3, జులై 2012, మంగళవారం

స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక


ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన కొద్ది రోజులకే దీపిక వారిద్దరి అభిప్రాయాలకు గొంతు కలిపింది.
“అనేక సంవత్సరాలుగా అది స్పష్టంగానే కనపడుతోంది. సానియా మాత్రమే కాదు, జ్వాల కూడా ముందుకు వచ్చింది. అవును, ఆటల్లో పురుష దురహంకారం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంది” అని దీపిక తోటి మహిళా క్రీడాకారులకు బహిరంగంగా తోడు నిలిచింది.
లండన్ ఒలింపిక్స్ కోసం టీం లను ఎ.ఐ.టి.ఎ ఎంపిక చేసిన అనంతరం సానియా మీర్జా అసోసియేషన్ కు లేఖ రాసింది. ‘అసంతృప్తితో రగులుతున్న ఒక సుప్రసిద్ధ భారత టెన్నిస్ క్రీడాకారుడిని శాంతపరచడానికి ప్రలోభంగా ఉపయోగపడవలసి రావడం చాలా అవమానకరంగా ఉంద’ని సానియా ఆ లేఖలో పేర్కొంది. లేఖలో సానియా లియాండర్ పేస్ ను ఉద్దేశించిందని ‘ది హిందూ’ తెలిపింది.
లండన్ ఒలింపిక్స్ లో పాల్గొనే పురుషుల టీం ఎంపికలో ఆటగాళ్ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి. భూపతి, బోపన్న లు తాము లియాండర్ తో జట్టుగా ఆడేది లేదని పత్రికా ముఖంగా ప్రకటించడంతో వివాదం రచ్చకెక్కింది. దేశ ప్రయోజనాలకు ఆడడం కంటే వ్యక్తిగత విబేధాలకే ఆటగాళ్లు ప్రాముఖ్యత ఇస్తున్నారని వీరి వివాదం ద్వారా దేశ ప్రజలకు అర్ధం అయింది.
డేవిస్ కప్ తో పాటు వివిధ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో లియాండర్ అనేక సంవత్సరాలుగా దేశానికి పేరు ప్రతిష్టలు సంపాదించినా ఆయనతో జట్టు కట్టడానికి ఇతర ఆటగాళ్లు సిద్ధపడకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక విధంగా దేశ ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా. పేస్ తో జట్టు కట్టడానికి స్పష్టమైన కారణం ఏదీ భూపతి ఎన్నడూ చెప్పలేదని కూడా వివిధ పత్రికలు తెలియజేశాయి. ఆ విధంగా చూసినా ఆటగాళ్ల అభ్యంతరాలు వ్యక్తిగతమైనవని అనుకోవలసి వస్తోంది.
తాము ఆరు నెలలనుండి జట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నామనీ ఇప్పుడు ఒలింపిక్స్ కి ముందు విడదీయడం భావ్యం కాదని భూపతి, బోపన్నలు అన్నట్లు కొన్ని పత్రికలు, చానెళ్లు తెలిపాయి. ఆడితే ఇద్దరమూ జతగా ఆడతామనీ లేదంటే అసలే ఆడబోమని వారు బహిరంగంగానే పేర్కొన్నారు. అంటే పరోక్షంగా బెదిరింపులకు కూడా దిగారన్నమాట. భూపతి, బోపన్న ల అభ్యంతరాలు దేశ ఉమ్మడి ప్రయోజనాల రీత్యా పక్కన పెట్టదగినవిగా కనిపిస్తున్నాయి. అయినా ఆటగాళ్లు అందుకు సిద్ధపడకపోవడం సమర్ధనీయంగా లేదు. 
ఇదంతా ఒక ఎత్తు కాగా పురుష ఆటగాళ్ల వివాదాన్ని పరిష్కరించడానికి ఎ.ఐ.టి.ఎ ఎంచుకున్న పరిష్కారం మరొక ఎత్తు. భూపతి, బోపన్నల తిరుగుబాటు ను గౌరవిస్తూ వారిని జంటగా కొనసాగడనికి ఎ.ఐ.టి.ఎ అనుమతించింది. మరో వైపు మిక్స్ డ్ డబుల్స్ లో సానియాను జతగా ఎంపిక చేసి లియాండర్ ను సంతృప్తిపరచడానికి ఎ.ఐ.టి.ఎ ప్రయత్నించిదన్నది సానియా ఆరోపణ. లియాండర్ సేవలు దేశానికి అవసరమని భావిస్తే, ఇతర ఆటగాళ్ల తిరుగుబాటును తిరస్కరించయినా సరే, తాను భావించిన పురుషుల టీం నే ఎ.ఐ.టి.ఎ ఎంపిక చేసినట్లయితే సంస్ధతో పాటు, మహిళా ఆటగాళ్ల వ్యక్తిగత సమగ్రతకు కూడా గౌరవనీయంగా ఉండేదేమో. దాని బదులు అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడంతో ఇద్దరి పురుష ఆటగాళ్ల తిరుగుబాటుని గౌరవించి మహిళా ఆటగాళ్ల గౌరవాన్ని తేలిక చేసినట్లయింది.
ఈ నేపధ్యంలో, మహిళా క్రీడాకారుల అసంతృప్తిలో న్యాయం స్పష్టమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి