10, జులై 2012, మంగళవారం

ఆంధ్రా బుల్లోడే మనకాడ మెడికో!



- ntr00 talangana patrika telangana culture telangana politics telangana cinemaలోకల్ కోటాలో ఏటా 20శాతంసీట్లు మాయం
- నాన్‌లోకల్ కింద మరో 15శాతం సీట్ల దోపిడీ
- అన్‌రిజర్వుడ్ సీట్లను నాన్‌లోకల్‌గా మార్చేశారు
- హైకోర్టు తీర్పునూ పక్కనబెట్టారు
- హైదరాబాద్‌లో అయితే ఆటలు సాగవట..!
- అందుకే అడ్డాను తమ గడ్డకు మార్చుకున్నారు
- బెజవాడలో వారిదే హవా... వారిదే వేదం..!!
- దిక్కుతోచని స్థితిలో తెలంగాణ విద్యార్థిబెజవాడ హెల్త్ బీమారి
- తెలంగాణ మెడికల్ సీట్లకు విజయవాడలో కౌన్సెలింగ్
- దొంగ లోకల్ సర్టిఫికెట్లతో సీమాంధ్ర విద్యార్థుల హల్‌చల్

ఒకదాని వెనుక ఒకటి..! దగా.. దగా..!! తెలంగాణ అంటేనే వారికి చెప్పలేని వివక్ష..! తెలంగాణ విద్యార్థులంటే అస్సలే గిట్టదు..!! పోరుగడ్డపై చదువుకునే వారికి ఎక్కడ అందలం అందుతుందోనన్న దురాలోచన, దుర్నీతి.. వారిది. వైద్య విద్యలో అది కట్టలు తెంచుకుంటుంది!! ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టినట్లు సీట్ల లెక్కలు చెబుతారు..! పొంతనలేని లెక్కల చిట్టా తో మసిబూసి మారేడుకాయ చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన 150 ప్రభుత్వ మెడికల్ సీట్లను మాయం చేసిన సీమాంధ్ర పెద్దలు తెలంగాణ సీట్లను గద్దల్లా తన్నుకుపోయేందుకు ఏనాడో వ్యూహరచన చేశారు. నిజానికి తెలంగాణ విద్యార్థుల మెడికల్ సీట్ల కోటాకు తెలంగాణలోనే కౌన్సెలింగ్ చేపట్టాలి. కానీ, సీమాంవూధలోని విజయవాడ కేంద్రంగా కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు.

తెలంగాణలో కౌన్సెలింగ్ చేపడితే తమ ఆటలు సాగవని అడ్డాను తమ గడ్డమీదికి మార్చుకున్నారు..!! లోకల్.. నాన్‌లోకల్ పేరిట తెలంగాణ సీట్లను కూడా తమవారికే కట్టబెట్టాలన్నదే సీమాంధ్ర పెద్దల అసలు పన్నాగమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన విద్యా సంస్థల బ్రాంచ్‌లను తమకు అనుకూలంగా మార్చుకొని స్వస్థలంలో చదివిన సీమాంధ్ర విద్యార్థులు కూడా తెలంగాణలోని బ్రాంచ్‌లలో నాలుగేళ్లు చదివినట్లు దొంగచాటుగా సర్టిఫికెట్లు పొందుతున్నారు. నాలుగేళ్లపాటు ఏ బ్రాంచ్‌లో చదివితే.. ఆ ప్రాంతం(లోకల్ కోటా) కిందికి విద్యార్థులు వస్తారు. ఇలా పొందిన దొంగ సర్టిఫికెట్లతో సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ లోకల్ కోటా కింది వైద్య విద్య సీట్లు కాజేస్తున్నారు. కౌన్సెలింగ్‌ను తెలంగాణలో పెడితే ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో ఏకంగా సెంటర్‌ను తమ ప్రాంతానికి తరలించుకుపోయారు.

దొంగ సర్టిఫికెట్లతో లోకల్ కోటా కింద ఏటా 20శాతం సీట్లు సీమాంధ్ర విద్యార్థులు కాజేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక, అన్‌రిజర్వుడులో ఉండాల్సిన 15 శాతం సీట్లను నాన్‌లోకల్ పేరిట మింగేస్తున్నారు. అన్‌రిజర్వుడ్ సీట్లను యథాతథంగానే ఉంచాలని హైకోర్టు చెప్పినా ఖాతరు చేయడం లేదు..! తమ వారికోసం ఎలాంటి కుట్రలకైనా సీమాంధ్ర పెద్దలు తెరతీస్తారనడానికి మెడికల్ సీట్ల బాగోతమే ప్రత్యక్ష నిదర్శనం..!!
medico1 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్ జూలై 10 (టీ మీడియా):మెడికల్ సీట్ల వ్యవహారంలో సీమాంధ్ర పెద్దలు నాటినుంచి తెలంగాణ విద్యార్థులను నిలువునా ముంచుతున్నారు. వీలుదొరికినప్పుడల్లా సీట్లను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ సీట్ల పెంపులో జరిగిన వివక్షపై ఓ వైపు తెలంగాణ విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తుండగానే.. మరో వైపు తెలంగాణ కోటాలోని మెడికల్ సీట్లకు విజయవాడలో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని సీట్లకు తెలంగాణలో కౌన్సెలింగ్ చేపడితే తమ బాగోతం బయటపడుతుందని అడ్డాను ఏనాడో తమ ప్రాంతానికి మార్చుకున్నారు. దొంగ సర్టిఫికెట్లు పుట్టించి లోకల్, నాన్‌లోకల్ కింద సీట్లను కాజేయొచ్చని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని ఐదువేల పైచీలుకు ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు హెల్త్ యూనివర్సిటీ కేంద్రమైన విజయవాడలో ఏటా కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. విజయవాడకు తెలంగాణ ప్రాంతం నుంచి విద్యార్థులు ఎంతో వ్యయవూపయాసలకోర్చి కౌన్సెలింగ్‌కు వెళ్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ఇక్కడే అసలు విషయం దాగుంది. కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కాకుండా, ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని..! తెలంగాణలోని సీట్లు తెలంగాణ విద్యార్థులతోనే కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలి. అంటే సీమాంవూధలోని సీట్లకు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏమాత్రం సంబంధం లేదన్నమాట. ఈ లెక్కన తెలంగాణ సీట్లను ఇక్కడి విద్యార్థులతోనే నింపినట్లయితే.. తెలంగాణకు కేంద్రమైనా హైదరాబాద్‌లోనే కౌన్సెలింగ్ నిర్వహించొచ్చు. కానీ, అలా చేయడం లేదు. తెలంగాణ సీట్లను విజయవాడలో నింపుతున్నారు. అక్రమ దందా కోసమే అక్కడ వేదికను ఏర్పాటు చేసుకున్నట్లు విద్యా విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

అక్రమ దందాకు వేదిక బెజవాడ!
తెలంగాణ సీట్లను హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తే సీమాంధ్ర పెద్దల అక్రమాలు సాగే అవకాశం లేదు. ప్రస్తుతం నింపుతున్న సీట్ల విధానం చూస్తే.. తెలంగాణలో నాలుగేళ్లు చదువుకున్న విద్యార్థి ఎవరైనా ఆ కాలేజీ నుంచి లోకల్ సర్టిఫికెట్ తీసుకెళ్తే అతనికి తెలంగాణ లోకల్ కోటాలో సీటు దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఒకే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా బ్రాంచ్‌లున్న కాలేజీలు చాలానే ఉన్నాయి. సీమాంధ్ర విద్యార్థి తమ స్వస్థలంలో చదువుకొని.. తెలంగాణలోని బ్రాంచ్‌లో చదువుకున్నట్లు డబ్బులు కట్టి సర్టిఫికెట్ తెచ్చుకుని తెలంగాణ విద్యార్థిగా సీటు పొందుతున్నాడు. ఇదే పరిస్థితి ఏటా నడుస్తోంది. దీని వల్ల 85శాతం లోకల్ కోటా గల సీట్లలో 10 నుంచి 20 శాతం సీట్లను దొంగ సర్టిఫికెట్లతో సీమాంధ్ర విద్యార్థులు తన్నుకుపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లోకల్ కోటా కింద సీటు పొందిన విద్యార్థి తెలంగాణ కాలేజీల్లో చదివాడా..? లేడా..? అన్నది విజయవాడలో గుర్తించడం సాధ్యం కాదు..! కనుక కౌన్సెలింగ్‌ను అక్కడే కొనసాగించేందుకు సీమాంధ్ర పెద్దలు, అధికారులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌లో కనుక కౌన్సెలింగ్ నిర్వహిస్తే ముందుగా లోకల్ కోటా 85శాతాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు విద్యార్థి తాను కోరుకున్న స్పెషలైజేషన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన 15శాతం అన్‌రిజర్వుడు సీట్లకు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీ పడటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇది జరగనీయొద్దనే లక్ష్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెద్దలు పకడ్బందీగా పావులు కదిపారన్న విమర్శలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా 85శాతం సీట్లు లోకల్, 15శాతం అన్‌రిజర్వుడుగా ఉన్నదాన్ని మార్చి 15శాతం నాన్‌లోకల్ కోటాగా నింపుతున్నారు. 1986లో ఇలాగే జరిగితే 1987లో హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీన్ని అన్‌రిజర్వుడుగా నింపాలని ఆదేశించింది. అయినా అప్పటినుంచి ఇప్పటివరకు నాన్‌లోకల్‌గానే నింపుతున్నారు. ఈ 15శాతం తెలంగాణ సీట్లను నాన్‌లోకల్ సర్టిఫికెట్లతో సీమాంధ్ర విద్యార్థులు కాజేస్తున్నారు. పైగా ముందు లోకల్ సీట్లను నింపకుండా, నాన్‌లోకల్ పేరిట సీట్లు భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ఏటా వందలాది మంది తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కౌన్సెలింగ్ పెడితే ఇది సాధ్యం కాదని గతంలోనే నిరూపితమైంది. గతంలో హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణవాదులు నాన్‌లోకల్ అన్న పదాన్ని మార్చి అన్‌రిజర్వుడుగా సీట్లు భర్తీ చేయించారు. అప్పుడు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. దీన్ని గుర్తించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు విజయవాడ కేంద్రంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ నాన్‌లోకల్ కోటా కింద సీమాంవూధవారికి 15శాతం సీట్లు యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు.

ఆదిలాబాద్ విద్యార్థి విజయవాడ వెళ్లగలడా?
తెలంగాణ సీట్లకు కౌన్సెలింగ్ తెలంగాణలోని ఏ జిల్లాలోనైనా చేపట్టొచ్చు. కానీ, తెలంగాణకు అస్సలే సంబంధం లేని విజయవాడలో చేపడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఉన్న విద్యార్థి తెలంగాణలోని ఏ జిల్లాలోనైనా కౌన్సెలింగ్ చేపడితే అక్కడికి వెళ్లడం సులువుగా ఉంటుంది. ఎలాంటి వ్యయవూపయాసలు ఉండవు. విజయవాడలో చేపట్టడంతో అంతదూరం వెళ్లడం ఖర్చుతో కూడుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి మెడికల్ కౌన్సెలింగ్ కోసం విజయవాడకు వెళ్లాలంటే దాదాపు 600కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్ కేంద్రంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తే కేవలం 300కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసి హాజరుకావచ్చు. తెలంగాణ సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే నింపినప్పుడు అక్కడిదాకా ఎందుకు పిలుస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.

‘బీ’ కేటగిరి ఫీజుపై సడలింపు ఇవ్వాలి
ప్రస్తుతం మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడు కేటగిరిల్లో సీట్ల భర్తీ జరుగుతోంది. 50శాతం కన్వీనర్ కోటా, 10శాతం బీ కేటగిరి, మిగిలిన 40శాత మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోటా కింద మెజార్టీ సీట్లు భర్తీ అయ్యాయి. బీ కేటగిరిలోని 10శాతం సీట్ల ఫీజు విషయంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీ కేటగిరిలో సీటు ఖరారు కాగానే రూ. 2.50లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ విద్యార్థి కన్వీనర్ కోటా కింద ఫ్రీ సీటు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ఫ్రీ సీటు వస్తే కట్టిన డబ్బు వెనక్కి తిరిగి రావడానికి సమయం పడుతుంది. ముందుగా రూ. రెండున్నర లక్షలు కట్టాలనే నిబంధన వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు సీటు పొందినా డబ్బు కట్టలేక సీటు పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి.

2010-11విద్యా సంవత్సరంలో 44మంది ఎస్సీలు, 32మంది ఎస్టీ విద్యార్థులు ఇలాగే రూ. రెండున్నర లక్షల ఫీజు కట్టలేక సీటును వదులుకున్నారు. కేవలం కాలేజీ ఫీజు రూ. 10వేలు కట్టించుకొని ఉంటే వీరు ఫ్రీ సీట్లకు తర్వాత పోటీ పడే అవకాశం ఉండేది. కానీ ‘బీ’ కేటగిరి సీట్లను కాదనుకున్న తర్వాత కన్వీనర్ సీట్లవైపు కూడా దృష్టి సారించడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గనుక బీ కేటగిరిలో సీటు ఖరారైన తర్వాత కాలేజీ ఫీజు రూ.10వేలు కట్టించుకొని, ఆ తర్వాత ఫ్రీ సీటు వస్తే అదే ఫీజుకు ఇక్కడికి డైవర్ట్ చేస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఒకవేళ ఫ్రీ సీటు రాకుంటే ఆ తర్వాత బీ కేటగిరి ఫీజును కట్టించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి