July 16, 2013
న్యూఢిల్లీ, జూలై 15 : ఒక విభజన.. ఐదు దశలు! ఎప్పుడో కాదు... వచ్చే
పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు! ఇది... ఢిల్లీ వర్గాలు అందిస్తున్న తాజా
సమాచారం! తెలంగాణపై కోర్‌కమిటీలో చర్చలు ముగించిన కాంగ్రెస్... దీనిని
ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి నివేదించింది. ఆ
తర్వాత... కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనుంది. ఆపైన... విషయాన్ని
రాష్ట్రపతికి నివేదించనుంది. విభజనపై రాష్ట్ర అభిప్రాయాన్ని కోరడం నాలుగో
దశ! చివరగా... పార్లమెంటులో బిల్లు! తెలంగాణ ఏర్పాటులో కీలక దశలు ఇవే అని
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సోమవారం ఢిల్లీలో
జైపాల్‌తో భేటీ అయ్యారు. వారి మధ్య 40 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. భేటీ
సారాంశాన్ని వెల్లడించేందుకు జైపాల్ నిరాకరించినప్పటికీ... వచ్చేనెల 5
నుంచి 30వ తేదీ వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక
రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం బిల్లు పెడుతుందని ఆయన సన్నిహితులు స్పష్టం
చేశారు.దిగ్విజయ్ నుంచి ఆ మేరకు సంకేతాలు అందినట్లు తెలిపారు. ఈ వర్గాల సమాచారం ప్రకారం... ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చలు, పార్టీ వైఖరి, తెలంగాణ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధిష్ఠానం తీసుకోవాలనుకుంటున్న చర్యల గురించి జైపాల్‌కు దిగ్విజయ్ వివరించినట్లు చెబుతున్నారు. "త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశమై తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి నివేదించిన తర్వాత ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం దాన్ని పంపుతారు.
అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి దీనిపై చర్చిస్తారు. అసెంబ్లీ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ... ఆగస్టు నెలాఖరులోపు విభజన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తుంది'' అని పేర్కొంటున్నారు. 'నిర్ణయానికి రాజ్యాంగ సవరణ అవసరం. దీనిపై విపక్షాలతో చర్చించాల్సి రావొచ్చు' అని దిగ్విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని గురించి కూడా దిగ్విజయ్, జైపాల్ మధ్య చర్చ జరిగింది. "రాజ్యాంగ సవరణ అంటే రాష్ట్రాల సంఖ్యను మార్చేందుకు రాజ్యాంగంలోని మొదటి షెడ్యూలును సవరించడమే. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు న్నాయి. విభజన తర్వాత 29కి పెరుగుతాయి. అందువల్ల షెడ్యూలును సవరించాల్సి ఉంటుంది. ఇందుకు సాధారణ మెజారిటీ సరిపోతుంది'' అని జైపాల్ సన్నిహితులు తెలిపారు. అయినా ప్రధాన బిల్లుకు అందరూ అంగీకరించినప్పుడు ఇలాంటి ప్రతిపాదనలన్నీ మూజువాణితో ఆమోదిస్తారని వారు తెలిపారు.
ఓటింగ్‌కు వెళ్లే అవసరంలేకుండా బిల్లును గట్టెక్కించాలన్నదే మెజారిటీ పార్టీల అభిప్రాయమని కూడా చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం... వచ్చేనెల 5వ తేదీలోపే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, కేంద్ర కేబినెట్ నిర్ణయం జరుగుతాయని తెలుస్తోంది. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు. 42 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు చిత్తుగా ఓడిపోయిన వారు 24 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని నివేదిస్తే నమ్మేంత అమాయకత్వం అధిష్ఠానానికి లేదు'' అని జైపాల్ తన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
దిగ్విజయ్‌సింగ్ తన చర్చల్లో రాయల తెలంగాణ గురించి కానీ, హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రతిపత్తి గురించి కానీ మాట్లాడలేదని... ఈ విషయం తెలుసుకునేందుకు జైపాల్ కూడా ప్రయత్నించలేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. కాగా, దిగ్విజయ్ సింగ్ కలుసుకునేముందు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా జైపాల్‌ను కలవడం గమనార్హం. బొత్స కూడా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, దిగ్విజయ్ సింగ్‌లను కలుసుకున్నట్లు తెలిసింది.
కీలక బిల్లులు..: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేనెల 5 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సమావేశాల్లో... ఆహార భద్రతపై జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సభ ఆమోదం పొందడంతోపాటు భూసేకరణ బిల్లు, బీమా బిల్లు, పెన్షన్ బిల్లు, కంపెనీల బిల్లు వంటివి ప్రవేశపెట్టే అవకాశముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి