3, జులై 2012, మంగళవారం

గాలి బెయిల్ కేసు: సిబిఐకి యాదగిరిరావు టోకరా?



 Gali Bail Case Yadagiri Cheats Cbi

హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసులో మధ్యవర్తి యాదగిరి రావు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కే టోకరా వేశాడట. సిబిఐ అధికారులు మే 26న యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ డీల్‌లో తనకు ముట్టినది రూ.9.5 లక్షలేనని అప్పుడు అతను చెప్పాడు. కానీ, అతనికి రూ. 9.5 కోట్లు అందినట్లుగా సమాచారం. సిబిఐ అదనపు ఎస్పీ ఆర్ఎం ఖాన్, ఇన్‌స్పెక్టర్ సోమయ్య సమక్షంలో యాదగిరి వాంగ్మూలం ఇచ్చాడు.
మాజీ న్యాయమూర్తి చలపతి రావుతో తనకు పరిచయం ఉందన్న విషయాన్ని గాలి సోమ శేఖర్‌కు చెప్పానని, తర్వాత తాము సిబిఐ జడ్జి పట్టాభి రామారావు ద్వారా బెయిల్ తెప్పించుకోవడానికి చలపతి రావును ఉపయోగించుకోవచ్చని భావించామన్నారు. ఈ క్రమంలో చలపతి, సోమ శేఖర్‌లకు సెంట్రల్ కోర్టు హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశానని, వీరిద్దరికీ ముందే పరిచయం ఉందన్న విషయం అప్పుడే తనకు తెలిసిందన్నారు.
తనకు కమీషన్ కింద రూ. 20 లక్షలు ఇస్తారని చలపతిరావు చెప్పారని, బెంగళూరులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ఇప్పిస్తానని సోమ శేఖరరెడ్డి హామీ ఇచ్చారని యాదగిరి వివరించాడు. గాలికి బెయిల్ వచ్చిన రోజు దశరథ రామిరెడ్డి, సోమ శేఖరరెడ్డి, సురేష్‌ బాబు, తాను కలిసి అశోక్‌ నగర్ వెళ్లి అక్కడికి చలపతి రావును పిలిపించి ఐదారు బ్యాగుల్లో ఉన్న డబ్బు మూటలను అందజేశామన్నాడు. తర్వాత తాను అశోక్‌ నగర్ వచ్చి చలపతి రావుకు ఫోను చేశానన్నాడు. కొద్దిసేపటికి చలపతిరావు వచ్చి ఓ ప్లాస్టిక్ బ్యాగు తనకు ఇచ్చారని, అందులో రూ. 9.5 లక్షలే ఉన్నాయని వివరించాడు.
సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో యాదగిరి పైవిధంగా చెప్పారు. అయితే చలపతి రావు అరెస్టయిన తర్వాత ఆయనను ఎసిబి అధికారులు ప్రశ్నించినప్పుడు గాలికి బెయిల్ వచ్చిన రోజు రాత్రి 11.30కి తన ఇంటికి యాదగిరి ఒక అట్టపెట్టెను పంపాడని, ఆ పెట్టె ఒక వైపు తెరిచి ఉండటంతో వెంటనే యాదగిరికి ఫోన్ చేశానని, అందులో కొంత డబ్బు తాను వాడుకున్నట్లు యాదగిరి చెప్పాడన్నారు.
ఆ తర్వాత ఆ పెట్టెలోని డబ్బులో సగాన్ని రెండు బ్యాగుల్లో దాచానని, మొత్తం సొమ్ము రూ. 3 కోట్లు ఉంటుందని చలపతి వెల్లడించారు. తాజాగా యాదగిరి ఇంట్లో దొరికిన కోట్లాది రూపాయల నగదును గమనిస్తే మొత్తం డీల్‌ను మాట్లాడుకొని 9.5 కోట్ల సొమ్మును యాదగిరి తీసుకొని ఉంటారని అంటున్నారు. యాదగిరి ఇంట్లో రూ.3.75 కోట్లు దొరకగా, ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్లుగా గుర్తించారు. అంటే మే 26న యాదగిరి రావు సిబిఐని తప్పుదోవ పట్టించినట్లుగా అర్థమవుతోంది. సోమవారం జరిపిన సోదాలలో తొలుత రూ.2.25 కోట్లు దొరికినట్లుగా తెలిసింది. ఆయితే ఆ తర్వాత అధికారులు రూ.3.75 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి