Updated : 5/6/2014 6:36:14 AM
Views : 1900
-చల్లారిన సమైక్య ఆశలు
-అపాయింటెడ్ డేను వాయిదా వేయడానికీ ససేమిరా
-తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా
-ప్లీడింగ్ ప్రక్రియను ఆరువారాల్లోగా పూర్తి చేయాలని స్పష్టీకరణ
-పవిత్రమైన కోర్టు హాలును చేపల మార్కెట్‌లా మార్చొద్దన్న జస్టిస్ దత్తు
-ఉండవల్లి వాదనలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ,
మే 5 (టీ మీడియా):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై స్టే విధించడానికి
సుప్రీంకోర్టు నిరాకరించింది. విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై
లోతుగా విచారణ జరగకుండా ఇప్పటికిప్పుడు స్టే విధించడం సమంజసం కాదని
స్పష్టంచేసింది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే ను కూడా వాయిదా వేయలేమని
తెలిపింది. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టవిరుద్ధమైన
ప్రక్రియ ఉన్నట్లయితే కోర్టు దృష్టికి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్‌రెడ్డి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు
సూచించింది. పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలపై అసహనం
వ్యక్తం చేసిన కోర్టు పవిత్రమైన కోర్టు హాలును చేపలమార్కెట్‌గా మార్చవద్దు
అని వ్యాఖ్యానించింది.-అపాయింటెడ్ డేను వాయిదా వేయడానికీ ససేమిరా
-తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా
-ప్లీడింగ్ ప్రక్రియను ఆరువారాల్లోగా పూర్తి చేయాలని స్పష్టీకరణ
-పవిత్రమైన కోర్టు హాలును చేపల మార్కెట్‌లా మార్చొద్దన్న జస్టిస్ దత్తు
-ఉండవల్లి వాదనలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం
తదుపరి విచారణను సుప్రీం ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలా లేక రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా అనేదానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనుకున్నవారి ఆశలు ఆవిరైపోయాయి. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నా సుప్రీం మాత్రం అడ్డుకుంటుందని సీమాంధ్ర నేతలు ఆశించారు. రాష్ట్ర విభజనలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ సుప్రీంలో పిటిషన్లు వేశారు. ఐతే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సుప్రీం స్టేకు నిరాకరించింది. దీంతో ఇన్నాళ్లూ అడ్డగోలు వాదనలు చేస్తున్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు గప్‌చుప్ అయిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ర్టానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్, సీఎం రమేష్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, అడుసుమిల్లి జయప్రకాశ్, విశాలాంధ్ర మహాసభ తరఫున రవితేజ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంఎల్ శర్మ... ఇలా మొత్తం 23 పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ ప్రక్రియపై స్టే విధించాలని, జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేనూ వాయిదా వేయాలని, అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని వీరు కోరారు. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు వీటన్నింటినీ సోమవారం విచారించింది.
సుమారు ఇరవై నిమిషాలపాటు వాదనలు జరిగాయి. గతంలో చాలా రాష్ర్టాలు ఏర్పడ్డా ఇలాంటి గందరగోళం ఎప్పుడూ జరుగలేదని, ఏర్పాటు ప్రక్రియ సక్రమ పద్ధతిలో జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దాన్ని పార్లమెంటులో చర్చకు పంపవద్దంటూ రాష్ట్రపతిని కోరుతూ మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందిందని, అయినా ఈ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. భాషాప్రయుక్త, సాంస్కృతిక పవిత్రతకు భంగంవాటిల్లే తీరులో విభజన జరిగిందని ఆయన వాదించారు. ఒక్క పార్టీ తీసుకున్న నిర్ణయంపై మిగిలిన పార్టీలు కూడా ప్రభావితమయ్యే ధోరణి కనిపిస్తోందని అన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని అన్నారు. రాజ్యసభలో సైతం బీజేపీకి చెందిన అరుణ్‌జైట్లీ లాంటివారు రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లుపై చర్చ జరుగుతోందని, ఈ బిల్లు రూపకల్పనలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని సభాముఖంగానే వ్యాఖ్యలు చేశారని రాజీవ్‌ధావన్ పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, ఈ బిల్లు వ్యవహారంలో ఎక్కడెక్కడ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయో వివరంగా కోర్టుకు తెలియజేయాలని, తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఆమోదం మేరకే రాష్ట్ర విభజన జరిగిందని, పార్లమెంటు ఒక రాజ్యాంగవ్యవస్థ అని జస్టిస్ దత్తు గుర్తు చేశారు.
రాష్ట్ర విభజనపై స్టే విధించాల్సిందిగా రాజీవ్ ధావన్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. బిల్లుకు సంబంధించి లోతుల్లోకి వెళ్ళకుండా స్టే విధించడంగానీ, అపాయింటెడ్ డేను వాయిదా వేయడంగానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయలేదని పేర్కొన్న ధర్మాసనం, ప్లీడింగ్‌లన్నీ ఆరువారాల్లోకి పూర్తి చేయాలని, తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అనంతరం ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జోక్యం చేసుకుని తాను ఒక పార్లమెంటు సభ్యుడిగా బిల్లుపై చర్చ సందర్భంగా సభలోనే ఉన్నానని, ప్రజాస్వామ్యం హత్యకు గురైందని అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లును పార్లమెంటులో చర్చకు సిఫారసు చేయవద్దని రాష్ట్రపతిని కోరుతూ శాసనసభ మూజువాణి ఓటుతో ఒక తీర్మానాన్ని ఆమోదించిందని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా పార్లమెంటులో చర్చకు వచ్చిందని ఉండవల్లి అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా సభకు హాజరుకావడానికి కూడా సిగ్గుపడుతున్నానని ఆవేశంగా అన్నారు. ఇదే సమయంలో మరి కొందరు న్యాయవాదులు వాదనలో జోక్యం చేసుకున్నారు. దీంతో జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు జోక్యం చేసుకుని ఎవరు ఏ వాదన చేసినా వినడానికి ధర్మాసనం సిద్ధంగా వుంది. అందరికీ వాదించుకునే అవకాశం ఇస్తాం. ఒకరి తర్వాత ఒకరుగా వారి వాదనలను వినిపించవచ్చు. కానీ పవిత్రమైన కోర్టు హాలును చేపలమార్కెట్‌గా మాత్రం మార్చకండి అని అసహనం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వినిపించాలనుకునే న్యాయవాదులకు అవకాశం ఇచ్చారు. దాదాపు అందరూ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని, చట్టవిరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పడంతో, లోతుగా విచారణ జరిపిన తర్వాతే ఈ లోపాలు ఎక్కడ ఎలా చోటుచేసుకున్నాయో స్పష్టమవుతుందని వారికి సూచించారు. ఇందుకోసం ప్లీడింగ్‌లన్నీ ఆరువారాల్లోగా పూర్తి చేయాలని, ఆ తర్వాతనే లోతుగా విచారణ జరపడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినట్లుగానీ, చట్టవిరుద్ధంగా బిల్లు చర్చకు వచ్చిందనిగానీ న్యాయవాదులు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి