19, జులై 2012, గురువారం

జగన్ అడ్డంగా దొరికిపోయారా?, బాబు గట్టున పడినా...

జగన్ అడ్డంగా దొరికిపోయారా?, బాబు గట్టున పడినా...

గురువారం, జూలై 19, 2012, 10:48 [IST]
 Is Jagan Crisis With Voting Pranab


హైదరాబాద్: రాష్ట్రపతి రేసులో యుపిఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలనే నిర్ణయం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారా అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అవుననే అంటున్నారు. తనపై, తన పార్టీపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వేధిస్తున్నాయని ఆరోపణలు చేసిన వైయస్ జగన్ అండ్ కో ఇప్పుడు ప్రణబ్‌కు మద్దతివ్వడం ద్వారా టిడిపి చేతికి ఓ ఆయుధాన్ని ఇచ్చారంటున్నారు.
ప్రణబ్‌కు మద్దతివ్వాలనే జగన్ పార్టీ నిర్ణయాన్ని అటు టిడిపి, ఇటు టిఆర్ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయి. జగన్‌కు బెయిల్ తెప్పించుకునేందుకే యుపిఏ అభ్యర్థికి ఆ పార్టీ ఓటేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రణబ్‌కు ఓటు.. జగన్‌కు బెయిల్ అని ఒప్పందం కుదుర్చుకొని వచ్చారని టిడిపి, టిఆర్ఎస్ నేతలు ఘాటుగా ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేకపోయినప్పటికీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలను తరచి చూస్తే రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని చెప్పవచ్చు. దీంతో ప్రణబ్‌కు మద్దతుపై జగన్‌ను నిలదీస్తున్నారు. టిడిపి, కాంగ్రెసులు కుమ్మక్కయ్యాయన్న జగన్ ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారానే ప్రశ్నించేందుకు టిడిపికి అవకాశమివ్వగా, ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆస్కారమిచ్చాయనే చెప్పవచ్చు.
జగన్‌ను వేధిస్తోందన్న కాంగ్రెసు అభ్యర్థికి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించగా.. జగన్ ఆస్తుల కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈ విషయంలో అధిష్టానం ప్రమేయం ఉంటుందని తాము భావించడం లేదని చెప్పారు. నిన్నటి వరకు అధిష్టానం సూచనల మేరకే సిబిఐ పని చేస్తోందని కాంగ్రెసును ధనుమాడిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు ఒక్కసారిగా అధిష్టానం ప్రమేయ ఉంటుందని తాము భావించడం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.
వైయస్సార్ కాంగ్రెసులో ఎందుకు మార్పు వచ్చిందని టిడిపి ప్రశ్నిస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని చెప్పిన జగన్ తెలంగాణ వ్యతిరేకి యుపిఏ అభ్యర్థికి ఎందుకు ఓటు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంది. ఇరు పార్టీలు కూడా విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే దాదాకు మద్దతిస్తున్నారని, త్వరలో జగన్ కూడా బెయిల్ పైన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా జగన్ పార్టీ ఇబ్బందుల్లో పడగా, దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ గట్టున పడిందని చెప్పవచ్చు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయన్న జగన్ పార్టీ ఆరోపణలు టిడిపిని ఉప ఎన్నికలలో ఘోరంగా దెబ్బతీశాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్‌కు మద్దతు ఇవ్వక పోవడంతో కుమ్మక్కు తలనొప్పి బాబుకు దూరమైంది. ఇప్పుడు అది జగన్ వంతు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్లు ఓటు వేయక పోవడం సరికాదనే విమర్శ మాత్రం టిడిపి ఎదుర్కొంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి