజానికి నశిస్తోంది ఇ.యు ఓపిక కాదు. ఇ.యు దేశాల బందిపోటు విధానాలతో గ్రీసు ప్రజల ఓపిక మాత్రమే నశిస్తోంది. ఒక్క గ్రీసు ప్రజల ఓపిక మాత్రమే కాదు. జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్సు, స్పెయిన్ తదితర దేశాల ప్రజల ఓపిక సైతం నశించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి