5, అక్టోబర్ 2011, బుధవారం

డెంగ్యూ వ్యాధి- చికిత్స

డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్‌ వల్ల సంక్రమించే వ్యాధి. ఎడిస్‌ ఈజిప్టై అనే రకం దోమ కుట్టడం వల్ల వస్తుంది. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగిని కుట్టిన ఈ దోమ మరొకరిని కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమ కుట్టిన 4 నుంచి 15 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది.
ఎముకలు విరిచే జ్వరం
విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి, మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగ్యూ ప్రత్యేకత. ఎముక విరిగినప్పుడు ఎలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పులు ఉండడం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అనిపేరొచ్చింది. డెంగ్యూ వ్యాధిలో మూడు దశలున్నాయి. మొదటిది సాధారణ డెంగ్యూ జ్వరం. రెండోది డెంగ్యూ హెమరేజిక్‌ జ్వరం. మూడోది డెంగ్యూ షాక్‌ సిండ్రోం. చాలా మందిలో మొదటి దశ నుండే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేస్తారు. కొద్ది మంది రెండో దశకు, మరి కొద్ది మంది మూడో దశకు కూడా చేరుకుంటారు. రెండు, మూడో దశలు ప్రమాదకరమైన దశలు. డెంగ్యూ మరణాలు ఎక్కువగా మూడో దశలో జరుగుతాయి.
గుర్తించడం కష్టమే...
మొదటి దశలో వ్యాధిని గుర్తించడం కష్టమే. డెంగ్యూ జ్వరాలు జూలై నుండి డిసెంబరు మాసాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో విపరీతంగా ఒళ్లునొప్పులు ఉండే జ్వరాలన్నింటికీ డెంగ్యూ జ్వరంగా భావించి రక్తపరీక్ష చేయించడం మంచిది. రక్తఫలికికల (ప్లేట్‌లెట్స్‌) సంఖ్య తగ్గి ఉంటే డెంగ్యూగా అనుమానించొచ్చు. అయితే ప్లేట్‌లెట్స్‌ తగ్గడం డెంగ్యూ మాత్రమే సోకినందు వల్ల వచ్చే లక్షణం కాదు. వైరల్‌, మలేరియా లాంటి ఇతర వ్యాధులు సోకినప్పుడు కూడా ఈ సంఖ్య తగ్గొచ్చు. ప్రత్యేకమైన డెంగ్యూ నిర్ధారిత పరీక్షలు చేసి మాత్రమే డెంగ్యూను నిర్ధారించాల్సి ఉంటుంది. రెండవ దశలో, మూడో దశలో లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని నిర్ధారించడం సులభం.
ప్రత్యేక వైద్యం లేదు
లక్షణాలను బట్టి వైద్యం చేస్తారు. ఈ వైద్యానికి ప్రత్యేకమైన పరికరాలుగానీ, ప్రత్యేకమైన వసతులుగానీ అవసరం లేదు. కావాల్సిందల్లా ప్లేట్‌లెట్స్‌ను అందించగల రక్తనిధుల, రక్త సహాయం చేయగల దాతలు. ఈ రెండూ అందుబాటులో ఉంటే డెంగ్యూ వ్యాధికి సాధారణ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయొచ్చు.
నివారణ మన చేతుల్లోనేద
డెంగ్యూ వ్యాధికి టీకా మందు లేదు. దోమలు అధిక సంఖ్యలో పుట్టకుండా, పుట్టిన దోమలు కుట్టకుండా చూసుకోవడమే నివారించదగ్గ పరిష్కారాలు. ఇంటిలోపల ఏ ప్రాంతంలోనైనా మంచినీరు ఐదు రోజులు మించి నిల్వ ఉంచకూడదు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో వారానికి ఒకసారి నీటిని మార్చుకోవాలి. పగటి పూట పొడవాటి చేతుల చొక్కాలు, లాగులు తొడుక్కోవాలి. దోమలు కుట్టకుండా లేపనాలు పూసుకోవాలి. దోమతెరలు ఉపయోగించాలి. ఇంటి కిటికీలకు దోమతెరలు కట్టించాలి. డెంగ్యూ జ్వరాలు ఉన్న ప్రాంతాలలో వారానికి ఒక్కరోజు డ్రైడే పాటించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి