31, జులై 2013, బుధవారం

కృష్ణా ప్రాజెక్టులు ప్రశ్నార్థకం


Updated: July 31, 2013 06:00 (IST)
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఖాయమైన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపు కీలకంగా మారనుంది. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులకు అంత సమస్య లేకున్నా.. కృష్ణా బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం అంత సులువైన విషయం కాదు. గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. అయితే కృష్ణా నది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నది నీటిపై ఆధార పడ్డ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, నీటి లభ్యత తక్కువగా ఉండడం, ఎగువ రాష్ర్టంలో భారీ ప్రాజెక్టులు ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. దీంతో మిగులు, వరద జలాలపై ఆధారపడి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

 
ఇందులో కొన్ని తెలంగాణ ప్రాజెక్టులు ఉండగా, మరికొన్ని ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించేవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు అధికారిక (ట్రిబ్యునల్ అవార్డు) నీటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర విభజన ప్రక్రియలో వీటి భవిష్యత్తుపై చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టుల అవసరాలు తీరాలంటే 227 టీఎంసీల నీరు అవసరం ఉంది. అయితే కృష్ణాలో మనకు కేటాయించిన 811 టీఎంసీల నీరు గతంలో ఉన్న ప్రాజెక్టులకే సరిపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు వరద లేదా మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవి కావడంతో నీటి పంపకం విషయం కొంత సున్నితంగా ఉండనుంది.

 రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు...
 తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 59 టీఎంసీల నీరు అవసరం. అయితే ఇందులో 29 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల నుంచి మరో 30 టీఎంసీలను పెన్నా నది మిగులు జలాల నుంచి ఉపయోగించాలని నిర్ణయించారు. అయితే ఈ తాజా పరిణామంతో పెన్నా నుంచి నీటిని తీసుకోవడం ఇబ్బంది లేకపోయినా...కృష్ణా నుంచి నీటి వాడకానికి మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితీ అంతే. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.38 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది.

 ఇందుకు అవసరం అయ్యే 43.50 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల నుంచే ఉపయోగించుకోవాల్సి ఉంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 6.11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. దీనికి అవసరం అయ్యే 40 టీఎంసీల నీటిని కృష్ణా వరద నీటి నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. ఇందుకోసం 38 టీఎంసీలను కృష్ణా వరద నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంది.

 తెలంగాణలోని ప్రాజెక్టులు...
 ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండలోని 3.70 లక్షల ఎకరాల పంటలకు సాగునీటిని అందించాలి. ఇందుకు అవసరం అయిన 30 టీఎంసీలను కృష్ణా వరద నీటి నుంచి ఉపయోగించుకోవాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని 3.40 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. ఇందుకు అవసరం అయిన 25 టీఎంసీలకు కృష్ణా నది వరద నీరే శరణ్యం. ఇదే జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా కృష్ణా వరద నీటిపై ఆధారపడ్డదే. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 20 టీఎంసీల నీరు అవసరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి