18, జులై 2012, బుధవారం

ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా


ప్రేమ పెళ్ళిళ్ళు నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా అసారా గ్రామ పంచాయితీ ఫత్వా జారీ చేసింది. 40 యేళ్ళ లోపు మహిళలు ఒంటరిగా మార్కెట్ కి కూడా వెళ్లరాదంటూ నిషేధం విధించింది. ఆడ పిల్లలు రోడ్లపైన మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడాన్నీ నిషేధించింది. ఆనక తమది ఫత్వా కాదని 36 కులాల వాళ్ళం కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయమని పంచాయితీ పెద్దలు తమ రూలింగ్ ని సమర్ధించుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా అధికారులనుండి ఈ రూలింగ్ పై నివేదిక కోరగా హోమ్ మంత్రి చిదంబరం ఫత్వాలు చెల్లవని ప్రకటించాడు.
జులై 11 న జరిగిన పంచాయితీ సమావేశంలో ఈ ఉత్తర్వులు ఆమోదించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కులాంతర వివాహం చేసుకున్న యువతీ, యువకులను పరువు పేరుతో హత్యలు చేయిస్తున్న ఖాఫ్ పంచాయితీలు అధికారికంగా, వ్యవస్ధాగతంగా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామం ద్వారా స్పష్టం అవుతోంది. మహిళల ప్రజాస్వామిక భావనలు భరించలేని స్ధితిలో ఉంటూ వారిపై అణచివేతను కొనసాగించడానికి మరిన్ని మార్గాలు వెతుకుతున్నట్లు స్పష్టం అవుతోంది.
అసారా గ్రామ పంచాయితీ ఉత్తర్వులపై తక్షణం నివేదిక ఇవ్వాలని యు.పి రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా మేజిస్ట్రేటు ను కోరింది. ప్రేమ పెళ్లిళ్లపైనా, 40 సం.ల లోపు మహిళలు తోడు లేకుండా షాపింగ్ కి వెళ్లడం పైనా నిషేధం విధించడంతో పాటు మహిళలంతా ఇల్లు దాటి బైటికి వస్తే తలపై ముసుగు కప్పుకోవాలని కూడా అసరా పంచాయితీ ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారు గ్రామంలో నివశించడానికి అనర్హులని ప్రకటించింది. పొద్దు కుంకాక 40 లోపు మహిళలు అసలు బైటికే రావద్దని పంచాయితీ పెద్దలు చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
నోరు మెదపని అజిత్, ఖండించిన చిదంబరం
మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అసారా పంచాయితీ కేంద్ర విమానయాన మంత్రి అజిత్ సింగ్ నియోజకవర్గంలో ఉంది. అయితే పంచాయితీ ఉత్తర్వులపై వ్యాఖ్యానించడానికి అజిత్ సింగ్ రోజంతా నిరాకరిస్తూనే ఉన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది. బహుశా ఓట్లు పోతాయన్న భయం అజిత్ నోటిని మూసి ఉండవచ్చు.
అయితే యు.పి ఓటర్లతో పని లేని చిదంబరం మాత్రం పంచాయితీ ఉత్తర్వులను ఖండించాడు. ప్రజాస్వామిక వ్యవస్ధలో అలాంటి ఆంక్షలకు తావులేదని చెబుతూ వారి ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై పంచాయితీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరోధిస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ఖాఫ్ పంచాయితీలు, ఫత్వా, డ్రస్ కోడ్స్ లాంటి పంచాయితీ ఉత్తర్వులకు ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేదనీ ఆ మేరకు పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలనీ ఆయన కోరాడు.
గ్రామస్ధుల మద్దతు
“ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్ధిస్తున్నాం. ఆడపిల్లలు ఒంటరిగా గ్రామంలో నడుస్తుంటే అనేక సమస్యలు తలేత్తుతాయి” అని ఒక గ్రామస్ధుడు వ్యాఖ్యానించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆడ పిల్లలు ఒంటరిగా నడుస్తున్నపుడు సమస్యలు సృష్టిస్తున్నవారిని వదిలేసి ఒంటరిగా నడవడాన్నే గ్రామస్ధులు తప్పు పడుతున్నారు. యువకులు కూడా ‘హేండ్స్-ఫ్రీ’ సౌకర్యం (చేతితో ఫోన్ పట్టుకోకుండా బ్లూ టూత్ సాయంతో మాట్లాడే సౌకర్యం) ఉన్న సెల్ ఫోన్లు వాడరాదని కూడా పంచాయితీ తీర్మానించిందని సదరు చానెల్ తెలిపింది.
పంచాయితీ నిర్వహించినవారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినపుడు గురువారం రాత్రి గ్రామంలో పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పంచాయితీ సభ్యులను అరెస్టు చేసిన ఇద్దరు పోలీసులపై గ్రామస్ధులు దాడి చేసి కొట్టారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుకున్నారు. బస్సుల్లోకి జొరబడి ప్రయాణీకులపై చేయి చేసుకున్నారు. దానితో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేయక తప్పలేదు. భాగ్ పట్ పోలీసులు ఇపుడు 10 మంది గ్రామస్ధూలపై కేసులు నమోదు చేశారు.
గ్రామస్ధుల అభిప్రాయాలు
బ్రిటన్ పత్రిక ‘డెయిలీ మెయిల్’ అసారా గ్రామస్ధుల్లో కొందరి అభిప్రాయాలు సేకరించింది. ఆ పత్రిక ప్రకారం ఈ తీర్మానాలను పంచాయితీ ఫిబ్రవరి నెలలోనే ఆమోదించింది. అయితే వాటిని గ్రామస్ధులు పెద్దగా పట్టించుకోనట్లు అనుమానం కలగడంతో జులై 11 న సమావేశమై మరోసారి గుర్తు చేసింది. “మా ఆదేశాలను కొందరు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోవడం లేదని మేము గమనించాము. అందుకే బుధవారం సమావేశం జరిపి ఆదేశాలను ఉల్లంఘించినవారిని మొదట వెలి వేయాలని అనంతరం గ్రామ బహిష్కరణ విధించాలని నిర్ణయించాం. ఆదేశాలు పాటించేలా చేయడానికి ఇంకా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్ధితి వస్తే అప్పుడు చూస్తాం” అని పంచాయితీ సభ్యుడయిన 50 యేళ్ళ మహమ్మద్ మోహ్కామ్ డెయిలీ మెయిల్ తో అన్నాడు. గ్రామంలో 70 శాతం ముస్లింలు కాగా 30 శాతం హిందువులని, హిందువుల్లో ఎక్కువమంది జాట్ లనీ పత్రిక తెలిపింది.
“అబ్బాయిలు కూడా ఇయర్ ఫోన్లు వాడరాదని మేము కోరుతున్నాం. ఎందుకంటే రోడ్లపైన హారన్ లను వారు వినకుండా యాక్సిడెంట్లు చేస్తున్నారు. గ్రామంలో మహిళలు తమ తలపై ముసుగు వేయాలి. గ్రామం దాటి వెళితే వారు ముసుగు తొలగించవచ్చు” అని మోహ్కామ్ తెలిపాడు. “ప్రేమ పెళ్ళిళ్ళు సమాజానికి అవమానం. అవి తల్లిదండ్రులకు, ముఖ్యంగా అమ్మాయి కుటుంబాలకి చాలా బాధాకరం.  ఎందుకంటే వారి తల్లిదండ్రుల గౌరవాన్ని భంగం కలిగిస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకునేవారినెవరినీ గ్రామంలో ఉండనీయం” అని మరో పంచాయితీ సభ్యుడు సత్తార్ అహ్మద్ అన్నాడు. 40 యేళ్ళ మహిళలు మార్కెట్ కి వెళ్లకుండా నిషేధించడాన్ని సమర్ధిస్తూ “దానివల్ల నేరాలు జరుగుతాయి” అని ఆయన వ్యాఖ్యానించాడు. తలకు ముసుగువేసుకుంటే అమ్మాయిలకే భద్రత అనీ సమర్ధించాడు.
గ్రామంలోని హిందూ, ముస్లిం ప్రజల్లో అత్యధికులు పంచాయితీ ఫత్వాకు మద్దతు ఇచ్చారు. “మహిళలు వాటిని పాటించి తీరాల్సిందే” అని విజేందర్ కశ్యప్ అన్నాడు. “అమ్మాయిలు మొబైల్స్ ఉపయోగించకుండా పూర్తి నిషేధం విధిస్తే నేనింకా సంతోషించి ఉండేవాడిని” అని తరుణ్ చౌదరి వ్యాఖ్యానించాడు. మహిళలు కూడా ఫత్వాకు మద్దతు పలికారు. “వారు నిర్ణయించినవి అన్నీ అనుసరించవలసిందే. వాదప్రతివాదాలకు స్ధానం లేదు” అని 40 యేళ్ళ గీతా దేవీ వ్యాఖ్యానించింది.
23 యేళ్ళ నీతూ సింగ్ అభిప్రాయం కొంచెం తేడాగా ఉంది. భాగ్ పట్ లో ఎం.ఏ చదువుతున్న నీతూ ఇలా అన్నది. “గ్రామంలో మహిళలు తలకు ముసుగు వేయాలన్న ఆదేశాన్ని నేను అంగీకరిస్తాను. కానీ మా తల్లిదండ్రులతో సంబంధంలో ఉండాలంటే మొబైల్ ఫోన్ చాలా అవసరం కదా.” స్వంత అవసరం తనపై ఆంక్షను వ్యతిరేకించేలా చేసినప్పటికీ మహిళలపై ఉన్న  సామాజిక వివక్షపై అవగాహన లేకపోవడం వల్ల సదరు అణచివేతకు మద్దతు పలికేలా నీతూను ప్రోద్బలించింది.
మరో పంచాయితీ సభ్యుడయిన 62 యేళ్ళ ఇస్లాముద్దీన్ ఇలా అన్నాడు, “అపరిపక్వంగా (immature) ఉండే మా అమ్మాయిలు గానీ, చెల్లెళ్ళు గాని మొబైల్ ఫోన్ వాడరాదని మా అభిప్రాయం. ఎందుకంటే అనేక సమస్యలకు అది దారి తీస్తుంది. ఎం.ఎం.ఎస్ క్లిప్ లు తీయడానికి ఫోన్ లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిందేకదా. ఏ తప్పులూ చేయకుండా వారిని నిరోధించాలని, చెడ్డవారి నుండి వారిని కాపాడాలనీ కోరుకుంటున్నాం” అని ఇస్లాముద్దీన్ అన్నాడు.
చట్టాల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రక్షణ యంత్రాంగం పేరుతో నిర్మించిన వ్యవస్ధలన్నీ ప్రజలకు రక్షణ ఇవ్వడం కంటే పాలకులకు రక్షణ ఇవ్వడానికే సమయం అంతా గడిపేయడంతో చట్టాల గొప్ప ప్రజల వాకిటికి రావడం లేదు. ఆధునిక టెక్నాలజీ ద్వారా వచ్చిపడుతున్న నేరాలకు కూడా పంచాయితీలే రక్షణ కల్పించవలసి రావడాన్ని బట్టి పోలీసు వ్యవస్ధపై ప్రజలకి నమ్మకం లేదని గ్రహించవచ్చు. నిత్యావసర సరుకులను ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా విఫలం అయిన పాలకులు రక్షణ ఇవ్వగలమన్న భరోసాను కూడా ప్రజలకు చేరవేయలేకపోయారు.
భారత దేశ గ్రామీణ వ్యవస్ధలో భూస్వామ్య అభివృద్ధి నిరోధక భావజాలం మహిళలపై అణచివేత కొనసాగిస్తున్నదనీ, తనపై రుద్దబడుతున్న దళారీ, సామ్రాజ్యవాద పెట్టుబడుల సామాజిక అనివార్యతలకు సైతం ప్రతిఘటన కొనసాగిస్తున్నదనీ, ఆ ప్రతిఘటనకు అంతిమంగా మహిళలు, దళితులు లాంటి బలహీన వర్గాల వారే బలవుతున్నారనీ అసారా పంచాయితీ ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి. ఆధిపత్య వ్యవస్ధల భావాజాలంలోతో అణచివేతకు గురవుతున్న వర్గాలు సైతం ఆమోదం ప్రకటించే వ్యవస్ధల సాధారణత్వాన్ని డెయిలీ మెయిల్ వెల్లడించిన గ్రామస్ధుల అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి