30, జులై 2013, మంగళవారం

ఎందుకీ తొందర ?


July 30, 2013
హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి, జూలై 29:
ఇప్పట్లో రాదు, లేదు, కాదు అనుకున్న రాష్ట్ర విభజన అంశం ఇంత అకస్మాత్తుగా ఎందుకు తెరపైకి వచ్చింది? 'కాంగ్రెస్ తేల్చదు. తెలంగాణ ఇవ్వదు' అని అంతా అనుకుంటున్న తరుణంలో... విభజన దిశగా అంత చకచకా ఆ పార్టీ ఎందుకు పావులు కదుపుతోంది? తెరవెనుక ఏం జరిగింది? కారకులెవరు? కారణాలేమిటి? విభజన ముంగిట నిలిచిన రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి! వీటికి సవివరమైన సమాధానాలతో 'ఆంధ్రజ్యోతి' అందిస్తున్న ప్రత్యేక కథనమిది!

దశాబ్దాలుగా బిగుసుకున్న చిక్కుముడి ఇక వీడిపోనుంది. రాష్ట్ర విభజన దిశగా నిర్ణయం మాత్రం ఖరారైపోయింది. 'ఓడినా ఫర్వాలేదు. అవసరమైతే ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాం. అంతేతప్ప, కేసీఆర్‌లాంటి వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు' అని కొన్ని నెలల క్రితం తేల్చిచెప్పిన సోనియా... ఇప్పుడు విభజనకు సంపూర్ణంగా రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, రాహుల్ భవిష్యత్తు... ఈ మూడు కోణాల్లో ఆలోచనలను మధించిన తర్వాతే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితిపై అధిష్ఠానం కొన్ని నెలల క్రితం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. "ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమం, ఎడతెగని అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన స్తంభించిపోయాయి ఎన్నాళ్లిలా?'' అనే ప్రశ్నపై నేతలు దృష్టి సారించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దలేమనే అంచనాకు వచ్చారు. "పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే... ఆంధ్రప్రదేశ్ మరింత నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితి సుదీర్ఘంగా కొనసాగడానికి అనుమతించిన పార్టీగా కాంగ్రెస్ కూడా నష్టపోతుంది. రాష్ట్రమూ నష్టపోతూ, రాజకీయంగా మనమూ నష్టపోతూ, ఎవరికీ ప్రయోజనం లేని పరిస్థితిని ఎందుకు కొనసాగించాలి? దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకడం తప్పనిసరి'' అని పార్టీ ముఖ్యులు ఆలోచించారు. రాష్ట్ర విభజనా? లేక ఉద్యమాన్ని అణిచివేయడమా? ఏది సాధ్యం? అని ఆలోచించారు. అనివార్యంగా విభజన మార్గాన్నే ఎంచుకున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. విభజన కాకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే, రాజకీయ నష్టాన్ని కూడా భరించి, తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో అణచివేయాల్సి ఉంటుంది.

ఒకవేళ అందుకు సిద్ధపడ్డా.. రాష్ట్రంలో ఆ పని చేయగల సమర్థులు కాంగ్రెస్ హైకమాండ్‌కు కనిపించలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయ్యాక సమర్థంగా వ్యవహరించి తెలంగాణ ఆందోళనలు ఆపగలిగినా.. ఉద్యమాన్ని మాత్రం పూర్తిగా ఆర్పలేకపోయారని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోయారని ఇందులో కాంగ్రెస్ ముఖ్యులు ఒక అంచనాకు వచ్చారు.కిరణ్ స్థానంలో మరొకరిని నియమించాలనుకున్నా, అందుకు తగిన నాయకుడు లేడు. కొత్త సీఎంను తెచ్చిపెట్టినా.. సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ పార్టీ ప్రభావం తగ్గుతున్నా ఆ పరిస్థితి తమకు లాభించడంలేదని, అనూహ్యంగా టీడీపీ లబ్ధిపొందుతోందని కాంగ్రెస్‌కు అంతర్గత సర్వేలు సూచించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని నిఘా వర్గాలు నివేదికలిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తప్ప మరో మార్గం లేదని, దీనివల్ల పార్టీకి కూడా లాభం కలుగుతుందని వ్యూహకర్తలు తీర్మానించారు. వీలైనంత తొందరగా రాష్ట్రాన్ని విభజించి, నవంబరులో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఎన్నికలతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.


ఇంత తొందర ఎందుకంటే...

'దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు విభజనే పరిష్కారం' అని నిర్ణయం తీసుకున్నప్పటికీ... అంత తొందర, ఇంత హడావిడి ఎందుకు? దీనికి ముఖ్యంగా కనిపిస్తున్న కారణాలు ఇవి... సోనియాగాంధీని ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆమె వయసు పెరుగుతోంది. పార్టీపై, దేశ రాజకీయాలపై తన పట్టు ఉండగానే రాహుల్ గాంధీని స్థానాన్ని సుస్థిరపరచాలని ఆమె భావించారు. ఆయనను ప్రధానమంత్రిని చేయాలన్నది ఆమె లక్ష్యం! ఒకవైపు జాతీయ స్థాయిలో, మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో నరేంద్ర మోదీ ప్రభావం పెరుగుతోంది. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇప్పుడున్న దానికంటే భారీగా కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే అవకాశం కనిపించట్లేదు. దక్షిణాదిపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక, ఇప్పటికే అధికారంలో ఉన్న కేరళలో గణనీయ స్థానాలు దక్కించుకుని, పొత్తుల సాయంతో తమిళనాడులోనూ ఎన్నో కొన్ని స్థానాలు దక్కించుకోవచ్చు. "సమైక్యాంధ్రలోనో... విభజన తర్వాత ఉండే రెండు రాష్ట్రాల్లోనో వీలైనన్ని స్థానాలు దక్కించుకోగలిగితే యూపీఏ-3 అధికారంలోకి రావడం తథ్యం. రాహుల్ ప్రధాని కావడం ఖాయం.

నగదు బదిలీ, ఆహార భద్రత, ఇతరత్రా విజయాలను తురుపు ముక్కలుగా చేసుకుని ఆంధప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడే రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలి'' అని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. అందుకే... ఇప్పుడు విభజన ప్రక్రియను అనూహ్యమైన వేగంతో పూర్తి చేస్తోంది. విభజన తర్వాత ఏర్పడే రాయల తెలంగాణలోని 21 లోక్‌సభ స్థానాల్లో... కనీసం 15 - 16 సీట్లను గెలుచుకోగలమని కాంగ్రెస్ లెక్కలు వేసింది. సీమాంధ్ర రాష్ట్రంలోనూ ఎన్నో కొన్ని సీట్లు రావడం ఖాయమని అంచనా వేసింది. మొత్తమ్మీద ప్రస్తుతమున్న 31 లోక్‌సభ సీట్లకు కొంచం అటూఇటుగా మళ్లీ గెలుచుకోవచ్చని అంచనావేసింది. ఒకవేళ విభజన వల్ల సీమాంధ్రలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని, అక్కడ జగన్ పార్టీ గెలుస్తుందని అనుకున్నా పెద్దగా నష్టంలేదని కాంగ్రెస్ లెక్కవేసింది. "జగన్ పార్టీ గెలిచినా ఆయన మాకే మద్దతివ్వక తప్పదు. యూపీఏకే మద్దతిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల ఎలా చూసినా విభజన వల్ల మాకే లాభం'' అని కాంగ్రెస్ ముఖ్యుడొకరు విశ్లేషించారు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం విభజనపై రాకెట్ వేగంతో అడుగులు వేస్తోంది. 'రాయల తెలంగాణ'పై ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మినహా దాదాపు మిగిలిన నాయకులందరినీ కాంగ్రెస్ అధిష్ఠానం ముందే సంప్రదించినట్లు తెలిసింది. వారంతా ఇంకేమీ చెయ్యలేక 'ఓకే' అని తలలూపినట్లు సమాచారం. అలాగే... కేసీఆర్‌తోపాటు, టీ-జేఏసీ ముఖ్యనేతలు కూడా అంతర్గతంగా రాయల తెలంగాణకు అంగీకరించినట్లు చెబుతున్నారు. నదీజలాల సమస్య ఉండదన్నదే 'రాయల తెలంగాణ'కు ప్రధానమైన ప్రాతిపదిక అని పేర్కొంటున్నారు. రాయలసీమను ముక్కలు చేయడంపై ఆ ప్రాంతంలో ఆందోళనలు తలెత్తినా వాటినెలాగైనా పరిష్కరించవచ్చుననే నమ్మకంతో ఉన్నారు.

వెనక్కి వెళ్లలేక ముందుకు...

కొన్నేళ్లుగా తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని ఢిల్లీలో నిలువరిస్తున్న సీమాంధ్ర నాయకులు ఈసారి ఎందుకు విఫలమయ్యారు? 'బలమైన లాబీయింగ్' చేస్తారని పేరు తెచ్చుకున్న వారు ఎక్కడ తప్పటడుగులు వేశారు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరిన సీమాంధ్ర నేతలకు అధిష్ఠానంలోని ముఖ్యులు ఒకే ప్రశ్న వేశారు. "విభజన వద్దు సరే! మరి... తెలంగాణ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆందోళనలు సద్దుమణిగేదెలా? మీలో ఎవరికి కావాలంటే వారికి సీఎం పదవి ఇస్తాం! తెలంగాణ సమస్యను పరిష్కరిస్తారా? ఎంతకాలంలో పరిష్కరించగలరు?'' అని ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పలేక సీమాంధ్ర నేతలు తెల్లమొహం వేశారు. "ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిసి బయటికి వస్తున్న సీమాంధ్ర నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలే. రాజీనామాల ప్రకటనలన్నీ ఉత్తవే. అసలు విషయం వేరే ఉంది. అధిష్ఠానం ప్రశ్నలకు వీరివద్ద జవాబులు లేవు'' అని సీనియర్ నేత ఒకరు అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశాలు బాగాలేవన్న వాదనలను సీఎం కిరణ్ మొదట్నుంచీ తిప్పికొడుతూ వచ్చారు. పార్టీ పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన గణాంకాలతో సహా వివరించినా అధిష్ఠానం పట్టించుకోలేదు. తన మానాన తాను ముందుకెళ్లి నిర్ణయం తీసుకుంది. అయితే.. కిరణ్ మాట నిజమని చివరి దశలో అధిష్ఠానం ముఖ్యులు గ్రహించారు. సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వే కూడా కిరణ్ వాదననే బలపరిచేలా ఉండటాన్ని గమనించారు. అయితే.. తెలంగాణపై అప్పటికే నిర్ణయం తీసుకుని ఉండటం, వెనక్కి రాలేనంత ముందుకు వెళ్లిపోయారు. అందుకే.. ఇప్పుడిక ఏమీ చేయలేం. నిర్ణయం జరిగిపోయింది అని సమాధాన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవహారం ఆఖరి అంకంలో ఉంది. రాష్ట్ర విభజన జరగడం ఖాయం. దీన్ని వీలైనంత ఎక్కువ కాలం వాయిదా వేయడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయడానికి అధిష్ఠానం పావులు కదుపుతోంది. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎవరి మాట నెగ్గుతుందో వేరే చెప్పాలా?!
12 ఏళ్లు పంచుకోవాలి!
తెలంగాణ ఇచ్చి తీరాలనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత సోనియాగాంధీ ఐదుగురు ఐఏఎస్‌లతో ఒక కమిటీ వేసినట్లు తెలిసింది. విభజన దిశగా ఈ కమిటీయే కసరత్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకుని... ఆదాయం, నదీ జలాల పంపిణీ సహా అన్ని అంశాలపై ప్రాథమికమైన నివేదికను కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరు రాష్ట్రాలు 12 సంవత్సరాలపాటు పంచుకోవాల్సి ఉంటుంది. సాగునీటి వనరుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో అనేక సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది. ఆ జాగ్రత్తల ముసాయిదాను కూడా సమర్పించింది. భాగ్యనగరిని కొన్నేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష లేదా పరోక్ష అజమాయిషీలో ఉంచుకోవాలని సూచించింది.

అప్పటిదాకా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తెలిపినట్లు సమాచారం. అయితే... అధికారుల కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేసినా, ఇరువర్గాలతో ఏమాత్రం చర్చలు జరపకుండా విభజన, వనరుల పంపిణీ, ఒప్పందాలకు సంబంధించి ప్రాథమిక అవగాహన కుదిర్చే ప్రయత్నం చేయకుండా విభజనకు వెళ్లడంవల్ల, గందరగోళ పరిస్థితులు ఏర్పడవా? అన్న ఆందోళన సీమాంధ్ర నేతల్లో వ్యక్తమవుతోంది. "ఆదాయం, ఆస్తులు, జలాల పంపిణీ... ఇవన్నీ విభజనపై ప్రకటన చేయకముందే తేలాలి. అప్పుడయితేనే వారినీ, వీరినీ ఆయా అంశాలపై నచ్చజెప్పడానికి వీలవుతుంది. రాష్ట్రం ఇచ్చేస్తామని ప్రకటించిన తర్వాత... ఎవరికి వారు ఆయా అంశాలపై పట్టుపట్టి కూర్చుంటారు'' అని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ... రాయల తెలంగాణవైపే మొగ్గు చూపితే, దానిని బీజేపీ వ్యతిరేకించే అవకాశముంది. మరి... పార్లమెంటులో బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే, అధిష్ఠానం దీన్ని తేలిగ్గానే తీసుకుంటోంది. "పైకి ఏం చెబుతున్నా... రాయల తెలంగాణకు అందరూ ఒప్పుకున్నారు. ఈ బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది. ఇవ్వనిపక్షంలో... తెలంగాణకు అడ్డు తగిలిన పాపం ఆ పార్టీకే చుట్టుకుంటుంది'' అని చెబుతున్నారు.
కేసీఆర్ కో చోడ్‌దే!
హైదరాబాద్-ఆంధ్రజ్యోతి, జూలై 29:
తెలంగాణ ఇచ్చేస్తారు సరే? ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో గరిష్ఠ లబ్ధి సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ ఏం చేస్తుంది? 'టీ-చాంపియన్లం మేమే' అని చెప్పుకొంటున్న టీఆర్ఎస్‌ను ఎలా 'డీల్' చేస్తుంది? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ ముఖ్యులు ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసా? 'టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను మేం లెక్కలోకి తీసుకోవడంలేదు' అని! ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్‌కు తమతో కలవడం తప్ప మరో గత్యంతరం లేదని గట్టిగా నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. అంతేకాదు... టీ-జేఏసీ, ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి జేఏసీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ తమవైపు తిప్పుకొన్నట్టు తెలిసింది. 'తెలంగాణ ప్రకటిస్తే... మా మద్దతు మీకే' అని వారు ఢిల్లీలో హామీ ఇచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న కొందరు ముఖ్య నేతలు కూడా టీ-నిర్ణయం వెలువడిన తరువాత తమ పార్టీలో చేరేలా ఒప్పందాలు కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

'టీఆర్ఎస్‌కో చోడ్ దేవ్. కేసీఆర్ ఈజ్ నోమోర్ ఏ ఫోర్స్. హి ఈజ్ ఎ డిస్‌క్రెడిటెడ్ లీడర్' (కేసీఆర్‌ను పక్కనపెట్టేయండి. ఆయన ఇక ఏమాత్రం బలమైన శక్తికాదు. ఆయన నమ్మకం కోల్పోయారు) అని టీ-వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యుడు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతతో అన్నారు. "కేసీఆర్ నాతో మాట్లాడటానికి ప్రతిరోజూ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు. ఆయనను ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు'' అని కూడా తేల్చేసినట్లు తెలిసింది. టీఆర్ఎస్‌ను విలీనం ముందుగానే విలీనం చేసుకుంటే... 'మా త్యాగం వల్లే కాంగ్రెస్ దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది' అని కేసీఆర్ చెప్పుకొనే అవకాశం ఉంది. అలా చెప్పుకొనే ఆస్కారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంతమాత్రం సిద్ధంగా లేదు. తెలంగాణ ఇచ్చేసిన తర్వాత, ఆ పార్టీ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుని.... క్రమంగా కేసీఆర్‌ను బలహీనపరిచి, తప్పనిసరి పరిస్థితులు కల్పించి, కాళ్ల బేరానికి రప్పించుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి