30, జులై 2013, మంగళవారం

ఆఖరి అంకం


July 30, 2013
న్యూఢిల్లీ, జూలై 29 : కాంగ్రెస్ ఉరకలు వేస్తోంది. పరుగులు తీస్తోంది. ముందే తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ భాగస్వామ్య పక్షాలతో, సీడబ్ల్యూసీతో 'మమ' అనిపించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరగాల్సిన యూపీఏ సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారానికి... ముందుకు జరిపింది. 'త్వరలో' అని చెబుతున్న సీడబ్ల్యూసీ సమావేశాన్ని కూడా మంగళవారమే ఏర్పాటు చేసింది. సాయంత్రం 4కు ప్రధాని మన్మోహన్ నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. అది ముగియగానే... సాయం త్రం 5.30కి కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణపై తేల్చేందుకే ఈ వరుస భేటీలు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. 'తెలంగాణ సమస్యకు రాష్ట్ర విభజనే పరిష్కారం' అని మంగళవారం జరిగే పార్టీ, యూపీఏ సమన్వయకమిటీ సమావేశాల్లో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రికల్లా తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏం జరుగుతుంది?

రాష్ట్ర విభజనపై నిర్ణయాధికారాన్ని కాంగ్రెస్‌కు అప్పగిస్తూ యూపీఏ సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానించే అవకాశముంది. సమన్వయ కమిటీ సభ్యులంతా తెలంగాణకు తాము అనుకూలమేనని ఇప్పటికే వివిధ సందర్భాల్లో తెలిపారు. 'ఇతర డిమాండ్లతో ముడిపెట్టకుండా తెలంగాణ ఇచ్చేయాలి' అని ఎన్సీపీ నేత తారిక్ అన్వర్ సోమవారం ప్రకటించారు. అటు సీడబ్ల్యూసీలోకానీ, యూపీఏ భేటీలోకానీ భిన్నగళాలు వినిపించకుండా సోనియా ఇప్పటికే చొరవ తీసుకున్నట్లు తెలిసింది.

అయితే రాష్ట్ర విభజనపై స్థూల నిర్ణయం మాత్రమే తీసుకుంటారని... విభజన ఎలా జరుగుతుందన్న విషయం మాత్రం మంగళవారంనాటి సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశంలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పది జిల్లాల తెలంగాణా? అదనంగా రెండు జిల్లాలు కలిపిన రాయల తెలంగాణా? ఖమ్మంను విడదీస్తారా? హైదరాబాద్‌ను ఎంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారు? కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? అనే అంశాలపై చర్చకు రావని, వచ్చినా ఇప్పటికిప్పుడు స్పష్టత ఇచ్చే అవకాశంలేదని టెన్ జనపథ్ వర్గాలు తెలిపాయి. విభజనకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనను మంత్రుల బృందానికి అప్పగిస్తున్నట్లు సమన్వయ కమిటీ, సీడబ్లూసీలో ప్రకటించే అవకాశాలున్నాయి.
ఆ తర్వాత...
గురువారం (ఆగస్టు 1న) కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించి... విధి విధానాలను రూపొందించేందుకు మంత్రుల బృందాన్ని నియమిస్తుంది. కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిస్తారు. ఈ నిర్ణయంపై అభిప్రాయం తెలుపాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర అసెంబ్లీకి నివేదిస్తారు.

రాష్ట్ర అసెంబ్లీ నెల రోజుల్లోపు తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. మంత్రుల బృందంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మత్రి చిదంబరంతోపాటు విద్య, ఆరోగ్యం, నీటిపారుదల, విద్యుత్, అటవీ-పర్యావరణం, రైల్వేలు, మానవ వనరులు, రసాయనాలు- ఎరువులు, ఆహార, వినియోగ వ్యవహారాలు, కార్మిక శాఖల మంత్రులు ఉంటారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఇందులో భాగస్వామి అవుతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల భౌగోళిక స్వరూపాన్ని నిర్ణయించడంతోపాటు రాజ«ధాని ప్రతిపత్తి, ఆదాయ పంపకాలు, కొత్త రాజధానికి ప్యాకేజీ వంటి అనేక అంశాలను వీరు నిర్ణయిస్తారు. ఆ తర్వాత న్యాయశాఖతో సంప్రదించి బిల్లును రూపొందిస్తారు. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించిన తర్వాత మళ్లీ రాష్ట్రపతికి నివేదించి ఆయన ద్వారా మరోసారి అసెంబ్లీ పరిశీలనకు పంపుతారు.

కిరణ్‌కు ప్రధాని పిలుపు...
ముఖ్యమంత్రి కిరణ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ప్రధాని స్వయంగా ఆహ్వానించినట్లు తెలిసింది. "మీతో ప్రధాని ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి ఢిల్లీలో అందుబాటులో ఉండండి'' అని ప్రధాని కార్యాలయం నుంచి కిరణ్‌కు ఫోన్ వచ్చినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీకి ముందే ప్రధానితో కిరణ్ సమావేశం కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇప్పటికే ఢిల్లీలో ఉండగా... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా మంగళవారం ఢిల్లీ చేరుకోనున్నానరు. త్రిమూర్తులను సీడబ్ల్యూసీ భేటీకి ఆహ్వానించడంపై స్పష్టత లేదు. అయితే... సీడబ్ల్యూసీ నిర్ణయానికి తిరుగులేదని, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని 'త్రిమూర్తుల'కు తేల్చిచెప్పే అవకాశాలున్నాయి.

రాయల తెలంగాణానేనా?
రాయల తెలంగాణపై పలువురు నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ... తాము తెలంగాణలో కలిసేందుకే అనంతపురం, కర్నూలు జిల్లాల నేతలు పలువురు అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే... సీమాంధ్ర నేతల తదుపరి అడుగులను కూడా కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. వీరి కార్యకలాపాలపై కాంగ్రెస్ పెద్దలకు ఎప్పటికప్పుడు నిఘా వర్గాల నివేదికలు అందుతున్నాయి. మరోవైపు... హైదరాబాద్‌లో రెండు మూడు రోజులుగా దామోదర రాజనర్సింహ నివాసంలో సందడి నెలకొంది. పలు సంఘాల ప్రతినిధులు ఆయనను కలుస్తున్నారు. మరోవైపు... "తెలంగాణ అంశాన్ని మొదలు పెట్టింది మేమే. ముగించాల్సింది కూడా మేమే! తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకోవడం లేదు. 1999 నుంచి విస్త­ృతంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మంగళవారమే నిర్ణయం వెలువడుతుంది'' అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి