31, జులై 2013, బుధవారం

ఆవిర్భావం నుంచి విభజన వరకు


July 31, 2013

హైదరాబాద్, జూలై 30 : ఆంధ్రప్రదేశ్.. ముందుతరాలకు ఓ చరిత్ర..ఓ పాఠం.. 57 ఏళ్లుగా సాగుతున్న సమైక్య రాష్ట్ర ప్రస్థానం ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన దిశగా మంగళవారం తొలి ప్రకటన చేయడంతో 1956 నవంబరు 1న ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనంతో రూపుదిద్దుకున్న 'ఆంధ్రప్రదేశ్' గత చరిత్రగా మిగిలిపోనుంది.

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న ఇండియన్ యూనియన్‌లో భాగమైంది. 1956లో ఆంధ్రరాష్ట్రంతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. నాటి నుంచి జైఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న డిమాండ్లు అడపాదడపా విన్పిస్తున్నా సుమారు దశాబ్దంన్నర క్రితం ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్టకేలకు విభజనకు బాటలు వేసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి విభజన వరకు ఏం జరిగిందో సంక్షిప్తంగా...

హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా...
- కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాలు 16, 17 శతాబ్ధాల్లో కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి.
-దేశంలో బ్రిటీష్ పాలకుల ప్రవేశంతో హైదరాబాద్ రాష్ట్ర పాలకుడు నిజాం తన పాలనలోని సర్కారు(ప్రస్తుత కోస్తాంధ్రలో కొంత భాగం), రాయలసీమ ప్రాంతాలపై అధికారాన్ని బ్రిటీష్ వారికి కట్టబెట్టారు. దీంతో అవి బ్రిటీష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం మద్రాసు రాష్ట్రంలో భాగంగా మారాయి. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో భాగస్వామిగా మారి ప్రత్యేక రాష్ట్రంగా ఉండిపోయింది.

- హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో భాగస్వామి అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం ఎం.కె. వెల్లోడి అనే సివిల్ సర్వెంట్‌ను 1950 జనవరి 26న నియమించింది. 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
- తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు 1952లో 56 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా భాషాప్రాతిపదిక ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపాలన్న ప్రతిపాదనను 1953లో కాంగ్రెస్ అధిష్ఠానం తెరపైకి తెచ్చింది. దీనికి తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి మద్దతు పలికారు. దీంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
- తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజల నడుమ సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు ఎన్ని ఉన్నా కేవలం తెలుగు భాష మాట్లాడే ప్రజలను ప్రాతిపదికగా తీసుకుని 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ను రాజధానిగా చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో తెలంగాణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఆ ప్రాంత ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న హామీతో విలీన ప్రతిపాదన తీర్మానాన్ని ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ 1955 నవంబరు 25న ఆమోదించింది.
- 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రాంతాల నాయకుల నడుమ 'పెద్ద మనుషుల ఒప్పందం' జరిగింది. దీనిపై బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావులు సంతకం చేశారు. ఎట్టకేలకు రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
- ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సమృద్ధిగా ఉన్న నీటివనరులు, సారవంతమైన భూముల కారణంగా కోస్తాంధ్ర అభివృద్ధి పరంగా ముందంజలో ఉంది. విశాఖపట్నంలో పారిశ్రామికాభివృద్ధి.. పలు ఓడరేవుల నిర్మాణం.. కేజీ బేసిన్‌లో చమరు నిక్షేపాల కారణంగా ఆర్థికంగా కూడా కోస్తాంధ్ర మిగిలిన ప్రాంతాలకన్నా అభివృద్ధి పథంలో ఉంది. అధికశాతం బీడు భూములు, సాగునీటి వనరులు లేకపోవడంతో తెలంగాణ ప్రాంతం అభివృద్ధిపరంగా వెనుకబడింది. రాయలసీమ సైతం కరవు కాటకాలతోను, కొన్ని దశాబ్దాలుగా సాగిన ఫ్యాక్షన్ హత్యల కారణంగా వెనకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగిందిలా...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు నిరసన గళం విన్పించారు.
-కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సమితి పేరుతో పార్టీని స్థాపించారు. విద్యార్థుల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొంత కాలం ఉద్ధృతంగా సాగింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సుమారు 300 మంది మృత్యువాతపడ్డారు.
- నాటి పరిస్థితుల తీవ్రతను తగ్గించేందుకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పలుమార్లు ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులతో మాట్లాడి 1969 ఏప్రిల్ 12న 8 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు దాన్ని తిరస్కరించి తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు.
- తెలంగాణ ప్రాంతంలో సాగుతున్న ప్రత్యేక డిమాండ్‌కు ధీటుగా 1972లో సీమాంధ్ర ప్రాంతాల్లో జైఆంధ్ర ఉద్యమం మొదలైంది.
- ఇరుప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులను తీసుకొచ్చేందుకు 1973 సెప్టెంబరు 21న 6 సూత్రాల పథకం తెరపైకి వచ్చింది.
-ఉద్యోగ నియామకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ 1985లో తెలంగాణ ప్రాంతంలో నిరసన స్వరాలు మొదలయ్యాయి. దీంతో అప్పటి తెదేపా ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగభద్రతకు జీవోను తీసుకొచ్చింది.
- 1999 వరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఎలాంటి ఉద్యమాలు లేవు. అయితే ఎన్నికల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ 1999లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రి పదవి లభించలేదన్న కారణంతో తెదేపాను వీడిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా...
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో 2001లో కాంగ్రెస్ అధిష్ఠానం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలంటూ తీర్మానం చేసి అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి పంపింది. అయితే ఎన్డీయే దాన్ని తిరస్కరించింది. అప్పటి హోంశాఖ మంత్రి ఎల్‌కే ఆడ్వాణి దేశ సమగ్రతకు చిన్నరాష్ట్రాల ఏర్పాటు సరికాదంటూ ప్రకటన చేశారు.
- 2004 నాటి ఎన్నికల ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తూ తెరాసతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. నాటి ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెరాస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామి పక్షంగా మారింది. అయితే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కాంగ్రెస్ సరిగా స్పందించడం లేదంటూ 2009 డిసెంబరు 9న సంకీర్ణం నుంచి తెరాస వైదొలిగి ఒంటరి పోరాటం ప్రారంభించింది.
- ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించా రు. దీంతో కేంద్రం డిసెంబరు 9న 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియ ప్రారంభమైంది' అంటూ ప్రకటించింది. కానీ, 23నాటికి మాటమార్చి ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రకటించింది.
- కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పలువురు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆత్మాహుతికి పాల్పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న అయిదుగురు సభ్యులతో కూడిన శ్రీకృష్ణ కమిటీని నియమించింది. శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబరు 30న నివేదిక ఇచ్చింది.
- శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో 2011-12 మధ్యకాలంలో మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సకలజనుల సమ్మెలతో తెరాస ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. దీంతో 2012 డిసెంబరు 28న అన్ని పార్టీలతో కేంద్ర హోంశాఖ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
- 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగనుంది. అయితే సాంస్కృతిక వైరుధ్యాలు కల ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉంటాయా..? ఆంధ్రప్రదేశ్ మరోసారి విభజన ఉద్యమానికి వేదికగా మారుతుందా..? అన్నది చరిత్ర తేల్చాల్సిన అంశాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి