15, మే 2014, గురువారం

డబ్బే డబ్బు..!


    సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇరుకు బొక్కసాల్లో నలుగుతున్న సొమ్మంతా స్వేచ్చగా గాలిపీల్చుకుంటోంది. బ్యాంకు ఎకౌంట్లలో మూలుతున్న డబ్బంతా బయటికొస్తోంది. ఎక్కడెక్కడో దాక్కున్న నల్లధనమంతా కొత్తగా ప్రపంచాన్ని చూస్తోంది. ఓవరాల్ గా బడాబాబులనుండి మామూలు జనంపైపు మనీ ఫ్లో పరవళ్లు తొక్కుతుంది.
నల్లధనం బయటికొస్తోంది..!
   
ఎన్నికల సంబరం దేశానికి కొత్త కళ తెస్తోంది. వేలమందికి ఉపాధినిస్తోంది. ఎంతో మందికి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలు జనంలోకి వేల కోట్ల డబ్బుని పంపుతోంది. ఫలితంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చేతులు మారే సొమ్ముతో కొందరి ముఖాలు కళకళ లాడుతున్నాయి. టాక్సి డ్రైవర్ నుంచి, చార్టర్డ్ ఎకౌంటెంట్ వరకు ఎన్నికల ఆదాయం పొందుతున్నారు..మామూలుగా అంతంత మాత్రంగా ఉండే చిన్నా చితకా బిజినెస్ లకు ఈ ఎలక్షన్ హడావుడిలో 24గంటలు సరిపోవటం లేదు. దేశమంతా ఎన్నికలంటే మామూలు విషయం కాదు.. భారత్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్స్ టూమచ్ ఎక్స్ పెన్సివ్ అనటంలో సందేహం లేదు. అధికారిక, అనధికారిక ఖర్చులు అన్నీ కలిపితే 30 వేల కోట్లను దాటుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్న ఈ సొమ్ము అనేక రంగాలకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని ఆర్థికవేత్తల అంచనా. ఎన్నికల ప్రచారం నుండి పోలింగ్ వరకు ఈ సొమ్ము వేలాదిమంది జేబులు నింపుతోంది. వాస్తవానికి అధికారికంగా ప్రభుత్వమే వేల కోట్లు ఖర్చు పెడుతుంది. అలాంటిది పార్టీలు పెట్టే ఖర్చు లెక్కిస్తే అది ఆకాశాన్నంటుదంటే సందేహం లేదు.
రోజుకు రెండువేలు..
   
నిన్నటిదాకా ఐదొందలు కూడా సంపాదించని చాయ్ వాలా ఇప్పుడు రోజుకు 2వేలు సంపాదిస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాయి. వీడియోగ్రాఫర్లు, కెమేరామెన్లకు చేతినిండా పనిదొరుకుతోంది. అంతా ఎన్నికల సీజన్ మహిమ. ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఓ పక్క అభ్యర్థుల జేబులు ఖాళీ అవుతుంటే మరోపక్క కొందరి జేబులు నిండుతున్నాయి. డ్రైవర్లు మొదలుకొని చార్టెడ్ అకౌంటెంట్ వరకు ఎందరో వృత్తి నిపుణులకు ఎలక్షన్లు ఓ వరంగా మారాయి. ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ప్రచారానికి టాక్సీలు, కార్లు, జీపులు కావాలి. పోస్టర్లు, ఫ్లెక్సిలకు ప్రింటింగ్ ప్రెస్ లు కావాలి. అంతా రికార్డు చేయటానికి వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు, కావాలి. పాటలు, ప్రసంగాలు రాసే రచయితలు కావాలి. ఇంకా, కేటరింగ్, ట్రాన్స్ పోర్టర్లు, షామియానాలు, స్టేజి డెకరేటర్లు, జండా మోసే కూలీలు, ఒకటా రెండా.. ఎన్నికావాలి..? ఓ చిన్న ఇంట్లో అయిదొందలు మంది అతిథులతో జరిగే శుభకార్యానికే సవాలక్ష పనులుంటాయి. ఎంతోమందితో అవసరంపడుతుంది. బడ్జెట్ అంచనా పెరిగిపోతుంది. అలాంటిది ఇండియా లాంటి పెద్ద దేశంలో జరిగే అతిపెద్ద ఎన్నికల పండుగకు ఎంత తతంగం ఉంటుంది?
30 వేల కోట్లు అంచనా!
  
దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో అయ్యే ఖర్చు 30 వేల కోట్లు దాటనుందని ఆర్థిక నిపుణులు అంచనా. ఈ ధన ప్రవాహం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు దోహదపడుతోందంటున్నారు. ప్రతి అభ్యర్థికి తన గురించి తాను ప్రచారం చేసుకోవాలి. దానికి పాంప్లెట్ లు అత్యవసరం . సో ప్రింటింగ్ ప్రెస్‌లకు చేతి నిండా పని. కలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇప్పుడు సిబ్బందికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదంటున్నారు.
మూడు పాంప్లెట్లు ఆరు జెండాలు!
    పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటే అభ్యర్థులకు పోలింగ్ కు ముందే గెలిచినంత సంబరం. అందుకే పార్టీ గుర్తుతో, ఎలక్షన్ సింబల్ తో జెండాలు కట్టలకు కట్టలు అవసరమౌతాయి. ఈ పనీ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాగుతోంది. జెండాలు తయారు చేసే ప్రతి వ్యాపారికి ఈ సీజన్ లో 20 లక్షలకు పైగా ఆదాయం ఉందంటున్నాయి పూణె వ్యాపార వర్గాలు.
  నేతలు, కార్యకర్తలే కాదు. వేలాదిమంది దేశం మొత్తం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రెగ్యులర్ గా ఉపాధి దొరకని వారికి కూడా ఎన్నికలు మంచి అవకాశాలు వస్తున్నాయి. కటౌట్ ఓట్లు కురిపిస్తాయనుకుంటున్నారు నేతలు. అందుకే, ఎత్తైన కటౌట్లతో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వాటినికి తయారు చేసే వారు ఫుల్ బిజీగా మారిపోయారు.
వర్కర్స్ లేక డెడ్ లైన్ లోపు ఇవ్వలేకపోతున్నారట...
షూటింగే షూటింగ్!
  
ఇక ఎన్నికల్లో రోడ్ షో లు చాలా ఇంపార్టెంట్. ఈ ర్యాలీల్లో ఎంత ఖర్చు చేసేదీ తెలుసుకోటానికి ఈసీ ఓ కన్నేస్తోంది. ఇది వీడియో గ్రాఫర్లకు చేతినిండా పనిస్తోంది. ముంబై లోని 6లోక్ సభ నియోజకవర్గాల్లో 4 వందల మంది వీడియోగ్రాఫర్లను ఈసీ ఎంగేజ్ చేసిందంటేనే వీరికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు రోడ్ షోలలో వాడే ఓపెన్ టాప్ జీపులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వాటిని అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసే వారికి డిమాండ్ పెరిగింది.
డాటా అనలిస్టులకు చేతినిండా పనే..!
  
ఓట్లు పడాలంటే ఇమేజ్ ఉండాలి. దీన్ని కూడా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నారు అభ్యర్థులు.. సినిమాస స్టైల్లో రైటర్లు, వాయిస్ ఆర్టిస్టులను వాడుకుని యాడ్స్ తయారు చేస్తున్నారు. ఇది మీడియాకు ఆదాయాన్ని కురిపిస్తోంది. మరోపక్క అడ్డా కూలీలు, షామియానాలు అద్దెకిచ్చే వారు పుల్ బిజీగా మారారు. కొన్ని ప్రాంతాల్లో డాటా అనలిస్టులకు కూడా ప్రాధాన్యత ఉంది. బూతులవారిగా లెక్కలు చూస్తూ అక్కడి పరిస్థితిని విపులీకరిస్తారు. సోషల్ మీడియాపై కూడా నేతలు దృష్టి పెట్టడంతో ఆయా వెబ్ సైట్లకు పంట పండుతోంది
సందడే సందడి..!
  
షామియానాలు, కుర్చీలు రోజువారీగా అద్దెకిచ్చే వారికి, స్టేజ్ అలంకరించే వారికి మైక్ సెట్, కరెంట్ బల్బులు ఆకర్షణగా అలంకరించేవారికి పని డబుల్ ట్రిపుల్ అయింది. ప్రతి రోజు అన్ని పార్టీల వారికి వీరి అవసరం ఉండే ఉంటుంది. వీరు కూడా ఈ సీజన్ లో బాగా సంపాదిస్తున్నారు.
పార్టీ కార్యాలయాల పక్కన ఉండే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా ఫుల్ బిజీగా మారాయి.
బువ్వ దొరుకుతోంది!
  
ఇక కూలీ నాలి చేసుకునే పేదలకు ఎన్నికలు ఉపాధినిచ్చాయి . మూడు నెలల పాటు కూలి గురించి ఆలోచించుకోనవసరం లేకుండా పోయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు డబ్బులు ఎక్కువిస్తే ఆ పార్టీకి జై కొడుతూ ప్రచారం చేస్తున్నారు.
మనది రెండో స్థానం!
   
అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా 42వేల కోట్లు అక్కడి రాజకీయ పార్టీలు ఖర్చుపెట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి.ఇక మన మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టు 30వేల కోట్లు మంచి నీళ్లలా కరిగించి రెండో స్థానంలో నిలబడబోతున్నారు. ఇదంతా కష్టార్జితమా? లేక నల్లడబ్బా?
కట్టల పాములు బయటపడుతున్నాయా? ఎక్కడెక్కడో దాచిన సొమ్మంతా తవ్వితీస్తున్నారా? ఐదేళ్లు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగాలంటే ఈ మాత్రం పెట్టుబడి తప్పదనుకుంటున్నారా? అసలు ఎంత సొమ్ము ఖర్చవుతోంది?
అంకెలు కాదు రూపాయలు..
  
నిన్నటి ఎన్నికల్లో జడ్పీటీపీ అభ్యర్థి ఖర్చు 2లక్షలు, ఎంపీటీసి అభ్యర్థి ఖర్చు లక్షకు మించకూడదు. మరి అంతే ఖర్చు చేశారా? లేదన్న విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు... ఇక అసెంబ్లీ అభ్యర్థి 25లక్షలు, లోక్ సభ అభ్యర్థి 70లక్షలు వరకు ఖర్చు పెట్టొచ్చని ఎన్నికల సంఘం అనుమతించింది. కానీ, వాస్తవంగా ఖర్చుపెడుతున్నదెంత? 30 వేల కోట్లల్లో.. ఎన్నికల సంఘం తానుగా చేసే వ్యయం రూ.3,500 కోట్లు ఉంటే, ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు కోసం కేంద్ర హోంశాఖ, భారతీయ రైల్వేలు, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మరో రూ. 3,500 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన సొమ్మంతా కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు, కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున ధనప్రవాహం వెల్లువెత్తనుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంటోంది..
కష్టార్జితమేనా?
  
ఈ సొమ్మంతా కష్టార్జితమా? ఎన్నికల్లో నల్లధనం ప్రవహిస్తోందా? బ్లాక్ మనీకి కాళ్లొస్తున్నాయా? పరవళ్లు తొక్కుతున్న బ్లాక్ మనీ ఓటర్ల మధ్యకు చేరుతోందా? విచ్చలవిడిగా ఓట్లు కొనే ప్రయత్నాలు సాగుతున్నాయా? వంద, ఐదొందలు.... ఓ చీర, జాకెట్ పీస్, క్రికెట్ కిట్టు... ఇలా నిన్న మొన్నటి దాకా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇచ్చేవారు. ఇప్పుడు రేంజ్ మారింది. అంతెందుకు నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే శాంపిల్ చూశాం. ఒక్కో ఓటుకు వేలకు వేలు ఖర్చుపెట్టారని వార్తలొచ్చాయి. ఓ ఇంట్లో ఓట్లెక్కువుంటే గంపగుత్త లకారమో, అంతకంటే ఎక్కువో ఇచ్చేశారట. స్థానిక సంస్థల్లో కనపడ్డ సీన్ ఇది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతోంది? ఎంత ఖర్చు పెడుతున్నారు?
డబ్బంతా మైనింగ్, సిమెంట్ పరిశ్రమలనుంచే !
   
ఈసీ చెప్పినదానికంటే అనేక రెట్లు ఖర్చుపెడుతున్నారు అభ్యర్థులు. పార్టీ పెట్టే ఖర్చు, అభ్యర్థులు పంచే కట్టలు అన్నీ కలుపుకుంటే కోట్లకు లెక్కలు తేలుతాయని అంచనా. ఎన్నికలు ధనమయంగా మారాయి కాబట్టే పార్టీలు కూడా కుబేరుల్నే ఎంచుకుంటున్నాయని, అలాంటి వారినే టికెట్లు వరిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ ఎన్నికల్లో మైనింగ్, సిమెంట్ ఇండస్ట్రీల నుండి ఎక్కువ సొమ్ము తరలుతోందని సెంటర్ పర్ మీడియా స్టడీస్ అంటోంది. ఎన్నికల్లో మంచినీళ్లలా అభ్యర్థులు పెట్టే ఖర్చుల్లో సింహభాగం బ్లాక్ మనీ అయి ఉండే అవకాశం ఉందని నిపుణుల వాదన..
ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?
  
ఒక్కో ఓటుకు వేలకు వేలు ఖర్చుపెట్టేవారు, గెలిచిన తర్వాత ఏం చేస్తారు? సీమాంధ్రను సింగపూర్ చేయగలరా? బంగారు తెలంగాణ బిల్డ్ చేస్తారా? లేక సొంత బొక్కసాన్ని నింపుకుంటారా? ఫండ్ వసూలు చేయటం.. దాన్ని ఖర్చుచేయటం. పార్టీలన్నీ ఈ తతంగంలో తెగబిజీగా ఉన్నాయి. కార్పొరేట్లు, ఇతర పెట్టుబడిదారులనుండి సొమ్ములు కూడబెట్టడం, దాన్ని ఎలా ఖర్చుచేయాలనే లెక్కల్లో మునిగితేలుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఖర్చు విషయంలో కొరడా ఝళిపిస్తానంటోంది. ఈ ఎన్నికల ఫలితంగా జీడిపి నుండి, వాణిజ్య వృద్ధి వరకు అనేక మార్పులు రానున్నాయి. ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటుందని అంచనా. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తాట తీస్తాం: ఎన్నికల సంఘం
   
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం 1951, ఎన్నికల నిర్వహణ చట్టం 1961, ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఆదాయపు పన్ను చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అంటోంది. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైనంత వరకు సెక్షన్-10 ఏ ప్రకారం ఖర్చులను లెక్కిస్తామంటోంది..
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు?
  
బలహీనపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి జవసత్వాలు పుంజుకునేందుకు 2014సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయంటున్నారు వి శ్లేషకులు. ఎన్నికల ఖర్చు పెరగడం దేశానికి వరం లాంటిదంటున్నారు ఆర్థిక నిపుణులు. 2009 లో ఎన్నికల వ్యయం 15 వేల కోట్లు కాగా... ఇప్పటి ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు. నిజానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు రూపంలో ఖర్చుపెట్టే వ్యయంతో కలిపి మొత్తం ఎన్నికల వ్యయాన్ని కచ్చితంగా అంచనా వేయటం అసాధ్యం. కేంద్రం చేసే వ్యయంతో కలుపుకొని రూ.30 వేల కోట్లని అంచనా వేస్తున్నా ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఎన్నికల ఖర్చు అంచనాలకు మించి పెరిగింది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు డబ్బును ఎరగా వేయడం ఇటీవలి కాలంలో అధికమైంది. అయితే, ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు వరం లాంటిదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి