19, అక్టోబర్ 2011, బుధవారం

వాల్‌స్ట్రీట్‌ ముట్టడి

వాల్‌స్ట్రీట్‌ ముట్టడి కుట్రా?

శనివారం నాడు ప్రపంచవ్యాపితంగా వాల్‌స్ట్రీట్‌ ముట్టడి అనుకూల ప్రదర్శనలు జరిగిన నగరాలలో లండన్‌ ఒకటి. అక్కడి వారు పనిలో పనిగా లండన్‌లో కూడా నిరవధిక ఆక్రమణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారు ఏకంగా లండన్‌ సెంట్‌ పాల్‌ చర్చి ప్రాంగణాన్నే తమ వేదికగా ఎంచుకొని వంద గుడారాలు వేశారు. సోషలిస్టులతో కలిసి ఆందోళనలో ఎలా పాల్గొంటారని క్రైస్తవమత భక్తురాలైన ఒక మహిళను ప్రశ్నించగా అవన్నీ నాకు తెలియదు బ్యాంకుల బెయిలవుట్లకు వ్యతిరేకంగా ఏసు అందరినీ పిలుస్తున్నాడంటూ ఆమె ప్లకార్డు పట్టుకొని మిగతావారితో కలిసి నినాదాలివ్వటంలో మునిగిపోయింది. ఎం కోటేశ్వరరావు
న్యూయార్క్‌ నగరంలో అక్టోబరు 17న నాటిన'వాల్‌స్ట్రీట్‌ ముట్టడి' అనే చిన్న బీజం నెలరోజులకే అమెరికా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిందంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఇది ఇంకా పూర్తిగా మొగ్గతొడగలేదు. ఇంకా మొలకస్థాయిలోనే ఉంది. దీన్ని ఇంతకుమించి ఎదగకుండా అమెరికా, ప్రపంచ పీడిత ప్రజానీకాన్ని మరింతగా ఆకర్షించకుండా నలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాన్ని ప్రారంభంలో తొక్కి పెట్టిన వాల్‌స్ట్రీట్‌ మీడియా ఇప్పుడు ఆడిపోసుకొనేందుకు, తప్పుదారి పట్టించేందుకు అనూహ్యమైన ప్రాధాన్యత ఇస్తోంది. ఒక సర్వే ప్రకారం టీ పార్టీ కార్యక్రమాలకు 2009 ప్రారంభంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఇప్పుడు ముట్టడికి అనుకూలంగా, వ్యతిరేకంగా కలుపుకొని అంత ఇస్తున్నారట.
వాల్‌స్ట్రీట్‌లోని కార్పొరేట్లను కాదు ఆదుకోవలసింది మెయిన్‌స్ట్రీట్‌లోని జనాన్ని అన్నదే ముట్టడి ఉద్యమకారుల ప్రధాన డిమాండ్‌. అమెరికన్లు మన మాదిరి ఎందుకు వీధులకు ఎక్కుతున్నారు అన్నది ఒక ప్రశ్న. న్యూయార్క్‌ నగరంలో 'ఛేజ్‌ మాన్‌హటన్‌' అనే ఒక బ్యాంకు ఉంది. సంక్షోభం కారణంగా ఆదుకొమ్మని ప్రభుత్వాన్ని కోరగానే 947 కోట్ల డాలర్ల ప్రభుత్వ(ప్రజల) సొమ్మును ఒబామా సర్కార్‌ అప్పనంగా ఇచ్చింది. ఆ మొత్తాన్ని తీసుకున్న వెంటనే బ్యాంకులో పని చేస్తున్న 14వేల మంది సిబ్బందిని తొలగించివేసింది. కడుపు మండిన సిబ్బంది ఏ పార్టీ, యూనియన్‌తో నిమిత్తం లేకుండా ఇదెక్కడి అన్యాయం మా ఉద్యోగాలను రక్షించే పేరుతో డబ్బు పొంది చివరికి ఇలా చేస్తారా అంటూ ఎక్కడి కక్కడ బ్యానర్లు, జెండాలు పట్టుకొని ముట్టడి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇలా సమాజంలో ఆర్థిక సరక్షోభంతో ప్రభావితులైన వారందరూ రోజు రోజుకూ ఉద్యమంలోకి వస్తున్నారు. విద్యార్థులు విద్య కొనుగోలుకు లక్షకోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వాటిని తీర్చటానికి ఉద్యోగాలివ్వండి, లేదా రద్దు చేయండి అంటూ వారు జెండాలు పట్టుకున్నారు. అప్పుచేసి కొనుక్కున్న ఇల్లూ పోయింది, ఉన్న ఉద్యోగమూ పోయింది, మేం ఎక్కడకు పోవాలంటూ వీధుల్లో ముట్టడి కేంద్రాల్లో తిష్టవేస్తున్నవారెందరో.
కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలన్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదుల ముఖ్య స్థావరంలోనే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఎంత చిన్న ఉద్యమం ప్రారంభమైనా ప్రపంచంలోని అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు సంతోషించకుండా ఎలా ఉంటారు. 'అక్కడి మన కమ్యూనిస్టులు' ఈ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నవారెందరో. అలాంటి ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు, కమ్యూనిస్టు బూచిని చూపి అణచివేసేందుకు అక్కడి పాలకవర్గం పూనుకుంది. దానిలో భాగంగానే 'వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం కమ్యూనిస్టుల కుట్ర'గా మీడియా డాన్‌ రూపర్ట్‌ మర్డోచ్‌ యాజమాన్యంలోని 'ఫాక్స్‌' న్యూస్‌ ఛానల్‌ వ్యాఖ్యాత ఆరోపించాడు. 'వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమాన్ని హైజాక్‌ చేస్తున్న కమ్యూనిస్టులు' ఇది ఒక పత్రిక శీర్షిక. 'లాస్‌ ఏంజెల్స్‌ ముట్టడికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టులు, దేశవ్యాప్త నాయకత్వ ఆక్రమణకు పథకం' ఇది మరొక శీర్షిక. 'వాల్‌స్ట్రీట్‌ ముట్టడిని కెంట్‌ స్టేట్‌లో జరిపినట్లు చేయాలి' ఒక టీవీ వ్యాఖ్యాత ఉవాచ. ఒకవైపు 'ఇది యూదు వ్యతిరేక ఆందోళన' అంటూ యూదులను రెచ్చగొట్టేవిధంగా మరో పత్రిక వ్యాఖ్యాత చిత్రణ. మరోవైపు మాతో వాల్‌స్ట్రీట్‌ ఉద్యమాన్ని పోల్చితే ఊరుకోం అంటున్న పచ్చిమితవాద టీ పార్టీ నేతలు. అమెరికాలోని కెంట్‌ రాష్ట్రంలో 1970 మే నాలుగవ తేదీన కెంట్‌ విశ్వవిద్యాలయంలో కంపూచియాలో అమెరికా దురాక్రమణకు నిరసన తెలిపారు. వారిపై ఓహియో నేషనల్‌ గార్డులు(సాయుధ పోలీసులు) పదమూడు సెకండ్లలో 67 రౌండ్ల కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపివేశారు. మరో తొమ్మిది మందిని గాయపరిచారు.వాల్‌స్ట్రీట్‌ ఉద్యమకారులపై అలా చేయాలని డోనీ డచ్‌ అనే టీవీ విశ్లేషకుడు చెప్పటంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇతరులు నిరుత్తరులయ్యారు. నా ఉద్ధేశ్యం అలా చంపమని కాదుగాని అలాంటిదేదో చెయ్యాలని తిరిగి డోనీ అన్నాడు. ప్రపంచవ్యాపితంగా పత్రికలు, టీవీలకు వార్తలను అందించే రాయిటర్‌ సంస్థ స్వయంగా రంగంలోకి దిగి పచ్చి అబద్దాలతో వార్తలను రాస్తున్నది. వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి జార్జి సోరస్‌( అంతర్జాతీయ డబ్బు జలగ) వెనుక ఉండి సొమ్మిచ్చి నడిపిస్తున్నాడని, ఆ సొమ్ముతోనే ఉద్యమకారులు నాలుగు పేజీల పత్రికను తెస్తున్నారని రాసింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. తాము రాసినదానికి 'సాక్ష్యం' కూడా ఉందని చెప్పుకుంది. సోరస్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు ప్రతి ఏటా కొన్ని సంస్థలకు కొంత సొమ్మిస్తారు. సోరస్‌కు ఉన్న అనేక కంపెనీలలో ఓపెన్‌ సొసైటీ ఒకటి. అది టైడ్స్‌ సెంటర్‌ అనే సంస్థకు దాన ధర్మాలకు ఖర్చు చేయమని ప్రతి ఏటా కొంత సొమ్మును అందచేస్తుంది. అది ఎవరికి ఇస్తుందో సోరస్‌కు కూడా తెలియదు. టైడ్స్‌ సెంటర్‌ 2001-10 మధ్య కెనడాలోని యాడ్‌బస్టర్స్‌ అనే ఒక పత్రిక(ఇది కార్పొరేట్‌ కంపెనీల ప్రకటనలు స్వీకరించదు)కు 185వేల డాలర్ల విరాళం ఇచ్చింది. ఆ పత్రిక ఇప్పుడు వాల్‌స్ట్రీట్‌ ముట్టడికి మద్దతు ఇస్తోంది. కనుక జార్జిసోరస్‌ ఇచ్చిన సొమ్ము పరోక్షంగా ఉద్యమానికి అందినట్లే అని రాయిటర్‌ లాపాయింట్‌ తీసింది. టైడ్స్‌ సంస్థకు సోరస్‌ మాదిరి విరాళాలిచ్చేవారెందరో ఉన్నారు. అది యాడ్‌బస్టర్స్‌తో పాటు మితవాద టీపార్టీ ఉద్యమానికి కూడా మిలియన్ల డాలర్ల విరాళం ఇచ్చింది. ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే పత్రిక తనకు విరాళం ఇచ్చిన1696 మందిలో వెయ్యి డాలర్లు ఇచ్చింది ఒకే ఒక్కరని పేర్కొన్నది. రాయిటర్స్‌ సంస్థ వార్త ప్రకారం వసూలైంది మొత్తం 75వేల డాలర్లు మాత్రమే. ఇదే విధంగా ఉద్యమకారుల్లో యూదువ్యతిరేకులున్నారని రెండు వీడియోలను కొందరు సాక్ష్యాలుగా ముందుకు తెచ్చారు. ఒకదానిలో ఇద్దరు, మరొకదానిలో ఒకడు అలాంటి వాడు కనిపించాడట. దేశవ్యాపితంగా వేలాది మంది ఉద్యమకారుల్లో ఎక్కడైనా ఒకడో అరో ఉండటాన్నిచూపి,(అసలు వీడియో తీసేవారే వారిని ఏర్పాటు చేశారేమో) చిలవలు పలవలుగా మీడియాలో నానా యాగీ చేస్తున్నారు. ఇక ఫాక్స్‌(నక్క) ఛానల్‌ వ్యాఖ్యాత గ్లీన్‌ బెక్‌కు 'వాల్‌స్ట్రీట్‌ ఉద్యమ స్వభావం ప్రపంచ మార్క్సిస్టు విప్లవం మాదిరిగా కనిపిస్తున్నదట. ఒక రూపం పెట్టుబడిదారీ విధానాన్ని హింసా పద్దతుల్లో కూలదోయాలని చెబుతుందని, మరో రూపం ఎంతో శాంతంగా కనిపిస్తుందట. వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి మొదటి రూపం అంకురార్పణ చేసిందట.

అమెరికాలో ఆర్థిక సమస్య పరిష్కారమైందని ప్రకటించిన తరువాత యాదృచ్ఛికంగా వచ్చిన ఈ ఉద్యమాన్ని సంఘటిత రూపంలోకి, నిర్థిష్ట డిమాండ్లను రూపొందించటం ఇప్పుడు ముందుకు వచ్చిన సమస్య అని ఒక వామపక్ష ఫ్రొఫెసర్‌ పేర్కొన్నారు. ఉద్యమంలో కమ్యూనిస్టులు, కార్మిక సంఘాల నేతలు భాగస్వాములు అవుతున్నారు. కొన్ని చోట్ల నాయకత్వాన్ని కూడా అందిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న కమ్యూనిస్టుపార్టీ నిర్మాణం, ప్రభావానికి ఎన్నో పరిమితులు ఉన్నాయని గుర్తించాలి. అయినప్పటికీ జనాన్ని కమ్యూనిస్టు భూతంతో ఉద్యమం నుంచి దూరం చేయాలని అక్కడి మీడియా ప్రయత్నిస్తోంది. ప్రచ్చన్న యుద్ధంలో కమ్యూనిజంపై తామే విజయం సాధించామని ప్రకటించుకున్న వారే ఇప్పుడు అమెరికాను కమ్యూనిస్టు భూతం ఆవరించిందని చెబితే జనం అంతగుడ్డిగా నమ్ముతారా?
నిజానికి జరుగుతున్నదేమిటి? దేశ స్థూలాదాయం(జిడిపి) దానికి ఉన్న అప్పు 100-60శాతంగా ఉంటే అక్కడి ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉన్నట్లు. ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాల జిడిపి-అప్పు నిష్పత్తులు 100-100, 100-85శాతాలకు చేరాయి. ఇటువంటి స్థితిలో కొత్త పన్నులు వేయలేవు, అంతకు ముందు జనానికి అమలు జరిపిన సంక్షేమ పథకాలను కొనసాగించలేవు. రద్దు చేస్తే జనం సహించరు. స్వల్పకాలంలో ఈ సమస్యను అధిగమించాలంటే అప్పు చేయటం, కోతలు పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. అమెరికా,ఐరోపా ఆర్థిక సమస్యలు రాజకీయ, సామాజిక సంక్షోభాలకు దారితీస్తున్నాయి. దివాళాతీసిన దేశాలకు అప్పులు ఇవ్వవద్దని జర్మన్లు ప్రదర్శనలు జరుపుతున్నారు. తమ సౌకర్యాలకు కోత పెట్టవద్దని గ్రీస్‌, స్పెయిన్‌, ఇటలీ పౌరులు నిరసన తెలుపుతున్నారు. అమెరికన్ల సమస్య కూడా ఇదే. శనివారం నాడు ప్రపంచవ్యాపితంగా వాల్‌స్ట్రీట్‌ ముట్టడి అనుకూల ప్రదర్శనలు జరిగిన నగరాలలో లండన్‌ ఒకటి. అక్కడి వారు పనిలో పనిగా లండన్‌లో కూడా నిరవధిక ఆక్రమణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారు ఏకంగా లండన్‌ సెంట్‌ పాల్‌ చర్చి ప్రాంగణాన్నే తమ వేదికగా ఎంచుకొని వంద గుడారాలు వేశారు. సోషలిస్టులతో కలిసి ఆందోళనలో ఎలా పాల్గొంటారని క్రైస్తవమత భక్తురాలైన ఒక మహిళను ప్రశ్నించగా అవన్నీ నాకు తెలియదు బ్యాంకుల బెయిలవుట్లకు వ్యతిరేకంగా ఏసు అందరినీ పిలుస్తున్నాడంటూ ఆమె ప్లకార్డు పట్టుకొని మిగతావారితో కలిసి నినాదాలివ్వటంలో మునిగిపోయింది. ఇదీ వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం, దాని తీరు తెన్నులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి