భౌగోళికమైన విభజన ఒక జాతి మానసిక ఐక్యతకు తాత్వికతను నిర్మించడం దేశ
చరిత్ర లో గొప్ప వైచిత్రి. ఆ ఘనత బెంగాల్ విభజనదే. భారత్ అనేది ఒక
ప్రాదేశిక నామమే తప్ప, ఐక్యజాతికి ప్రతీక కాదంటూ విన్‌స్టన్ చర్చిల్ వంటి
వారు చేసిన వ్యాఖ్యను పూర్వపక్షం చేసిన ఘటన కూడా అదే. 1905లో జరిగిన
బెంగాల్ విభజన దేశ భౌగోళిక స్వరూపంలోని బలహీనతను గుర్తించేటట్టు చేస్తే,
1911 నాటి బెంగాల్ విభజన రద్దు ఆ బలహీనతలను అధిగమించడానికి దేశీయులను
ముందడుగు వేయించింది. ఈ చారిత్రక ప్రస్థానంలో రెండు మజిలీలు ఆంధ్ర రాష్ట్ర
అవతరణ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం.1913లో బాపట్లలో ఆంధ్రమహాసభ తొలి సమావేశం
తరువాత ‘ఆంధ్రపత్రిక’ రాసిన ‘ఆంధ్రోద్యమం’ అనే వ్యాసంలో ‘వంగ రాష్ట్ర విభజన
జరిగిన పిమ్మట ప్రత్యేక రాష్ట్రము కావలయునను ఆందోళన ఆంధ్రులయందు
ప్రారంభమయ్యెను. 1911వ సంవత్సరమున లార్డు హార్డింజు ప్రభుత్వం వారు
రాష్ట్రముల నిర్మాణం విషయమై ఇండియా మంత్రికి పంపిన నివేదిక భాషాప్రయుక్త
రాష్ట్ర విభజన సిద్ధాంతమునకు బలము కలుగజేసినది.
1913 సంవత్సరమున ఆంధ్రులు బాపట్ల నగరమున సమావేశమై రాష్ట్రము కావలయునను
కోరిక స్పష్టపరిచిరి’ అని పేర్కొన్నారు. ఇలాంటి భావనకు పదును పెట్టిన ఘటనలు
తరువాత చాలా చోటు చేసుకున్నాయి. 1911లో విభజన రద్దు కావడమే కాకుండా
బెంగాల్ నుంచి అస్సాం, బీహార్, ఒరిస్సా వేరయ్యాయి. 1911, ఏప్రిల్‌లోనే
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందు’, ‘ఆంధ్రుల ప్రస్తుత పరిస్థితి’ అనే
వ్యాసంలో కటువైన వ్యాఖ్యలు చేసింది. ‘తెలుగువారు వెనుబడిన తెగవారు. వాళ్లకి
బుర్రలేదు. భాష్యం అయ్యం గార్, ముత్తుస్వామి అయ్యర్ వంటివారు వాళ్లలో
ఎప్పు డూ లేరు’ అని. ఇది మనస్తాపంతో పాటు, ఆలోచనను కూడా
కలగజేసిందనిపిస్తుంది. అప్పటికే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి
సంఘీభావంగా ఆంధ్రులు కౌతా శ్రీరామశాస్త్రి, ముట్నూరి కృష్ణారావు, దంటు
సుబ్బావధాని, మునగాల రాజా, బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, యర్రమిల్లి
జగ్గన్నశాస్త్రి, గోటేటి వెంకటరావు వెళ్లివచ్చారు. బిపిన్‌చంద్రపాల్
బెంగాల్ విభజనలో గవర్నర్ జనరల్ కర్జన్ వ్యూహం గురించి దక్షిణాదిన వరసగా
రాజమండ్రి, మచిలీపట్నం, చెన్నపట్నాలలో ప్రసంగించారు. ఈ సభల నిర్వహణలో
గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ముట్నూరి కృష్ణారావు ప్రముఖ పాత్ర వహించారు.
అక్కడ మొదలైన ఆంధ్రత్వ భావన, ఎన్నో మలుపులు తిరిగి 1956, నవంబర్ 1 నాటికి
ఆంధ్రప్రదేశ్‌గా రూపుదాల్చింది.
తెలుగు మాట్లాడే పదకొండు జిల్లాలు తమిళ ప్రాంతంతో కలిసి మద్రాసు
ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఈ అందరినీ కలిపి మద్రాసీలు అనేవారు. ఇప్పటి
తెలంగాణ నిజాం పరిపాలన లో ఉండేది. తెలుగు ప్రాంతాలైన తొమ్మిది జిల్లాలతో పా
టు, కర్ణాటకలోని గుల్బర్గా విభాగంలోని నాలుగు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్
విభాగంలోని మరో నాలుగు జిల్లాలు కలిపి మొత్తం నిజాం సంస్థానంగా చరిత్ర
ప్రసిద్ధం. మన దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఉన్న పరిస్థితి ఇది. ఆగస్టు
15, 1947 నాటికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రామస్వామి రెడ్డియార్
ముఖ్యమంత్రి. ఒక సంవత్సరం తరువాతే ప్రత్యక్ష చర్య (ఆపరేషన్ పోలో) ద్వారా
నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైంది. హైదరాబాద్ సంస్థానంతో సహా దేశంలోని
568 స్వదేశీ సంస్థానాలను భారత గణతంత్ర రాజ్యంలో విలీ నం చేయడం మరో పెద్ద
అడుగు. చివరి నిజాం ‘రాజ ప్రముఖ్’గా మారిన తరువాత 1949 వరకు మేజర్ జనరల్
జెఎన్ చౌదరి హైదరాబాద్ మిల టరీ గవర్నర్‌గా పని చేశారు. ఎంకె వెల్లోడిని
ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించింది. 1949 నాటికి మద్రాసు
రాష్ట్రానికి పూసపాటి సంజీవ కుమారస్వామి రాజా ముఖ్యమంత్రి అయ్యారు. 1952
నాటి తొలి సాధారణ ఎన్నికల వరకు వారే ఆ పదవులలో ఉన్నారు.
1947లో భారత్‌కు స్వాతంత్య్రం ఒక్కటే రాలేదు. వందల సంవత్సరాల విదేశ
పాలనలలోని దుష్ఫలితాలు కూడా వారసత్వంగా వచ్చాయి. ప్రాంతాల మధ్య, కులాల
మధ్య, మతాల మధ్య అగాధాలు ఏర్పడి ఉన్నాయి. గాం ధీజీ నాయకత్వంలో అహింసాయుత
ఉద్యమం జరిగినా, దేశ విభజన మత ప్రాతిపదికన జరిగి ప్రపంచ చరిత్రలోనే అత్యంత
విషాద ఘట్టంగా, రక్తపంకిల ఘట్టంగా మిగి లింది. అప్పుడే పాకిస్థాన్‌తో
యుద్ధం జరిగింది. ఇలాంటి ఒక సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో భాష అనే
అంతస్సూత్రంతో ప్రజల మధ్య బంధాన్ని నిర్మించవచ్చునని నాటి నాయకులు భావిం
చారు. అలాగే దేశాన్ని సంస్థానాలనో, జమిందారీలనో పిలుచుకుంటూ పురాతన
కాలంలోనే ఉన్నామన్న భావ న నుంచి బయటపడటానికీ, ప్రజాస్వామికంగా
పిలుచుకోవడానికీ వీలుగా ప్రాంతాల మధ్య హద్దులు నిర్ణయించుకోవాలని కూడా
అనుకున్నా రు. ఈ అభిప్రాయం మేరకు ఏర్పాటైనదే ఎస్‌కె దార్ కమిషన్. అప్పుడే
జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
సమర్ధించాయి.
కానీ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి జైపూర్ కాంగ్రెస్
తీసుకున్న నిర్ణయాల అమలులో నెహ్రూ ప్రభుత్వం జాప్యం చేసింది. దీనితో
ఆంధ్రలో అసంతృప్తి మొదలయింది. మొదట గుంటూరు జిల్లా కావూరులోని
వినయాశ్రమానికి చెందిన ‘స్వామీ సీతారాం’ (గొల్లపూడి సీతారామ శాస్త్రి)
దీక్ష చేపట్టారు. తరువాత అక్టోబర్ 19, 1952న పొట్టి శ్రీరాములు ఆంధ్ర
రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. 58 రోజుల తరువాత డిసెంబర్ 15న ఆయన
మరణించారు. మరునాడే పండిట్ నెహ్రూ ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు
చేస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్ర, రాయలసీమలలోని పదకొండు జిల్లాలను కలిపి
కర్నూలు రాజధానిగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
కర్నూలును
రాజధానిగా చేయడానికి ఉన్న కారణాలు కూడా గమనించవలసినవే. మద్రాసును
తాత్కాలిక రాజధానిగా చేయాలన్న జేవీపీ సిఫార్సు బయటకు పొక్కింది. ఈ
ప్రతిపాదనకు తమిళులు అంగీకరించలేదు. దీనితో కర్నూలును ఎంచుకోవలసివచ్చింది.
నిజానికి మద్రాసులో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. అయినా ఆ నగరం
ఆంధ్రరాష్ట్రానికి దక్కలేదు. జేవీపీ సిఫారసు కూడా కొంతవరకు ఇందుకు కారణం.
ఆంధ్రులు మద్రాసు గురించి పట్టుపట్టడం సరికాదని ఆ నివేదిక పేర్కొన్నది.
1917 నాటి నెల్లూరు ఆంధ్ర మహాసభ సమావేశం నుంచి మద్రాసు నగరం ఆంధ్రకు
చెందాలని ఆంధ్రులు వాదిస్తున్నారు. మద్రాసు తెలుగువారి రాజధాని కావాలని ఆ
సభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఒంగోలు వెంకటరంగయ్య పంతులు వాదించారు. అయితే
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకునే వరకు ఈ
కష్టాలు తీరలేదు.
1952 ఎన్నికలతో హైదరాబాద్ రాష్ట్రానికి డాక్టర్ బూర్గుల రాంకిషన్‌రావు,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సి. రాజగోపాలాచారి ముఖ్యమంత్రులయ్యారు.
తెలంగాణలో రైతాంగ పోరాటం ముగిసిన తరువాత విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకుంది.
విశాలాంధ్ర ఏర్పాటు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా, అప్పటి పెద్దలు
విశాలాంధ్రకు మొగ్గు చూపడం చారిత్రక వాస్తవం. హైదరాబాద్ రాష్ట్ర
కాంగ్రెస్‌లో కీలక నాయకుడు స్వామి రామానంద తీర్థ విశాలాంధ్రకు గొప్ప
మద్దతుదారుడు. ఆనాడు విశాలాంధ్ర కోరికకు బలం చేకూర్చిన రాజకీయ,
సాహితీవేత్తలు అంతా రామానంద శిష్యులు కావడం గమనార్హం. వట్టికోట
ఆళ్వారుస్వామి, దాశరథి, కాళోజీ నారాయణరావు వంటివారంతా విశాలాంధ్రను
మనస్ఫూర్తిగా సమర్థించారు. తెలుగువారందరికీ ఒక రాష్ట్రం కావాలన్నదే వారి
ఆశయం. కాంగ్రెస్ వాదులు కోదాటి నారాయణరావు, పీవీ నరసింహారావు వంటివారు కూడా
విశాలాంధ్రను సమర్థించారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల తెలంగాణ
ప్రజల అభిమతాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. విలీనం ఎక్కువమంది అభిమతం
కాదని ఆయన బాహాటంగానే ప్రకటించారు. నిజానికి 1969కి కూడా పీవీ తన
అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అప్పుడే గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో
‘ఆంధ్రప్రదేశ్ విచ్ఛిత్తి’ మంచిది కాదనే ఆయన ఉపన్యసించారు. విశాలాంధ్రకు
ఊతమిచ్చిన మరో బలమైన శక్తి కమ్యూనిస్టులు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటూ
పుచ్చలపల్లి సుందరయ్య వంటివారు పిలుపునిచ్చారు.
దీనితో భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్ణయం మేరకు తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర
రాష్ట్రాన్ని కలిపి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఒక రాష్ట్రం చేశారు. ఇంత
ప్రయాణం తరువాత 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ యాత్ర
నల్లేరుపై నడకలా సాగలేదన్నది వాస్తవం. తరాలు మారతాయి, కాలం మారుతుంది.
అనుకోని పరిస్థితులు తలెత్తుతాయి. ఇది విస్మరించలేని వాస్తవం. అందుకు
తగ్గట్టు భౌగోళిక పరిస్థితులలో చిరు మార్పులు తప్పవు. ఆంధ్రప్రదేశ్‌లో
నిన్నటి వరకు జరిగిన పరిణామాలు దాని ఫలితమే!
భాషా ప్రాతిపదికకు మోకాలడ్డు
కాంగ్రెస్ పార్టీ 1920 నాటికే భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు
కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. 1927లో మరోమారు పార్టీ ఈ మేరకు విధాన
ప్రకటన చేసింది. పార్టీ ప్రాదేశిక కమిటీలను ఈ ప్రాతిపదికపై 1920 ఆదిగా
ఏర్పాటు చేస్తూ వచ్చింది. 1945-46 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు
భాషాప్రయుక్త రాష్ట్రా లను వాగ్దానం చేసింది. కానీ స్వాతంత్య్రానంతరం కేవ
లం భాష ఒక్కటే ప్రాతిపదిక చేస్తే జాతీయ సమైక్యతకు భంగం కలుగుతుందనే భావన
బలపడి రాజ్యాంగ పరి షత్ అధ్యక్షుని హోదాలో బాబూ రాజేంద్రప్రసాద్ 1948,
జూన్‌లో ఈ అంశంపై ఎస్‌కె దార్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. అదే ఏడాది
డిసెంబర్‌లో సమర్పించిన నివేదికలో కమిటీ భాషాప్రయుక్త రాష్ట్రా లు
ఏర్పరిస్తే జాతి ప్రయోజనాలకు ముప్పు వాటిల్లు తుందని తేల్చింది. ఆంధ్ర
ప్రాంతం ఈ నివేదికను తీవ్రంగా వ్యతిరేకించింది. దార్ కమిషన్ సిఫార్సులను
అధ్యయనం చేసేందుకు నియమించిన ‘జేవీపీ కమిటీ’ 1949లో సమర్పించిన నివేదికలో
కొత్త రాష్ట్రాల ఏర్పా టును వాయిదా వేయడమే మంచిదని తీర్మానిం చింది. కానీ
అంబేద్కర్ 1948 అక్టోబర్‌లో సమర్పించిన మెమొ రాండంలో దార్ కమిషన్ సిఫార్సుల
మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించారు.
భాషా ప్రాతిపదికదే పైచేయి
నెహ్రూ ప్రభుత్వం రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని తలపెట్టి 1953 డిసెంబర్‌లో
ఫజలలీ నేతృత్వంలో ఓ కమిషన్ (ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసింది. 1955
సెప్టెంబర్‌లో ఈ కమిషన్ సమర్పించిన నివేదికలో 16 రాష్ట్రాలను, 3
కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పరచాలని సిఫార్సు చేసిం ది. ఈ నివేదికను నాటి
ప్రభుత్వం 1955 డిసెంబర్ 14న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కమిషన్
సిఫార్సులను అమలు చేసేందుకు ప్రభుత్వం 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణ
చట్టానికి రూపకల్పన చేసింది. విశాలాం ధ్ర ఏర్పాటుతో ఉభయ ప్రాంతాల ప్రజలకు
కలిగే ప్రయోజనాలను గుర్తించినప్పటికీ, తెలంగాణ ప్రాంతా న్ని ప్రత్యేక
రాష్ట్రంగా కొనసాగనివ్వాలని, 1961 ఎన్ని కల అనంతరం మాత్రమే ప్రజాభీష్టం
సానుకూలంగా ఉంటే అప్పుడు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని
సిఫార్సు చేసింది. కమ్యూనిస్టు పార్టీ ఎమ్మ ల్యేలు ఈ సిఫార్సులను తీవ్రంగా
వ్యతిరేకిస్తూ హైదరా బాద్ రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామాలు చేస్తామని ప్రక
టించారు. విశేషమేమిటంటే హైదరాబాద్ అసెంబ్లీ శాస నసభ్యులలో కూడా అత్యధికులు
విశాలాంధ్రకే మద్దతు పలికారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉభయ
ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిర్చి విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం
సుగమం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి