4, జులై 2012, బుధవారం

'జగతి'లో హెటిరో పెట్టుబడులు రూ.35 కోట్లు


  • ఈ మొత్తం ముడుపులే
  • జగన్‌ కేసులో మొదటి ఛార్జిషీట్‌కు
  • అనుబంధం దాఖలు
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైఎస్‌ జగన్‌పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. దీంతో పాటు మొదటి ఛార్జిషీట్‌కు అనుబంధ ఛార్జిషీటును సిబిఐ అధికారులు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం దాఖలు చేశారు. తాజా అనుబంధ ఛార్జిషీట్‌ హెటిరో డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన హెటిరో డ్రగ్స్‌ జగన్‌ సంస్థల్లో రూ. 35 కోట్ల పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. పిసి యాక్ట్‌ సెక్షన్‌ 9, 10, 11 కింద సిబిఐ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. జగన్‌ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాధి కారులను ప్రభావితం చేశారని సిబిఐ పేర్కొంది. జగన్‌ కంపెనీల్లోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించింది. హెటిరో డ్రగ్స్‌ తదితర కంపెనీలు జగన్‌ సంస్థల్లో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని, ఇవన్నీ ముడుపులేనని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. చెన్నైకి చెందిన జగదీశన్‌ ఆడిటర్స్‌ ప్రతినిధి ప్రభాకరన్‌తో పాటు జగతి పబ్లికేషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న హరీష్‌ కామర్తి వాంగ్మూలాలను సిబిఐ తన ఛార్జిషీట్‌తో జత చేసింది. జగన్‌ కేసులో సిబిఐ ఇప్పటికే మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి