ఒక
రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ
ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని
బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా
స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం
కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి
దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా
భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం చెంది పోలీసులకి ఫిర్యాదు
చేయడంతో అమెరికా అధ్యక్షుడి భద్రతాధికారుల నైతిక నీచత్వం ప్రపంచానికి
తెలిసి వచ్చింది.
పొట్ట కూటి కోసం
నిస్సహాయ కొలంబియా మహిళ పడుపు వృత్తిని చేపడితే, ఆమె శరీరాన్ని వాడుకున్న
అమెరికా భద్రతాధికారి సిగ్గూ లజ్జా లేకుండా ఆమె పొట్టపై తన్నడానికి కూడా
సిద్ధపడ్డాడు. డబ్బిచ్చి వస్తువు కొనుక్కోవడం కస్టమర్లు చేసే పని. ఇక్కడ
పరస్పరం నమ్మకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్త్రీ పురుష సంబంధం
వ్యాపారీకరించబడిన పడుపు వృత్తిలోనైనా అదే సూత్రం పని చేస్తుందని మహిళ
నమ్మక తప్పదు. ఆ మహిళ తనకిస్తానని అంగీకరించిన మొత్తాన్ని ఇవ్వకుండా మోసం
చేస్తే తానిచ్చిన సుఖాన్ని తిరిగి తీసుకోలేని సహజ నిస్సహాయతలో ఉంటుంది.
ఆమె నిస్సహాయత ని శారీరకంగా కూడా సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడిన ఒబామా
భద్రతాధికారిది మామూలు భాషకి అందని నీచత్వం. దేశాధ్యక్షుడి భద్రత కోసం
పరాయి దేశానికి వెళ్ళి, భాధ్యతని విస్మరించి మరీ వ్యభిచరించడం నైతిక పతనం
కాగా, కనీసం పతనంలో కూడా నిజాయితీ చూపని వీడి పతన వ్యక్తిత్వం కుళ్లి
దుర్గంధం వెదజల్లుతోంది. వీడి దుర్గంధాన్ని మోస్తున్నందుకు ఈ అక్షరాలెంతగా
దుఃఖిస్తున్నాయో కదా!
24 యేళ్ళ కొలంబియా మహిళ
తో న్యూయార్క్ టైమ్స్ విలేఖరులు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కొలంబియాలో
కొన్ని చోట్ల పడుపు వృత్తి నేరం కాదు. అందుకే సదరు మహిళ పోలీసులకి ఫిర్యాదు
చేయగలిగింది. ఆమె తనను తాను ప్రాస్టిట్యూట్ గా చెప్పడానికి అంగీకరించలేదు.
తనను ‘ఎస్కార్ట్’ గా ఆమె పేర్కొంది. ఒబామా భద్రతాధికారులు తనను డిస్కో
ధెక్ వద్ద కలిశారనీ, ‘చాలా బుద్ధిమంతులుగా’ కనిపించారనీ తెలిపింది. ఉదయం
పూట డబ్బు విషయంలో తగాదా పడ్డామని చెప్పింది. తాము ఒబామాతో ఉన్నట్లు వాళ్ళు
చెప్పలేదనీ తెలిపింది. $30 డాలర్లు మాత్రమే ఇస్తానని చెప్పిన అధికారి
పోలీసుల జోక్యంతో $225 చెల్లించుకున్నాడని తెలిపింది. ఒక ఏజెంటయితే అసలు డబ్బులే ఇవ్వనన్నాడని డెయిలీ మెయిల్ తెలిపింది.
కొద్ది రోజుల తర్వాత తమ
తగాదా వార్త అయిందని ఫ్రెండ్ చెప్పడంతో హతాశురాలినయ్యానని న్యూయార్క్స్
టైమ్స్ తో మాట్లాడిన యువతి తెలిపింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారితో
తాను గొడవపడ్డానని తెలుసుకుని తీవ్రంగా భయపడ్డానని తెలిపింది. “నాకు భయం
వేసింది. అతనిని శిక్షిస్తే ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని భయపడ్డాను. ఇది
నిజంగా చాలా పెద్ద వ్యవహారం. అమెరికా ప్రభుత్వంతో సంభందించినది. ఈ భయంతో
వరుసగా నెర్వస్ ఎటాక్స్ వస్తున్నాయి. రోజంతా ఏడుస్తూనే ఉన్నాను” అని
విలేఖరితో అన్నది.
ఈ స్కాండల్ లో జీవించిన అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులు 12 మందిని అప్పటికప్పుడు వెనక్కి పంపేశారు. 20 మంది కొలంబియా
మహిళలు అమెరికా భద్రతాధికారులకు ఆ రాత్రి సుఖాన్ని అమ్మడానికి
సిద్ధమాయారని ‘న్యూయార్క్ టైమ్స్’ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.
సంఘటనలో దొరికిపోయిన ముగ్గురు సీక్రెట్ సర్వీస్ అధికారులు సంస్ధ నుండి
వెళ్ళిపోయారు. ఒక సూపర్ వైజర్ ని డిస్మిస్ చేయగా, మరొకరు రిటైర్ మెంట్
తీసుకున్నాడు. ఇంకొక జూనియర్ స్ధాయి అధికారి రాజీనామా చేశాడు. ఎనిమిది మంది
సెలవులో వెళ్ళిపోయారు. మొత్తం 12 మంది ఏజెంట్లపై విచారణ జరుగుతోంది.
వారందరూ వేశ్యలతో దొరికిపోయారు. నైట్ క్లబ్ లో తాగి తందనాలాడారు. వారందరి
సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రభుత్వం రద్దు చేసింది.
అమెరికా అధ్యక్షుడి
కోసం భద్రతా సేవలను నిర్వర్తించే అధికారులు సామాన్యులు కారు. ఆ స్ధాయికి
చేరుకోవడానికి అనేక మంది కలలు కంటూ ఉంటారు. అనేక స్ధాయిల్లో వివిధ పరీక్షలు
నిర్వహించి, అనేక సంవత్సరాల సర్వీసు రికార్డులను పరిశీలించి ఒబామా
భద్రతాధికారులను నియమిస్తారు. అధ్యక్షుడి భద్రతాధికారులు ఈ విధమైన
కార్యకలాపాలలో ఉన్నట్లయితే అది చివరికి అధ్యక్షుడి భద్రతకే ప్రమాదాన్ని
తెచ్చిపెడుతుంది. వారిని ఆకర్షించే మహిళ స్వయంగా మరొక దేశానికి పని చేసే
రహస్య గూఢచారి కావచ్చు. ఒబామా భద్రతా వ్యవస్ధలోకి చొచ్చుకు వెళ్లడానికి
ప్రయత్నిస్తున్న హంతక ముఠా సభ్యురాలు కావచ్చు. లేదా తనకి తెలియకుండానే
భద్రతాధికారుల వద్ద నుండి సమాచారాన్ని బయటకు పంపే ‘బగ్’ ని మోస్తున్న అమాయక
ఎర కావచ్చు. ఇవేమీ పట్టించుకోకుండా తమది కానీ చోట ఒక రాత్రి సుఖాన్ని
‘కొనుక్కోవడానికి’ ప్రయత్నించడం అధో స్ధాయి భ్రష్టత్వం.
అధ్యక్షుడి భద్రతని
చూసే వ్యక్తులు కేవలం శారీరక దృఢత్వాన్ని ప్రదర్శించే మల్లయోధులు మాత్రమే
కాదు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు కాపలా ఉండడం దేశభక్తి ప్రదర్శనలో ఒకానొక
సమున్నత స్ధాయి. ప్రమాదం ముంచుకు వచ్చిన చోట తన ప్రాణాన్ని అవలీలగా అడ్డు
పెట్టగల ‘వ్యక్తిగత ఔన్నత్యాన్ని’ వారు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ
ప్రదర్శనలో దేశ ప్రజల ప్రయోజనాలు దాగి ఉంటాయి. దేశ పరువు ప్రతిష్టలు ఇమిడి
ఉంటాయి. వారి సమున్నత వ్యక్తిత్వం దేశాధ్యక్షుడి వ్యక్తిత్వానికి మరింత
శోభని తేవాలి. కొంగొత్త సొబగులు అద్దాలి. వారిని చూసి దేశం గర్వ పడాలి.
వారి దేశ భక్తి ప్రదర్శన చూసి ప్రతి పౌరుడూ గర్వంతో పులకరించాలి.
కేవలం కండలు తిరిగిన
బలశాలురు మాత్రమే నిర్వర్తించగల బాధ్యత కాదది. రోజువారీ జీవనంలోని ప్రతి
అంశలోనూ అత్యంత ధీశాలురు మాత్రమే నిర్వర్తించే బాధ్యత అది. సున్నితత్వంతో
పాటు ధీరత్వం, తెగింపుతో పాటు దయార్ద్రశీలత, సంయమనంతో పాటు దూకుడు,
నెమ్మదితనంతో పాటు వేగం… ఈ లక్షణాలన్నీ జమిలిగా కలిసి ఉన్నవారే దేశాధిపతుల
భద్రతాధికారులు. వారు వాసన కుక్కను నడిపే ‘డాగ్ హాండ్లర్’ కావచ్చు. కేవలం
సమాచారం సేకరించే ఎనలిస్టు కావచ్చు. జవాను కావచ్చు, కమాండర్ కావచ్చు.
అధ్యక్షుడి పక్కనే నిలిచే అంగరక్షకుడు కావచ్చు. వీరందరి పని ఒకటే.
అధ్యక్షుడి భద్రత. అలాంటి బృందంలోని సభ్యులు ఏకంగా డజను మంది భాధ్యతను
విస్మరించి రాత్రి సుఖానికి కక్కుర్తి పడ్డారంటే ఏ స్ధాయి పతనం అది?
సంవత్సరాల సర్వీసులని
పరిశీలించి, అనేకానేక కోణాల్లోని వ్యక్తిత్వాలను పరిశీలించి వడపోసి ఎన్నిక
చేసిన భద్రతాధికారుల్లో పన్నెండు మంది శారీరక సుఖానికి కక్కుర్తి పడ్డారంటే
వడపోతలో తొలగించబడిన వందలాది మంది భద్రతాధికారుల నైతిక స్ధాయి ఏపాటిదో
ఊహించవలసిందే. ఇది ఒక ఐసోలేటేడ్ కేసు కాదు. డజను మంది ఒకేసారి అనర్హులుగా
వెనక్కి వెళ్లిపోవడం ‘ఐసోలేటేడ్’ కాదు. వారి వెనుక వారి అనుభవం ఉంది. వివిధ
స్ధాయిల్లో వారు కనబరిచిన ‘పనితనం’ ఉంది. వారి అనుభవాన్ని పరిశీలించిన
ఉన్నతాధికారుల నిర్ధారణలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ వారి నైతిక స్ధాయి
ఒక్కసారైనా వ్యక్తం కాలేదంటే నమ్మలేము. కాకుంటే అదేమంత పెద్ద విషయం కాదని
భావించే, ఉన్నత స్ధాయికి ప్రమోట్ చేయబడ్డ వాస్తవాన్ని ఇక్కడ గుర్తించాలి.
“ఇంతకు ముందు ఒక్కసారయినా జరగకుండా ఇలాంటివి ఇప్పుడు జరగవు” అన్న
కాలిఫోర్నియా రిప్రెజెంటేటివ్ డారెల్ ఇస్సా మాటల అంతరార్ధాన్ని
గుర్తించాలి.
అవును, అదేమంత పెద్ద
విషయం కాదు. ప్రభావశీలుడయిన రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూకి వెళ్ళిన అందమైన
యువతిని మోహించి కన్నుగీటినా అదేమంత విషయం కాదు. అది సౌందర్య ప్రియత్వం.
ప్రపంచ దేశాలకి అప్పులిచ్చి ఆడుకునే అత్యున్నత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్
డైరెక్టర్ పదవిలో ఉండి తన సబార్డినేట్ ఉద్యోగితో అక్రమ సంబంధానికి
సిద్ధపడినా అదేమంత విషయం కాదు. అది పాలనా సామర్ధ్యం. తానున్న హోటల్ గదిని
శుభ్రం చేయడానికి వచ్చిన మహిళతో బలవంతపు శృంగారానికి సిద్ధపడినా అదేమంత
పెద్ద విషయం కాదు. అది పురుషత్వం. కడుపు కక్కుర్తి కోసం ఒళ్ళు
అమ్ముకోవడానికి సిద్ధపడిన స్త్రీలతో అసహ్యకరంగా సామూహిక శృంగారానికి దిగినా
అదేమంత పెద్ద విషయం కాదు. అది శారీరక దృఢత్వం. మహా అయితే, జస్ట్, ఓ ఐదు
నిమిషాల్లో కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించాడు, అంతే కదా! అంతమాత్రానికే,
ఐదు నిమిషాల కక్కుర్తిని వ్యవస్ధ నడవడితో ముడి పెట్టాలా?
ఐదు నిమిషాల
కక్కుర్తిలోనే ఆ వ్యక్తి విలువలు లేవా? ఐదు నిమిషాల కక్కుర్తిలోనే
దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం లేదా? దశాబ్దాలు నడిచి వచ్చిన జీవన గమనం
చుట్టూ వేలాది అభిమానుల ప్రోత్సాహం లేదా? వేలాది అభిమానులతో నిండి ఉన్న
రాజకీయ వ్యవస్ధ లేదా? రాజకీయ వ్యవస్ధ శాసిస్తున్న సామాజికార్ధిక వ్యవస్ధ
లేదా? సామాజికార్ధిక వ్యవస్ధలో సమిధలుగా నలుగుతున్న కోట్లాది సామాన్యుల
జీవన వ్యధలు లేవా? ఆ విలువలకీ, జీవన గమనానికీ, అభిమానుల నైతిక నిశ్చయానికీ,
సామాన్యుల వ్యధలని లిఖిస్తున్న వ్యవస్ధకీ స్ట్రాస్ కాన్ ప్రతినిధి.
స్ట్రాస్ కాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్ధలో ఒబామా భద్రతాధికారి ఒక
జూనియర్ పార్టనర్. వారిద్దరూ వ్యవస్ధ పతనాన్ని తరతమస్ధాయిల్లో
ప్రతిబింబిస్తున్నవారే.