Updated : 5/6/2014 6:53:09 AM
Views : 2331
-కొల్లగొట్టిన కొలువులు కొల్లేట్లో కలిపేసుకున్నరా?
-సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లంటే అన్యాయం..
-ఇది దీర్ఘకాలిక కుట్రే
-తెలంగాణపై పరోక్షంగా పట్టుకోసమే ఈ ఎత్తు..
-ఆప్షన్లు టీ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధం
-ఆప్షన్లు ఇస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చీ దండుగే!..
- తెలంగాణలో సర్వత్రా ఆందోళనలు.. ఆగ్రహావేశాలు
హైదరాబాద్,
మే 5 (టీ మీడియా): రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిన నాటి నుంచీ తెలంగాణ పట్ల
కేంద్రం చూపుతున్న వివక్షపై తెలంగాణవాదులు భయపడినంతా అవుతున్నది! తెలంగాణ
ఉద్యమానికి ఆది మూలమైన ఉద్యోగాల విషయంలో కూడా చివరకు అన్యాయమే జరిగే
పరిస్థితి ఏర్పడటంతో ఉద్యమ లక్ష్యమే నీరుగారిపోయే ప్రమాదం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే కొనసాగేలా
కేంద్ర నిబంధనలు ఉండటంతో తెలంగాణలోని ఉద్యోగులు, నిరుద్యోగులు ఆందోళన
చెందుతున్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం అనుసరిస్తున్న
మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.-సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లంటే అన్యాయం..
-ఇది దీర్ఘకాలిక కుట్రే
-తెలంగాణపై పరోక్షంగా పట్టుకోసమే ఈ ఎత్తు..
-ఆప్షన్లు టీ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధం
-ఆప్షన్లు ఇస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చీ దండుగే!..
- తెలంగాణలో సర్వత్రా ఆందోళనలు.. ఆగ్రహావేశాలు
ఆప్షన్ల పేరుతో తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉండేలా ఆప్షన్లు ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇవ్వడం దేనికని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం
రాష్ట్ర విభజనలో భాగంగా సమైక్య రాష్ట్రంలోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు పంపిణీ చేసేందుకు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఆప్షన్లు ఉంటాయని పేర్కొనడం తెలంగాణవాదులకు శాపంగా మారనుంది. గతంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో అమలుచేయని ఆప్షన్ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మాత్రమే జొప్పించటాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
1969లో తొలిదశ ఉద్యమమైనా, 2001లో మలిదశ ఉద్యమమైనా ఉద్యోగాల దోపిడీకి వ్యతిరేకంగానే ప్రారంభమయ్యాయని గుర్తు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ ఒక క్రమపద్ధతిలో లక్షల సంఖ్యలో తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొట్టినందుకు ప్రతిస్పందనగానే ఉద్యమం పుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించేవరకు కొనసాగిందని, ఇప్పుడు కూడా అదే దోపిడీ పరిస్థితి ఉంటే లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ దోపిడీకి ఉదాహరణలెన్నో..
తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొట్టారనేది కేవలం ఈ ప్రాంత ప్రజల ఆరోపణ కాదని, అది నూటికి నూరుపాళ్లు సత్యమని అనేక సందర్భాల్లో రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముల్కీ రూల్స్, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం, గిర్‌గ్లానీ కమిషన్, ఫజల్ అలీ కమిషన్, 371-డీ వంటి అనేక కమిటీలు, కమిషన్లు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాయి. వేల మంది సీమాంధ్రులు తెలంగాణలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు పొందారని లెక్కలతో సహా నివేదికలిచ్చాయి. ముల్కీ నిబంధనలు రద్దయిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంగా ఉద్యోగ రంగంలో తెలంగాణ దారుణంగా నష్టపోయింది. అన్యాయం జరిగిందని ఎన్ని కమిటీలు, కమిషన్‌లు నిర్ధారించినా స్థానికేతరులు తెలంగాణ నుంచి వెనక్కి పోలేదు.
మొక్కుబడిగా కొంతమందిని బదిలీ చేసి 610జీవోను అమలు చేశామని చెప్పారు. వీటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లను కల్పించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సీమాంధ్రులకు ఆప్షన్ ఇవ్వటంవల్ల తెలంగాణ నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండవు. తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు దక్కవు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా సీమాంధ్ర ఉద్యోగులే తిష్ఠ వేయనున్నారు. దాంతో ఎప్పటిలాగే తెలంగాణ ప్రజలు మళ్లీ సీమాంధ్ర ఉద్యోగుల ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితే ఎదురు కానుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఎక్కడ చూసినా సీమాంధ్రులే..
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అటెండర్ నుంచి శాఖల కార్యదర్శుల వరకు ఎక్కడ చూసినా సీమాంధ్రులే తిష్ఠ వేశారు. స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీరాజ్, పురపాలక సంఘాలలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున సీమాంధ్ర ఉద్యోగులు అక్రమ నియామకాలు జరిగాయి. డిప్యూటేషన్ల పేరుతో మరికొంత మంది ఉద్యోగులు తెలంగాణలో పాతుకుపోయారు. పురపాలక శాఖలోని ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే 500మందికి పైగా వివిధ స్థాయిల్లోని సీమాంధ్ర అధికారులు డిప్యూటేషన్లు, అక్రమ పద్దతిలో హైదరాబాద్‌లో కొనసాగుతున్నారు.
వీరందరూ కీలక పదవుల్లో ఉండటంతో వారి బందువులు, స్నేహితులు అక్రమ పద్ధతిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 60శాతం మంది నియామకమయ్యారు. అదే విధంగా పంచాయతీరాజ్‌శాఖలోని గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ విభాగాలలో కూడా అక్రమ నియామకాల పరంపర కొనసాగింది. ఈ శాఖల్లో వందల సంఖ్యలో సీమాంధ్ర ఉద్యోగులు డిప్యూటేషన్లపై హైదరాబాద్ వచ్చి విధులను నిర్వహిస్తున్నారు. దీని కారణంగానే తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు పదోన్నతుల్లోనే కాకుండా నిరుద్యోగులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర విభజనతో కొత్త రాష్ట్రంలో పదోన్నతులు లభిస్తాయని భావిస్తున్న ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం చేసిన ఆప్షన్ల ప్రకటన పిడుగుపాటుగా మారింది. ఆప్షన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
ఆప్షన్ వెనుక ఆంతర్యమేంది?
ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు అవసరం లేకుండానే ఇరు ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేసే మార్గాలున్నప్పటికీ ఆప్షన్లు బలవంతంగా తెలంగాణపై ఎందుకు రుద్దుతున్నారనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది. విభజన అనంతరం 10ఏళ్ల పాటు రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన వారిలో సీమాంధ్ర, తెలంగాణ వారిని విభజించి ఆయా ప్రభుత్వాలకు కేటాయించే అవకాశం ఉంది. అలా చేస్తే ఏ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం లేదు.
ప్రధానంగా హైదరాబాద్‌పైనే ఆశలు పెట్టుకొన్న సమాంధ్ర ఉద్యోగులకు ఆ ఆశ కూడా తీరుతుంది. ఇలాంటి అవకాశాలున్నప్పటికీ అధికారులు ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలనే ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ సాగునీరు, విద్యుత్, రవాణా తదితర రంగాల్లో ఇరు రాష్ర్టాల మధ్య పంపకాలు అంత తొందరగా తేలవు. అలాంటప్పుడు ఆప్షన్ల సాకుతో తెలంగాణ రాష్ట్రంలోనే తిష్ఠవేసే సీమాంధ్ర ఉద్యోగులను వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అనుకూలంగా పనులు చక్కబెట్టుకోవచ్చనే దీర్ఘకాలిక కుట్రకూడా ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల వేలకోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించిన సీమాంధ్ర పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్యలు రాకుండా ఉండాలంటే సీమాంధ్రులు ఇక్కడే ఉండాలనే కుట్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు.
విభజనకు స్థానికతే గీటురాయి కావాలి: ఉద్యోగ సంఘాలు
రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనకు వారి స్థానికతే గీటురాయి కావాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఈమేరకు కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీకి అనేక విజ్ఞాపనలు కూడా సమర్పించాయి. ఆప్షన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా టీఎన్జీవో మొదటి నుంచీ పోరాడుతూనే ఉంది. తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ కూడా స్థానికత అధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జేఏసీ నేతలు కమలనాథన్ కమిటీకి వినతిపత్రం సమర్పించింది. అన్ని శాఖలలో జరిగిన ఉల్లంఘనలను గిర్‌గ్లాని నివేదిక ప్రాతిపదికన సరిచేయాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి పోస్టుల్లో జిల్లాల సంఖ్య 13;10నిష్పత్తిలో పంపిణీ జరిపి అధికారులను స్థానికత అధారంగా రాష్ర్టాలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఇదే పద్దతిని సచివాలయానికి శాఖాధిపతుల రాష్ట్రస్థాయి కార్యాలయాలకు వర్తింపచేయాలని తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ వెంకటేశం, కో-చైర్మన్ శ్రీధర్ దేశ్‌పాండే ,కార్యదర్శి నల్లా విజయ్‌కుమార్, సెక్రెటరీ బాలనర్సయ్య, పబ్లిసిటీ సెక్రెటరీ మహేందర్ డిమాండ్ చేశారు. ఆప్షన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై తెలంగాణ ప్రిజన్ ఆఫీసర్స్ అసోసియేసన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులకు ఆప్షన్ అంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం చేయటమేనని అసోసియేషన్ అధ్యక్షుడు కే వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సాయి సురేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి అంటున్నారు. జైళ్లశాఖ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్ ఇవ్వొద్దన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకూడదని బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్ స్పష్టం చేశాయి. 371(డీ) ఆర్టికల్ ప్రకారం జోన్ 1నుంచి 4 వరకూ ఏ జోన్‌లో ఉద్యోగం పొందిన ఉద్యోగులు అక్కడికే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
యుద్ధానికి సిద్ధం
విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇచ్చిన అంగీకరించం. ఆప్షన్ల అంశం సీమాంధ్ర అధికారుల కుట్ర. ఉద్యోగి పూర్వీకుల స్థానికతను ఆధారంగానే లోకల్, నాన్‌లోకల్ గుర్తించాలి. ఆప్షన్ అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలోని పది జిల్లాల్లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను తక్షణమే వెనక్కిపంపాలి.
- రాఘవేంద్రరావు, తెలంగాణ ఎంపీడీవోల సంఘం జేఏసీ అధ్యక్షుడు
నిరుద్యోగులకు అన్యాయమే
విభజన తర్వాత ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం అంటే తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేయడమే. సీమాంధ్రుల కుట్రను గట్టిగా ఎదుర్కొవాలి. ఉద్యోగుల ఆప్షన్లను అంగీకరించే ప్రసక్తే లేదు.
- కే భాస్కర్‌రెడ్డి, తెలంగాణ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు
కుట్రలను ప్రతిఘటిస్తాం
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడమంటే తెలంగాణ నిరుద్యోగుల ఆశలను ఆగం చేయడమే. ఉద్యోగుల ఆప్షన్లను అంగీకరించం. సీమాంధ్ర అధికారుల కుట్రలను తీవ్రంగా ప్రతిఘటించాలి. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను తక్షణమే వెనక్కిపంపాలి.
- మహ్మద్ యాసిన్, తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల జేఏసీ అధ్యక్షుడు
పెద్ద కుట్ర..
ఉద్యోగుల ఆప్షన్ల నిర్ణయం వెనుక పెద్ద కుట్రదాగి ఉంది. దీన్ని తెలంగాణ ఉద్యోగులందరూ సమిష్టిగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి. ఆప్షన్ల పేరుతో తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టి నిరుద్యోగుల కడుపుకొట్టడానికి ప్రయత్నించడమే. ఉద్యోగి పూర్వీకుల స్థానికత ఆధారంగా లోకల్, నాన్‌లోకల్ కోటాను నిర్ణయించాలి.
- ఎల్ తాజ్మోహన్ రెడ్డి, తెలంగాణ మున్సిపల్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
ఉద్యోగి పూర్వీకుల స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. సీమాంధ్రులందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పంపించాలి. తెలంగాణ ఏర్పడే వరకు ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు. ఆప్షన్ల అంశాని తెరపైకి తెచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆప్షన్లను అంగీకరించే ప్రసక్తే లేదు.
- మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు
సీమాంధ్రులు వెళ్లాల్సిందే
స్థానికేతర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే, తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. ఐతే గ్రూప్-1 అధికారులకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.
- ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి
స్థానికత ఆధారంగానే పంపిణీ జరగాలి:టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, మే 5 (టీ మీడియా): స్థానికతను ఆధారంగానే ఉద్యోగుల పంపిణీని చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పంపిణీ విషయంలో రాజ్యాంగ సూత్రాలను అమలు చేయాలన్నారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో స్థానికతను పాటించాలన్నది ప్రాంతీయ మౌఢ్యం నుంచి పుట్టింది కాదని, ఆర్టికల్ 371-డీ ఆధారంగానే ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఆప్షన్ అన్నది ఒక అవకాశం మాత్రమేనని, విధిగా పాటించాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. ఆప్షన్ పేరిట బలవంతంగా సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో కొనసాగించేందుకు కుట్రలు చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందంతా చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు.
ఆప్షన్లకు ఒప్పుకోం:టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇస్తామంటే ఒప్పుకునేది లేదని టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు స్పష్టం చేశారు. ఆప్షన్ అంటే మరో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో మూడు కొత్త రాష్ర్టాలు జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్‌లు ఏర్పడినపుడు అమలుచేయని ఆప్షన్ పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి ఉద్యోగిని అక్కడికి పంపించేయాల్సిందేనన్నారు. ముందు తాత్కాలిక ఉద్యోగుల పంపిణీలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులను ఎక్కడికక్కడే విభజించి, మిగిలిన వారి సంగతిని ప్రత్యేక కమిటీకి వదిలి వేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోం:హరీశ్‌రావు
ఉద్యోగులకు పంపిణీలో ఆప్షన్లను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. 1200 మంది అమరులైన తరువాత వచ్చిన తెలంగాణలో కూడా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉండటాన్ని ఒప్పుకోబోమన్నారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని, దాని ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కే మెజార్టీ వస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోదని తెలిపారు.
తెలంగాణ ఉద్యోగులే ఉండాలి: ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భూమి పుత్రులే ఉద్యోగులుగా ఉండాలని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సచివాలయం, ప్రధాన కార్యాలయాలతో పాటు అన్ని విభాగాలలో తెలంగాణ ఉద్యోగులే ఉండాలని, ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇతర రాష్ర్టాలలో ఏవిధంగా ఉద్యోగుల విభజన జరిగిందో పరిశీలించాలన్నారు. ఉద్యోగుల విభజనలో సహేతుకమైన, న్యాయబద్దమైన విధానాన్ని అవలంభించాలని, ఎవరికీ అన్యాయం జరుగకూడదన్నారు.
ప్రమాదకరం: విఠల్
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ అవకాశం ఇవ్వడం తెలంగాణకు అత్యంత ప్రమాదకరంగా మారుతుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ అన్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డు ఆధారంగా స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల పంపిణీ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మూడు రాష్ర్టాల విభజనలో అమలు చేయని పద్ధతిని తెలంగాణలోనే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆప్షన్ అంటే మరో సకల జనుల సమ్మెను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఆ విధానం రాజ్యాంగ వ్యతిరేకం:ఘంటా చక్రపాణి
ఆప్షన్ విధానం రాజ్యాంగ వ్యతిరేకమని రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఆప్షన్ అంశంపై చట్టం చేసిందన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఏ ఉద్యోగికీ ఆప్షన్ ఉండదని అన్నారు. ఉద్యోగంలో చేరే రోజే ఆప్షన్ ఉండదనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ ఉద్యోగి ఏ ప్రాంతములోనైనా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేకమైన ఆప్షన్ అంశాన్ని తెరపైకి తెచ్చి అమలు చేయాలని భావించడం ఆశ్చర్యకరమైన విషయమని చెప్పారు. రాజ్యాంగంలో ఆప్షన్లకు తావులేదని, కేవలం సడలింపులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. భార్య, భర్త, వికలాంగులు, సామాజిక వెనుకబడిన వర్గాలకు మాత్రం కొంత సడలింపు ఉంటుందన్నారు. అనారోగ్యం కారణం చెల్లదని తెలిపారు.
స్థానికతకే ప్రాధాన్యం: హరగోపాల్
ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆప్షన్ అంశాన్ని తెరపైకి తేవడం సరికాదన్నారు. ఇప్పటికైనా స్థానికతను స్పష్టంగా నిర్వచించి, ఏపీఎన్జీవోలు, టీఎన్జీవో నాయకులు చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. గిర్‌గ్లానీ కమిషన్‌లో 56 వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం నష్టపోయిందని చెప్పిందన్నారు. ఐతే చాలా మంది పదవీ విరమణకు దగ్గర పడుతున్నారని, అందువల్ల ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలిసిన అవసరం లేదన్నారు. స్నేహ పూర్వకంగా సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత ఇరుప్రాంతాల ఉద్యోగసంఘాల నాయకులపై ఉందని అన్నారు.
చదువులు, కొలువులు, వనరులు స్థానికులకే చెందాలి: వరవరరావు
తెలంగాణ ఉద్యమం స్థానికత, స్వాభిమానం, స్వపరిపాలన, స్వావలంబన ప్రాతిపదికన వచ్చిందని విరసం నేత వరవరరావు అన్నారు. చదువులు, కొలువులు, వనరులు స్థానికులకు చెందడమే న్యాయమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా చేయడం అన్యాయమన్నారు. 1969 ఉద్యమం చదువులు, ఉద్యోగాల కోసం వచ్చిందని, అనంతరం తెలంగాణ వనరులు కూడా దోపిడీకీ గురయ్యాయని అన్నారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు తక్కువగా ఉన్నారని చెప్పారు. విభజనలో తెలంగాణ ప్రాంతములో కొరత ఏర్పడితే ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయాలని సూచించారు. ఉద్యోగుల విభజనలో ఆప్షన్లకు అవకాశం ఇవ్వకుండా అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలని సూచించారు.
స్థానికత ఆధారంగానే ఆప్షన్లు పరిగణనలోకి తీసుకోవాలి
తెలంగాణ ఉద్యోగుల హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లనివ్వం. ఉద్యోగస్తుల ఆప్షన్ల విషయంలో స్థానికతను ఆధారం చేసుకోవడమే కాకుండా, 1975లోని రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు డీవోపీటీ గైడ్‌లైన్స్ ప్రకారమే ఉద్యోగస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలోని యువతకు ఉద్యోగాల్లో అన్యాయం జరగడంతోనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది.
- దాసోజ్ శ్రవణ్, టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి
ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఎందుకు?
ఆప్షన్ల పేరిట సీమాంధ్రులు హైదరాబాద్‌లో తిష్ఠ వేస్తామంటే ఒప్పుకునేది లేదు. ఆప్షన్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఫలితం లేకుండా పోతుంది. ఆప్షన్ అంశాన్ని బలవంతంగా రుద్దుతామంటే సహించేది లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఏర్పడిన తరువాత ఎవరి రాష్ట్రంలో వారే కొనసాగాలి. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా సీమాంధ్రుల ఆధిపత్యాన్ని కొనసాగిస్తామంటే సహించేది లేదు. ఉల్లంఘనలపై గిర్‌గ్లానీ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని, సీమాంధ్రులను వారి స్వస్థలానికి పంపించేయాల్సిందే. ఆప్షన్ల పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలి.
- బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్‌ఎస్ నాయకుడు
ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే
తెలంగాణ వారికే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చెందాలి. ఉద్యోగులకు ఆప్షన్లు అంటూ గొడవ పెట్టడం మంచిదికాదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. కలిసినట్టుగా తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఆప్షన్లకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉద్యమించాలి.
- ప్రదీప్‌కుమార్, బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు
హెచ్‌ఓడీల్లో మొత్తం సీమాంధ్రులే
తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే. వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని హెచ్‌ఓడీల్లో 90శాతం సీమాంధ్రవారే. ఆప్షన్ల పేరుతో ఇక్కడే ఉంటే కిందిస్థాయిలోని వారికి కూడా ప్రమోషన్లురావు. దీని వల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో సీమాంధ్ర అధికారులే ఉంటే అంగీకరించబోము.
- జూపల్లి రాజేందర్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జేఏసీ ఛైర్మన్
మళ్లీ ఉద్యమమే
ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడమంటే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేయడమే. సీమాంధ్ర అధికారులంతా ఇక్కడే ఉంటే ఇక్కడి వారికి ప్రమోషన్లు ఎక్కడ వస్తాయి? జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోనూ వాళ్లే ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యోగులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆప్షన్లు అమలు చేస్తే కొత్త రాష్ట్రంలో కూడా ఉద్యమాలు కొనసాగుతాయి.
- డీ మల్లేశం, పరిశ్రమల శాఖ ఉద్యోగుల సంఘం నేత
ఇక తెలంగాణ ఎందుకు?
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కూర్చోబెడితే తెలంగాణ రాష్ట్రం ఎందుకు? మేం ముందు నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోనూ వాళ్లే అధికభాగం ఉన్నారు. కొన్నింట్లో 90 శాతం వరకు సీమాంధ్రులే ఉన్నారు. ఆప్షన్లు అమలు చేయడం దారుణం.
- ఆర్ సుధీర్‌బాబు, బీ రాజేశం.
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు
నిరుద్యోగులకు అవకాశాలు రావు
తెలంగాణ రాష్ర్టాన్ని కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అలాంటి వాటిల్లో కీలకమైన అంశానికే ఎసరు పెడితే ప్రజలు సహించరు. 60 ఏండ్ల ఉద్యమానికి ఫలితం ఏముంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్లను అంగీకరించం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే పదేళ్లు ఉంటున్నప్పుడు వారు ఇక్కడే సీమాంధ్ర కార్యాలయాల్లో పని చేసేటట్లుగా మార్గనిర్దేశం చేయాలి. ఈ పదేళ్ల తర్వాత అనేక మంది రిటైరవుతారు. ఇంకా ఎక్కువ సర్వీసు ఉండే వారిని సీమాంధ్ర ప్రాంతానికి పంపాల్సిందే. లేకపోతే ఇక్కడ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుంది.
- గణేశ్, తెలంగాణ ఆప్కో ఉద్యోగుల సంఘం కార్యదర్శి
చట్టంలో ఆప్షన్ల అంశమే లేదు
రాష్ట్ర విభజన చట్టంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయనే ప్రస్తావన ఎక్కడా లేదు. చట్టంలోని సెక్షన్-77 ప్రకారంగా ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంటామని మాత్రమే పేర్కొంది తప్ప, తప్పనిసరిగా ఆప్షన్లు కల్పిస్తామని కాదు. ప్రధానంగా విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరుగుతుంది. అందుకు విరుద్దంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం.
- కే రఘు, విద్యుత్ జేఏసీ సమన్వయకర్త
ఆప్షన్లు ఇస్తే మరో కురుక్షేత్ర సంగ్రామం
ప్రభుత్వం కుట్రపూరితంగా ఆప్షన్లను ప్రతిపాదిస్తే మరో కురుక్షేత్రం కోరితెచ్చుకున్నట్లే అవుతుంది. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు విభజన తర్వాత వారిప్రాంతాలకు వెళ్ళాల్సిందే. సీమాంధ్ర ఉద్యోగులు వారి జన్మభూమి పట్ల మమకారం లేకుండా ఇంకా ఇక్కడే ఉంటామని తిరకాసు పెడితే అలాంటి వాళ్ళను తెలంగాణ సమాజం సహించబోదు. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది.
- టీ వెంకటేశ్వర్లు, తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ
గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు
గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు
మరో ఉద్యమం తప్పదు
ఆప్షన్లను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడ అవలంభించని విధానం ఇక్కడ అవసరం లేదు. ఆప్షన్ల పేరిట ఆంధ్రా ఉద్యోగులంతా తెలంగాణ ప్రభుత్వంలో సచివాలయంలో పని చేస్తామంటే అంగీకరించం. దిగువస్థాయిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు పంపించాలని కోరడంలేదు. అలాంటప్పుడు వారిక్కడ ఎట్లుంటరు? ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరుగాలి. అలా కాదని ఆప్షన్ల పేరిట ఇక్కడే తిష్ఠ వేసేందుకు కుట్ర చేస్తే మరో ఉద్యమానికి సచివాలయం వేదిక అవుతుంది.
- జీ నరేందర్‌రావు, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి
ఉద్యోగులకు ఆప్షన్లు విషయంలో ప్రభుత్వమే ఒక స్పష్టతకు ఇవ్వాలి. ఆప్షన్లు ఎవరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వకూడదన్న అంశాన్ని ప్రకటించాలి. ఈ దిశగా ప్రభుత్వం నిర్దిష్ట ప్రతిపాదన చేయాలి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాలి.
- ఎస్ వీరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
ఆప్షన్లు ఇవ్వొద్దు
ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వవద్దు. ఆప్షన్లు అంటే చాలు వారంతా ఇక్కడే ఉంటారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటే తెలంగాణ ఏర్పడి ప్రయోజనం లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నన్ని రోజులు సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉండొచ్చు. ఆ తరువాత సీమాంధ్రకే వెళ్లిపోవాలి.
- పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
సీమాంధ్రకు వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వాలి
సీమాంధ్ర ఉద్యోగులు వారి సొంత ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు మాత్రమే ఆప్షన్ అవకాశాన్ని కల్పించాలి. తెలంగాణలో తిష్ఠ వేసేందుకు మాత్రం ఆప్షన్ ఇవ్వొద్దు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలి. సర్వీసు రికార్డ్సుతోపాటు ఉద్యోగి తండ్రి పుట్టిన స్థలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రస్థాయి పోస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్లు ఇవ్వకూడదు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకూ సొంతప్రాంతానికి వచ్చేందుకు ఆప్షన్లు ఇవ్వాలన్నారు.
- సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఏ పద్మాచారి
పూర్వీకుల స్థానికతను ప్రామాణికంగా పరిగణించాలి
ఉద్యోగుల ఆప్షన్లను అంగీకరించం. ముల్కీ నిబంధనలు అమలు చేయాలి. ఉద్యోగి పూర్వీకులు 1956కు ముందు ఎక్కడ ఉన్నారో దాన్నే స్థానికతగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో డిప్యూటేషన్‌పై అక్రమంగా సీమాంధ్ర ఉద్యోగులు తిష్ఠవేశారు. పదేళ్లపాటు రెండు ప్రభుత్వాల రాజధానులు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నప్పుడు ఉద్యోగులకు ఆప్షన్లు ఎందుకు? ఆప్షన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలను దెబ్బకొట్టాలనే కుట్రదాగి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఆప్షన్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- తిప్పర్తి యాదయ్య,
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు
ఆప్షన్లపై తీవ్రస్థాయి పోరాటం
ఆప్షన్లు ఇస్తే మొత్తం సీమాంధ్ర ఉద్యోగులు, డాక్టర్లే ఇక్కడే తిష్ఠవేస్తారు. ప్రస్తుతం అన్ని ఆస్పత్రుల్లోనూ 80శాతం మంది డాక్టర్లు సీమాంధ్రప్రాంతానికి చెందినవారే. ఇప్పుడు ఆప్షన్లు ఇస్తే అంతా హైదరాబాదే ఆప్షన్‌గా పెట్టుకుంటారు. తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లు వెళ్లకపోతే తెలంగాణ ప్రాంతానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు రావు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోకపోతే తెలంగాణలోని నిరుద్యోగుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్ సాధ్యంకాదు. టీచింగ్ ఆస్పత్రుల్లో ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో 8 మంది ప్రొఫెసర్లు ఉంటే అందులో ఆరుగురు సీమాంధ్రవారే. దీనిపై తాము తీవ్రస్థాయి పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం.
- బీ రమేష్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు
పాలనలో సంక్షోభం తప్పదు
ఆప్షన్ల పేరుతో కేంద్రం తెలంగాణలో మరో సంక్షోభానికి తెరతీస్తోంది. తెలంగాణలో ఆంధ్రా అధికారులు ఉన్నట్లయితే పరిపాలనలో సంక్షోభం నెలకొంటుంది. ఆంధ్రా అధికారుల కింద పనిచేసేందుకు తెలంగాణ ఉద్యోగులు సిద్ధంగా లేరు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉంటామంటే మరో రూపంలో ఉద్యమం వస్తుంది. తెలంగాణ వారు తెలంగాణ రాష్ట్రంలో, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ఏపీలో ఉంటే మంచిది. లేదంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- డాక్టర్ పీ మధుసూదన్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్
ఎక్కడి ఉద్యోగులు అక్కడే కొనసాగాలి
ఉద్యోగంలో చేరే సమయంలో పోలీసులు సేకరించిన పూర్వ సమాచారంతో ఉద్యోగుల పంపిణీని జరపాలి. ఆప్షన్ల ముసుగులో సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటామనడం సరైందికాదు. ఆప్షన్ల పద్ధతికి స్వస్తి పలకాలి. సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వ సర్వీసులో చేరే సమయంలో పోలీసుశాఖ సేకరించిన పూర్వాపరాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవాలు బయటపడతాయి.
- తెలంగాణ తహసిల్దార్ల సంఘం అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి
ఆప్షన్ అంటే ఊరుకోం
ఆప్షన్ల పేరిట హైదరాబాద్‌లో తిష్ఠ వేస్తామంటే ఊరుకునేది లేదు. వివిధశాఖల్లో మెజారిటీ పోస్టుల్లో సీమాంధ్రులే కొనసాగుతున్నారు. మళ్లీ ఆప్షన్ల పేరిట ఇక్కడే ఉంటామనడం పద్ధతి కాదు. ఇప్పటికే 610 జీవో అమలు చేయకుండా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసిన సీమాంధ్ర అధికారులు, మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ల పేరిట తెలంగాణవాదులను నట్టేట ముంచేందుకు సిద్ధమవుతున్నారు.
- తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల సంఘం నేత సత్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి