21, అక్టోబర్ 2011, శుక్రవారం

గడాఫీపై అంకుల్ సామ్ ‘గన్’


అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు ఆ దేవుడే ఏదో ఓ దారి చూపిస్తాడంటారు. దేవుడు గడాఫీ రూపంలో అమెరికాకు దారి చూపించినట్టున్నాడు. మధ్యప్రాచ్యంలో అమెరికా కట్టుకున్న ఆధిపత్యపు కోటలన్నీ ఒక్కటొక్కటే కూలిపోతుంటే, మూలస్తంభంగా ఉన్న ఈజిప్టు ముబారకే తోకముడిస్తే ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్న అమెరికాకు, లిబియాలో పారుతున్న నెత్తుటి ఏరుల్లో దారి దొరికింది. అది లిబియాను ‘విముక్తి’చేసి మధ్య ప్రాచ్యంలో కాలు నిలిపితే చాలు, అదే దాని ఆధిపత్యానికి సుస్థిర పునాది కాగలదన్న పెంటగాన్ సలహాను ఆచరణలో పెట్టింది. ఐరాస ఆంక్షల అమలు పేరిట లిబియాపై దాడికి సన్నాహాలు ముమ్మరం చేసింది.

జిమ్మీ కార్టర్ హయాంలో అమెరికా సాధించిన రహస్య ‘దౌత్య విజయాల’ పుణ్యమా అని, వలస పాలన నుంచి ‘స్వాతంత్య్రం’ పొందిన అరబ్బు ప్రపంచంపై పాశ్చాత్యదేశాలు ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోగలిగాయి. అమెరికా నోట, మధ్యప్రాచ్య ‘సుస్థిరత’, ‘భ ద్రత’ అన్న మాటలు ఎప్పుడు వినిపించినా వాటికి అర్థం ఒక్కటే. అమెరికా ఆధిపత్యపు సుస్థిరత, భద్రత అని. అందుకే అది అక్కడ రాచరికాలను నిలిపింది, ఎన్నికల తతంగంతో దేశాధినేతలుగా వెలిగిపోయే ‘ప్రజాస్వామిక’ నియంతలకు మద్దతు పలికింది. ఆ రాచరికాలు, నియంతృత్వాలు కూలిపోవడమంటే మధ్యపాచ్య ‘భద్రత’, ‘సుస్థిరత’లకు నూకలు చెల్లుతున్నాయనే అర్థం. ట్యునీషియాలో, ఈజిప్టులో అది దాన్ని నివారించలేకపోయింది. పైగా అమెరికా నిలపాలని చూస్తున్న ప్రధానులనూ, ప్రభుత్వాలనూ ప్రజలు చరిత్ర చెత్తబుట్టలోకి విసిరిపారేస్తున్నారు. ఇంతవరకూ ట్యునీషియాలో ఇద్దరు, ఈజిప్టులో ఒకరు ‘కొత్త’ ప్రధానులకు ఆ గతి పట్టింది. ఒకప్పుడు, అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మధ్యప్రాచ్యంపై ఆధిపత్యం సైనికంగా కూడా కీలకమైనదే. నాడూ నేడూ కూడా అది ఆర్థికంగా కీలకమైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తాళం చెవి,’ చమురు నిల్వలు ఉన్నది అక్కడే మరి!

ట్యునీషియాలో బెన్ ఆలీ దేశం విడిచిపారిపోయేదాకా ఫ్రాన్స్ ఆ నియంతను సమర్థిస్తూనే వచ్చింది. ఈజిప్టులో ముబారక్ గూండాలు, మఫ్టీ పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తింటూ, చస్తూ అక్కడి ప్రజలు అమెరికా సహాయం కోసం అర్థించారు. ముబారక్‌తో రాజీనామా చేయించమని ప్రతిపక్షాలు వేడుకున్నాయి. అవేవీ దాని చెవులకు ఎక్క లేదు. లిబియా ప్రజలుగానీ, వారి విప్లవ ప్రభుత్వంగానీ అడగకుండానే అమెరికా దాని మిత్ర దేశాలు వారిని ‘ఆదుకోడానికి’ యుద్ధ నౌకలను పంపాయి. గడాఫీ సేనలతో లిబియన్లు సాగిస్తున్న అంతర్గత యుద్ధంలో ఎలాగూ కూలిపోనున్న గడాఫీని తామే కూల్చేయడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికా ఆశించినదేదీ ట్యూనీషియాలో జరగలేదు, ఈజిప్టులో జరగలేదు. సైనిక చర్యతోనైనా లిబియాపై ఆధిపత్యాన్ని సాధించగలిగితే, అరబ్బు విప్లవాలకు తాను కోరుకున్న ముగింపు పలికే అవకాశం దక్కుతుందని అది ఆశపడుతోంది.

అరబ్బు విప్లవంతో అమెరికాకు అంతటి ముప్పు వచ్చిందంటే నమ్మలేని వారు అరబ్బు విప్లవం, దాని ప్రభావం ఎంత విస్తృతంగా వ్యాపిస్తున్నదో గమనించడం అవసరం. అదిప్పుడు ఖండ ఖండాంతరాలను దాటి మారుమోగుతోంది. నిన్న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ట్రేడ్‌యూనియన్ హక్కుల రక్షణ కోసం మాడిసన్ సిటీని ముట్టడించిన లక్షకు పైబడిన ప్రభుత్వరంగ ఉద్యోగులు, కార్మికులు ‘ఈజిప్ట్! ఈజిప్ట్!’ అంటూ నినదిస్తే, నేడు కైరోలోని తెహిరిర్ స్క్వేర్‌లో ఈజిప్షియన్లు విస్కాన్సిన్ కార్మికులకు మద్దతుగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈజిప్టు విప్లవాన్ని సమర్థించిన ఇరాన్‌లో అరబ్పు విప్లవం నెత్తురోడుతోంది. చైనాలో ఈజిప్టు ప్రేరణతో ఉత్తేజితులైన అసమ్మతివాదుల కారణంగా అక్కడి కమ్యూనిస్టు నేతలకు కంటిమీద కునుకు కరువవుతోంది.

ఐరాస ఆంక్షల విధింపు, విమానయానాలపై నిషేధం గఢాఫీని భయపెట్టలేకపోయాయి. పైగా, ‘విదేశీ జోక్యం’, లిబియా ‘చమురు దొంగల దాడులు’ అంటూ గడాఫీ ఎదురు ప్రచార దాడికి దిగాడు. మరింత రాక్షసంగా ప్రజలపై విరుచుకుపడుతున్నాడు. విమాన దాడులనూ ముమ్మరం చేశాడు. అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కనిపించిన వెంటనే వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్, అంతటివాడు గడాఫీకీ, ప్రజలకు మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ముందుకు వచ్చాడు. లూలా, క్యాస్ట్రోవంటి నేతలు గడాఫీకి మద్దతు పలకడం ప్రారంభించారు.

‘ఏ అవకాశాన్నీ కాదనలేమని’ అమెరికా ప్రభుత్వ తాజా స్వరం. అమెరికా, దాని మిత్రదేశాల యుద్ధనౌకలు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి లిబియాను చుట్టుముట్టాక, ‘సైనిక జోక్యం ఉద్దేశం లేదని’ హిల్లరీ క్లింటన్ ఇలా ప్రకటించిందో లేదో ‘అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అంటూ నాటో ప్రకటించింది! సరిగ్గా మధ్యధరా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు ప్రవేశిస్తున్న సమయంలో నాటో సమావేశం చర్చిస్తున్నది అదే అంశం గురించి. గడాఫీ మొండిగా విప్లవాన్ని అణచివే యడానికి ప్రయత్నిస్తుండటంతో జరుగుతున్న రక్తపాతానికి మించిన అవకాశం దొరకదని పెంటగాన్ నెత్తీనోరూ కొట్టుకుని చెబుతోంది. సైనిక జోక్యానికి కావాల్సిన సాకును గడాఫీయే సృష్టిస్తున్నాడు. అఫ్ఘానిస్థాన్ దురాక్రమణకు ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ అని పేరుపెట్టుకున్నట్టుగా, లిబియా దురాక్రమణకు ‘మానవతావాద యుద్ధం’ అని పేరు పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టు, పెంటగాన్ సంకల్పానికి నాటోలోనే ఎదురుపుల్లలు వేసేవారు తగిలారు. సైనికజోక్యం జరిగిన మరుక్షణమే గడాఫీ చమురు పైపులైన్లను పేల్చేస్తాడని లిబియా చమురును నమ్ముకున్న జర్మనీ వణికిపోతుంది. సైనిక జోక్యానికి ఐరాస అధికారం ఇవ్వాలని ఫ్రాన్స్ అంటోంది. ముస్లింలు మెజారిటీగా ఉన్న టర్కీ, లిబియాపై నాటో దాడికి దిగితే తమ దేశంలో ప్రత్యక్షం కానున్న అరబ్బు విప్లవ భూతాన్ని తలచుకుని భయపడుతోంది, అందుకే లిబియాలో సైనిక జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది.

లిబియాలో సైనిక జోక్యానికి దిగాలా, వద్దా? అని మంత్రాంగం చేస్తున్న పెద్దలకు ఒక్క విషయం మాత్రం పట్టడంలేదు. శాంతియుతంగా పోరాడుతున్న నిరాయుధ ప్రజలపై గడాఫీ సేనలు కురిపించిన బుల్లెట్లకు ఎదురు నిలిచింది, ప్రజలపై కాల్పులా? అంటూ తిరగబడింది లిబియన్ సైనికులు. గడాఫీ సైన్యంతోనూ, కిరాయి మూకలతోనూ పోరాడుతున్నది లిబియన్ ప్రజలు. తిరుగుబాటుదారుల తాత్కాలిక ప్రభుత్వపు రాజధాని బెంఘాజీ నగరంలోని చమురు కేంద్రాన్ని కావ లి కాస్తూ ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో విదేశీ జోక్యం వద్దు అన్న ప్లకార్డును పట్టుకుని నిలిచి నెట్‌లో ఓ మధ్య వయస్కుడు దర్శనమిచ్చాడు. అతను, మనం పడక కుర్చీ మేధావులుగా పిలిచే ఓ యూనిర్సిటీ ప్రొఫెసర్! బెంఘాజీ నగరమంతా మంగళవారం నుంచే ఎగురుతున్న ‘విదేశీ జోక్యం వద్దు!’ అన్న బ్యానర్లు పాశ్చాత్య మీడియాకు కనిపించకపోవడం పెద్ద విశేషమేమీ కాదు. ‘‘విదేశీ జోక్యం వద్దు! అని లిబియా ప్రజలంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. లిబియా ప్రజలు తమంతట తాముగానే విప్లవాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరని, ఎలాంటి విదేశీ జోక్యమూ అవసరం లేదని బెంఘాజీలోని విప్లవ ప్రభుత్వం స్పష్టం చేసింది.

విదేశీ సైనిక జోక్యంతో పరిస్థితి సంక్లిష్టం అవుతుందని హెచ్చరించింది. ఆ ప్రకటనను నాటో సమావేశం కనీసం ప్రస్తావించ లేదు. అమెరికా, నాటోలు ప్రజాభిప్రాయానికి అతీతమైనవి. వీటో చేస్తానన్న రష్యా బెదిరింపునూ అవి పట్టించుకోలేదు. లిబియాలో సైనిక జోక్యం జరిగితే అది ఐరాస విధించిన విమానయాన నిషేధం అమలు పేరిటే జరుగుతుంది. ఇరాక్‌పై ఐరాస జారీ చేసిన అలాంటి రెండు ఆదేశాల అమలుకు ఆనాడు ఐరాస అమెరికా, బ్రిటన్‌లకు అధికారాన్ని ఇచ్చింది. అది తెలియకనో ఏమో, లిబియా విప్లవ మండలిలోని ఒకరిద్దరు అమాయకంగా గడాఫీ కీలక సైనిక స్థావరాలు కొన్నిటిపైనా, వైమానిక బలగాలపైనా నాటో పరిమిత వైమానిక దాడులను మాత్రమే చేయాలని, అవి కూడా ఐరాస పేరిటనే, దాని ఆధిపత్యంలోనే జరగాలని కోరే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అమెరికా ఇలాంటి బలహీనత కోసమే ఎదురు చూస్తోంది.

ప్రజావిప్లవాలతో ఎప్పుడూ ఉండే చిక్కు ఒక్కటే. విప్లవ పక్షమైనా, వ్యతిరేక పక్షమైనాగానీ ఏం చేయాలో సావకాశంగా ఆలోచించే లోగానే అవకాశాలు చేయిజారిపోతాయి. అమెరికా రాజకీయ నాయకత్వం ఇప్పుడు అలాంటి సంకటాన్నే ఎదుర్కొంటోంది. కూలిపోడానికి సిద్ధంగా ఉన్న గడాఫీని కూలదోసి, ఆ సైనిక విజయంతో అరబ్బు విప్లవాలు తిరగరాస్తున్న మధ్య ప్రాచ్యం భవితవ్యాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశాలను వెదుక్కోవడమా? లేక ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాలలో ఎదురైన, ఎదురవుతున్న భంగపాటును గుర్తించి గడాఫీని కూల్చే పనిని లిబియా ప్రజలకే వదలడమా? బహుశా అమెరికా గుర్తు చేసుకోడానికి కూడా ఇష్టపడని మరో ముఖ్య సమస్య కూడా దాని ముందు నిలిచి ఉంది. పాలస్తీనాకు ద్రోహం చేసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయడమే ఒక చారిత్రక నేరమైతే, ఐరాస నిర్దేశించిన భూభాగానికి రెట్టింపును ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నా అమెరికా దాని మిత్రదేశాలూ దానిని తప్పుపట్టకుండా కాపాడుతున్నాయి. అదే ఆధునిక యుగంలో ఇస్లామిక్ ఛాందసవాదం (ఫండమెంటలిజం) ఊపిరిపోసుకోడానికి కారణమైంది. 1948 నుంచి నేటి వరకూ పాలస్తీనా భూభాగాల్లోకి అక్రమంగా ఇజ్రాయెలీల వలసలు సాగు తూనే ఉన్నాయి. అది తాజాగా చేపట్టిన వలస కాలనీల నిర్మాణానికి వ్యతిరేకంగా ఐరాస జారీ చేసిన ఆదేశాలను అమెరికా వీటో చేసింది! 1960లలో తలెత్తిన అరబ్బు జాతీయవాదానికి ప్రాతిపదిక పాలస్తీనాకు జరిగిన అన్యాయమే.

ఆనాటి అరబ్బు జాతీయవాద నేతలలో ప్రముఖుడు గడాఫీ! నేడు అరబ్బు జాతీయవాదం విప్లవ జాతీయవాదంగా ముందుకు వచ్చింది. ఆరు దశాబ్దాలుగా అమెరికా దాని మిత్రదేశాలూ అరబ్బులపైనా, ఇస్లామిక్ ప్రజలపైనా సాగించిన దురన్యాయాల నుంచే ఊపిరులు పోసుకున్న ఇస్లామిక్ తీవ్రవాదం, అమెరికా స్వయంగా పెంచిపోషించిన అల్‌కాయిదాలను అరబ్బువిప్లవం పూర్తి నిరర్థకమైనవిగా తేల్చిపారేశాయి. హింసతో అవేవీ సాధించలేని మహావిజయాలను అరబ్బు ప్రజానీకం సాధ్యంచేసి చూపారు. అరబ్బు విప్లవంతో ప్రజలు ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. అమెరికా గుర్తించినా లేకున్నా దాని ముందున్న అసలు సమస్య ఒక్కటే... ‘ఇస్లామిక్ ప్రపంచంతో సంబంధాలలో ఒక కొత్త ప్రారంభాన్ని’ ఆమోదించాలా? లేక మరో అఫ్ఘానిస్థాన్ దుస్సాహసానికి తెరదీసి మొత్తం మధ్యప్రాచ్యం అంతటా అల్‌కాయిదాలను, తాలిబన్‌లను సృష్టించాలా?
-పిళ్లా విశ్వనాథం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి