16, జులై 2013, మంగళవారం

హాంకాంగ్‌లా హైదరాబాద్


July 16, 2013
న్యూఢిల్లీ, జూలై 15 : తెలంగాణ ప్రకటిస్తే హైదరాబాద్‌ను 25 ఏళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. అప్పటివరకూ హాంకాంగ్ మాదిరిగానే.. హైదరాబాద్‌ను ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా కొనసాగించాలని ఆయన సూచించారు. ఏఐసీసీకి చెందిన విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సాధ్యమైనంత వరకు తెలంగాణ ఇవ్వకపోవడమే సరైన నిర్ణయమని ఆయన గత శుక్రవారం జరిగిన కోర్‌కమిటీ భేటీలో చెప్పినట్లు తెలిసింది. ఆ వర్గాల ప్రకారం... తెలంగాణ ఇవ్వడం వల్ల మొత్తం రాష్ట్రానికీతీవ్ర నష్టం జరుగుతుందని, అనేక సమస్యలు ఏర్పడతాయని అధిష్ఠానం ముందు ఆయన తేల్చి చెప్పారు.

అభివృద్ధి ఉన్నందునే.. ఆత్మగౌరవం బాట
నిజానికి సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ కూడా ఈ 56 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంతో.. రాజకీయావకాశాలు లేని కొన్ని వర్గాలు ప్రత్యేక రాష్ట్ర్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయని వివరించారు. అందువల్లే 2001 వరకూ తెలంగాణ ఆర్థికంగా వెనుకబడినట్లు వాదించేవారని, అది నిజం కాదని తేలడంతో ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి వాస్తవాలు వివరించడంలో వారు విఫలమయ్యారన్నారు. ప్రభుత్వోద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందన్న ప్రత్యేక ఉద్యమకారుల వాదనలో వాస్తవం లేదని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలు ప్రాంతాల వారీగా దక్కవని, చిన్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులు వచ్చిన సందర్భాలున్నాయని తెలిపారు.

అదే విధంగా ఏపీపీఎస్సీ కూడా ప్రాంతాల వారీగా, జనాభా ప్రాతిపదికగా ఉద్యోగులను ఎంపిక చేయదని వాదించారు. ఇక రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులున్నా ఆ ప్రాంతం వెనుకబడిందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ఎక్కువమంది ముఖ్యమంత్రులున్నా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న హామీ లేదన్నారు. తమ ప్రాంతం నుంచి కేవలం నలుగురే ముఖ్యమంత్రులున్నారని, వారిలో జలగం వెంగళరావు వలస వచ్చిన వారని తెలంగాణ వారు వాపోవడంలో అర్థం లేదని బొత్స అభిప్రాయపడ్డారు. ఈ కారణాలతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు.

ఏకపక్ష ప్రకటన కుదరదు
రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం ఏకపక్షంగా తెలంగాణను ప్రకటించేందుకు వీలు లేదని, అందులో రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడే అధికారాలున్నాయని బొత్స వాదించారు. ఇందుకు ఒక హేతుబద్ధమైన విధానం, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పడితే రాయలసీమ మాటేమిటని ఆయన ప్రశ్నించారు. 1936లో.. వారిలో అవిశ్వాస భావనలు తొలగించి కోస్తాంధ్రలో కలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు తర్వాత కర్నూల్‌లో రాజధాని ఉండేదని, ఇప్పుడు మరోచోట పెడతానంటే వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాలు, రెవెన్యూ, హైదరాబాద్‌కు సంబంధించి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ముఖ్యంగా గత 56 ఏళ్లలో హైదరాబాద్ రాజకీయ రాజధానిగా, బలోపేతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆయన చెప్పారు.

హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం..
రాష్ట్రానికి సంబంధించి 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే లభిస్తోందని బొత్స చెప్పారు. 95 శాతం సాఫ్ట్‌వేర్ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉందని, 30 శాతం పన్నులు అక్కడి నుంచే లభిస్తాయని చెప్పారు. రాజధాని అయినందువల్లే ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. నిజానికి ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా రాజధానుల్లో కాక ఇతర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. బీహెచ్ఈఎల్, హరిద్వార్‌లోనూ, హెచ్ఏఎల్ కోరాపుట్‌లోను, నాసిక్‌లోనూ ఉంటే మన రాష్ట్రంలో ఈ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను చూసి ప్రైవేటు రంగ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, ప్రైవేట్ రంగ సంస్థల్లో 90 శాతం అక్కడేఉన్నాయని బొత్స చెప్పారు. రూ.55 వేల కోట్ల మేర సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతుంటే అందులో రూ.54,500 కోట్లు హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. వీటన్నిటివల్లా.. ఇతర ప్రాంతాల ప్రజలు కొన్ని తరాలుగా హైదరాబాద్‌లో మనుగడ సాగించడం ప్రారంభించారని, తమ జీవితకాల పొదుపును ఇక్కడే పెట్టుబడులుగా పెట్టారని తెలిపారు. వీరంతా ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు.

విభజనతో అంతా అస్తవ్యస్తమే..
విభజన అనివార్యమైతే.. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పరుస్తారు? దానికి అవసరమైన భూమి సంగతేంటి? ఈ 56 ఏళ్లలో హైదరాబాద్‌లో సాధించిన అభివృద్ధి సాధించడానికి ఇక్కడ ఎంతకాలం పడుతుంది? అందుకు ఎన్ని వేల కోట్లు కేటాయించాలి? ఐఐటీ, ఐఐఎంలతో పాటు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పరచాలి? అని బొత్స సూటి ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక జీవనం అస్తవ్యస్తమవుతుందని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ తీవ్ర నష్టాలకు గురవుతాయని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు కోస్తాంధ్రకు లభిస్తున్న నీరు.. విభజన తర్వాత కూడా లభిస్తుందన్న హామీ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే భద్రాచలం సీమాంధ్రకు వెళుతుందని చెప్పారు.

కనీవినీ ఎరుగని స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే తప్ప రాష్ట్ర్ర విభజన సాధ్యపడదని చెప్పారు. సాధ్యమైనంత మేరకు యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదని, అయితే అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బొత్స చెప్పినట్లు తెలిసింది. కాగా తెలంగాణ ఇవ్వకపోతే ఎన్ని సీట్లు, ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నలకు తాను జవాబు ఇవ్వలేనని, అనుభవజ్ఞులైన కోర్ కమిటీ సభ్యుల ముందు రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడడం తనకు భావ్యం కాదని చెప్పారు.

ఈ చర్యలు తీసుకుంటే చాలు..
రాష్ట్రాన్ని విభజించి సంక్లిష్టమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొనే బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ సూచించారు.
1. తెలంగాణకు ప్రత్యేక బోర్డును ఏర్పరచి ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
2. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఏఐబీపీ కింద నిధులు కేటాయించాలి.
3. చట్టబద్ధమైన న్యాయ సంస్థను ఏర్పరచి నీటి పంపిణీని పర్యవేక్షించాలి.
5. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ట్రిబ్యునల్ ఏర్పరచి ఉపాధి కల్పనకు సంబంధించి తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి. జనాభా ప్రకారం నిధులు అందేలా చూడాలి.
6. తెలంగాణ కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పరచాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి