16, జులై 2013, మంగళవారం

సవరణ తప్పదు!


July 16, 2013
న్యూఢిల్లీ, జూలై 15 : రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమా? లేదా? అవసరమే అన్నది కొందరి మాట! అవసరమే లేదన్నది కొందరు రాజకీయ నాయకుల మాట! వారినీ, వీరినీ పక్కనపెడితే... రాజ్యాంగ నిపుణులు మాత్రం 'సవరణ తప్పనిసరి' అని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని, మూడు ముక్కలైన హైదరాబాద్ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుదుర్చుకున్న పెద్దమనుషుల ఒప్పందం, తదనంతర పరిణామాల నేపథ్యంలో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు, వీటి కారణంగా వచ్చిన జోనల్ వ్యవస్థ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు... వంటివి ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగం ద్వారా ప్రత్యేకంగా సంక్రమించిన అధికారాలు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి), 371(ఈ) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రత్యేకాధికారాలు, ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఆర్టికల్ 371 ద్వారా దాదాపు పది రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నాయి. అయితే, ఈ రాష్ట్రాలను విభజించిన తర్వాత కూడా ప్రత్యేక ప్రయోజనాలు కొనసాగాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఈ సవరణకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్‌ను రాష్ట్రానికి చెందిన కొందరు సంప్రదించారు.

మానవ హక్కుల కోసం పోరాడే ప్రముఖుడిగా రాజీవ్ ధావన్‌కు మంచి పేరుంది. 'రాష్ట్ర విభజన-రాజ్యాంగ సవరణ అవసరం'పై ఆయన ఒక సవివరమైన నివేదిక రూపొందించారు. దీని ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆర్టికల్ 371లోని సెక్షన్ 86లో మార్పులు తప్పనిసరి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను ఇం దులో గుర్తించి... ప్రాంతం, ప్రాతినిధ్యం, ఆస్తులు, ఒప్పందాలు, వనరు లు మొదలైనవి ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇదే నివేదికలో విభజనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఆర్టికల్ 3 సరిపోతుందా?
'రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానంతో పనిలేదు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని విభజించవచ్చు' అని తెలంగాణవాదులు బలంగా చేసే వాదన. నిజమే... ఆర్టికల్ 3 ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఒకకొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఇది సమాఖ్య విధానానికి, ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకమని 1960లో బాబూలాల్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రయోజనాల మాటేమిటి?
జూ రాజ్యాంగం 371, 371(ఎ) నుంచి 'ఐ' వరకు వివిధ రాష్ట్రాలకు కొన్ని ప్రయోజనాలను కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు 371(డి), (ఈ) ప్రకా రం ప్రత్యేకాధికారాలు లభించాయి. 2010లో పీవీ రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ... ఆంధ్రప్రదేశ్‌కు లభించిన అధికారులు ప్రాథమికమైనవిగా గుర్తించింది.

- ఆర్టికల్ 371ను, అందులోని ఉప అధికరణలను అప్పటికి అమలులో ఉన్న రాజ్యాంగ అధికారాల ద్వారా కానీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారాకానీ సవరించలేరు. అంటే... ఆర్టికల్ 368 కింద మాత్రమే వీటిని సవరించాల్సి ఉంటుంది.
- ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయగల అధికారాలున్న ఆర్టికల్ 2, 3, 4ల ద్వారా కూడా ఆర్టికల్ 371(డి)ని సవరించలేరు.
చిన్న(సస్సెషన్ క్లాజ్) సవరణ సరిపోదా?
-ఆర్టికల్ 371(డి)లో సెక్షన్ 1, 3, 9లలో 'ఆంధ్రప్రదేశ్' అనే పదం కనిపిస్తుంది. ఒక సాధారణ సవరణ చేసి 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం' అనే పదానికిబదులు - తెలంగాణ, రాయలసీమ, సీమాంధ్ర రాష్ట్రాలు- అని మార్చేందుకు వీలు లేదు.
- ఈ క్రమంలో బొంబాయిపునర్‌వ్యవస్థీకరణ చట్టం 1960లో సెక్షన్ 85, 86లను పరిశీలించాలి. సెక్షన్ 85 ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 'బొంబాయి' పదాలను 'మహారాష్ట్ర లేదా గుజరాత్ రాష్ట్రం'గా, 'రెస్టాఫ్ మహారాష్ట్ర' పదాన్ని 'మరియు రెస్టాఫ్ మహారాష్ట్ర లేదా తదనుగుణమైన' అని మార్చారు. సెక్షన్ - 86 ప్రకారం... 37వ రాజ్యాంగ సవరణ 1956లోని సెక్షన్ 15లో ఉన్న 'బొంబాయి మరియు మైసూర్' పదాలను 'గుజరాత్ మరియు మహారాష్ట్ర'లుగాను, 'మద్రాసు మరియు కేరళ' పదాలను 'మద్రాసు, మైసూర్ మరియు కేరళ'గా మార్చారు.

- ఆర్టికల్ 371(డి)ని ఒక ప్రత్యేక అవసరం కోసం ఏర్పాటు చేశారు. వాస్తవానికి రిజర్వేషన్ అనేది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. కానీ, ఈ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

- ఈ నేపథ్యంలో సాధారణమైన సవరణ లేదా మార్పుల ద్వారా ఆర్టికల్ 371(డి)లో మార్పులు, చేర్పులు అసాధ్యం. దీనిపై పార్లమెంటులో పునఃచర్చించి, సవరించాల్సి ఉంటుంది.

అయితే రాజ్యాంగ సవరణపై ఇప్పటికిప్పుడు తలలు పట్టుకోవాల్సిన పనిలేదని అటు న్యాయ నిపుణులు, ఇటు రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, రాజ్యాంగ సవరణ గురించి కూడా తప్పకుండా ఆలోచిస్తుందని వారు అంటున్నారు. పైగా, పార్లమెంటులో కొత్త రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, దానితోపాటు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి, రెండింటికీ అవసరమైన ఓట్లను ప్రభుత్వం సాధించుకోవచ్చునని చెబుతున్నారు.

షెడ్యూలు సవరణే...
రాష్ట్ర ఏర్పాటుకు మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదంతో కూడిన రాజ్యాంగ సవరణ అవసరంలేదని తెలంగాణవాదులు చెబుతున్నారు. ఒక రాష్ట్రం ఏర్పాటుకు షెడ్యూలును మాత్రమే సవరిస్తారని, దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ... మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమే అయినా, అది సాధించడం కష్టమేమీ కాదని స్పష్టం చెబుతున్నారు. "కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బిల్లు పెట్టినా మద్దతిస్తామని బీజేపీ చెబుతోంది. మాయావతి కూడా జై తెలంగాణ అన్నారు. ఇతరత్రా అనేక పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తాయి. అవసరమైన మెజారిటీ ఇట్టే వస్తుంది'' అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏ రాష్ట్రానికి.. ఎప్పుడు?
ఆర్టికల్ 371 ప్రకారం ఏయే రాష్ట్రాలకు ఎప్పుడెప్పుడు ప్రత్యేకాధికారాలు కల్పించారంటే..
7వ రాజ్యాంగ సవరణ - 1956 (ఆర్టికల్ 371): మహారాష్ట్ర, గుజరాత్
13వ సవరణ-1962 (ఆర్టికల్ 371 ఎ): నాగాలాండ్‌కు ప్రత్యేకాధికారాలు
22వ రాజ్యాంగ సవరణ 1969 (ఆర్టికల్ 371 బి): అసోం
27వ రాజ్యాంగ సవరణ 1971 (ఆర్టికల్ 371 సి): మణిపూర్
32వ రాజ్యాంగ సవరణ 1973 (ఆర్టికల్ 371డి, 371ఈ): ఆంధ్రప్రదేశ్
36వ రాజ్యాంగ సవరణ 1975 (ఆర్టికల్ 371 ఎఫ్): సిక్కిం
53వ రాజ్యాంగ సవరణ 1986 (ఆర్టికల్ 371 జి): మిజోరం
55వ రాజ్యాంగ సవరణ1986 (ఆర్టికల్ 371 హెచ్): అరుణాచల్
56వ రాజ్యాంగ సవరణ 1987 (ఆర్టికల్ 371 ఐ): గోవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి