ఆర్థికమే నిర్ణయాత్మకం (దీపశిఖ) - రాజ్‌దీప్ సర్దేశాయ్
July 26, 2013
ఏకాదశి శుభాకాంక్షలు తెలుపడం లౌకిక సంప్రదాయమా? లేక మత ప్రేరిత విషయమా? గత వారంలో వచ్చిన ఏకాదశిని మహారాష్ట్రలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువు అవతారమైన విఠోభాతో ముడివడివున్న రోజు అది. ఆ పర్వదినం ఉదయమే ట్విట్టర్‌లో నేను ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు తెలిపాను. ఇంటర్నెట్ హిందువులు నన్నిలా ప్రశ్నించారు: 'మీలాంటి మిథ్యా-లౌకిక ఉదారవాది ఒక హిందూ దేవుడి గురించి ఎలా ఆలోచిస్తారు?' ప్రముఖ కాంగ్రెస్‌వాది కీర్తిశేషుడు వి ఎన్ గాడ్గిల్ ఎదుర్కొన్న పరిస్థితే నాకూ ఎదురయింది. గాడ్గిల్ మహాశయుడు ఒకసారి కొబ్బరికాయను కొట్టి ఒక బహిరంగ సభను ప్రారంభించారు. ఇలా చేయడమంటే మీ లౌకిక విశ్వాసాలకు ద్రోహం చేయడమేనని పలువురు ఆయన్ని తప్పుపట్టారు. మృదు స్వభావి, మేధావి అయిన గాడ్గిల్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా ఒక కరపత్రం రాశారు. లౌకిక వాదంపై చర్చకు కూడా ఆయన పిలుపునిచ్చారు.
గాడ్గిల్ ఉదంతం 1990 దశకంలో జరిగింది. హిందూత్వ శక్తులు తమ రాజకీయ జైత్రయాత్రను ప్రారంభించిన రోజులవి. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లౌకికవాదంపై మళ్ళీ చర్చను ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే మత భావం, మతతత్వం మధ్య అదే అయోమయం ఇప్పటికీ కొనసాగుతోంది. నిష్ఠగా మతాచారాలను ఆచరించే వ్యక్తిని మతవాదిగా భావించవల్సిన అవసరమేమీ లేదు. మతపరమైన పండుగను చేసుకోవడం, శుభకార్యాలలో కొబ్బరి కాయ కొట్టడం, రామాలయాన్ని నిర్మించడానికి పూనుకోవడం సైతం 'మతతత్వ' చర్యలు కావు. అయితే చట్టాన్ని ఉల్లంఘించి మసీదును ధ్వంసం చేసి దాని స్థానంలో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించడం, తత్పర్యవసానంగా చెలరేగిన హింసాకాండ ఖచ్చితంగా మతతత్వ చర్యలే. ముస్లిమేతరులను బెదిరించడం ద్వారా తనను తాను ముస్లిం సమాజానికి నాయకుడినని చాటుకోవడానికి ఒక అక్బరుద్దీన్ ప్రయత్నించడం చాలా ప్రమాదకరమైన మతతత్వాన్ని రెచ్చగొట్టడమే అవుతుంది. శివసేన వ్యవస్థాపకుడు స్వర్గీయ బాల్ ఠాక్రే ఒకసారి ముస్లింలను 'సరిగ్గా ప్రవర్తించండి' లేదా పాకిస్థాన్‌కు వెళ్ళిపొండని హెచ్చరించారు. ఇది చాలా ఆవేశకరమైన, హింసాత్మక మతోన్మాదం ప్రజ్వరిల్లడానికి మాత్రమే తోడ్పడేదని చెప్పక తప్పదు.
సరే, ఈ గతకాలపు విషయాల నుంచి నరేంద్ర మోదీ, 'బురఖా' చర్చకు వస్తాను. లౌకికవాదం అనే 'బురఖా' మాటున కాంగ్రెస్ పార్టీ దాక్కొంటుందని సూచించడం ద్వారా మోదీ మతతత్వ ప్రకటన చేశారా? మోదీ సక్రమంగా ఆలోచించకుండా, రాజకీయంగా సక్రమమైనది కాని పోలిక తెచ్చారని, ఆయన వ్యాఖ్యను 'మతతత్వ' ప్రకటన అనడమంటే అది కొంచెం అతిశయోక్తి అవుతుందని నేను భావిస్తున్నాను. అవును, మోదీ గతంలో చేసిన అనేక వ్యాఖ్యలలో మత సూచిత అంశాలున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ఉపయోగించే రాజకీయ పరిభాషలో అటువంటి వ్యాఖ్యలు ఒక ప్రధాన భాగంగా ఉంటూ వస్తున్నాయి (గతంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న జేమ్స్ మైఖేల్ లింగ్డో, మియాన్ ముషార్రఫ్, మియాన్ అహ్మద్ పటేల్ ల గురించి మోదీ చేసిన ప్రస్తావనలను గుర్తు చేసుకోండి). ఆయన ఈ ధోరణి ఏమి సూచిస్తున్నది? ఒక వర్గం ప్రజల్లో మరో వర్గం వారిపట్ల ఉన్న పూర్వాభిప్రాయాలను ఉద్దేశపూర్వకంగా రెచ్చ గొట్టడమేననేది స్పష్టం. దేశ నాయకత్వానికి ఆరాటపడుతున్న మోదీకి ఇది సముచితం కాదు. ఆయన నాయకత్వంపై విశ్వసనీయతను పెంచదు. అయితే మోదీ చేసే అటువంటి ప్రకటనలను మతతత్వమైనవిగా పరిగణించడమంటే మోదీ పట్ల భీతినే వెల్లడిస్తుంది.
మోదీ ప్రకటనలకు అమిత ప్రాధాన్యమివ్వడానికి బదులు అసలు చర్చను రెండు విధాలుగా జరపాలి. మొదటిది-మోదీ సూచించినట్టు కాంగ్రెస్ పార్టీ, లౌకిక వాదం అనే ముసుగులో నిజంగా దాక్కుంటుందా? రెండోది- ఈ చర్చ వర్తమాన భారతదేశానికి ఉపయుక్తమైనదేనా? మొదటిప్రశ్నకు సమాధానమేమిటంటే జవహర్‌లాల్ నెహ్రూ 'లౌకిక' ఛాందస వాదం నుంచి కాంగ్రెస్ చాలా దూరం పయనించినదనడంలో కించిత్ సందేహం కూడా లేదు. పండిట్ నెహ్రూ లౌకిక వాదంలో పరిపూర్ణ విశ్వాసి. ఆయన వ్యక్తిగత నమ్మకాలన్నీ లౌకికవాద ఉత్తేజితాలు. ప్రజా జీవితంలో ఎటువంటి మత పరమైన ఆచరణలైనా లౌకిక వాదాన్ని పూర్తిగా నిరాకరించడమేనని ఆయన భావించేవారు. మతాచారాలను ఆయన అంగీకరించేవారు కాదు. అయితే మత విశ్వాసాల ప్రభావం చాలా బలంగా ఉన్న మన సమాజంలో నెహ్రూను అనుసరించడం చాలా కష్ట సాధ్యమైన విషయం. కనుకనే నెహ్రూ అనంతరం కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రతికూలతలు ఏర్పడని విధంగా లౌకికవాదాన్ని ఆచరిస్తోంది.
సత్యమేమిటంటే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మత వర్గాల వారిని బుజ్జగిస్తుంది. అయోధ్యలోని బాబ్రీ మసీదు ద్వారాలను తెరవడం, వివాదాస్పద స్థలంలో శిలాన్యాస్‌కు అనుమతించడం ద్వారా హిందూ ఛాందసవాదులను బుజ్జగించింది. షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు వివాదాస్పదం కావడంతో ముస్లిం మతాచార్యులను బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మహిళల చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ చట్టం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని మరి చెప్పనక్కరలేదు. కాంగ్రెస్ ఇలా బుజ్జగింపు చర్యలు చేపట్టడమనేది అధిక సంఖ్యాకుల ప్రయోజనాలకు విరుద్ధంగా అల్ప సంఖ్యాకులకు అంటే ముస్లింలు, ఇతర మత మైనారిటీలకే ఎక్కువ లబ్ధి నిస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది కూడా ఒక బూటకపు వాదనే. భారతదేశపు ముస్లింలు ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని జస్టిస్ సచార్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిన ముస్లింలకు మరిన్ని అవకాశాలు కల్పించడమంటే వారిని 'బుజ్జగించడం లేదా సంతుష్టపరచడం' ఎంత మాత్రం కాదు. అన్ని సామాజిక వర్గాలకు సమానావకాశాలు కల్పించడమనే రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించడమే.
ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని మైనారిటీలను ఆకట్టుకునేందుకు ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని జాతీయ సెలవుగా ప్రకటించడం, ముస్లిం యువతకు విద్యా ఉపకార వేతనాలు సమకూర్చడం మొదలైన సంక్షేమ కార్యక్రమాల మధ్య తేడాను చూడవల్సిన అవసరమున్నది. ముస్లింల అభ్యున్నతికి చిత్తశుద్ధి తో తోడ్పడకుండా ప్రవక్త పుట్టిన రోజును సెలవుగా ప్రకటించడం వల్ల ప్రయోజనమేముంది?
రెండో ప్రశ్నకు వద్దాం. ఎవరు ఎక్కువ లౌకికివాది అనేది వచ్చే ఎన్నికల్లో ఓటరు నిర్ణయాలను ప్రభావితం చేస్తుందా? వాస్తవమేమిటంటే లౌకికవాదం నిర్ణయాత్మక అంశంగా ఇంతవరకు ఈ దేశంలో రెండు సార్వత్రక ఎన్నికలు మాత్రమే జరిగాయి. మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో 1952లో ప్రథమ సార్వత్రక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నెహ్రూ భారత్‌ను హిందూపాకిస్థాన్‌గా పరిణమించడాన్ని ఎట్టి పరిస్థితులలోను అంగీకరించబోమని దృఢ స్వరంతో పదే పదే స్పష్టం చేశారు. ఆసేతు హిమాచలం చేసిన ప్రచారంలో ప్రతిసభలోనూ మతోన్మాద శక్తులపై రాజీలేని పోరాటం చేయవలసిన అవసరం గురించి నెహ్రూ నొక్కి చెప్పారు.
1991 సార్వత్రక ఎన్నికలలో సైతం లౌకిక-మిథ్యా లౌకిక వాదంపై చర్చను జాతీయ ఎజెండా గా చేయడంలో బీజేపి సఫలమయింది. ఎల్ కె అడ్వాణీ రథయాత్ర, దానికి దీటుగా ప్రతిస్పందించడంలో కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం బీజేపీకొక అవకాశాన్ని కల్పించాయి. ఆ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకొని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందింది.
2013 సంవత్సరపు భారతదేశం 1991 నాటి భారత్‌కు పూర్తిగా భిన్నమైనది. ఆర్థిక సంస్కరణల అనంతర భారతదేశం భావోద్వేగాలతో కాకుండా ఆకాంక్షలతో ప్రేరణ పొందుతోంది; కేవలం సామాజిక అస్తిత్వానికి కాకుండా ఆర్థిక పురోగతికి ప్రాధాన్యమిస్తోంది. హిందుత్వ జాతీయవాదానికి ప్రతీకగా మోదీని నిలపడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించగలమని బీజేపి భావిస్తుంటే ఆ పార్టీ పొరపడుతోందని చెప్పక తప్పదు.
హిందూత్వ జాతీయవాదిగా మోదీ పట్టణ మధ్యతరగతి ప్రజలలోని ఒక వర్గాన్ని అమితంగా ఆకట్టుకోగలుగుతారు. ఇందులో సందేహం లేదు. అయితే తాను నిజంగా సుపరిపాలనా పతాకనని మౌనంగా ఉన్న అధిక సంఖ్యాకులు విశ్వసించేలా చేయడం ద్వారా మాత్రమే ఆరాటపడుతోన్న అత్యున్నత పదవిని ఆయనఅధిష్ఠించ గలుగుతారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైతం, ఎన్నికల ఎజెండాను ప్రభుత్వ పనితీరు నుంచి లౌకికవాదం పరిరక్షణకు మార్చడం ద్వారా రాబోయే సార్వత్రక ఎన్నికలలో విజయం సాధించలేదు. లౌకికవాదంపై నకిలీ పోరాటాలు టెలివిజన్ కార్యక్రమాలను ఆకర్షణీయమూ, ఆసక్తికరమూ చేయవచ్చుగాని వాస్తవ ప్రపంచంలో ఆర్థిక వ్యవహారాలే నిర్ణయాత్మక అంశాలు సుమా!
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి