31, అక్టోబర్ 2011, సోమవారం

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం


తెలుగుతల్లి
"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆవిర్భవించిన రాష్ట్రమిది. దక్షిణ భారతంలోనేకాక యావద్భారత దేశంలోనే సంప్రదాయాలకు పెద్దపీట వేసి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ రాష్ట్రం ఏర్పడి నేటికి 54 సంవత్సరాలు అయ్యింది. సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో అర్ధ శతాబ్దం క్రితం ఎలా ఉందో ఆధునిక శతాబ్దంలో కూడా వాటికి అంతే విలువిస్తూ, వాటిని కాపాడుకుంటూ వస్తోంది. పైగా ఈ ఆంధ్ర రాష్ట్ర దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. అది... తెలుగు భాషపట్ల ప్రజల్లో మమకారాన్ని పెంపొందింపజేసేందుకు తెలుగు రచయితలు గత ఏడాదిగా చేస్తున్న కృషికీ, తెలుగు భాషకు ప్రాచీన భాషగా గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికీ రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రతిస్పందన లభించడం. అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవానికి గతంలో లేని ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెలుగుతల్లి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తెలుగు జాతిపట్ల మాతృ భాషాభిమానం పెరిగేట్లు చేశాయి. అందులో ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీనతను గుర్తించకపోవడం. ఇది భాషాభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వివిధ మాండలికాలలో రచనలు తెలుగుతల్లి చేస్తున్న కవులు, రచయితలను ఒకే తాటిపై తీసుకొచ్చి అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించేట్లు చేసింది. ముందుముందు ఇది మరింత ఉధృతమూ, విస్తృతమూ అయ్యే అవకాశముంది. అత్యంత ప్రాచీనమైన ఈ భాషకు ప్రభుత్వపరంగా ప్రాచీనతా గుర్తింపు లభించకపోయినా ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచ భాషలలో 6వ స్థానం, భారతదేశంలో 2వ స్థానం లభించడం ఈ భాషపట్ల భాషారాధకుల ప్రేమను తెలుపుతోంది. ఏ భాషకూ లేని ప్రత్యేక నుడికారాల సొంపు, భాషా సౌలభ్యం, మాట్లాడుతున్నా, వింటున్నా ఆత్మానందాన్ని కలిగించే సహజసిద్ధమైన భావ సౌందర్యం ఈ భాషకు ఉండడమే ఇందుకు కారణం. తెలుగు భాషకు బలం అందులోని జాతీయాలు. అనువాదాలకు అందనివవి. వీటిని మరో భాషలోకి తర్జుమా చేసి వాటిని తమ భాషల్లోకి కలిపేసుకునేందుకు చేస్తున్న ఇతర భాషా శాస్త్రవేత్తల కృషి ఏమాత్రం నెరవేరదు. "తెలుగు నుడికారపు సొంపు" అనేది నాలుగు వేదాలలోని నాలుగు మహా వాక్యాల్లా నాలుగు దిక్కుల్లో శాశ్వతంగా నిలిచిపోయిందన్నది ఎవరూ కాదనలేని సత్యం.

తెలుగుతల్లి ఇంత గొప్ప భాష కాబట్టే "దేశ భాషలందు తెలుగు లెస్స" అని ప్రస్తుతించబడింది, "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"గా కొనియాడబడింది. ఐతే ఆ భాషా మాధుర్యాన్ని ఆస్వాదించేవారెవ్వరు? ముఖ్యంగా నేటి తరంలో ... పఠనాభిలాష దాదాపుగా అడుగంటుతున్న పరిణామంలో!

ఇంగ్లీషు విద్య మహా నగరాలనుంచి మారుమూల పల్లెలకు సైతం కాన్వెంట్ల రూపంలో చొరబడుతున్నా, కుప్పలుతెప్పలుగా నేడు స్పోకెన్ ఇంగ్లీషు సెంటర్లు వెలుస్తున్నా వాటిలో అభ్యసించినవారికి ఎంతమాత్రం ఇంగ్లీషు అబ్బుతుందనేది అనుమానమే. ఇంగ్లీషు అవసరమేగానీ మాతృ భాషను బలవంతంగా మరచిపోవాలన్నంత అవసరమైతే ఏంలేదు. స్పోకెన్ ఇంగ్లీషులో ఉండే అసౌకర్యం అందరూ గమనిస్తున్నదే. ఈ రోజు దాదాపు ప్రతి ఇల్లూ ఓ స్పోకెన్ ఇంగ్లీషు సెంటర్ అయ్యిందనడం విడ్డూరమేమీ కాదు. విస్తృతమైన విద్యా రంగం, గ్లోబలైజేషన్ ఈ పరిస్థితి కారణాలైతే కావచ్చుగానీ ఇంగ్లీషు నేర్చుకున్నాక తెలుగు రుచించకపోవడం మాతృభాషకు నిలువునా ద్రోహం చేయడమే. తెలుగుతల్లి

మాతృ భాషాభిమానులు గుర్తించాల్సిన విషయం ఒకటుంది. విద్యా రంగ విస్తృతి, పాశ్చాత్య శైలి అనుకరణ భాషపై తీవ్ర పరిణామాన్ని చూపుతున్నా కేవలం వాటివలన మాతృ భాష మృత భాషగా మారుతుందేమోనన్న భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరు పరభాషా వ్యామోహంలోపడి మాతృ భాషను నిర్లక్ష్యం చేసినంతమాత్రాన తెలుగు భాష మనుగడకు ఆ ఇద్దరివల్ల వచ్చిన ప్రమాదమేమీ లేకపోవచ్చు కానీ ఒక స్వాతంత్ర్య పోరాటంలాగా తెలుగు భాషాభివృద్ధికోసం కృషి చేయాల్సిన అవసరం మాత్రం ఏర్పడిందిప్పుడు. ఈ ఉద్యమం ప్రతి ఇంటినుంచీ ఆరంభం కావాలితప్ప కేవలం సభలు, సమావేశాలకు మాత్రమో, పత్రికా ప్రకటనలకు మాత్రమో పరిమితం కాకూడదు. దీన్ని కేవలం కవులు, రచయితలకు మాత్రమే పరిమితం చెయ్యడం కూడా సరికాదు. ఇది సామాజిక బాధ్యత. ఈ బాధ్యతను స్వీకరించల్సిన అవసరం ప్రతి తెలుగువాడికీ ఉంది. కేవలం ప్రభుత్వానికి విజ్ఞాపనలు సమర్పించుకోవడంతో సరిపెట్టుకుంటే సరిపోదు కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజలతో మమేకమై ఉమ్మడి పోరుగా దీన్ని నడిపించాలి. ముఖ్యంగా పాలనాపరంగా తెలుగులో దరఖాస్తులు నింపాలన్న నిబంధన విధిస్తే చాలు తెలుగు భాషకు ప్రభుత్వం సగం సేవ చేసినట్లే. లేకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ల మాదిరిగా మన తెలుగునాడులోనే స్పోకెన్ తెలుగు సెంటర్లను పెట్టుకోవల్సిన ఆగత్యం ఏర్పడుతుంది.

పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంలో భాష మనుగడ గురించి ఆందోళనపడే పరిస్థితి రావడం దురదృష్టకరం. తానా, ఆటా, సిలికాన్ వేలీ లాంటి సంఘాలు విదేశాల్లో తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు సాంస్కృతిక వైభవానికి, తెలుగు భాషా వికాసానికీ ఎంతగానో కృషి చేస్తున్నాయి. ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు జాతిని ఏకమొత్తంగా నిలుపుతున్నాయి. వారిలో జాతీయాన్ని పెంపొందిస్తున్నాయి. ఇది ఎంతైనా హర్షణీయం. తెలుగు వారికి ఎంతో దూరంగా ఖండాంతరాలలో ఉన్న వారే ఎంతో ఘనంగా తెలుగు జాతి కీర్తి కెరటాలను ఎగురవేస్తుంటే తెలుగు నేల మీద ఉన్న మనం మరెంతగా తెలుగు జాతి ఏకీకరణకు కృషి చేయాలో ఆలోచించాల్సిన సమయమిది. నిర్లక్షం నిజాయీతిని ప్రశ్నిస్తుంది. అందుకే తెలుగును కేవలం వాడుక భాషగా మాత్రమే గుర్తిస్తున్న మనలో ముందు ఒక పరివర్తన కలగాలి. దానికి వేదిక మన ఇల్లే కావాలి. తెలుగు తల్లి అంటూ మన భాషను, సంప్రదాయాన్నీ గౌరవించుకుంటున్నాం. దేవతవోలె పూజించుకుంటున్నాం. అటువంటి తెలుగు తల్లి ఒడిలో పుట్టిన ప్రతి తల్లీ తన తల్లి భాషను తన బిడ్డలకు బోధించడం ద్వారా తన తల్లి ఋణం తీర్చుకునేందుకు ప్రయత్నించాలి. బిడ్డలకు తొలి గురువు తల్లే అయినప్పుడు ఆ ఇంటినే వదిలి మరెక్కడో తెలుగు భాషపట్ల సెమినార్లు నిర్వహించడం కంటే ప్రతి ఇంటిలోను సెమినార్లలాంటి అవగాహనా పాఠాలను ప్రతి తల్లీ తన ఇంటిలోనే ప్రారంభిస్తే తెలుగు అపూర్వ వైభవాన్ని అతి తేలిగ్గా పొందుతుంది. అందుకే ఉన్నతోద్యాగాల నిమిత్తం కంప్యూటర్ యువత విదేశాలకు ఉరకలేస్తున్నా, వారి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలు తెలుగుదనంనుండి దూరంకాకుండా ఉండేందుకు తాపత్రయ పడాలి. తల్లితండ్రులే వారిని విదేశీ ఉద్యోగాల దిశగా ప్రోత్సహిస్తున్నా, స్వదేశీ సంప్రదాయంపట్ల మాత్రం అభిమానం పెంపొందేట్లు చెయ్యాలి. భాషపట్ల వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. భాష గొప్పతనాన్ని తెలియజెప్పాలి. అదే ఈ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలుగు తల్లికి మనమిచ్చే నివాళి. ఆ దిశగా సాగే ప్రతి తల్లీ తెలుగు తల్లే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి