ధర్మాన, సబితపై 7న నిర్ణయం
July 26, 2013
హైదరాబాద్, జూలై 25: ఏ కేసులోనైనా నిందితులను అవసరమైతే
జైలు(జ్యుడీషియల్ కస్టడీ)కి పంపే అధికారం కోర్టుకు ఉంటుందని సీబీఐ
పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్ వ్యవహారంలో మాజీ
మంత్రి ధర్మాన ప్రసాదరావును, దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో మరో మాజీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జైలుకి పంపాలని కోరింది. ఈ మేరకు గతంలో దాఖలు
చేసిన మెమోపై గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. 'ఈ రెండు
కేసుల్లో నిందితులకు ఇదే సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ ఆదేశాలను
గౌరవించి వారు ఆయా తేదీల్లో హాజరవుతున్నారు. ఎక్కడా అతిక్రమణకు పాల్పడలేదు.
ఈ పరిస్థితిలో ఇదే కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపే అధికారం
లేదు' అని డిఫెన్స్ న్యాయవాది వాదించారు.ఆ అధికారం కోర్టుకు ఎప్పుడూ ఉంటుందని సీబీఐ న్యాయవాది సురేందర్ అన్నారు. తాము నిర్దోషులుగా బయ టకు వస్తామంటూ నిందితులు పేర్కొనడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అంతకు ముందు ధర్మాన, సబిత తమ న్యాయవాది ఉమామహేశ్వరరావు ద్వారా వాదనలు వినిపించారు. 'మాపై దర్యాప్తు జరుగుతుండగా మేమెక్కడా జోక్యం చేసుకోలేదు. అలా చేసి ఉంటే ఇప్పటికే సీబీఐ దానిని బయటపెట్టేది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరేది. కానీ అలా జరగలేదు. కోర్టు సమన్ల మేరకు కోర్టుకు హాజరవుతూ వస్తున్నాం. మా ప్రవర్తనలో ఎక్క డా లోపం లేదు' అని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తాము, కేసులు నమోదైనే వెంటనే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామాలు చేశామని చెప్పారు. ఈ విషయం తమను ఎన్నుకొన్న ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నందునే మీడియాతో మాట్లాడామని వివరించారు.
అది వాక్ స్వాతంత్య్రంలో భాగమే తప్ప ఏ సాక్షులనుద్దేశించి నేరుగా మాట్లాడలేదన్నారు. తమను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలంటూ సీబీఐ కోరేందుకు సరైన కారణాలు లేవని చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలన్నీ కాగితాల్లో, చార్జిషీట్ల రూపంలో ఉన్నపుడు తారుమారు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఆధారం లేని, పస లేని సీబీఐ మెమోను కొట్టేయాలని మాజీ మంత్రులు కోరారు. ఇందుకు సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 'సీఆర్‌పీసీ సెక్షన్ 88 మేరకు.. కోర్టు, తన పరిధిలో ఉన్న నిందితుడిని ఎప్పుడైనా రిమాండ్‌కు పంపొచ్చు' అని చెప్పారు. కోర్టులో తాము నిర్దోషులుగా రుజువు కాబోతున్నామంటూ నిందితులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. వారు మంత్రులుగా పనిచేసి నందున వారి మా టలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయని వాదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా వాక్ స్వాతం త్య్రాన్ని వారే ఉ ల్లంఘించారని పేర్కొన్నారు.
కాలు విరిగి మూడేళ్లయ్యాక ఆపరేషనా?
ఓఎంసీ నిందితుడు బీవీ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదన
మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఓఎంసీ కేసు నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో గురువారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆయన భార్య కాలు విరిగింది 3 ఏళ్ల క్రితమైతే ఇపుడు ఆపరేషన్ చేయించాలని శ్రీనివాసరెడ్డి చెప్పడం సరికాదని సీబీఐ పేర్కొంది. నిందితుడికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అది సరైన కారణం కాదని, బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. అతడు పలుకుబడి కలిగిన వ్యక్తి అని, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించింది. కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి