25, జులై 2013, గురువారం

సై అంటే సై

సై అంటే సై

July 26, 2013
(న్యూఢిల్లీ, హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి) నేడే శుక్రవారం... కోర్‌కమిటీ సమావేశానికి నేటి సాయంత్రమే ముహూర్తం! తెలంగాణపై కీలక నిర్ణయానికి అదే వేదిక! అధిష్ఠానం ఆదేశాలు అందుకున్న 'త్రిమూర్తులు' ఢిల్లీకి చేరుకుంటున్నారు. విభజన సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీంతో ఢీ అంటే ఢీ అంటూ, సై అంటే సై అని సవాళ్లు విసురుకుంటూ... ఇరు శిబిరాలు మోహరిస్తున్నాయి. సమైక్యవాదన వినిపించేందుకు సీమాంధ్ర మంత్రులు, విభజన సాధించేందుకు తెలంగాణ మంత్రులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ బాటపట్టగా... అవసరమైతే ఏ క్షణమైనా ఢిల్లీలో వాలేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు. బుధవారం 'సమైక్య' మంత్రులు సమావేశంకాగా... గురువారం టీ-మంత్రులు జానారెడ్డి నివాసంలో 'ప్రత్యేక' భేటీ జరిపారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీ బయలుదేరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గురువారమే ఢిల్లీ చేరుకున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో విభజన రాజకీయం రగులుతుండగా... అటు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం 'తనపని తాను' చేసుకుపోతోంది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణపై జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశం అజెండాను కోర్‌కమిటీ భేటీలో ఖరారు చేయనున్నారు. విభజనపై తన వైఖరిని కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ద్వారా 'త్రిమూర్తుల'కు తెలియచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 'తెలంగాణపై అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమలు ప్రక్రియకు సహకరించండి' అని షిండే వారిని కోరే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై హోంశాఖ ఇప్పటికే 80 శాతానికి పైగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది.

కిరణ్ ప్రయత్నాలు...
కోర్ కమిటీ సమావేశం జరిగిన వెంటనే తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధిష్ఠానం భావిస్తుండగా... దీనిని సాధ్యమైనంతగా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కనీసం మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసేదాకా ఆగాలని... సెప్టెంబర్ తర్వాత నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలు ముగిసేదాకా తెలంగాణపై బహిరంగ ప్రకటన ఉండదని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై అధిష్ఠానం అంతిమ నిర్ణయం తీసుకున్నప్పటికీ... దీనిపై బహిరంగ ప్రకటన చేస్తుందా? లేక... కేంద్ర హోంశాఖకు తమ వైఖరిని తెలియజేసి, లోలోపలే విభజన ప్రక్రియ ప్రారంభిస్తారా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం విభజనను తన శక్తిమేరకు వ్యతిరేకించాలనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

"పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక సర్పంచ్ స్థానాలు దక్కాయి. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే ప్రకారం చూసినా, తెలంగాణలో కేవలం 50 శాతం మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కానీ... సీమాంధ్రలో 90 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారు'' అని సీఎం వాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఈ సమాచారాన్ని కోర్‌కమిటీ, వర్కింగ్ కమిటీ సభ్యులకు, పార్టీ ఉపా«ధ్యక్షుడు రాహుల్ గాంధీకి కొందరు నేతలు అందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ విభజనను వ్యతిరేకిస్తున్నట్లు కిరణ్ చెబుతున్నట్లుగా ఒక మంత్రి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే కిరణ్ చెబుతున్నారని వివరించారు.

చలో ఢిల్లీ...
సీమాంధ్రకు చెందిన మంత్రులు వట్టి వసంతకుమార్, కొండ్రు మురళి, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. మిగిలిన మంత్రులు శుక్రవారం చేరుకోనున్నారు. మాతృ వియోగంలో ఉన్న రఘువీరారెడ్డి మినహా... మిగిలినవారంతా రాజధానికి వెళ్తున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగే కోర్‌కమిటీ సమావేశానికి ముందుగానే సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో సమావేశం కానున్నారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ బతకాలంటే విభజన ఆలోచన మానుకోవాలని కొండ్రు మురళి విలేకరులతో అన్నారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికే ఢిల్లీలో చాలామంది పెద్దలను కలుసుకుని తెలంగాణపై ముందుకు కదలొద్దని కోరారు. కొందరు ఎంపీలు రెండు రోజులక్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన బాధ్యత అని ప్రణబ్ చెప్పినట్లు తెలిసింది. అయితే... సీమాంధ్ర మంత్రుల్లో ఎంతమంది రాజీనామాలకు కట్టుబడి ఉంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా... 19మంది మంత్రుల్లో కనీసం 10 మంది వెనక్కు తగ్గుతారని సీమాంధ్ర మంత్రి ఒకరు చెప్పారు. అసలు ఇంతవరకు రాజీనామాల గురించి ఆలోచించనే లేదని ఆయన తెలిపారు. "నాకు అందిన సమాచారం ప్రకారం... మరో నెల రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి ప్రక్రియను పూర్తి చేస్తారు'' అని ఆ మంత్రి తెలిపారు.

గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే... ప్రధాని మన్మోహన్‌కు స్వల్ప అస్వస్థత కారణంగా అది రద్దు అయ్యింది. శుక్రవారంనాటి కోర్‌కమిటీ సమావేశం కూడా జరగదని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుండగా... ఆమేరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ప్రతి శుక్రవారం కోర్‌కమిటీ భేటీ కావడం రివాజు! ఈ శుక్రవారం కోర్‌కమిటీ భేటీ జరగకపోతే... మళ్లీ రెండో తేదీదాకా జరగదు. అయితే... వచ్చేనెల 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాల్లో కీలక బిల్లులు అనేకం ఆమోదించాల్సి ఉంది. ఈ పార్లమెంటులో అనుసరించాల్సి వ్యూహంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. దీంతో... ఈ శుక్రవారమే కోర్‌కమిటీ నిర్వహించి, తదుపరి సీడబ్ల్యూసీ భేటీకి రంగం సిద్ధం చేస్తారని తెలుస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి