ప్రణాళికా
లోపం, ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్యను
తీవ్రంగా ఎదుర్కొంటుండగా వినియోగదారులకు శాపంగా మారింది. ఇటీవల పెరిగిన
విద్యుత్ చార్జీలు ప్రజలకు మోయలేని భారంగా మారాయి. గృహ వినియోగదారులు,
పరిశ్రమలు, చక్కెర పరిశ్రమ నుంచి కుందేళ్ల ఫారాలు, కోళ్ల ఫారాలు,
దోబీఘాట్‌లకు కూడా పెంచారు. ఎవరినీ వదిలిపెట్టకుండా చార్జీలను బాదారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగించడం రైతులకు ఊరట కలిగించినపప్పటికీ
రాష్ట్ర ప్రజలపై పెంచిన విద్యుత్ చార్జీల భారం 4442 కోట్లు. పెరిగిన
చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇంత భారీ ఎత్తున విద్యుత్
చార్జీలను 2000 సంవత్సరంలో పెంచారు. గృహ వినియోగదారులపై పెంచిన విద్యుత్
చార్జీల భారం 930 కోట్లు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడం,
మోయలేని సబ్సిడీల భారం, చాలినంత విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో
పెద్దపరిమాణంలో ట్రాన్స్‌కో విద్యుత్ కొనుగోళ్లు చేస్తోంది. క్రమ పద్ధతి
ప్రకారం చార్జీలను పెంచకుండా, ఓట్ల రాజకీయ కోణంలో విద్యుత్ సంస్థలను
నిర్వహించే ధోరణి వల్ల విద్యుత్ చార్జీలను పెంచక తప్పలేదు. విద్యుత్ రంగం
యాజమాన్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన విధానాలు అనుసరించకపోవడం వల్ల
డిస్కాంలు, ట్రాన్స్‌కో కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో
గత్యంతరం లేని స్థితిలో చార్జీలను పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం
చెబుతున్నప్పటికీ సామాన్యులపై మోయలేని భారం పడింది. 1.08 కోట్ల మంది
వినియోగదారులపై చార్జీల భారం పడదని అంటున్నా, కనెక్టడ్ లోడ్ పేరుతో
పెంచుతున్నారు. వినియోగదారుల కనెక్టడ్ లోడు 500 వాట్‌లు దాటితే ఒక రకం
చార్జీ, ఆ లోపు వినియోగదారులకు మరో రకం చార్జీలను వసూలు చేస్తారు. 500
కనెక్టడ్ లోడు దాటితే వంద యూనిట్లకు గృహ వినియోగదారులు ప్రస్తుతం 212.50
చెల్లిస్తే, కొత్త చార్జీ కింద 260 చెల్లించాల్సి ఉంటుంది. 500 కనెక్టడ్
లోడు కింద ఉన్న వారిపై చార్జీల ప్రభావం ఉండదని చెబుతున్నా, ఈ రోజు
సామాన్యుడి ఇంట్లో కూడా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్, టీవీ
ఉన్నాయి. 500 కనెక్టడ్ లోడు ఆధారంగా గృహ, వాణిజ్య రంగాలను రెండు
కేటగిరీలుగా విభజించారు. సామాన్యుల జేబులు ఖాళీచేసే విధంగా ఏపిఇఆర్‌సి
సంస్థ విద్యుత్ చార్జీల పెంపుదలకు పచ్చజెండా ఊపిందనే విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. డిస్కాంలు 4950 కోట్ల మేర చార్జీలు పెంచేందుకు
అనుమతించాలని కోరగా, ఏపిఇఆర్‌సి 4442 కోట్ల చార్జీల పెంపుదలకు
సమ్మతించింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 34,343 కోట్లు అవసరం కాగా
9800 కోట్ల వరకు లోటు ఉంటుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం 5358 కోట్ల
సబ్సిడీని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో 3620 కోట్లు వ్యవసాయం ఉచిత
విద్యుత్ కోటాలో, 1736 కోట్లు గృహ వినియోగదారులకు కేటాయించనున్నారు.
మిగిలిన లోటు 4442 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవాలని ఏపిఇఆర్‌సి
పేర్కొంది. విద్యుత్ చార్జీల నిర్ణయంలో టెలిస్కోపిక్ విధానాన్ని కూడా
ఏపిఇఆర్‌సి రద్దు చేసింది. టెలిస్కోపిక్ పద్ధతిలో 50 యూనిట్ల వరకు 1.45
పైసలు, 51 నుంచి వంద యూనిట్ల వరకు యూనిట్‌కు 2.80 పైసలు చార్జీ అమలులో
ఉండేది. కొత్త శ్లాబ్‌లో 500 కనెక్టడ్‌లోడు దాటితే 0-100 వరకు యూనిట్‌కు
2.60 పైసలు చెల్లించాల్సిందే.
విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో
విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 16,606 మెగావాట్లు ఉంది. విద్యుత్ డిమాండ్
సగటున రోజుకు 300 ఎంయుకు చేరుకుంది. సగటున రోజూ 40 నుంచి 50 ఎంయు విద్యుత్
లోటు ఉంటోంది. ఈ ఏడాది 93వేల యూనిట్ల వరకు విద్యుత్ అవసరమని అంచనా వేయగా,
81 వేల యూనిట్ల వరకు అందుబాటులో ఉంటుందని, 12 వేల ఎంయు విద్యుత్ లోటు
ఏర్పడుతుందని లెక్క కట్టారు. పది సంవత్సరాల్లో ఒక ఎంటి బొగ్గు ధర 1224
నుంచి 2486కు పెరిగింది. వెయ్యి ఎస్‌సిఎం గ్యాస్ ధర 4550 నుంచి 8789కు
పెరిగింది. విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు 1.81 పైసల నుంచి 3.05 పైసలకు
పెరిగింది. విద్యుత్ కొనుగోలు ధర 68.5% పెరిగింది. ఇక సమృద్ధిగా సహజ వాయువు
నిక్షేపాలు ఉన్నా, రిలయన్స్ సంస్థ అనుసరిస్తున్న తీరు వల్ల మన రాష్ట్ర
ప్రజలకు శాపంగా మారింది. 2700 మెగావాట్ల గ్యాస్ విద్యుత్‌కు కేవలం 1200
మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు రెండు వేల మెగావాట్ల గ్యాస్
విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణమై ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. మరో రెండు వేల
మెగావాట్ల గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం త్వరలో పూర్తవుతుంది.
గ్యాస్ కేటాయింపులు తగ్గిస్తామని రిలయన్స్ ప్రకటించడంతో ముందు 15,438 ఎంయు
గ్యాస్ ఆధారిత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆనందపడిన డిస్కాంలు 9189
ఎంయు గ్యాస్ విద్యుత్ అయినా లభిస్తుందని ఏఆర్‌ఆర్‌లో ప్రతిపాదించాయి.
చివరకు అది కూడా అబద్ధమని తేలడంతో 6514 ఎంయు గ్యాస్ విద్యుత్ మాత్రమే
లభిస్తుందని చివరి నిమిషంలో ప్రతిపాదనలను ఏపిఇఆర్‌సికి ఇచ్చాయి. గ్యాస్
కొరతతో చాలినంత విద్యుత్ అందుబాటులోకి రాకపోవడంతో పరిశ్రమలకు మూడు రోజుల
పవర్ హాలిడే ప్రకటించారు. పరిశ్రమ వర్గాల ఆందోళనతో ఇప్పుడు ఒక రోజు పవర్
హాలిడేకి ప్రభుత్వం దిగి వచ్చినా, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. గ్యాస్
కొరత వల్ల డిస్కాంలపై 871 కోట్ల ప్రభావం పడింది. మరోవైపు దాదాపు అన్ని రకాల
విద్యుత్ ప్లాంట్‌లు కలిపి 31 వరకు ఉన్నాయి. ఈ ప్లాంట్‌లు పర్యావరణ
అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్,
ఉత్తరాంధ్ర, నెల్లూరు తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున థర్మల్ ప్లాంట్లకు
ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. భూసేకరణ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం
వల్ల ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా వీటి పరిస్థితి తయారైంది. ప్రభుత్వంలో
నెలకొన్న గందరగోళం, రాజకీయ అనిశ్చితి వల్ల విద్యుత్ ప్లాంట్లు ముందుకు
కదలడం లేదు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో మంచి పేరున్న జెన్కో
19వేల మెగావాట్ల కెపాసిటీ ఉన్న 23 వివిధ ప్రాజెక్టులను నిర్మించాల్సి
ఉంది. జెన్కోకు అవసరమైన నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం ముందుకురావాలి.
ప్రభుత్వం విద్యుత్ విధానంపై నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి.
విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు తేవాలి. రిలయన్స్ గ్యాస్ కేటాయింపులు
పెంచుకోవాలి. లేనిపక్షంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు రావు.
వినియోగదారులపై చార్జీల భారం పెరుగుతుంది. చాలినంత విద్యుత్ సరఫరా చేయలేక,
తగినన్ని నిధులు లేక డిస్కాంలు దెబ్బతినే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి