వైసీపీలో 'చిచ్చు'!
July 26, 2013
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 'విభజన'! సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు ఆ పార్టీలో చిచ్చు పెట్టాయి! ఆ పార్టీ నాయకులు సీమాంధ్ర, తెలంగాణగా చీలిపోయారు! పార్టీ చీలిక దిశగానూ సాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా సీమాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి, అధిష్ఠానం తీరుపై ఆ పార్టీ తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. దీంతో, రాష్ట్ర విభజన సమస్య వైసీపీని సుడిగాలిలా చుట్టేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సీమాంధ్రకు చెందినవారే. తెలంగాణ నుంచి వైసీపీకి చట్టసభల్లో ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయలక్ష్మి మినహా మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలూ సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం రాజీనామా చేయడంతో వైసీపీలోని తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. రాజీనామాల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని నిప్పులు చెరిగారు.
దీనికితోడు, జైల్లో ఉన్న జగన్ నుంచి సిగ్నల్స్ వచ్చిన తర్వాతే పార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతుగా దూకుడు ప్రదర్శిస్తున్నారనే సమాచారం వారికి మింగుడు పడటం లేదు. దీంతో, తెలంగాణపై పార్టీ అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకోవటానికి వారు సిద్ధపడుతున్నారు. వాస్తవానికి, 'తెలంగాణ సమస్యను కేంద్రమే పరిష్కరించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి' అంటూ పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానాన్నే కేంద్ర హోం శాఖ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో చెప్పామని, దానికే కట్టుబడి ఉన్నామని చాలా కాలంగా వైసీపీ చెబుతూ వస్తోంది. అయితే, పార్టీ వైఖరి స్పష్టంగా లేదని, తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తోందని ప్రత్యేకవాదులు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ అంశాన్ని తేల్చే పనిలో పడగా, ఈనెల 17న వైసీపీ ఎమ్మెల్యేలు విభజన సమస్యపై కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖ రాయటం కలకలం సృష్టించింది. 'రాష్ట్ర విభజన కాంగ్రెస్ సొంత వ్యవహారం కాదు.
తొలుత ఆ పార్టీ వైఖరి చెప్పాలి. ఆ తర్వాత ఇతర పార్టీలతో చర్చించాలి' అని ఆ లేఖలో పేర్కొనడం వైసీపీలోని తెలంగాణ నేతల కడుపు మండేలా చేసింది. తెలంగాణ సమస్యను కేంద్రమే తేల్చాలని ప్లీనరీలో నిర్ణయం తీసుకున్న తర్వాత, మళ్లీ పార్టీలతో చర్చించాలని లేఖ రాయటం ఎందుకనే ప్రశ్న వారి నుంచి వచ్చింది. జగన్ ఆదేశం మేరకే పార్టీ ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రికి ఈ లేఖ రాసినట్లు గుర్తించారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక అడుగు ముందుకేసి గురువారం ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. కొందరు పార్టీ నేతలు ఈ రాజీనామాలు వారి వ్యక్తిగతమని కొట్టిపారేసినా.. ఈ పరిణామం పార్టీ తెలంగాణ నేతలకు మింగుడు పడటం లేదు. "తెలంగాణపై ప్లీనరీలో చెప్పింది ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? రాజీనామాల పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. మళ్లీ తెలంగాణ ప్రజలను మోసగిస్తే సహించం'' అంటూ వైసీపీకి చెందిన తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు.
తెలంగాణపై ప్లీనరీ వైఖరికి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. "రాజీనామాలు వారి వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా? అనేది తేలాలి. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టత కోరతాం. వ్యక్తిగత నిర్ణయమైతే వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలి. రాజీనామాలే పార్టీ నిర్ణయమైతే.. మా నిర్ణయం వేరుగా ఉంటుంది'' అని మరో నేత కేకే మహేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. "సమైక్యవాదులతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, కేంద్రం నిర్ణయాన్ని ఆహ్వానిస్తామని జగన్ చెబితేనే.. వైసీపీ తెలంగాణకు అనుకూలమని భావించి మేం ఈ పార్టీలో చేరాం. కానీ, ప్లీనరీలో చేసిన తీర్మానానికి భిన్నంగా.. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణకు అనుకూలం కాకపోతే ఆ విషయాన్ని వైసీపీ స్పష్టంగా చెప్పాలి. అప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం మేం ప్రజల వెంట సాగుతాం'' అని ఇంకో నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజకీయ వ్యూహంతోనే..
వైసీపీ ఎమ్మెల్యేలు పక్కా రాజకీయ వ్యూహంతోనే రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వైసీపీ చతికిలపడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమని తేలిపోయింది. సీమాంధ్రలోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. అదే సమయంలో టీడీపీ పుంజుకోవటం, కాంగ్రెస్ పరిస్థితి తమ కంటే మెరుగ్గా ఉండటం వైసీపీ అధిష్ఠానాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు తెలిసింది. తెలంగాణలో ఎలాగూ పట్టు సాధించే పరిస్థితి లేదు. ఇక మిగిలింది సీమాంధ్ర. కనీసం రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనైనా నెగ్గుకు రావాలంటే, సమైక్యాంధ్ర నినాదాన్ని నమ్ముకోవటం తప్ప మరో మార్గం లేదనే పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రం సమైక్యంగానే కొనసాగితే, ఆ క్రెడిట్ కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు దక్కరాదనే ఎత్తుగడతోపాటు, ఒకవేళ తెలంగాణ ఏర్పడితే వారు సమర్థంగా అడ్డుకోలేకపోయారని, వారికంటే తామే ముందుగా రాజీనామాలు చేశామని చెప్పుకునే వ్యూహం కూడా రాజీనామాల వెనక ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు వ్యతిరేకం కాదని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేసిన రాజీనామాలు ఆ పార్టీని కూడా ఇరుకునపెడతాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి