19, అక్టోబర్ 2011, బుధవారం

ప్రాచీన దేశంలో పోరాట జ్వాలలు

ప్రాచీన దేశంలో పోరాట జ్వాలలు

''దిగజారిపోయే ఈజిప్టు మహిమ/ పతనమైపోయే గ్రీస్‌ గొప్పతనం/ పడిపోయే ట్రారు పట్ణణం/ నేలకొరిగే రోమ్‌ కిరీటం/ అణిగింది చూడు వెనిస్‌ గర్వం/ కానీ.../ అక్కడి ప్రజలు కన్న కలలు../పెంచుకున్న ఆశలు../ ఆకాంక్షలు../కలలుగానే మిగిలి వున్నవలాగే.
రాచరికాలు పతనమై క్రమేపీ పౌర ప్రభుత్వాలు ఏర్పడుతున్న సమయంలో పసిద్ధ ఆంగ్ల కవి, నాటకకర్త మేరి ఎలిజబెత్‌ కోలరిడ్జ్‌ రాసిన ఈ గేయం ప్రస్తుత పరిణామాలకూ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు కూలుతున్నది రాచరిక కోటలు కాదు. పెట్టుబడి పేక మేడలు. సామ్రాజ్యవాద ఆర్థిక నమూనాల నీటి బుడగలు. నాడూ..నేడూ కూడా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. ఈజిప్టులో హోస్నీ ముబారక్‌ను ప్రజలు దించేసినా..అక్కడి జనం ఆశలు అలానే ఉన్నాయి. గ్రీస్‌లో ప్రభుత్వం కూలలేదు కానీ దేశం రుణ సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ప్రజలపై పెను భారాలు పిడుగుల్లా పడుతున్నాయి. ఆ భారాలను భరించలేని జనం ఆగ్రహావేదనలతో ప్రతిఘటనలకు దిగుతున్నారు. ప్రాచీన ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా చెప్పబడే గ్రీస్‌ ప్రజలకు ఈ దురవస్థ ఎందుకొచ్చింది? చారిత్రికంగా సాంస్కృతిక, కళా సారస్వత రంగాలకు కాణాచిగా నిలిచిన ఆ దేశం ఇప్పుడెందుకు మునిగిపోతోంది? ఈ పూర్వాపరాల పరామర్శే ఈ వారం అట్టమీది కథ..
దీనికి ముందు కాస్త గ్రీసు చరిత్రలోకి వెళ్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీస్‌లో ఆర్థిక, సామాజిక మార్పులు వేగం పుంజుకున్నాయి. పర్యాటక, నౌకాయాన రంగాల్లోకి ప్రధాన ఆర్థిక వనరులు, భారీగా పెట్టుబడులు తరలిరావడంతో అభివృద్ధి వూపందుకుంది. 1991 ప్రాంతంలో మనదేశంలో లాగే అక్కడా సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచేశారు. వృద్ధి రేటు వేగం చూపించి ఊదర గొట్టారు. దేశీయ స్థూల ఉత్పత్తి కొన్నేళ్లపాటు సాలుసరి మూడు శాతం చొప్పున ఎగబాకింది. పెద్ద ఎత్తున సంపద పెరుగుదల నమోదైంది. అయితే ఇదంతా ఒక వైపే. ధనవంతులు, బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు, ఓడల యజమానులు, ఇతర పెట్టుబడిదారీ వర్గాలకు మాత్రమే సొంతమైంది. కార్మికవర్గం, అణగారిన ప్రజలకు ఈ 'అభివృద్ధి' ఫలాలు అందని మావిపళ్లే అయ్యాయి. వారంతా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
2000 ఆఖరిలో ముంచుకొచ్చిన ఆర్థిక సంక్షోభం గ్రీస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ధనాన్ని పాలకులు విపరీతంగా వృధా చేయడం, సంపన్నులచే పన్ను ఎగవేత, ఆపైన అంతర్జాతీయంగా అప్పు పుట్టకపోవడం దేశాన్ని సంక్షోభం ఊబిలో మరింతగా కూరుకుపోయేలా చేశాయి. అలాగే రుణభారం పెనుశాపంగా పరిణమించింది. 2010 వసంతం గ్రీస్‌ పాలిట కారుమబ్బుల కాలమై కూర్చుంది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక దివాళా తీయడం తప్పదన్న దుర్భర స్థితి దాపురించింది. అక్కడి ఉద్యమాల సెగ తమకెక్కడ తగుల్తుందోనని తోటి యూరోపియన్‌ దేశాలు 145 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. కుప్పకూలుతున్న గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థకు కాస్త వూతమిచ్చాయి. అయితే ఈ రుణాల మంజూరుకు విధించిన షరతులే ప్రజలను గుల్ల చేశాయి. ప్రజోపయోగ సంక్షేమ కార్యక్రమాలపై విధిగా కోతలు విధించి, సాధారణ ప్రజల నుండి అధిక పన్నులు గుంజాలన్నది వాటిలో ప్రధాన షరతు. ఇది దీర్ఘకాలిక సామాజిక అశాంతికి దారితీసింది. యూరోజోన్‌ను అస్థిర పర్చేందుకు దారి తీసింది. యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అయితే ఇంత దుర్భర పరిస్థితిలోనూ యూరోపియన్‌ యూనియన్‌ పెట్టుబడిదారులకు లాభాలు కురిపించే మార్గాలనే సంక్షోభానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా చూపుతూ తనవైన వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కార్మికుల వేతనాలను, ఫించన్లను తెగకోయడం, ఉద్యోగాల నుంచి తొలగించి ఉపాధికి ఎసరు పెట్టడం, సామాజిక భద్రతను, సామాజిక హక్కులను హరించివేయడం వంటి వాటిలో ఇయు మరింత ప్రత్యేక పాత్ర పోషించింది. ఈ పోకడలు 2007 బడ్జెట్‌ కేటాయింపులలోనే భారీ ఎత్తున ప్రతిబింబించాయి. వైద్యం తదితర కీలక రంగాలకు భారీ కోతలు విధించారు. మరోవైపున గత ప్రభుత్వ హయాం నుంచి పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ జరుగుతోంది. మాస్ట్రిచ్‌ ఒప్పందం, ఆర్థిక మరియు ద్రవ్య యూనియన్‌ (ఇఎంయు), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, లిస్బన్‌ ఒడంబడికలు ఈ క్రమంలో తీసుకొచ్చినవే. ఐరోపాలోని బడా పెట్టుబడిదారులు మరింతగా బలపడేందుకు, పెద్ద మొత్తంలో లాభాలు గడించే ఎత్తుగడలతో వీటిని తయారు చేశారు.
వాస్తవానికి అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లోని ఇతర దేశాల్లోనూ ఆర్థిక సంక్షోభాలకు పెట్టుబడిదారుల మితిమీరిన లాభార్జనా దాహమే మౌలిక కారణం. సంపదంతా గుత్త పెట్టుబడిదారుల చేతిలో కేంద్రీకృతమైపోతోంది. రుణ సంక్షోభం మూలంగా గ్రీస్‌ స్థూల దేశీయోత్పత్తి 2009 నుంచి ప్రతి సంవత్సరం ఐదు శాతం చొప్పున తగ్గుతూ వస్తోంది. 2012లో ఇది మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా ఈ రుణ సంక్షోభానికి కారణంకాకున్నా సంక్షోభ ప్రభావమంతా వారిపైనే పడుతోంది. ఈ సంక్షోభం ప్రస్తుతం ఐర్లండ్‌, పోర్చుగల్‌, ఇటలీ, స్పెయిన్‌కు విస్తరించి జర్మనీలో గుబులు రేపి యూరోపియన్‌ యూనియన్‌ను ఓ కుదుపు కుదిపేసింది. యావత్‌ ప్రపంచం స్టాక్‌మార్కెట్ల సూచీల వైపు బిత్తర చూపులు చూసేలా చేసింది.
ఉద్దీపనలు..విష గుళికలు
గ్రీసు రుణ సంక్షోభంలో కూరుకుపోగానే యూరప్‌ యూనియన్‌ గగ్గోలు పెట్టింది. ఉమ్మడి కరెన్సీ ఉండటంతో యూరో స్టాకు సూచీలన్నీ నేల చూపులు చూశాయి. దీంతో ఒకవైపు ఉద్దీపనలు ప్రకటిస్తూ మరోవైపు పొదుపు చర్యలు తీసుకోవాలంటూ గ్రీసుపై ఒత్తిడి చేస్తూ ప్రజలపై పెను భారాల మోపే విషగుళికల లాంటి షరతులు విధించాయి. ఈ క్రమం..2010 ఏప్రిల్‌-మే నెలల్లో గ్రీసు ఇక దివాళా తీస్తుందన్న భయాందోళనలు వెల్లువెత్తాయి. దీంతో యూరో జోన్‌ దేశాలు 145 బిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజికి ఆమోదం తెలిపాయి. గ్రీసు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఉద్దీపన ఒప్పందం ప్రకారం ఈ ప్యాకేజి ప్రకటించాయి. ఈ షరతుల్లో భాగంగా మరిన్ని కఠిన పొదుపు చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు. దానిపై కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కాగా మరోవైపు ఇదే సంవత్సరం ఆగస్టులో ఇయు, ఐఎంఎఫ్‌ నుంచి రెండో విడత ఉద్దీపన ప్యాకేజి పొందాలంటే గ్రీసు మరిన్ని పొదుపు చర్యలు తీసుకోవాల్సిందేనంటూ షరతులు తీసుకొచ్చాయి. అక్టోబర్‌లో ప్రభుత్వం మరిన్ని కఠిన పొదుపు చర్యలు ప్రకటించింది. వ్యాట్‌ ను భారీగా పెంచేశారు. దాంతో పాటు జనంపై కొత్త పన్నులును బాదారు. నవంబర్‌లో మూడో విడత ఆర్థిక సహాయాన్ని ఇయు, ఐఎంఎఫ్‌ ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు 2011 ఫిబ్రవరిలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవని, తన ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలకెక్కాలంటే సంస్కరణలను వేగవంతం చేయాలని సామాజ్య్రవాద దేశాల నాయకులు గ్రీస్‌ను హెచ్చరించారు. దీంతో జనంపై భారాలు మరింత అధికమయ్యాయి. భరించలేని ప్రజలు రోడ్డు ఎక్కారు. ఈ ఏడాది జూన్‌లో 24 గంటల పాటు సాధారణ సమ్మె చేపట్టారు. ప్రభుత్వ నూతన పొదుపు చర్యల ఆమోదాన్ని అడ్డుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పార్లమెంటు ముట్టడించేందుకు ప్రదర్శన చేశారు. గత జూన్‌లో 109 బిలియన్‌ యూరోల ఉద్దీపన ప్యాకేజిని ఐరోపా ఆర్థిక స్థిరత్వ సౌకర్య పథకం కింద (యూరోపియన్‌ ఫినాన్షియల్‌ స్టెబిలిటి ఫెసిలిటి) అందించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ నాయకులు అంగీకరించారు. ఇదే సమయంలో మూడు ప్రధాన రుణ రేటింగ్‌ సంస్థలూ గ్రీసు రుణార్హత రేటింగ్‌ను బాగా తగ్గించి 'దివాళాకు చేరువులో ఉన్న' అని సూచించే రేటింగ్‌ను ఇచ్చాయి. 2011 ఆగస్టులో గ్రీసుకు రెండో బెయిల్‌ అవుట్‌ అందించేందుకు జులై 21 న చేసుకున్న ఒప్పందాన్ని అమల్జేయాలని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జీన్‌ క్లౌడీ ట్రీచెట్‌ కోరారు. గత సెప్టెంబర్‌లో మూడిస్‌ అనే రుణ రేటింగ్‌ సంస్థ ఎనిమిది గ్రీకు దేశాల క్రెడిట్‌ ర్యాంకును తగ్గించింది. ఒడ్జెట్‌ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం మరో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఇంత జరుగుతున్నా..గ్రీసు ఇప్పటికీ యూరో జోన్‌లో కొనసాగుతుందని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజిలా మెర్కెల్‌; ఫ్రెంచ్‌ అధ్యక్షులు సర్కోజీ, యూరోపియన్‌ కమిషన్‌ అధిపతి జోస్‌ మాన్యల్‌ ప్రకటించారు.
ప్రభుత్వం
కార్యనిర్వహణాధికారిగా గ్రీస్‌ దేశాధ్యక్షునికి లాంఛనప్రాయమైన అధికారాలు ఉంటాయి. పాన్‌ హెల్లినిక్‌ సోషలిస్టు మూవ్‌మెంట్‌ (పిఎఎస్‌ఒకె-పాసోక్‌) పార్టీ సీనియర్‌ నాయకులు కరోలస్‌ పపౌలీస్‌ ప్రస్తుత దేశాధ్యక్షునిగా ఉన్నారు. 1929లో జన్మించిన కరోలస్‌ అధ్యక్షపదవి చేపట్టకముందు విదేశాంగ మంత్రిగా పని చేశారు. 2005 మార్చి 12 అధికారం చేపట్టిన ఆయన 2010లో మళ్లీ అధ్యక్షునిగా ఎన్నికై కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. 300 సభ్యులు గల పార్లమెంటుకు ఆయన బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం జార్జి పాపండ్రూ ప్రధానిగా ఉన్నారు. గ్రీస్‌లో అత్యంత శక్తివంతమైన రాజకీయ వారసత్వమున్న కుటుంబానికి చెందిన జార్జి పాపండ్రూ 2004 నుంచి పాసోక్‌ పార్టీ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. 2007లో పార్టీ ఓటమి పాలైనప్పుడు ఈయననే నాయకత్వంలో ఉంది. మళ్లీ ఆయన నాయకత్వంలోనే 2009లో పాసోక్‌ ఘనవిజయం సాధించింది. ఆర్థిక సంస్కరణలకు, హరిత విధానాల ప్రోత్సాహానికి, ప్రజా జీవితంలో అవినీతిపై పోరాడటంలోనూ పాపండ్రూ ముందుంటారని చెబుతారు. ఆర్థిక, వాణిజ్య సంక్షోభ విపత్తు చుట్టుముట్టి దేశమంతా విస్తరించినప్పుడు పాపండ్రూకు పెను సవాల్‌ ఎదురైంది. 2009 డిసెంబర్‌ నుంచి బడ్జెట్‌ లోటు తగ్గించుకోవాలంటూ మార్కెట్‌ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీంతో అనేకమార్లు కోతలకు ఆయన పదునుపెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోసేశారు. ఇంధన ధరలను చుక్కలంటించారు. కాకపోతే పన్నుల ఎగవేత చర్యలకు మాత్రం అడ్డుపడ్డారు. అయినా సంక్షోభ ఊబి నుంచి బయటపడలేకపోయారు. 2010 వసంతానికి కల్లా ఏమాత్రం రుణాలు చెల్లించలేని దీనస్థితిలోకి దేశం నెట్టివేయబడింది. యూరోజోన్‌ లోని ప్రభుత్వాలతో చర్చలు జరిపి, ప్రధానంగా జర్మనీతో చర్చల అనంతంరం మరోమారు కోతల చర్యలకు పాపండ్రూ తెర లేపారు. ఈ సారి అవి మరింత కఠినంగా ఉన్నాయి. పెన్షన్లు, జీతాల్లో భారీ కోతలు విధించారు. ఇవన్నీ కూడ చాలడం లేదు. దీంతో 2011 ఆకురాల్చే కాలంలో మరోమారు ఉద్దీపన ప్రకటించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు సంకేతాలిచ్చాయి. పాపండ్రూ గతంలో 1988-89లో జాతీయ విద్యాశాఖ మంత్రిగాను, 1994-96లో మత వ్యవహారాల మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. 1990-2004లో విదేశాంగ వ్యవహారాల మంత్రిగా చేశారు. పాపండ్రూ తాత జార్జ్‌ పాపండ్రూ సీనియర్‌, నాన్న ఆండ్య్రూస్‌ పాపండ్రూ కూడా గ్రీస్‌ ప్రధానమంత్రులుగా పనిచేశారు. 2006లో సోషలిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలానే గ్రీస్‌ 182 ప్రధానిగా ఆయన అక్టోబర్‌ 9, 2009లో బాధ్యతలు చేపట్టారు. సీనియర్‌ పాపండ్రూ 1944-45, 1963, 1964-65 మధ్యకాలంలో ప్రధానిగా మూడు సార్లు ఎన్నికయ్యారు) అలానే ఆండ్య్రూస్‌ రెండు పర్యాయాలు (1981 - 89లోనూ, 1993-1996 మధ్యకాలంలో) చేశారు.
గ్రీసు చారిత్రిక భౌగోళిక విశేషాలు
గ్రీసు అనేది గ్రేసియా అనే లాటిన్‌ పదం నుంచి ఉద్భవించింది. గ్రేసియా అంటే గ్రీకుల భూమి అని అర్థం. గ్రీసును గ్రీకులు హెల్లాస్‌ లేదా ఎల్లాద కూడా పిలుస్తారు. హెల్లాస్‌ అని ఇంగ్లీషులో కూడా కొన్ని సార్లు వినియోగిస్తారు. ఇది దక్షిణ యూరప్‌లో ఉంది. హెలెనిక్‌ రిపబ్లిక్‌ అనేది ఈ దేశానికున్న అధికారిక నామం. గ్రీసు రాజధాని ఏథెన్స్‌. దేశంలో అతిపెద్ద నగరం కూడా ఇదే. ఉత్తరాన అల్బేనియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ మాసిడోనియా, బల్గేరియా దేశాలు, తూర్పున టర్కీ సరిహద్దు దేశాలు. గ్రీసు ప్రధాన భూభాగానికి తూర్పు వైపున ఏజియన్‌ సముద్రం ఉంది. పశ్చిమాన అయోనియన్‌ సముద్రం ఉండగా, దక్షిణాన మధ్యధరా సముద్రముంది. ప్రపంచంలో అత్యధిక తీరప్రాంతమున్న దేశాల్లో గ్రీసుది 12వ స్థానం. దీని తీరప్రాంత పొడవు 13,676 కిలోమీటర్లు. ఇది మధ్యధరా సముద్రంలో క్రమాకారం లేని ద్వీపకల్పంగా ఉండి, దానికి చాలిడైస్‌, పెలోపొన్నిస్‌ అనే రెండు పెద్ద ద్వీపకల్పాలు అదనంగా పొడుచుకొచ్చినట్లుగా ఉంటుంది. గ్రీకు దీవులను వాటి స్థానాల్ని బట్టి రెండు సమూహాలుగా విభజించారు. అవి : 1) అయోనియన్‌ దీవులు 2) ఏజియన్‌ దీవులు. గ్రీస్‌ ప్రధాన భూభాగానికి పశ్చిమంగా అయోనియన్‌ దీవులుంటాయి. వీటిలో కోర్ఫు, సెఫలోనియా, ల్యూకస్‌ దీవులు కలిసి వుంటాయి. ఏజియన్‌ దీవులు తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉంటాయి. యబాయియా, సమోస్‌, చియోస్‌, లెస్బాస్‌, క్రెవే దీవులు కూడా ఏజియన్‌ దీవుల్లోనే కలిసి ఉంటాయి. దాదాపు 1400 దీవులు గ్రీస్‌ చుట్టూ వున్నాయి. వీటిలో జనావాసాలున్నవి 227. కాగా ఉత్తర మధ్య గ్రీస్‌, ఎపిరస్‌, పశ్చిమ మాసిడోనియా ప్రాంతాలు పర్వతాలతో కూడి ఉంటాయి. దాదాపు 80 శాతం గ్రీసు దేశం పర్వతమయమైవుంటుంది. పిండస్‌ పర్వతాల ప్రధాన శ్రేణి వాయువ్య గ్రీస్‌ నుంచి పెలోప్పాన్నెస్‌ ద్వీపకల్పం వరకు విస్తరించాయి. గ్రీసు దేశంలోకెల్లా అతి ఎత్తైన శిఖరం ఒలింపస్‌. ఇది సముద్ర మట్టానికి 2,917 మీటర్ల (9,570 అడుగుల) ఎత్తులో ఉంటుంది.
గ్రీసు దేశానికి వైభవోపేతమైన ప్రాచీన నాగరికత వారసత్వముంది. పశ్చిమ నాగరికతకు గ్రీసునే కేంద్రబిందువుగా పరిగణిస్తారు. ప్రజాస్వామ్యం, పశ్చిమ తత్వశాస్త్రం, ఒలింపిక్‌ క్రీడలు, పశ్చిమ సాహిత్యం, చారిత్రక, రాజనీతి శాస్త్రాలకు గ్రీసు పుట్టినిల్లు. అలాగే ప్రధాన శాస్త్రీయ, గణిత సిద్ధాంతాలు, విశ్వవిద్యాలయ విద్య, నాణేలు, విషాద, వినోద పశ్చిమ నాటకాలకు కూడా గ్రీసు దేశమే మూలస్థావరంగా చెబుతారు. గ్రీసులో 17 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ క్షేత్రాలుగా యునెస్కో గుర్తించింది. అలనాటి చారిత్రక, సాంస్కృతిక, సారస్వత వైభవం పాక్షికంగానైనా ప్రతిబింబిస్తూ ఇప్పటికీ అబ్బురపరుస్తుంటుంది. ఆ దేశం అత్యధిక ప్రపంచ వారసత్వ క్షేత్రాలున్న దేశంగా గ్రీసు యూరప్‌లో ఏడవ స్థానం ఆక్రమించగా.. ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. 1830లో ఆధునిక గ్రీసు ఏర్పాటయ్యింది. ప్రస్తుత సంక్షోభాన్ని పక్కనపెడితే వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీస్‌ ఒకటి. యూరోపియన్‌ యూనియన్‌లో 1981 నుంచి గ్రీస్‌ సభ్యదేశం. అలానే 2001 నుంచి ఉమ్మడి కరెన్సీ దేశాల కూటమైన యూరోజోన్‌లో భాగస్వామి. 1952 నుంచి నాటో సభ్యదేశం. ఐరోపా అంతరిక్ష సంస్థ (యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ)లో 2005 నుంచి సభ్యురాలిగా ఉంది. ఐక్యరాజ్యసమితి, ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ, నల్ల సముద్ర ఆర్థిక సహకార సంస్థల్లో వ్యవస్థాపక సభ్యదేశంగా గ్రీస్‌ కొనసాగుతోంది.
గ్రీసు వివరాలు ...
పూర్తి పేరు : హెలినిక్‌ రిపబ్లిక్‌
జనాభా : 1.12 కోట్లు (ఐరాస 2010)
రాజధాని : ఏథెన్స్‌
విస్తీర్ణం : 131,957 చకిమీ
ప్రధాన భాష : గ్రీక్‌
ప్రధాన మతం : క్రైస్తవం
ఆయుప్రమాణం : 78 సంవత్సరాలు (పురుషులు), 83 సంవత్సరాలు (స్త్రీలు)
ద్రవ్య మారకం : యూరో (1 యూరో = 100 సెంట్లు)
ప్రధాన ఎగుమతులు : జౌళి ఉత్పత్తులు, దుస్తులు, ఆహారం,
చమురు ఉత్పత్తులు
తలసరి జిఎన్‌ఐ : 28,630 డాలర్లు (ప్రపంచబ్యాంకు 2009 )
ఇంటర్నెట్‌ డొమైన్‌ : జిఆర్‌
అంతర్జాతీయ డయల్‌ కోడ్‌ : +30

ఇదీ చరిత్ర
పురాతన రాతి యుగానికి ముందు అట్టికా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవాసాలున్నా.. పురాతన శాస్త్ర ఆధారాల ప్రకారం..కొత్త రాతియుగకాలం అక్రోపాలిస్‌ పర్వతాలు, క్లెప్సిథ్రా ప్రాంతాల్లోని గుహల చుట్టూ జనసంచారం వున్నట్టు తెలుస్తోంది. యూరప్‌లో మొట్టమొదట నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతం గ్రీసే. మొదట్లో ఏజియన్‌ సముద్రంలో సైక్లాడిక్‌ నాగరికతతో ప్రారంభమై క్రీట్‌లోని మినోయాన్‌ నాగరికత, ప్రధానభూభాగం (మైయిన్‌ల్యాండ్‌)లోని మైసీనియన్‌ నాగరికత ప్రారంభమైంది. మైసీనియన్ల తో అనేక ఇండో యూరోపియన్‌ తెగలకు చెందిన ప్రజలు క్రీస్తుపూర్వం 2000 నాటికి గ్రీస్‌లో ప్రవేశించి అత్యున్నత స్థాయి నాగరికతలను అభివృద్ధి చేశారు. అది అనేక గ్రీకు రాజ్యాలు, నగర రాజ్యాలు... గ్రీక్‌ ద్వీపకల్పమంతా వ్యాపించి నల్ల సముద్రం తీరానికి, దక్షిణ ఇటలీకి, ఆసియా మైనర్‌కు, నాగరికత విస్తరించింది. శాస్త్రీయ సంగీతం, అద్భుతమైన గృహనిర్మాణ శైలి, నాటకం, సైన్స్‌, తత్వశాస్త్రం అక్కడ అభివృద్ధి చెందాయి. ఏథెన్స్‌లో ప్రజాస్వామ్య వాతావరణం ఉండటంతో ఒక గొప్ప సాంస్కృతిక వాతావరణం వెల్లివిరిసింది. క్రీస్తుపూర్వం 1200 ప్రాంతంలో ఇండోయూరోపియన్‌ జాతికి చెందిన డోరియన్‌ తెగ ప్రజలు గ్రీస్‌ ప్రాంతాన్ని ఆక్రమించడంతో ప్రారంభమైన అంధయుగ వర్ణనలు మనకు మహాకవి హోమర్‌ కావ్యాల ద్వారా తెలుస్తాయి. క్రీస్తు పూర్వం 750 నాటికి చరిత్ర ప్రసిద్ధి చెందిన నగర రాజ్యాలు ఏర్పడి విశ్వవిఖ్యాత గాంచిన గ్రీకుల స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ నగరాల రాజ్యాలు సముద్ర మార్గాల ద్వారా విదేశీ వ్యాపారం జరపడంతో కళలు, సారస్వతం, రాజకీయాలు, తత్వశాస్త్ర అధ్యయనం విస్తరించాయి. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం నాటికి గ్రీస్‌ అత్యున్నతమైన వైభవ శిఖరాల్ని అందుకుంది. పెలెపోన్నేసియన్‌ యుద్ధం (క్రీస్తుపూర్వం 431-404) దానిని బలహీనపర్చింది. వరుస యుద్ధాల ద్వారా పర్షియన్‌ సామ్రాజ్యాన్ని తిప్పికొట్టేందుకు ఏథెన్స్‌, స్పార్తా నేతృత్వం వహించాయి. ఈ యుద్ధంలో తమకు తాముగా గ్రీకులుగా పిలుచుకునే మాసిడోనియాకు చెందిన ఫిలిప్‌-2, ఆయన తనయుడు అలెగ్జాండర్‌ విజయం సాధించారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికి గ్రీస్‌ రోమన్‌ సామ్రాజ్యంలో ఒక సామంత స్థాయికి కుదించుకుపోయింది. క్రీస్తుపూర్వం 146లో గ్రీకుదేశాల్లో రోమన్‌ రాజ్యం ఏర్పడిన రెండు శతాబ్దాలు గడిచిన తర్వాతనే హెలిస్టిక్‌ యుగం పాక్షికంగా మొదలైంది. అలెగ్జాండర్‌ స్థాపించిన అలెగ్జాండ్రియా, ఆటియోచ్‌, సెల్యూసియాతో పాటు ఆసియా, ఆఫ్రికాలోని ఇంకా అనేకమైన కొత్త హెలిస్టిక్‌ పట్టణాలకు చాలా మంది గ్రీకులు వలసలు వెళ్లారు. దీంతో రోమన్‌, హెలిస్టిక్‌ సాంస్కృతికంగా మిళితమైపోయి బైజాంటైన్‌ సామ్రాజ్యం అనే సరికొత్త రాజ్యం క్రీస్తు శకం 330లో కాన్‌స్టాంటినోపుల్‌లో స్థాపితమైంది. తర్వాతి 1123 సంవత్సరాల వరకు బైజాంటైన్‌ సామ్రాజ్యం సుసంపన్నమైన సైనికబలంతో, సాంస్కృతిక వైభవంతో విరాజిల్లింది. కీస్తుశకం 1204లో కాన్‌స్టాంటినోపుల్‌ మతయుద్ధ యోధుల హస్తగత మయ్యేవరకు గ్రీస్‌ తూర్పు రోమన్‌ సామ్రాజ్యంలోనే భాగంగా ఉండేది. క్రీస్తుశకం 1453లో ఒట్టోమాన్‌ టుర్కీస్‌ చేతిలో కాన్‌స్టాంటినోపుల్‌ పతనమమ్యేవరకు బైజాంటైన్‌ సామ్రాజ్యం కొనసాగింది. ఒట్టోమాన్‌ పాలన చేపట్టిన తర్వాత గ్రీకు మేధావులు ఇటలీ తదితర ఒట్టోమాన్‌ పరిపాలనలోని ప్రాంతాలకు వలస వెళ్లారు. పశ్చిమ యూరప్‌కు ప్రాచీన గ్రీకు శిల్పకళకు పునరుజ్జీవింపజేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. క్రీస్తుశకం 1460లో గ్రీస్‌, ఆర్తడాక్స్‌ చర్చి ప్రాబల్యమున్నప్పటికీ టర్కీస్‌ సామ్రాజ్యంలో ఒక రాష్ట్రమైంది. గ్రీసు మహాకవి లార్డ్‌బైరన్‌ ద్వారా గ్రీస్‌ తిరుగుబాటు 1821లో చాలా ప్రసిద్ధి పొందగా 1827లో గ్రీస్‌ స్వాతంత్య్రం పొందింది. టర్కీకి వ్యతిరేకంగా 1821 నుంచి 1829 వరకు ఈ స్వాతంత్య్ర పోరాటం సాగింది. గ్రీస్‌ సార్వభౌమత్వానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా పూచీగా ఉన్నాయి. గ్రీస్‌ రక్షిత రాజ్యాలు ఇంచుమించుగా పోన్నెస్‌ ద్వీపకల్పం అంత విస్తీర్ణంలో ఉండే గ్రీస్‌ ప్రాంతానికి బవేరియా యువరాజు ఒట్టోను 1832లో మొదటి రాజుగా నియమించారు. 1863లో రక్షిత రాజ్యాలు నియమించిన రెండో రాజు ఒకటవ జార్జి హయాంలో గ్రీస్‌ ఇప్పటి భూభాగాలన్నింటిని తిరిగి పొందగలిగింది. తన 57 సంవత్సరాల పరిపాలన కాలంలో జార్జి61 పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించారు. విచ్ఛిన్నమవుతున్న టర్కిష్‌ సామ్రాజ్యం నుంచి థిసలీ, ఎపిరస్‌, మాసిడోనియా, క్రెటిలాతో పాటు దాదాపు ఏజియాన్‌ దీవుల సముదాయం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 19, 20 శతాబ్దంలో గ్రీస్‌ జనాభాలో 6శాతం ప్రజానీకం వేర్వేరు దేశాలకు ప్రధానంగా అమెరికాకు వలసవెళ్లారు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత గ్రీస్‌ టర్కీతో చేసిన యుద్ధంలో విజయం సాధించలేకపోవడంతో రాజరికం కూలిపోయింది. 1923లో రిపబ్లిక్‌గా ఏర్పడింది. రెండు మిలటరీ నియంతృత్వాలు,ఒక ఆర్థిక సంక్షోభం, తర్వాత రెండవ జార్జ్‌ ప్రవాసం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇటాలియన్‌ జర్మనీ ఆక్రమణదారుల్లో గ్రీస్‌ ఓడిపోయింది. దీంతో 1941 వరకు మాత్రమే జార్జి-2 అధికారంలో ఉన్నారు. బ్రిటీష్‌, గ్రీస్‌ సేనలు దేశాన్ని విముక్తి చేసిన తరువాత 1944లో అక్టోబర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు గెరిల్లాలు భారీస్థాయిలో ఉద్యమం నిర్వహించారు. గ్రీస్‌ అంతర్యుద్ధం 1944 డిసెంబర్‌లో మొదలై 1949 అక్టోబర్‌ 16 వరకు సాగింది. కమ్యూనిస్టులను అణిచివేయడానికి మార్షల్‌ ప్లాన్‌కి ముందు అమల్లో ఉన్న ట్రామన్‌ సిద్ధాంతం ప్రకారం అమెరికా నుంచి గ్రీస్‌కు భారీగా సాయమందించింది. గ్రీస్‌ ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో సభ్యురాలే గాక 1951 లో నాటో కూటమిలో కూడా సభ్యత్వం పొందింది. 1967లో ఏప్రిల్‌లో మిలటరీ అధికారం చేజిక్కించుకుంది. కాన్‌స్టాంటిన్‌-2 రాజు ప్రవాసంలోకి వెళ్లిపోయాడు. మిలటరీ తిరుగుబాటు నాయకుడు కల్నల్‌ జార్జి పాపడోపౌలస్‌ తనకున్న మితవాద ముద్రని పొగొట్టుకోవడానికి 1973లో మిలటరీ పదవిని వదులుకొని ప్రధాని పదవి చేపట్టాడు. ఆ తర్వాత అధ్యక్ష పదవి చేపట్టాక మార్షల్‌ లా ఎత్తివేశాడు. 1973 నవంబర్‌లో జరిగిన తిరుగుబాటులో పాపడోపౌలస్‌ పదవీచ్యుతడయ్యారు. ఏడు సంవత్సరాలపాటు సాగిన కల్నల్‌ పాలన అణచివేత, రాజకీయ వ్యతిరేకులను ప్రవాసాలకు పంపటం, మానవ హక్కుల అతిక్రమణ, మొదలగు చర్యలతో విపరీతంగా అపఖ్యాతి పాలై చివరకు సైప్రస్‌ను ఆక్రమించే ప్రయత్నంలో విఫలమై కూలిపోయింది. మిలటరీ పాలన అంతమైన ఐదు నెలలకు 1974లో డిసెంబర్‌లో రిఫరెండం ద్వారాం గ్రీకు రాజరికం రద్దయింది. రిపబ్లిక్‌ స్థాపించారు. మాజీ ప్రధాని కరామన్లిస్‌ ప్రవాసం వీడి 1967 తర్వాత మొదటిసారిగా ఏర్పడిన పౌర ప్రభుత్వానికి ప్రధాని అయ్యాడు.
ఒలింపిక్స్‌ పుట్టిల్లు
గ్రీసులో ఆటలకు అధిక ప్రాధాన్యమిస్తారు. ప్రాచీన కాలం నుంచే విశేష ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వవిఖ్యాతి గాంచిన ఒలింపిక్స్‌ క్రీడలు గ్రీసులోనే జీవం పోసుకున్నాయి. 1896లో ఏథెన్స్‌లోని పానాధేనియన్‌ స్డేడియం ఈ క్రీడలు తొలి వేదికయింది. ఆ తర్వాత 1896, 1870, 1875, 1906, 2004 సమ్మర్‌ ఒలింపిక్స్‌ వరకు అనేక పర్యాయాలు ఒలిపింక్స్‌కు గ్రీసు ఆతిథ్యం అందించింది. గ్రీకు జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు 2009లో ప్రపంచ 12వ ర్యాంకు పొందింది. 2004లో యుఇఎఫ్‌ఎ యూరో కప్‌ను ఈ జట్టు సొంతం చేసుకుంది. క్రీడా చరిత్రలో అత్యంత అశ్చర్యకరఘటనగా ఈ విజయం ఖ్యాతి పొందింది. గ్రీసులో 16 ఫుట్‌బాల్‌ జట్లు వున్నాయి. వీటిలో ఒలంపియాసిస్‌, పానథినాయికోస్‌, ఏరీస్‌, పోక్‌, ఎఇకె జట్లు కూడా ప్రధానమైనవి. అలాగే గ్రీకు జాతీయ బాస్కెట్‌బాల్‌ జట్టు కూడా దశాబ్దాలుగా తమ సాంప్రదాయ నైపుణ్యతను ప్రదర్శిస్తూ రాణిస్తోంది. ఇది 2004లో ప్రపంచ నాలుగో ర్యాంకు సొంతం చేసుకుంది. 1987, 2005లో రెండు సార్లు యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుపొందింది. గత నాలుగు ఫిఫా పోటీల్లో మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లింది.

ఆ తర్వాత గ్రీస్‌లో ఎన్నికలు క్రమం తప్పకుండా స్వేచ్ఛగా జరుగుతూ పౌర పాలన సాగుతోంది. 1981 జనవరి 1న గ్రీస్‌ యూరోపియన్‌ యూనియన్‌ సభ్యత్వం పొందింది. మాజీ ప్రధాని జార్జి పాపండ్రో కుమారుడు ఆండ్రియస్‌ పాపండ్రో పాన్‌ హెలినిక్‌ సోషలిస్టు మూవ్‌మెంట్‌ పార్టీని స్థాపించారు. గ్రీస్‌ దేశానికి మొదటి సోషలిస్టు ప్రధానిగా ఆండ్రియస్‌ ఎన్నికయ్యారు. కొసొవో సంక్షోభాన్ని పరిష్కరించడానికి 1999లో ఆ ప్రాంతంపై నాటో కూటమి దాడులను గ్రీస్‌ గట్టిగా వ్యతిరేకించింది. దాడుల వలన ఆర్థిక రాజకీయ సుస్థిరత్వం దెబ్బతిని, లేలాది మంది శరణార్థులు గ్రీస్‌లోకి చొరబడి అవకాశంతో పాటు సెర్బాలతో వారికి ఉన్న తూర్పు ఆర్థడాక్స్‌ మత సంబంధాలు కూడా దాడులను వ్యతిరేకించడానికి కారణాలు. ఇప్పుడు అధికారంలో ఉన్న పోషక్‌ పార్టీ ప్రజలను నానా ఇక్కట్లకు గురి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ తదిర ప్రాంతాల్లో నాటో సాగిస్తున్న యుద్ధ అవసరాల కోసం గ్రీసు దేశం సైన్యంపై అధికంగా ఖర్చు చేసి అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్దీపన ప్యాకేజీల షరతులతో ప్రజల నడ్డి విరుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి