6, మే 2014, మంగళవారం

కరెంటు కష్టాలకు కారకులెవరు- వి.యస్.ఆర్. నాయుడు


Published at: 06-05-2014 03:19 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ సమయంలో (1956) రాష్ట్రంలో విద్యుత్ స్థాపిత శక్తి కేవలం 99 మెగావాట్లు మాత్రమే ఉండేది. రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాభివృద్ధికి ప్రోత్సాహమివ్వాలనే సంకల్పంతో విద్యుత్ సరఫరా చట్టం నిబంధనల క్రింద 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు స్థాపించబడింది. బోర్డు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ రంగం ప్రగతికి పునాది పడింది. 1959-60లో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పాదక శక్తి 213 మెగావాట్లకు చేరింది.
రాష్ట్ర విద్యుత్ రంగాభివృద్ధికి బీజం నాటింది కీ.శే. జలగం వెంగళరావు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ బోర్డులో పనిచేస్తున్న నార్ల తాతారావుని రాష్ట్రానికి తీసుకొచ్చి, విద్యుత్ సంస్థ అధ్యక్షులుగా నియమించారు. నార్ల తాతారావు స్వయంగా ఇంజనీరు, విద్యుత్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి. రాష్ట్ర విద్యుత్ బోర్డు అధ్యక్షులుగా కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో నూతనంగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్(ప్రస్తుతం డా. నార్ల తాతారావు థర్మల్ స్టేషన్)తో పాటు కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ, లోయర్ సీలేరు, నాగార్జునసాగర్, శ్రీశైలం కుడికాల్వ ప్రాజెక్టు, డొంకరాయి, పోచంపాడు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మితయ్యాయి. అంతేకాకుండా తెలుగుదేశం హయాంలో విజయవాడ, కొత్తగూడెం థర్మల్ స్టేషన్లు విస్తరణ ప్రాజెక్టులతో పాటు నూతనంగా రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (210 మెగావాట్లు) నిర్మితమయ్యింది. శ్రీశైలం ఎడమకాల్వ జలవిద్యుత్ కేంద్రం కూడా తెలుగుదేశం హయాంలోనే వచ్చింది.
ఇక్కడ గమనించదగిన విషయమేమిటంటే 1959-96లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక శక్తి 6163 మెగావాట్లు ఉండేది. అంటే 35 సంవత్సరాల రాష్ట్ర విద్యుత్‌రంగం చరిత్రలో విద్యుత్ ఉత్పాదక శక్తి కేవలం 6163 మెగావాట్లు ఉండగా, దానికి చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ కాలంలో అదనంగా 5634 మెగావాట్లకు సామర్థ్యాన్ని జోడించి, దాన్ని 2004 నాటికి 11797 మెగావాట్లకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో జెన్‌కో, ప్రయివేటు, కేంద్ర విద్యుత్ కేం ద్రాలతో కలిపి రాష్ట్ర స్థాపిత విద్యుత్ ఉత్పాదక శక్తి 16,266 మెగావాట్లు.
ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఒకటుంది. ప్రభుత్వాల చిత్తశుద్ధి, అధికారుల పట్టుదల, నిబద్ధతల వల్ల ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో నిర్దేశిత కాల ప్రమాణాల మేరకు నిర్మితమయ్యాయి. అయితే గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాసేవ కంటే రాజకీయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల వారి హయాంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ అలసత్వానికి గురయ్యాయి.
1994కు ముందు అంటే తెలుగుదేశం అధికారంలోకి రాకపూర్వం రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. విద్యుత్ కొరత, సరఫరాలో తరచూ అంతరాయాలు, ఓల్టేజ్ సమస్యలు విపరీతంగా ఉండేవి. విద్యుత్ లోటుతో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వాటిని మార్చడానికి వారాలు పట్టేది. విద్యుత్ రంగానికి అవసరమైన భారీ నిధులు స్వదేశీ, విదేశీ ఆర్థిక సంస్థలు సమకూర్చడానికి సుముఖంగా లేవు. రుణ సౌకర్యం పొందాలంటే విద్యుత్ సంస్థ నికర ఆస్తులలో, పెట్టుబడులలో మొత్తం మీద ఏటా కనీసం 3 శాతం వరకైనా రాబడి చూపించాలి. విద్యుచ్ఛక్తి ఆర్థిక సంస్థ నుంచిగానీ, గ్రామీన విద్యుదీకరణ సంస్థ నుంచి గానీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి గానీ, ప్రపంచ బ్యాంకు నుంచి గానీ ఆర్థిక సహాయం లభించాలంటే ముందుగా ఈ కనీసపు రాబడిని చూపవలసి ఉండేది. ఏదో ఒక రూపంలో ఈ నిర్దిష్ట లక్ష్యాన్ని చూపడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏటికాయేడు సబ్సిడీలు విడుదల చేస్తుండేవి లేదా రుణాలను ఈక్విటీగా మార్పు చేయడానికి అంగీకరిస్తూ వచ్చాయి. ఏ మార్గంలో ప్రభుత్వం లెక్కలు చూపి, సహాయం అందుకొన్నా ఫలితం మాత్రం విద్యుత్ సంస్థకు ఆర్థికలోటు భారీగా పేరుకుపోతూ వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వపరంగా కావలసిన మేరకు నిధులు పెట్టలేని పరిస్థితి. సంస్థ ఉద్యోగులకు కూడా జీతభత్యాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అతి ముఖ్యమైన విద్యుత్ రంగం దేశంలో మహారాష్ట్ర తరువాత మన రాష్ట్రానిదే రెండవ స్థానం. ఎన్టీపీసీ - సింహాద్రి 1000 మెగావాట్ల మొదటి స్టేజీ సామర్థ్యాన్ని మన రాష్ట్రమే పూర్తిగా వినియోగించుకొనేటట్లు కేంద్రాన్ని ఒప్పించి, సాధించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. గతంలో ఎన్నడూలేని విధంగా సరఫరా, పంపిణీ రంగాలలో రూ. 5800 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. వివిధ రంగాలలో విద్యుత్ వినియోగాన్ని ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న విద్యుత్‌ను శాస్త్రీయంగా లెక్కించి, విద్యుత్ నష్టాలను 37 శాతం నుంచి 22 శాతానికి అంటే 15 శాతం తగ్గించగలిగింది. కొన్ని వేల ట్రాన్స్‌ఫార్మర్లను స్టాక్‌లో పెట్టి, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో కొత్త వాటితో మార్చబడ్డాయి. ఎలక్ట్రానిక్ పద్ధతితో బిల్లులు తయారుచేయడం, ఇ-సేవా కేంద్రాలలో విద్యుత్ బిల్లులు చెల్లింపు, మొబైల్ వ్యాన్ల సహాయంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తొలగించడం వంటి వినూత్నమైన చర్యలు చేపట్టి, వినియోగదారుల సేవలను మెరుగుపరచడం జరిగింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టిన మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక రోల్‌మోడల్‌గా పరిగణించడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగంలో చేసిన కృషి, నిబద్ధత, పనితీరు, సంస్కరణల ఫలితాల వల్లే లభించాయని చెప్పడంలో సందేహం లేదు.
గత 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 7.8 శాతం నిధుల్ని కేటాయిస్తే, వైఎస్సార్ నిధుల్ని పెంచకపోగా 3.9 శాతం తగ్గించారు. చంద్రబాబు దామాషా ప్రకారం విద్యుత్ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం 63వేల కోట్లు కేటాయించాలి. కానీ వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డిలు విద్యుత్ రంగానికి కేటాయించింది 31వేల కోట్లు మాత్రమే... అంటే 3.9 శాతం అన్నమాట. ఈ లోటు బడ్జెట్ కేటాయింపుల వల్ల డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి.
నారా చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళ పరిపాలనలో పెంచిన మొత్తం విద్యుత్ చార్జీలు కేవలం రూ. 16 వందల కోట్లు. అయితే గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ చార్జీల భారం లేకపోయినా, గృహ, వాణిజ్య, వ్యాపార రంగాలకు చార్జీలు పెంచి, రూ. 25 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. 2004-05లో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ సగటున రూ. 2.74 ఉండగా, 2013-14లో యూనిట్ విద్యుత్ రూ. 4.54గా ఉంది. అంటే చార్జీలు రెండింతలయ్యాయన్నమాట. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాల వల్ల విద్యుత్ వినియోగదారుల మీద పడిన భారం మొత్తం సుమారు రూ. 56 వేల కోట్లు. దీనికితోడు సార్వత్రక ఎన్నికల తరువాత మే నెలలో అదనంగా సుమారు రూ. 7 వేల కోట్ల భారం విద్యుత్ చార్జీల రూపేణా వసూలు చేయడానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఆర్థికభారంతో కూరుకుపోయి చిధ్రమైన విద్యుత్ సంస్థ తెలుగుదేశం హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల జవసత్వాలు పొంది, వినియోగదారులకు మెరుగైన సేవలందించింది. అయితే, గత పదేళ్ళలో కాంగ్రెస్ పాలకుల నిర్వాకాల వల్ల, నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి వెన్నుముక లాంటి విద్యుత్ సంస్థ జీవచ్ఛవంలా మారుతోందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.
- వి.యస్.ఆర్. నాయుడు
మాజీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్), ఏపీ ట్రాన్స్‌కో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి