5, అక్టోబర్ 2011, బుధవారం

సిబిఐ

సిబిఐ... ఈ పేరు వింటేనే అవినీతి మహారాజులకు, ఘరానా నేరగాళ్లకు, అమానుష ఉగ్రవాదులకు హడల్‌. సిబిఐ కన్ను పడకూడదని అక్రమ సంపాదన చేసే రాజకీయ నాయకులు, ప్రధాన నేరగాళ్లు, టెర్రరిస్టులు కోరుకొంటారు. తాము సంపాదించిన అక్రమ సంపాదన వివరాలు సిబిఐ కంటపడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కొందరి పాపం పండుతుంది. వారు సిబిఐ ముందు దోషిగా నిలబడక తప్పదు. కామన్వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణంలో సురేష్‌ కల్మాడీ, 2జి కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళి, గనుల అక్రమ రవాణాలో గాలి జనార్థన్‌ రెడ్డి వంటి వారికి సిబిఐ ఉచ్చు బిగుసుకున్నది. సిబిఐ చొరవతో వీళ్లంతా ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడ్తున్నారు. తాజాగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై కూడా సిబిఐ కన్ను పడింది. సిబిఐ శోధనతో ఇప్పటికే కలవరిపడిపోతున్నారు జగన్‌.
ఈ నేపథ్యంలో సిబిఐ గురించి తెలుసుకుందాం...
సిబిఐ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. అందుకే ఏ రాజకీయ నాయకుడిపైనైనా అవినీతి ఆరోపణలొస్తే సిబిఐ దర్యాప్తు కోసం రాజకీయ పక్షాలు పట్టుబడ్తాయి. ఆఖరి అస్త్రంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు, పార్లమెంటు, ప్రజలు సిబిఐ విచారణ కోసం డిమాండ్‌ చేస్తారు. అయితే సిబిఐకి కూడా అనేక పరిమితులు, రాజకీయ విధేయత వంటి ఆరోపణలున్నాయి. ఇంటర్‌పోల్‌ సభ్య దేశాల సమన్వయంతో దేశంలో అంతర్రాష్ట్రాల, అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన ప్రధాన నేరాలపై కూడా సిబిఐ దర్యాప్తు నిర్వహిస్తోంది. అవినీతి నిరోధక, ఆర్థిక నేరాలు, ప్రత్యేక నేరాల విభాగాల్లో సిబిఐ దర్యాప్తు సాగిస్తుంది. అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఐఎఎస్‌లు, బ్యాంకుల, ఆర్థిక, ప్రభుత్వ రంగ సిఎండి వంటి ఉన్నతాధికారులపై వచ్చిన కేసులను దర్యాప్తు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
సిబిఐ ఏర్పాటు నేపథ్యం
సిబిఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) భారత ప్రభుత్వ ఏజెన్సీ. ఇది క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ బాడీ. నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ. 1941లో భారత ప్రభుత్వం స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎస్‌పిఇ)ను ఏర్పాటు చేసింది. అందులో నుండి సిబిఐ 1963 ఏప్రిల్‌ ఒకటిన ఏర్పడింది. అంటే సిబిఐకి ఎస్‌పిఇ మాతృ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జరిగిన అవినీతి, లంచగొండి తనంపై విచారణ జరిపేందుకు ఎస్‌పిఇని ఏర్పాటు చేశారు. ఎస్‌పిఇ అధినేత యుద్ధ విభాగానికి చెందిన వ్యక్తి. యుద్ధం తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వోద్యోగుల లంచగొండితనం, అవినీతిపై ఎస్‌పిఇ విచారణ జరిపింది. ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946లో ప్రారంభమైంది. దీన్ని తర్వాత కేంద్ర హోం డిపార్ట్‌మెంట్‌కు బదలాయించారు. దాని విచారణాధికారాలను తర్వాత అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు విస్తరించారు. సిబిఐ అవినీతికి సంబంధించిన కేసుల్లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ పర్యవేక్షణలో, ఇతర విషయాల్లో కేంద్ర పర్సనల్‌, పెన్షన్‌, గ్రీవెన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కాలానుగుణంగా సిబిఐ దేశంలో ప్రధాన దర్యాప్తు ఏజెన్సీగా పేరు సంపాదించింది. దీంతో అవినీతి, ఆర్థిక అవకతవకలు, హత్య, కిడ్నాపింగ్‌ తదితర క్లిష్టమైన కేసుల్లో సిబిఐ విచారణ జరిపించాలనే డిమాండ్‌ పెరిగింది. అంతేకాదు సంబంధిత పార్టీలు వేసిన పిటిషన్ల ఆధారంగా కొన్ని ప్రధాన కేసులను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు సిబిఐని ఆదేశించాయి. కేంద్ర పర్సనల్‌, ప్రజా పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నియంత్రణలో సిబిఐ పనిచేస్తోంది. భారత్‌కు సిబిఐ అధికారిక ఇంటర్‌పోల్‌ యూనిట్‌. క్రిమినల్‌ నేరాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు కూడా చేపట్టాల్సి రావడంతో సిబిఐలో రెండు విభాగాలను ఏర్పాటు చేయాలని 1987లో నిర్ణయించారు. అవి 1. అవినీతి నిరోధక విభాగం. 2. ప్రత్యేక నేరాల విభాగం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సిబిఐ తన రిపోర్టులను కేంద్ర ప్రభుత్వానికే సమర్పిస్తుంది. రాష్ట్రాలకు నివేదికలు సమర్పించాల్సిన అవసరం సిబిఐకి లేదు. సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
ఎన్‌ఐఎ, సిబిఐల మధ్య తేడా?
నవంబర్‌ 2008లో ముంబయిలో ఉగ్రవాద దాడి తర్వాత నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) అనేది ఏర్పాటు చేశారు. ప్రప్రథమంగా ఇటీవల ఢిల్లీలో హైకోర్టులో జరిగిన పేలుళ్ల దర్యాప్తు బాధ్యతను దానికి అప్పగించారు. ఎలా పనిచేస్తుందో ఇంకా చూడాలి. దాడుల తీరు, ఉగ్రవాదులకు నిధులు ఎలా వచ్చాయి, ఇతర ఉగ్రవాద నేరాలపై ఎన్‌.ఐ.ఎ దర్యాప్తు చేస్తుంది. సిబిఐ ప్రధానంగా అవినీతి, ఆర్థిక అవకతవకలు, తీవ్రస్థాయి కేంద్రీకృత నేరాలపై దర్యాప్తు చేస్తుంది. డిఎస్‌పిఇ యాక్ట్‌, సెక్షన్‌ 2 ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే సెక్షన్‌ 3 కింద జరిగిన నేరాలకు సంబంధించిన కేసులను సిబిఐ సుమోటోగా (ఉన్న పళంగా) తీసుకొని దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నేరాలకు సంబంధించి సెక్షన్‌ 6 ప్రకారం ఆయా రాష్ట్రాల అనుమతితో మాత్రమే దర్యాప్తు చేపడ్తుంది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలి. సుప్రీం కోర్టు, హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండానే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు. ఆయా రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేయగలిగే సాధారణ నేరాలు, కేసులను సిబిఐ చేపట్టరాదు. అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వోద్యోగిపై ఎవరైనా, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగంలో వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, ప్రధాన నగరాల్లో దీనికి కార్యాలయాలున్నాయి. సిబిఐ తనకు కావాల్సిన సమాచారాన్ని తనదైన శైలిలో రాబడ్తుంది. తమ ఆధీనంలోకి తీసుకున్న వ్యక్తులు చెప్పిన నోటిమాటగా తెల్పిన సమాచారాన్ని కూడా ఆధారంగా వినియోగించుకునే వెసులుబాటు సిబిఐకి ఉంది. కోర్టులు కూడా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని పట్టుబట్టే అవకాశం లేదు.
ట్రాప్‌ అంటే ఏంటి?
కేంద్ర ప్రభుత్వోద్యోగి లంచం తీసుకుంటుండగా సిబిఐ ప్రత్యక్షంగా దాడి చేసి పట్టుకోవడాన్ని ట్రాప్‌ (వల పన్నడం) అంటారు. ఆ సందర్భంగా పట్టుకొన్న డబ్బును సిబిఐ సీజ్‌ చేసి కోర్టులో ఛార్జిషీటుతో సహా ప్రవేశపెడ్తుంది. కేసు పూర్తయిన తర్వాత ఆ డబ్బును సంబంధిత వ్యక్తికి అందజేస్తారు. సిబిఐలో అవినీతిని అంతమొందించాలనే ఉద్దేశ్యంతో అంతరంగికంగా విజిలెన్స్‌ను ఏర్పాటు చేశారు.
రెడ్‌ నోటీసు
ఇంటర్‌పోల్‌ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లో ఉంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశంలో తలదాచుకుంటే ఇంటర్‌పోల్‌ వారికి నోటీసు జారీ చేస్తుంది. దీంతో సంబంధిత దేశం చర్యలు తీసుకొని ఆ నేరస్తుణ్ణి అప్పగించాల్సి ఉంటుంది. సిబిఐకి ఇంటర్‌పోల్‌ను వినియోగించుకునే సదుపాయం పరిమితంగా ఉంది. దీని కోసం విదేశీ మంత్రిత్వ శాఖపై సిబిఐ ఆధారపడాల్సి ఉంది. ఆ మంత్రిత్వ శాఖ కోరితేనే ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకునే అవకాశం సిబిఐకి ఉంది.
సిబిఐలో చేరాలంటే!
స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా సిబిఐ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తుంది. ఇన్‌స్పెక్టర్‌, దానికంటే ఎక్కువ కేటగిరీ గల పోస్టులను డిప్యుటేషన్‌పై భర్తీ చేస్తుంది. నాన్‌ పోలీసు అధికారులు కూడా సిబిఐలో డిప్యుటేషన్‌పై చేరవచ్చు.
సిబిఐ అధినేత డైరెక్టర్‌
డైరెక్టర్‌ (గ్రూప్‌-ఎ : ఒక్క పోస్టు) : సిబిఐ అధినేత డైరెక్టర్‌. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు లేదా కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (రాష్ట్రం) స్థాయి ఐపిఎస్‌ అధికారి దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ నేతృత్వంలో హోం సెక్రటరీ, సెక్రటరీ, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ సభ్యులుగా గల కమిటీ డైరెక్టర్‌ను నియమిస్తుంది.
స్పెషల్‌ డైరెక్టర్‌ (గ్రూప్‌-ఎ : ఒక్క పోస్టు) : సిబిఐలో స్పెషల్‌ డైరెక్టర్‌ రెండో ర్యాంకు అధికారి. అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా నియమితుడైన ఐపిఎస్‌ అధికారిని స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించవచ్చు.
అడిషనల్‌ డైరెక్టర్‌ (గ్రూప్‌-ఎ : రెండు పోస్టులు) : అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ర్యాంకు గల ఐపిఎస్‌ అధికారిని అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమిస్తారు.
జాయింట్‌ డైరెక్టర్‌ (గ్రూప్‌-ఎ : 16 పోస్టులు) : ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ర్యాంకు గల ఐపిఎస్‌ అధికారిని (80 శాతం మందిని) డిప్యుటేషన్‌పై జాయింట్‌ డైరెక్టర్‌గా నియమిస్తారు. 20 శాతం మందిని సిబిఐ డిపార్ట్‌మెంట్‌లో డిఐజిగా ఐదేళ్లు పనిచేసిన వారికి జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తారు.
డిఐజి (గ్రూప్‌-ఎ : 39 పోస్టులు) : డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు స్థాయికి చెందిన ఐపిఎస్‌ అధికారిని డిప్యుటేషన్‌పై సిబిఐలో డిఐజి (75 శాతం మందిని)గా నియమిస్తారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఇన్‌కమ్‌ట్యాక్స్‌, ఇండియన్‌ కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌) అధికారులు కూడా డిఐజిగా నియమితులవుతారు. 25 శాతం పోస్టుల్లో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా సిబిఐలో నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసిన అధికారులను నియమిస్తారు. (సీనియర్‌ సూపరింటెండెంట్‌, ఎస్‌పి స్థాయిలో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసి ఉండాలి)
ఎస్‌ఎస్‌పి (గ్రూప్‌-ఎ : 10 పోస్టులు) : డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా నాలుగేళ్ల రెగ్యులర్‌ సర్వీసు కలిగిన ఐపిఎస్‌ అధికారిని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా ప్రమోషన్‌ కల్పిస్తారు.
ఎస్‌పి (గ్రూప్‌-ఎ : 89 పోస్టులు) : 60 శాతం పోస్టులను ఐపిఎస్‌/ఐఎఎస్‌/ఐఎఎఎస్‌/ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన వారిచే భర్తీ చేస్తారు. అందులో పది శాతం పోస్టులను ఎఐఎస్‌, ఐఎ అండ్‌ ఎఎస్‌/ఐఆర్‌ఎస్‌లకు చెందిన వారిచే భర్తీ చేస్తారు. మిగిలిన 40 శాతం పోస్టులను ఎఎస్‌పిగా ఆరేళ్లు రెగ్యులర్‌ సర్వీసు (మొత్తం 12 ఏళ్ల సర్వీసు) పూర్తి చేసిన అధికారులచే భర్తీ చేస్తారు.
ఎఎస్‌పి (గ్రూప్‌-ఎ : 75 పోస్టులు) : అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా 80 శాతం పోస్టులను డిపార్ట్‌మెంట్‌లో డిఎస్‌పిగా ఆరేళ్లు పూర్తిచేసిన అధికారులచే భర్తీ చేస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను డిప్యుటేషన్‌పై నియమిస్తారు.
డిఎస్‌పి (గ్రూప్‌-ఎ : 240 పోస్టులు) : 40 శాతం డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు పోస్టులను డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులచే భర్తీ చేస్తారు. మరో 40 శాతం పోస్టులను కేంద్ర/రాష్ట్ర పోలీసు క్యాడర్‌ నుండి డిప్యుటేషన్‌పై భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్‌ రిక్య్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారు.

తెలుగు డైరెక్టర్‌
పి.వి.నరసింహారావు హయాంలో సిబిఐ డైరెక్టర్‌గా మన రాష్ట్రానికి చెందిన కె.విజయ రామారావు (31 జులై 1993 నుంచి 31 జులై 1996 వరకూ) కూడా పని చేశారు. తర్వాత ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగానూ వ్యవహరించారు. ఆయన డైరెక్టర్‌గా ఉన్న కాలంలోనే బాబ్రీ విధ్వంసం, హర్షద్‌ మెహతా కుంభకోణం వంటివి సిబిఐ దర్యాప్తు చేసింది.


ఎవరీ లక్ష్మీనారాయణ!
సిబిఐలో జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. గాలి జనార్థన రెడ్డి, జగన్‌ అక్రమాలపై, ఆర్థిక వ్యవహారాలపై ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. లక్ష్మీనారాయణ తెలుగువాడే. కడప నగరం గుంత బజారులోని సాయి నిలయంలో ఏప్రిల్‌ 3, 1965న జన్మించారు. షణ్ముగం, వసుంధరల ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ. ఆయన తాత వాసగిరి సుబ్బయ్య కడప తహసీల్దారుగా పనిచేసేవారు. షణ్ముగం ఎస్‌ఆర్‌బిసిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నందికొట్కూరులో ఉద్యోగం చేశారు. దీంతో లక్ష్మీనారాయణ విద్యాభ్యాసం సున్నిపెంటలో ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించారు. ప్రాజెక్టు కాలేజీలోనే ఇంటర్‌ కూడా చేశారు. చిన్నప్పటి నుండీ చదువులో చురుగ్గా వుండే లక్ష్మీనారాయణ వరంగల్‌లోని ఆర్‌ఈసి కళాశాలలో ఇంజనీరింగ్‌, బెంగళూరులో ఎంటెక్‌, మద్రాసులో ఐఐటి పూర్తిచేశారు. తర్వాత సివిల్స్‌ రాసి టాపర్‌గా వచ్చినా ఐపిఎస్‌ ఎంచుకున్నారు. 1990 బ్యాచ్‌ అధికారిగా మహారాష్ట్ర కేడర్‌లో సర్వీసు ప్రారంభించారు. అనంతపురానికి చెందిన మేనత్త కూతురు ఊర్మిళను పెళ్లి చేసుకున్నారు.


వ్యవస్థాపక డైరెక్టర్‌ డిపి కోహ్లి
సిబిఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డిపి కోహ్లి. ఏప్రిల్‌ 1, 1963 నుండి మే 31, 1968 వరకు ఈ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు కోహ్లి ఎస్‌పిఇకి ఐజి (ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)గా 1955 నుండి 1963 వరకు పనిచేశారు. 1955కు ముందు ఆయన మధ్య భారత్‌, ఉత్తర ప్రదేశ్‌, కేంద్ర స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్‌పిఇలో చేరకముందు ఆయన మధ్య భారత్‌లో పోలీసు చీఫ్‌గా వ్యవహరించారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కోహ్లీని భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్‌-సి : 755 పోస్టులు) : 50 శాతం పోస్టులను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఐదేళ్లు పూర్తిచేసుకున్న అధికారులచే భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం పోస్టులను కేంద్ర/రాష్ట్ర పోలీసు అధికారులను డిప్యుటేషన్‌పై నియమిస్తారు.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్‌-సి : 381 పోస్టులు) : 50 శాతం పోస్టులను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా నేరుగా భర్తీ చేస్తారు. 25 శాతం పోస్టులను సీనియారిటీ, ఫిట్‌నెస్‌ ప్రాతిపదికన ఎఎస్‌ఐగా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన అధికారులచే భర్తీ చేస్తారు. మిగిలిన 25 శాతం పోస్టులను డిపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ ద్వారా భర్తీ చేస్తారు. గ్రూప్‌-బి పోస్టులను యుపిఎస్‌సి నిబంధనల ప్రకారం సిబిఐ డైరెక్టర్‌ భర్తీ చేస్తారు. సీనియర్‌ క్లర్క్‌ స్టెనోలు, ఎల్‌డిసిలు, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ మినహా మిగిలిన గ్రూప్‌-సి పోస్టులను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు భర్తీ చేస్తారు. గ్రూప్‌-సిలోని సీనియర్‌ క్లర్క్‌ స్టెనోలు, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పోస్టులను ఎస్‌పి స్థాయి అధికారి భర్తీ చేస్తారు.
న్యాయాధికారులు
లీగల్‌ అడ్వయిజర్‌ / డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ను న్యాయశాఖ నియమిస్తుంది. అదనపు లీగల్‌ అడ్వయిజర్లు (6), డిప్యూటీ లీగల్‌ అడ్వయిజర్లు (20), సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (67), పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (96), అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (41) కూడా ఉంటారు.
వివిధ విభాగాలు
''శ్రమ, నిష్పక్షపాతం, ఏకీకరణ'' నినాదంతో పనిచేసే సిబిఐలో మూడు ప్రధాన విభాగాలున్నాయి.
అవినీతి నిరోధక విభాగం : దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో వుంది. కేంద్ర ప్రభుత్వోద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల సంస్థలు, కేంద్ర ఆర్థిక సంస్థల్లోని వ్యక్తులకు సంబంధించిన అంశాలను స్వీకరిస్తుంది.
ఆర్థిక నేరాల విభాగం : బ్యాంకుల అవినీతి, మోసం ఆర్థిక నేరాలు, విదేశీ మారక ద్రవ్యం, దిగుమతి, ఎగుమతి రంగాల్లో నిబంధనల ఉల్లంఘన, మాదక ద్రవ్యాల, పురావస్తువుల, సాంస్కృతిక రంగాలకు చెందిన ఆస్తుల అక్రమ రవాణా (స్మగ్లింగ్‌), నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణా తదితర అంశాలపై, నిధుల దుర్వినియోగం, భారీ నిధులు గల సంస్థల వ్యవహారాలకు సంబంధించిన అంశాలను స్వీకరిస్తుంది.
ప్రత్యేక నేరాల విభాగం : సంచలనాత్మక హత్యలు, కిడ్నాపింగ్‌లు, మాఫియా, అండర్‌ వరల్డ్‌ చేసే నేరాలు, వివిధ రాష్ట్రాల్లో కేంద్రీకృత (ఆర్గనైజ్‌డ్‌) గ్యాంగులు, ప్రొఫెషనల్‌ క్రిమినల్స్‌ చేసే నేరాలు. భారత ప్రభుత్వానికి చెందిన జప్తు చేసే వ్యవహారాలకు సంబంధించిన విభాగాల కేసులు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ కేసుల్లో అధికారుల ప్రమేయం వంటి అంశాలను స్వీకరిస్తుంది.

సిబిఐ డైరెక్టర్లు
పేరు కాలం
డిపి కోహ్లి 1963-68
ఎఫ్‌వి అరుల్‌ 1968-71
డి సేన్‌ 1971-77
ఎస్‌ఎన్‌ మాథుర్‌ 1977 (యాక్టింగ్‌)
సివి నరసింహన్‌ 1977 (యాక్టింగ్‌)
జాన్‌ లోబో 1977-79
ఆర్‌డి సింగ్‌ 1979-80
జెఎస్‌ బజ్వా 1980-85
ఎంజి కాట్రే 1985-89
ఎపి ముఖర్జీ 1989-90
ఆర్‌ శేఖర్‌ 1990 (యాక్టింగ్‌)
విజరు కరణ్‌ 1990-92
ఎస్‌కె దత్తా 1992-93
కె.విజయ రామారావు 1993-96
జె సింగ్‌ 1996-97
ఆర్‌సి శర్మ 1997-98
డిఆర్‌ కార్తికేయన్‌ 1998 (యాక్టింగ్‌)
టిఎన్‌ మిశ్రా 1998-99
ఆర్‌కె రాఘవన్‌ 1999-2001
పిసి శర్మ 2001-03
యుఎస్‌ మిశ్రా 2003-05
విఎస్‌ తివారి 2005-08
వివి అశ్విని కుమార్‌ 2008-10
అమర్‌ ప్రతాప్‌ సింగ్‌ 2010-ప్రస్తుతం
కొనసాగుతున్నారు.

స్టాఫ్‌ విభజన
వార్షిక రిపోర్టుల ఆధారంగా సిబిఐ స్టాఫ్‌ను మినిస్టీరియల్‌ స్టాఫ్‌, ఎక్స్‌ క్యాడర్‌ పోస్టులుగా విభజించారు. ఎక్స్‌ క్యాడర్‌ పోస్టులో టెక్నికల్‌, ఎగ్జిక్యూటివ్‌ స్టాఫ్‌, ఇడిపి స్టాఫ్‌, హిందీ భాషా స్టాఫ్‌ (అధికార భాషా విభాగానికి చెందినది) ఉంటారు. మినిస్టీరియల్‌ స్టాఫ్‌లో ఎల్‌డిసి, యుడిసి, క్రైమ్‌ అసిస్టెన్ట్స్‌ మొదలైన వారు... ఎగ్జిక్యూటివ్‌ స్టాఫ్‌లో కానిస్టేబుల్స్‌, ఎఎస్‌ఐ, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు... ఇడిపి స్టాఫ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డాటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్లు, అసిస్టెట్‌ ప్రోగ్రామర్లు, ప్రోగ్రామర్లు, ఎస్‌ఎస్‌ఎ ఉంటారు.
సిబిఐ శోధించిన కొన్ని ప్రధాన కేసులు
* బోఫోర్సు కేసు - 1986లో (అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రమేయం).
* కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధమున్న హవాలా బ్రోకర్లు జాతీయ నాయకులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చిన కేసు (1991).
* దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లు అయిన ఇద్దరు మాల్దీవుల మహిళలకు విక్రయించిన కేసు (1994).
* 22 ఏళ్ల లా విద్యార్థి ప్రియదర్శిని మట్టూ హత్య కేసు (1999).
* ఉత్తర ప్రదేశ్‌లోని నిఠారీ గ్రామంలో డజన్ల కొద్ది చిన్నారులను హత్య చేసిన కేసు.
* కరాచీలో దావూద్‌ ఇబ్రహీంను అరెస్టు చేశారన్న మీడియా కథనాల ఆధారంగా సరైన సమాచారం అందించాలని పాకిస్తాన్‌లోని ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఎ)ను సిబిఐ కోరింది (2007).
* కేరళలోని కొట్టాయంలో గల సెయింట్‌ పాయిస్‌ కాన్వెంట్‌ హాస్టల్‌లో క్రైస్తవ సన్యాసిని సిస్టర్‌ అభయ హత్య కేసు (1992)
* గుజరాత్‌లో సొహ్రాబుద్దీన్‌ హత్య కేసు.
* మలంకారా వర్గీస్‌ హత్య కేసు (2002)
* భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసు
* కామన్వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం
* 2జి కుంభకోణం
* ఓబుళాపురం మైనింగ్‌ అక్రమ రవాణా కుంభకోణం
* వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల వ్యవహారం
సిబిఐ అకాడమీ
సిబిఐ అకాడమీని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 1996లో నెలకొల్పారు. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు 40 కిలోమీటర్ల దూరంలో, రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. 26.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీలో పరిపాలన, అకడమిక్‌, హాస్టల్‌, రెసిడెన్షియల్‌ బ్లాక్స్‌ ఉన్నాయి. ఇక్కడ సిబిఐకి చెందిన అన్ని ర్యాంకుల అధికారులకు శిక్షణ ఇస్తారు. గతంలో సిబిఐలోని డిప్యూటీ ఎస్‌ఎస్‌పి, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లకు హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రం, ఎన్‌పిఎలలో శిక్షణ ఇచ్చేవారు. ఘజియాబాద్‌ అకాడమీ నెలకొల్పిన తర్వాత శిక్షణను అక్కడికి మార్చారు.

రాజకీయ ప్రభావాలు
సిబిఐకి అప్పగించే కేసులే తీవ్ర స్థాయిలోవై ఉంటాయి. ఉన్నత స్థానాల్లో వున్న వారికి చెందిన ఆరోపణలే దాని దాకా వస్తాయి. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. సాధారణంగా ఏ కేసైనా సంబంధిత రాష్ట్ర పోలీసులు రిజిస్టర్‌ చేస్తారు. అవసరాన్ని బట్టి కేంద్రం మధ్యవర్తిత్వంతో కేసులను సిబిఐకి బదలాయిస్తారు. సిబిఐ అత్యంత ప్రధానమైన కేసులను చేపడ్తుండటంతో వివాదాల సుడిగుండానికి దూరంగా ఉండలేని పరిస్థితి.పాలనా పరంగా సిబిఐ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే వుంటుంది. కనక కాంగ్రెస్‌, బిజెపి లేక మరెవరు అధికారంలో వున్నా వారి ప్రభావం దానిపై పడుతుంటుందని ఆరోపణలు అనేకం వున్నాయి. తమ వారిని కాపాడటం, ప్రత్యర్థులను వేధించడం వంటివాటికి సిబిఐని వాడుకున్న ఉదాహరణలున్నాయి. అందులో అత్యంత వివాదాస్పదమైన కేసు బోఫోర్సు కేసు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఎక్కువ విమర్శలనెదుర్కొన్నా ఏడేళ్లు పాలించిన బిజెపి ఎన్‌డిఎలు కూడా తక్కువ తిన్నది లేదు.బిజెపి ప్రతిపక్షంలో వున్నప్పుడు వాజ్‌పేయి సిబిఐ స్వతంత్రంగా పనిచేయాలని వాదించారు. కాని ఆయనే ప్రభుత్వాధినేతగా తమను సమర్థించుకుంటూ మాట్లాడారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడుగా వున్న అద్వానీయే హోం శాఖ చేపట్టడంతో ఈ వ్యవహారం రంసకందంలో పడింది. తర్వాత సిబిఐ ఉపేక్షతో ఆయన కేసు నుంచి విముక్తుడయ్యారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కేంద్ర మంత్రి అయిన మురళీ మనోహర్‌ జోషి కూడా దీనిపై నిరసన తెల్పుతూ రాజీనామా చేసి తర్వాత రాజీ పడ్డారు. అంటే ప్రతిపక్షంపైనే గాక తమలో తాము రకరకాలుగా సిబిఐని ప్రభావితం చేస్తుంటారని దీనివల్ల తెలుస్తుంది. ఆ సమయంలోనే మాయావతి, లాలూ యాదవ్‌ వంటివారిపై సిబిఐని ప్రయోగించినట్టు వివాదాలు నడిచాయి. గుజరాత్‌లో ఘోర నరమేధం జరిగినా విచారణ కమిషన్లను నియమించి సరిపెట్టిన నాటి కేంద్రం సిబిఐని ఉపయోగించుకోలేదు. తర్వాత యుపిఎ హయాంలో సోరాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ విషయమై సిబిఐ కోర్టు ఆదేశంతో జోక్యం చేసుకుంటే రాజకీయ కక్ష అని ఎన్‌డిఎ గగ్గోలు పెట్టింది. కాంగ్రెస్‌ కూడా తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకై ములాయం సింగ్‌ను తిప్పుకోవడానికి సిబిఐ ఆయుధాన్ని చూపించింది. ఈ విషయమై మెతక వైఖరిని తర్వాత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా. అలాగే కేరళలో పి. విజయన్‌ పైనా ఎప్పుడో వీగిపోయిన అసత్య ఆరోపణను ముందుకు తెచ్చి ఇబ్బంది పెట్టడానికి విఫలయత్నం చేసింది. ఇలాంటి కారణాల వల్ల సిబిఐ రాజకీయ ఒత్తిడుల ప్రభావానికి లోనవుతోందని విమర్శలొస్తున్నాయి. ఆశ్రిత పక్షపాతం, దోషులను వదలిపెట్టడం, అవినీతికి పాల్పడిన ఆరోపణలు కూడా సిబిఐ అధికారులపై ఉన్నాయి. ఈ విషయాలను ఎవరో కాదు డైరెక్టర్‌గా పనిచేసిన జోగీందర్‌ సింగ్‌, జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన బిఆర్‌ లాల్‌ బహి ర్గతం చేశారు. నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పేరొందిన బిఆర్‌ లాల్‌ తాను రాసిన పుస్తకంలో సిబిఐపై ఒత్తిడులు, విచారణను తప్పుదారి పట్టించిన విధానాన్ని ఉదాహరణలతో సహా ప్రస్తావించారు. ఈ సంస్థ అవినీతికి పాల్పడిందని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంలోనే తేలింది. సంస్థ ఉన్నతాధికారులు నిధులను దుర్వినియోగం చేసిన తీరు బహి ర్గతమైంది. సిబిఐ తప్పులను బయటపెట్టిన తనను వాళ్లు ముప్పుతిప్పలు పెట్టారని ఆర్‌టిఐ కార్యకర్త కృష్ణానంద్‌ త్రిపాఠి ఆరోపించారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు ఇవ్వడంతో సిబిఐ ఊపిరి పీల్చుకుంది. ఏదైనా కేసు సిబిఐ వద్దకెళ్తే అది కంచికి వెళ్లినట్లేనని ప్రజల్లో బలంగా నాటుకొని ఉంది. సిబిఐ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను తవ్విన చందంగా ఉంటుందని అనుకుంటారు. సిబిఐ చేపట్టిన కేసులు ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనివ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన బోఫోర్స్‌ కుంభకోణం, వేలాది మంది మృతి చెందిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, నర హంతక నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మచ్చగా ఏర్పడిన సొహ్రాబుద్దీన్‌ హత్యకేసు... ఇలా చెప్పుకుంటూ పోతే ఏ కేసులోనూ సిబిఐ దాని అంతు తేల్చలేదు. దీంట్లో తప్పు పట్టాల్సింది సిబిఐని కాదు. సిబిఐకి పరిధులు నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వాన్ని. అధికార పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కూడా సిబిఐ బూచిని ఉపయోగించుకుంటోందనే విమర్శలు కొల్లలు.
విమర్శలు ఎన్ని వున్నా... ఏ కేసులోనైనా అంతిమంగా సిబిఐ రంగంలోకి దిగాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి