‘వాల్‌స్ట్రీట్‌ను
ఆక్రమిద్దాం!’ నెలరోజుల క్రితం న్యూయార్క్ వాల్‌స్ట్రీట్‌లో మొదలైన హోరు
నేడు టోక్యో, హాంకాంగ్, లండన్, సియోల్ తదితర ప్రపంచ ప్రధాన నగరాలన్నిటినీ
ముంచెత్తేస్తోంది. ‘పనీపాటా లేని హిప్పీ మూకల గోల’ అంటూ నేతలు ఈసడించిన
‘లొల్లి’ నేడు అమెరికాలోని 100 నగరాలను ముంచెత్తి, గ్లోబల్ ఘోషగా
విస్తరిస్తోంది. శనివారం ఒకే రోజున పాశ్చాత్య, ప్రాచ్య ప్రపంచాలలోని ప్రధాన
నగరాలలో ఉద్యమకారులు నిరసన ప్రదర్శనలకు సన్నాహాలు చేశారు.
పెచ్చుపెరుగుతున్న ఆర్థిక అసమానతలను, బడా కార్పొరేటు సంస్థల, బ్యాంకుల
దురాశాపూరిత లాభాపేక్షను, అవినీతిని నిరసనకారులు దుయ్యబడుతున్నారు.
న్యూయార్క్ వాల్‌స్ట్రీట్‌లోని స్టాక్ ఎక్స్చేంజ్‌కు దగ్గరలోని లిబర్టీ
ప్లాజా (జుకోటీ పార్కు)లో సెప్టెంబర్ 17న ఈ ఆందోళన మొదలైంది. నాటి నుంచి
ఆందోళనకారులు వందలు, వేలుగా అక్కడ బైఠాయిస్తున్నారు. శుక్రవారం ప్లాజాను
శుభ్రం చేసే నెపంతో ఆందోళనకారులను బలప్రయోగంతో తొలగించాలని పోలీసులు
భావించారు. ముందు రాత్రే వేలల్లో ఆందోళనకారులు అక్కడ చేరారు. దీంతో
పోలీసులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆందోళనకారులే. చీపుర్లు పట్టి
ప్లాజాను శుభ్రం చేశారు. ఆ తర్వాత ‘స్టాక్ ఎక్స్చేంజ్‌ని తుడిచి పారేస్తాం’
అంటూ చీపుళ్లతో ఆ భవంతిపై విరుచుకుపడ్డారు. స్టాక్ ఎక్స్చేంజ్‌ను
ఆక్రమించాలని పోలీసులతో తలపడ్డారు.
‘99 శాతం అమెరికా 1 శాతం’పై
నెలరోజులుగా సాగిస్తున్న ఈ శాంతి యుత ‘తిరుగుబాటు’కు సన్నాహాలు జూన్‌లో
మొదలయ్యాయి. ఈజిప్టు తెహ్రీర్ స్క్వేర్‌లో బైఠాయించిన అరబ్బు ప్రజాస్వామిక
విప్లవ కెరటం మధ్యధరా సముద్రం మీదుగా స్పెయిన్‌ను తాకింది. ప్రజలందరికీ
ఉపాధి, సామాజిక సంక్షేమం, భద్రతలకు హామీని ఇచ్చే ‘రియల్ డెమోక్రసీ’ని
స్పానియార్డులు డిమాండు చేశారు. ‘రియల్ డెమోక్రసీ’ యూరప్‌కు, అమెరికాకు
కూడా వ్యాపిం చింది, వాల్‌స్ట్రీట్ ఉద్యమానికి ప్రేరణ అయింది. స్పెయిన్
నిరసనకారులు కూడా ఆర్థిక అసమానతలను, పొదుపు చర్యల పేరిట ప్రజా సంక్షేమ
వ్యయాలపై కోత వేయడాన్ని నిరసించారు. వాల్‌స్ట్రీట్ ఉద్యమకారులకు స్పష్టమైన
డిమాండ్లే లేవని ప్రభుత్వం, రిపబ్లికన్లు అంటున్నారు. కానీ ఉద్యమకారుల
నినాదాలే వారి డిమాండ్లను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాయి.
2007లో అమెరికాను, దానితో పాటే ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినది
కార్పొరేటు బడా బ్యాంకుల దురాశే. వాటి విచ్చలవిడి సబ్‌ప్రైమ్ లెం డింగ్
కారణంగానే మధ్యతరగతి, కార్మికులు దివాళా తీశారు. లెహ్‌మన్ బ్రదర్స్ బ్యాంకు
దివాళాకు ముందు రోజు కూడా దానికి ఏ ప్లస్ ప్లస్ క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చిన
రేటింగ్స్ సంస్థలను గానీ, ఆశబోతు బ్యాంకులను గానీ ఎవరూ శిక్షించ లేదు.
పైగా బెయిల్ అవుట్‌ల పేరిట రెండు లక్షల కోట్ల డాలర్లను వాటికే
కట్టబెట్టారు. సంక్షోభ భారాన్ని మధ్యతరగతి, కార్మికులు, నిరుపేదలపైన
మోపారు. సంక్షేమ వ్యయాలలో, ఉద్యోగాలలో కోతలు అమలుచేశారు. ఈ దురన్యాయాన్నే
వాల్‌స్ట్రీట్ ఉద్యమం ప్రశ్నిస్తోంది. ‘దురాశాపరులు, అవినీతిపరులు అయిన
సంపన్నుల చేత మరింత ఎక్కువగా పన్నులు కక్కిస్తాం. సంక్షోభ భారాన్ని మోసేలా
చేస్తాం. అంతవరకూ మేం శాంతియుతంగా ప్రదర్శనలు జరుపుతూనే ఉంటాం. చర్చిస్తూనే
ఉంటాం. సంఘటితమవుతూనే ఉంటాం’ అంటూ ‘యుైనె టెడ్ ఫర్ గ్లోబల్ ఛేంజ్’ అనే
ఆందోళనకారుల వెబ్‌సైట్ తమ లక్ష్యాన్ని స్పష్టం చేసింది.
నిన్న
అమెరికాను ముంచెత్తిన సబ్ ప్రైమ్‌లెండింగ్ నేడు ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్,
గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలను దివాళా తీయిస్తోంది, యూరప్‌ను
మొత్తంగా సంక్షోభంలోకి నెడుతోంది. ఐఎంఎఫ్, ఈసీలు రెండూ కలిసి బ్యాంకులను
కాపాడడానికి నానా తంటాలు పడుతున్నాయి. యూరప్ అం తటా ఇప్పటికే అవి పెద్ద
ఎత్తున ‘పొదుపు చర్యల’ను రుద్దాయి. ఆర్థికంగా సురక్షితంగా ఉందనుకుంటున్న
బ్రిటన్‌లో గత రెండు వారాల్లోనే వేలాదిగా వాల్‌స్ట్రీట్ ఉద్యమకారులు
పుట్టుకొచ్చారు. ఉన్నత విద్యావంతుడు, మంచి ఉద్యోగస్తుడు అయిన సిప్రో (28)
అనే లండన్ ఆందోళనకారుడు ‘ద్రవ్య వ్యవస్థను సం స్కరించడం’ అంటూ తమ ఉద్యమ
లక్ష్యాన్ని ఒక్క ముక్కలో సూటిగా చెప్పా డు. ఇతని మాదిరే తప్పనిసరి
పరిస్థితుల్లో ప్రజలు తమంతట తాముగానే ద్రవ్యవ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను
సంస్కరించేందుకు ముందుకు రావలసిన అవసరం ఏర్పడింది. కోటీశ్వరులు మధ్యతరగతి
స్థాయిలోనైనా పన్నులు కట్టాలని వేడుకుంటున్న అమెరికా అధ్యక్షుడు బరాక్
ఒబామాను టీపార్టీ రిపబ్లికన్లు మార్క్సి స్టు అని తిట్టిపోస్తున్నారు. ఆ
టీపార్టీయే అమెరికా ఆర్థిక విధానాలను నేడు శాసిస్తోంది. అధ్యక్ష పదవిపై
కూడా ఆశలు పెట్టుకుంది. నెల రోజుల శిశువైన వాల్‌స్ట్రీట్ ఉద్యమం 54 శాతం
ప్రజల మద్దతును సమకూర్చుకుని టీపార్టీని ఇప్పటికే ‘ఓడించింది’. ఆర్థిక
సంక్షోభాన్ని సృష్టించిన వారే భారాన్ని మోయాలని, సంక్షోభ కాలంలోనూ
ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిస్తున్న సంపన్నులపై ఎక్కువ పన్నుల భారం మోపాలని
కోరుతున్న ప్రజాభిప్రాయాన్ని అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వం మన్నిస్తుందా?
అనేది అనుమానమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి