16, జులై 2013, మంగళవారం

న్యాయ బంధనాల్లో నేర నేతలు - మాడభూషి శ్రీధర్


July 16, 2013
నేరాలు చేసి బందీలు కావడం, జైళ్ళ నుంచి పోటీ చేయడం, గెలవడం, నేరం రుజువైనా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగడం మన దేశంలో సామాన్యమై పోయింది. అద్భుతంగా చేసుకున్న చట్టాలు, ఇష్టపడి కష్టపడి రాసుకున్న రాజ్యాంగం ఈ దుర్మార్గాన్ని ఏ విధంగా అనుమతిస్తున్నదో సామాన్యులకు అర్థం కాదు. న్యాయవేత్తలకు కూడా అర్థం కాదు. సుప్రీం కోర్టు ముందు కొందరు పరిశోధకులు, ప్రజాస్వామ్య అభిమానులు కలిసి ఈదుర్మార్గాన్ని రాజ్యాంగం అనుమతించలేదని చెప్పేదాకా సుప్రీంకోర్టుతో సహాఎవరికీ తెలియకపోవడం మరొక ఘోరం. రాజ్యాంగంలో ఉన్న అక్షరాలను అర్థం చేసుకోవడానికి ఈ దేశానికి 63 ఏళ్ళు పట్టింది!


జైళ్ళ నుంచి ఎవరికీ ఓటు చేసే అధికారం లేదని ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 62 (5) స్పష్టంగా పేర్కొన్నది. జైల్లో ఉన్నవాడికి బెయిల్ దొరికితే తప్ప ఓటు వేయడానికి బయటకు రాలేడు. కూతురుపెళ్ళి చేద్దామన్నా జైలు నుంచి బయటకు రావడానికి వీలుండదు, బెయిల్ ఇస్తే తప్ప. ఇటీవల క్రీడా క్రిమినల్ నిందలు ఎదుర్కొంటున్న ఒక క్రీడాకారుడు తాను పెళ్ళి చే సుకోవడానికి కూడా బెయిల్ కోరుకోవలసి వచ్చింది. జైల్లో ఉన్నవాడు పెళ్ళి కూడా చేసుకోలేడు. కానీ ఓటు వేయగలడా అని అనుమానం ఎవరికీ రాలేదు. ఓటు వేయలేని వాడు, ఓటరు కాని వాడు, ఓటర్ల జాబితాలో ఒకడు కాని వాడు ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచీ పోటీ చేయడానికి వీల్లేదు. కానీ ఈ రెండు సూత్రాలను అమలు చేసిన వాడు లేడు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదుకాని వ్యక్తి రాజ్యసభకు పోటీ చేయడానికి వీల్లేదు. అదే చట్టం సెక్షన్ 4(డి) ప్రకారం ఏదోఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరైతే చాలు లోక్‌సభకు ఆ వ్యక్తి పోటీ చేయవచ్చు. కానీ నేరారోపణపైన అరెస్టు చేసినపోలీసు నిర్బంధం లేదా జుడిషియల్ నిర్బంధంలో ఉన్నా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నా ఓటు వేయడానికి, పోటీ చేయడానికి అనర్హుడవుతాడని సెక్షన్లు 4,5 62(5) కలిపి చదివితే అర్థమవుతుంది. ఈ సెక్షన్లు 1950 నుంచి అంటే మనకు కొత్త రాజ్యాంగం వచ్చిన నాటినుంచి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో నిర్దేశించిన నియమాలు.

జైళ్ళ నుంచి నేరగాళ్ళు పోటీ చేయడం, జనం వారినే గెలిపించడం వంటి సంఘటనలు ఎక్కువగా జరిగే బీహార్‌లో ఈ పరిస్థితి చెల్లదని భావించిన ఎన్నికల కమిషన్ ఈ అనర్హత నియమాలను ఒక పిటిషన్ ద్వారా పాట్నా హైకోర్టు ముందుకు తెచ్చింది. వారి వాదనలో పస ఉందని 2004లో పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. తొమ్మిదేళ్ళ తరువాత సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పులో పాట్నా హైకోర్టు తీర్పును జూన్ 11న ధ్రువీకరించింది. ఇందువల్ల అభ్యర్థులు, నాయకులు నేరారోపణకు గురై కటకటాల్లో ఉండి అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఇకపై కుదరదు. ఏదైనా కారణాలతో పోలీస్ కస్టడీలో ఉన్న వారు కూడా చట్టసభల ఎన్నికల బరిలో దిగలేరు. నేరం రుజువైన తరువాత కూడా అప్పీలు చేసామన్న కుంటి సాకుతో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి వీల్లేదన్న అనర్హత విధిస్తూ సుప్రీంకోర్టు జూన్ 10న సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చిన సుప్రీం ధర్మాసనమే మరునాడు ఇంకో కేసులో ఈ సంచలన తీర్పునూ వెలువరించింది. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలితే అదే రోజు నుంచి వారు పదవులకు అనర్హులని, ఆ మరునాడు జైళ్ళలో ఉన్న నేతలు ఓటు వేయడానికి అనర్హులు కనుక వారికి పోటీ చేసే అర్హత రాదనే ఈ రెండు కీలకమైన తీర్పులను జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఇచ్చింది.

పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదని పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్నికల ప్రధానాధికారి, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై అప్పీలు వింటూ కింది కోర్టు ఉత్తర్వుల్లో ఏ లోపమూ కనిపించడం లేదని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. జైలుకెళ్ళడం, పోలీస్ కస్టడీ వల్ల ఓటు హక్కును కోల్పోయే వ్యక్తికి పోటీ చేసే అవకాశం ఉండదని వివరించింది. అయితే ముందస్తు నిర్బంధంలోకి వెళ్ళిన వ్యక్తులకు పోటీ చేసే అర్హత నిరాకరించడం సాధ్యం కాదని సెక్షన్ 62(5)లో ఉన్న వివరణను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నామినేషన్లు వేసే నాటికి ఎవరైనా జైల్లో ఉంటే, పోలింగ్ తేదీనాడు కూడా ఆ వ్యక్తి జైల్లో ఉండే పరిస్థితి వస్తే అతను నామినేషన్ వేయడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద సాధ్యం కాదు.

చట్టసభల్లో సభ్యత్వానికి అర్హతలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 4,5 లలో ఓటర్ అర్హతలను నిర్ధారించారు. చట్టంలోని సెక్షన్ 62 (5) కింద పోలీస్ కస్టడీ, జుడిషియల్ కస్టడీ లేదా తదితర కారణాలతో నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఆ సమయంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. కనుక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 4,5, 62 (5) సెక్షన్లను సమన్వయించి చదివితే న్యాయస్థాన ఆదేశాలతో నిర్బంధం (జుడిషియల్ కస్టడీ)లో ఉన్నా పోలీస్ కస్టడీలో ఉన్నా ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదని తేలుతుందని సుప్రీంకోర్టు వివరించింది.

ఓటు వేసే హక్కు చట్టం ఇచ్చిన హక్కు. అటువంటి హక్కును ఆ చట్టమే వెనకకు తీసుకోవచ్చు కూడా. శిక్షకు గురైన వారు ఎన్నికల్లో పాల్గొనలేరు. నేరారోపణలపైన చట్టబద్ధంగా నిర్బంధంలో ఉన్నవారు ఓటర్లు కాలేదు కనుక పోటీ చేయలేరని రాజ్యాంగం ఇతర శాసనాలు వివరిస్తున్నాయని అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మొదటి తీర్పు నేరం రుజువైన నేతలకు సంబంధించినదైతే రెండో తీర్పు కేవలం అనుమానంతో ఆరోపణలతో నిర్బంధంలో ఉన్న నాయకులకు సంబంధించినదని గమనించాలి. మొదటి తీర్పు గురించి పరిశీలిద్దాం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు దోషులుగా కింది కోర్టు నిర్ధారణ చేసిన నాటి నుంచే ప్రజా ప్రాతినిధ్య సభలలో సభ్యులుగా కొనసాగడానికి అనర్హులు అవుతారని జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8లో కొన్ని నేరాలు చేసిన వారిని పోటీ చేయకుండా నిషేధించే వివరాలు ఉన్నాయి. సెక్షన్ 8లో 1,2,3వ నిబంధనలు వివరంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇందులో మూడు రకాల నేరాలు చేసిన ప్రజాప్రతినిధులకు మూడు రకాల పరిస్థితుల్లో పోటీ చేయకుండా నిషేధాలు ఉన్నాయి.ఆ నిషేధాలను, అనర్హతలను పనికి రాకుండా చేసే మినహాయింపు సెక్షన్ 8(4)లో రూపొందించారు. అదేమంటే పై నేరం రుజువయ్యే నాటికి చట్టసభలలో సభ్యులుగా ఉన్న వ్యక్తులకు అనర్హత మూడు నెలలపాటు వాయిదా పడుతుంది.

ఆ మూడు నెలల కాలంలో కనుక పై కోర్టుకు అప్పీలు లేదా రివిజన్ దరఖాస్తు పెట్టుకుంటే ఆ అప్పీలు, రివిజన్ విచారణ పూర్తయ్యేదాకా అనర్హత వాయిదా పడుతుంది. ఇది చాలా దారుణమైన మినహాయింపు. ఎంత మంచి నియమాలు ఉన్నా, ఎన్ని పకడ్బందీ శాసనాలు చేసినా, ఇటువంటి మినహాయింపులతో నేరగాళ్ళను పార్లమెంటులో, శాసన సభల్లో కొనసాగించడానికి ఇదొక ఏర్పాటు. ఇది చాలా అన్యాయమైన నియమం అని అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో పలువురు విమర్శించారు.
రాజ్యాంగం 102, 192 అధికరణాలు పార్లమెంటు, శాసనసభా సీట్ల కోసం ఎన్నికలలో పోటీ చేయడానికి, ఎన్నికై ఉంటే ఆ సభలలో సభ్యులుగా కొనసాగడానికి అర్హతలను నిర్ణయించాయి. ఈ అధికరణాల అంతరార్థం ఏమంటే పోటీ చేయడానికి, సభ్యులుగా కొనసాగడానికి అనర్హతలు ఒకే రకంగా ఉండాలి. కానీ సెక్షన్ 8లో 1,2,3 సబ్ సెక్షన్ల ప్రకారం పోటీ చేయడానికి అనర్హతలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ 8(4) ప్రకారం ఆ అనర్హతలు గెలిచిన వారికి వర్తించవు. వారు ఆ పదవుల్లో కొనసాగే పరిస్థితి వచ్చింది. ఇదే తీవ్రమైన అసమానత. వివక్ష. శాసనకర్తలుగా గెలిచిన నేరగాళ్ళయిన నేతలను కాపాడుకోవడం కోసం 1950నాటి తరం నాయకులే 8(4) అనే దుర్మార్గ మినహాయింపు నియమం చేర్చడం ఒక రకంగా దేశ ద్రోహం, ప్రజాస్వామ్య ద్రోహం. సెక్షన్ 8(4) చాలా స్పష్టంగా రాజ్యాంగ అధికరణాలు 102, 192, సమానతా నియమం ఆర్టికల్ 14కు పూర్తి విరుద్ధం. అందుకు సెక్షన్ 8(4) మినహాయింపు రాజ్యాంగ వ్యతిరేకమని చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే రాజ్యాంగం అమలైన 1950లోనే వచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఈ రాజ్యాంగ వ్యతిరేక నియమం ఉందని 63 సంవత్సరాల కాలంలో ఈ జాతికి గుర్తుకు రాకపోవడం, ఈ నియమాలను అనుసం«ధించి చూడలేకపోడం సిగ్గు పడవలసిన విషయం.

కనీసం ఇప్పుడైనా ఒక న్యాయవాది (లిలీ థామస్), ఒక స్వచ్ఛంద సంస్థ (లోక్ ప్రహారీ) ఈ వైరుధ్యాన్ని 2005లో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా నేరుగా సుప్రీంకోర్టులోనే దాఖలు చేయడం పరువు దక్కించిన విషయం. మన చట్టసభలు మనకు ఎంత అన్యాయం చేసాయో ఈ 8(4) తెలియజేస్తుంది. అయితే 2005లో వేసిన ఈ పిటిషన్‌ను 2009 లోపే నిర్ణయించి ఉంటే నేరగాళ్ళు పార్లమెంటులో, శాసనసభల్లో స్థానాలు ఆక్రమించి ఉండేవారు కాదు. ఎంతోమంది ఎంపీలు జైళ్ళ చుట్టూ క్రిమినల్ కోర్టుల చుట్టూ తిరుగుతూ మధ్యలో బెయిల్ తీసుకుని చట్టసభలకు వచ్చే దారుణమైన పరిస్థితి ఉంది. ఎన్నికైన వారిని, పోటీ చేయబోయే వారిని రెండు విభిన్న వర్గాలుగా భావించి ఈ తేడాను సృష్టించడం జరిగిందని, గెలిచిన వారు నేరస్థులను కోర్టులు హఠాత్తుగా రుజువు చేసినపుడు వారు వెంటనే అనర్హులయితే, ఒకటి రెండు ఓట్ల ఆధిక్యతతో మాత్రం నడిచే సంకీర్ణ ప్రభుత్వాలు పడిపోతాయని కనుక వారి అనర్హత వాయిదా వేయడం న్యాయమని భారత ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే ఒక దారుణమైతే, ఈ తీర్పుపైన అప్పీలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం మరొక దారుణం. చట్టం ధ్వంసం చేసేవారే శాసన నిర్మాణం చేసేవారయితే ఈ దేశంలో చట్టబద్ధపాలన చట్టుబండలే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేసిన ఈ చట్టసభ సభ్యులు చట్టం ఉల్లంఘించారని రుజువైన తరువాత కూడా సభ్యులుగా కొనసాగడం కన్నా అవమానం చట్టాలకు, రాజ్యాంగానికి మరొకటి ఉండదు.
కింది కోర్టుల్లో అవినీతికి పాల్పడి రాజకీయ ప్రత్యర్థుల పైన శిక్షలు విధింప చేసి పోటీలో లేకుండా చేస్తారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కింది కోర్టుల్లో తప్పుడు ఆరోపణలను కొట్టి వేయించడానికి హైకోర్టుకు వెళ్ళే అధికారం ఉండనే ఉంది కనుక ఈ సాకుతో నేరగాళ్ళను పోటీ చేయనిచ్చే ఆలోచన చెల్లదు.

ఇక నిర్బంధంలో ఉన్న వారిని పోటీ చేయకుండా అనర్హులను చేస్తే, ప్రత్యర్థులను ఏదో ఒక కేసులో ఇరికించే దుర్మార్గాన్ని అధికార పక్షం వహించే ప్రమాదం ఉందన్న అనుమానం సహేతుకమైనదే. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగడానికి ఎంత నీచానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేసి కేసుల్లో ఇరుక్కున్నవారు, అధికార పార్టీ విధానాలను సైద్ధాంతికంగా వ్యతిరేకించినవారు, ప్రత్యేక తెలంగాణ వంటి ఉద్యమాలలో పాల్గొన్నవారు అరెస్టయితే వారిని పోటీ చేయడానికి అనర్హులనడానికి ఏ మాత్రం న్యాయం కాదు. కార్మిక హక్కుల కోసం పోరాడి జైలుపాలయిన వారిని, రాజ్యాంగ హక్కుల, పౌర హక్కుల రక్షణ కోసం పోరాడిన వారిని అనర్హులను చేస్తే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు.

అంతేకాదు, తీవ్ర నేరాలు చేసారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తులను, నేరం రుజువు కాలేదన్న కారణంతో పోటీ చేయడానికి అనుమతిస్తే అది కూడా అన్యాయమే. ప్రథమ సమాచార నివేదిక, పరిశోధన తరువాత ఆరోపణ పత్రం, ఆ తరువాత కోర్టు నిర్ధరించిన నేరాల పత్రం అని మూడు దశలు దాటిన తరువాత ఆరోపణలున్న నాయకులను ఖచ్చితంగా నిషేధించాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఏడాదిలో నేరాలు రుజువు చేసి మరో ఏడాదిలో అప్పీళ్ళు ముగించే వ్యవస్థ రాకపోతే ఈ ప్రజాస్వామ్య ద్రోహానికి న్యాయ వ్యవస్థ ద్వారా కూడా దోహదం చేసినట్టువుతుంది.
-మాడభూషి శ్రీధర్
ఆచార్యులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి