3, మే 2014, శనివారం

రాజన్న రాజ్యం మళ్లీనా? - వడ్డే శోభనాద్రీశ్వరరావు

Published at: 03-05-2014 07:35 AM
కొత్త ఆంధ్రప్రదేశ్, ఆర్థికలోటుతో ఏర్పాటవబోతున్న రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రం శీఘ్రగతిన పురోభివృద్ధి సాధించడానికి దోహదపడే నిర్ణయాల్ని తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తీసుకోవడం ప్రజలందరి తక్షణ కర్తవ్యం.
వైౖఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సెజ్‌లు, పారిశ్రామిక పార్కులు, అభివృద్ధి కారిడార్ల పేరుమీద వేలాది ఎకరాల రైత్వారీ భూములను స్వాధీనం చేసుకున్నారు. దశాబ్దాలుగా నిరుపేద, దళిత, బలహీనవర్గాల ప్రజలకు ప్రభుత్వాలు అందజేసిన బంజరు భూముల్ని, సామాన్య రైతులు ఎన్నో వ్యయప్రయాసలతో సాగులోకి తెచ్చుకున్న భూముల్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ఇలా స్వాధీనం చేసుకున్న భూములన్నిటినీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేత తన బంధువులకు, అస్మదీయులకు కారుచౌకగా కట్ట బెట్టారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామికాభివృద్ధి జరిగి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైఎస్ పదే పదే చెబుతూ ఉండేవారు. దాదాపు ఎనిమిదివేల ఎకరాలు కాకినాడ సమీపంలో పీసీఐఆర్‌కు సేకరించారు. ఆరేళ్లుదాటిపోతున్నా ఇప్పటికీ అక్కడ ఏ కార్యక్రమం మొదలవ్వలేదు. రెండు పంటలు పండే భూములు, కొబ్బరి, ఇతర ఫల వృక్షాలతో పచ్చదనంతో కళకళలాడుతూవుండే భూములు మరు భూములయ్యాయి. ఇంతవరకు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు జరిగివుండలేదు. వారికి వచ్చిన నష్టపరిహారపు సొమ్ముతో లోగడ కోల్పోయిన విస్తీర్ణంలో ఐదో వంతు భూమిని కూడా కొనుక్కోగలిగిన పరిస్థితి లేదు. ఇంతవరకు పరిశ్రమలే రానందున ఉద్యోగాల ఊసే లేదు.
అనంతపురం జిల్లాలో, బెంగళూరు నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విద్యా సంస్థలు, నూతన కోర్సులు, హోటళ్ళు, విమానాశ్రయం... ఇలాంటివెన్నో వస్తాయని పేర్కొన్నారు. ఐదు నుంచి పది సంవత్సరాల వ్యవధిలో 8 నుంచి 10వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తీసుకున్న డెవలపర్ 4,731 ఎకరాలని బ్యాంకుల్లో హామీపెట్టి 920 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ నిధులను లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రాజెక్ట్‌కు వినియోగించకుండా ఇందూ ప్రాజెక్ట్‌కు డైవర్ట్ చేశారు. అలాగే నిజాంపట్నం ఓడరేవు, పార్రిశామికాభివృద్ధి కారిడార్ పేరిట దాదాపు 24వేల ఎకరాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సేకరించబడింది. వరి పండించే భూములు, జీడి మామిడి తోటలతో సహా వేలాది ఎకరాల పేదల ఎసైన్డ్ భూములు ఇందులో ఉన్నాయి. 'ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం' ప్రకారం పంటలు పండే పొలాల్ని సెజ్‌ల కోసం తీసుకోరాదు. కానీ నిబంధనల్ని ఉల్లంఘించి అవసరమనుకున్నచోట్ల రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు సిబ్బందినీ వినియోగించి సన్నకారు చిన్నకారు రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ భూముల్లో ఏ అభివృద్ధి కార్యక్రమమూ మొదలవలేదు.
వ్యవసాయాభివృద్ధికి సాగునీరు ఎంతైనా అవసరం. అనుమతులు లేకుండా ప్రాజెక్టులను చేపడితే కేంద్ర ప్రణాళికానిధుల నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని 'తెలుగు గంగ' అనుభవం మనకు తెలియజేస్తూ ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోకుండానే 26 సాగునీటి ప్రాజెక్టులను 46 వేల కోట్లతో పూర్తిచేసి యాభై లక్షల ఎకరాలు సాగులోకి తెస్తామని 2004లో ఆర్భాటంగా ప్రకటించారు. ఇంగ్లీషు దినపత్రికలతో సహా జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల వివరాల్ని ఘనంగా ప్రకటించారు. ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్ర ప్రాజెక్టులపైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అభ్యంతరాలు పెట్టడానికి సమాచార మిచ్చినట్లుయ్యింది. మొదటి ఐదేళ్ళలో దాదాపు 40వేల కోట్లు కేటాయించినా, హామీ ఇచ్చిన 26 ప్రాజెక్టులలో కనీసం రెండు ప్రాజెక్టుల కింద రైతులకు పూర్తి స్థాయిలో నీరందలేదు. 2009 తర్వాత లక్షన్నర కోట్లతో 86 ప్రాజెక్టులను పూర్తిచేసి కోటి 38 లక్షల ఎకరాల బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చంది. గత ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టుల క్రింద మరో 40వేల కోట్లు ఖర్చయ్యాయి. అంటే పదేళ్లలో సుమారు 80వేల కోట్లు ఖర్చయినా, ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కూడా తడవలేదు. పూర్తికాకుండానే పులిచింతల ప్రాజెక్టును కొద్దినెలల క్రితం నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించడం కొసమెరుపు. ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుమీద వేలకోట్ల రూపాయలు ఖజానానుంచి ఇస్తూ, తిరిగి అందులో అధికారులకు, రాజకీయ నాయకులకు, ఇరిగేషన్ మంత్రికి, ముఖ్యమంత్రికి పర్సంటేజీల ప్రకా రం ముడుపులు ముట్టాయన్నది బహిరంగ సత్యం. జలయజ్ఞం పేరు మీదుగా అవినీతిపరులైన అధికారులు, రాజకీయ నాయకుల జేబులు నిండాయి తప్ప రైతుల పొలాల్లోకి నీరురాలేదన్నది నగ్న సత్యం.
జలయజ్ఞానికి రాష్ట్ర బడ్జెట్ నుంచే పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయవల్సి వచ్చింది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం డిమాండ్‌కు అనుగుణంగా పెరగలేదు. దీంతో విద్యుత్ కొరతను భర్తీ చేసుకోవడానికి మిగులు రాష్ట్రాలనుంచి విద్యుత్‌ను కొనడానికై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెట్టలేని దుస్థితిలో పడింది. ఫలితంగా పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో పెద్దఎత్తున కోత విధించాల్సి వచ్చింది. పర్యవసానంగా వేలాది పరిశ్రమలు రోజుకు కొన్ని గంటలు, వారంలో కొన్నిరోజుల పాటు కొనసాగిన విద్యుత్ కోతలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి మందగించింది. కీలక సమయంలో కరెంట్ కోతల వల్ల రైతులకు పంటలకు వందల కోట్ల రూపాయల నష్టం చేకూరింది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సూచనపై ఐటి- ఐటిఇఎస్ రంగాల ప్రగతి కోసం అనుసరించవలసిన వ్యూహాన్ని, విధానాన్ని రూపొందించడానికి జస్వంత్ సింగ్ కన్వీనర్‌గా, చంద్రబాబు కో -కన్వీనర్‌గా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయింది. ఆ టాస్క్‌ఫోర్స్ సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. హైటెక్ సిటీ, సైబరాబాద్‌లలో, ప్రముఖ కంపెనీలకు ఉద్యోగకల్పన కండిషన్‌గా పెట్టి టీడీపీ ప్రభు త్వం భూములు కేటాయించారు. దాదాపు అందరూ తమ యూనిట్లను స్థాపించి లక్షలాది యువజనులకు ఉపాధి కల్పించారు.
వైఎస్ హయాంలో కొనసాగిన అవినీతి దందాల వల్ల కొన్ని యూనిట్లు, మన రాష్ట్రంలో స్థాపించుదామనుకున్న యూనిట్లు కూడా వేరే రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. ఏటా వేలాది ఇంజనీర్లు, ఇతర ఉన్నత విద్యావంతులు విద్యాసంస్థల నుంచి పట్టభద్రులై బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లభించక బాధపడుతున్నారు. కొత్తగా పరిశ్రమలు రావాలన్నా, ఐటి సంస్థలు రావాలన్నా విదేశీ పెట్టుబడులు రావాలన్నా పరిపాలనా వ్యవస్థలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉంటేనే అది సాధ్యపడుతుందని ప్రపంచ అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమై పోయింది. అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి కొద్దిమేరకు ఉండేది. కానీ ఈ పదేళ్లలో ప్రతిస్థాయిలోనూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగింది. కాంట్రాక్టర్లూ ధనవంతులకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వారిచ్చిన దానికి కొన్నిరెట్లు తిరిగి రాబట్టుకోగలుగుతారు. కానీ పేదలకు ఆ అవకాశం ఉండదు. వారే ఎక్కువగా నష్టపోయేది. దళిత విద్యార్థి కులం సర్టిఫికెట్ కావాలన్నా, బక్క రైతు పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా ప్రతిఒక్క పనికీ ఈనాడు లంచం ఇవ్వనిదే అది జరిగే పరిస్థితి లేదు.
చంద్రబాబు దార్శనికుడు. కేంద్ర ప్రభుత్వం విజన్ -2020 రూపొందించక ముందే మన రాష్ట్రంలో విజన్-2020 రూపొందించబడింది. రాష్ట్ర ప్రగతి సాధనలో రహదారులు, విద్యుత్, మౌలిక వసతుల ప్రాధాన్యతను గుర్తించి, తదనుగుణమైన చర్యలు తీసుకున్నారు. ఈ పదేళ్లలో కొత్త రహదారులు పెద్దగా వేయకపోగా, ఉన్న రహదారుల్ని సక్రమంగా మరమ్మతు చేయని పరిస్థితి నెలకొని వుంది. వందల కోట్లరూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు స్వాహా చేస్తూ ఉంటే అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నదనే చందాన ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన రెడ్డి రామన్నరాజ్యం రావాలని పదేపదే మాట్లాడుతుంటారు. ఆ రాజన్నరాజ్యం వేలాది పేద, దళిత, బలహీన వర్గాల కుటుంబాలలో కడుపుశోకాన్ని, మనోవేదనను మిగిల్చిందన్న వాస్తవాన్ని గుర్తించాల్సి వుంది.
జగన్మోహన రెడ్డి తమ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లరూపాయలను అడ్డదారిలో సంపాదించారు. ఆ అవినీతి పద్ధతులపైన ఆయన ఇప్పటివరకు ఎక్కడా వివరణ ఇచ్చివుండలేదు. సీబీఐ పేర్కొన్న చార్జిషీట్లలోని అంశాలపైన పెదవి విప్పి ఒక్కమాట కూడా మాట్లాడివుండలేదు. జేబుదొంగకు, బందిపోటు దొంగకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేని అమాయక ప్రజలు అధిక సంఖ్యలో ఉండబట్టే జగన్మోహన రెడ్డి ఆ విధంగా వ్యవహరించగలుగుతున్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్, ఆర్థికలోటుతో ఏర్పాటవబోతున్న రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రం శీఘ్రగతిన పురోభివృద్ధి సాధించడానికి దోహదపడే నిర్ణయాల్ని తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తీసుకోవడం ప్రజలందరి తక్షణ కర్తవ్యం.
- వడ్డే శోభనాద్రీశ్వరరావు
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు

1 కామెంట్‌:

  1. "జేబుదొంగకు, బందిపోటు దొంగకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేని అమాయక ప్రజలు అధిక సంఖ్యలో ఉండబట్టే...."

    ఇది నిజం.

    రిప్లయితొలగించండి